
జయప్రకాష్ నారాయణతో నా స్వీయానుభవాన్ని రాసి, ఇక లోక్‌చెత్తను చెరిగే పనికి తాత్కాలికంగా విరామమిచ్చేదానికి అనుమతి ఇవ్వండి.
ఈ సంఘటన ప్రకాశం జిల్లాకు జెపి కలెక్టరుగా పనిచేస్తున్న కాలంలో జరిగింది. నేను అప్పుడే మా గ్రామం ఈదుమూడి నుంచి ఒంగోలుకు చేరాను. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య కార్యకర్తగా చురుగ్గా పనిచేస్తున్నాను. అప్పుడు ఒంగోలును జ్వరాలు చుట్టుముట్టాయి. ఇంటికి ఇద్దరు ముగ్గురికి తక్కువగాకుండా మంచాలెక్కారు. అదే సమయంలో పురపాలక సంఘాల్లో పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ఎక్కడి చెత్త అక్కడే నిల్వ చేరటంతో పట్టణమంతా ఒకటే కంపు. అసలే రాష్ట్రం మొత్తం మీద ఒంగోలు నీఛ నికృష్ట అపరిశుభ్ర పట్టణం. కార్మికుల సమ్మె కారణంగా పూర్తిగా పాడయిపోయింది. మా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము. కొన్ని ప్రాంతాల్లో ఊడ్చి, కాలువల్లో పూడికలు కూడా తీశాము. అయినా యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన కార్యక్రమాన్ని ఒక యువజన సంఘం నెత్తుకుని విజయవంతం చేయటం అంత తేలిక కాదు. అందుకని మేము పడుతున్న బాధల్ని ప్రభుత్వానికి నేరుగా చెబితేనన్నా స్పందించి చర్యలు తీసుకుంటారేమోనన్న భ్రమతో కుర్రాళ్లమంతా కలిసి కలెక్టరు జెపిని కలిసి వినతి పత్రం అందజేసి ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నాము. ఆ వినతి పత్రాన్ని అలా అలా చదువుతూనే పిడుగులు కురిపించటం ప్రారంభించాడు. బుద్ధున్నవాడెవడూ ఇలా కాగితాలు తీసుకుని ఏదో చేయమంటూ రాడు. మీరు కలెక్టరు ఆఫీసుల చుట్టూ తిరిగే సమయాన్ని ప్రజల కోసం వినియోగిస్తే అసలు సమస్యలే రావు. మీరు మీ ఇళ్ల నుంచి తలా ఒక చీపురు, తట్టా తీసుకుని వీధులన్నీ ఊడవండి. అంతేగానీ ఇలా అది చేయండి ఇది చేయండి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవద్దు.” అంటూ ఇంకా ఏదేదో బడబడా ఉపన్యసించాడు. చివరలో తక్షణం మేము బయటకు వెళ్లక పోతే తానే నెట్టించాల్సి వస్తుందని బెదిరించాడు జెపి. అప్పుడప్పుడే లోకాన్ని అర్ధం చేసుకుంటున్న మేము జెపి తీరుతో హతాశులమయ్యాము. వాస్తవానికి బెదిరిపోయాము. సరే, ఆయనతో వాదించే శక్తిలేక, కాళ్లీడ్చుకుంటూ ఇళ్లకు చేరాము. తర్వాతెప్పుడూ ఆయన దగ్గరకు రాయబారం వెళ్లే సాహసం చేయలేదు. మా సంఘం తర్వాత కూడా ఎన్నెన్నో ఉచిత వైద్యశిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించిన విషయం వేరే సంగతనుకోండి.
ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే…. ప్రభుత్వం చేయవలసిన పనిని వ్యక్తులుగానీ, చిన్న సంస్థలుగానీ పరిపూర్ణంగా చేయగలవా? అదే వాస్తవయితే, జెపి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్లు? స్వచ్ఛంద సంస్థ లోక్‌సత్తాతోనే ఈ దేశంలోని సమస్త రోగాలనూ పారదోలవచ్చుగదా? అంతా ఒక్కసారి చేయలేకపోతే ఒక్క ఊరిలోనయినా చేసి నిరూపించి ప్రజలను నమ్మించి రాజకీయాలు, శాసనసభలు, పాలన లేకుండా స్వచ్ఛంద సంస్థలకే దేశాన్ని అప్పగించేందుకు కృషి సల్పవచ్చుగదూ?
అంటే జెపికి అంతా తెలుసు. ఏమి చేసినా ప్రభుత్వమే చేయాలి. కాకపోతే ఎప్పుడన్నా, ఎక్కడన్నా అత్యవసరమైతే వ్యక్తులు పూనుకుని తాత్కాలికంగా సమస్యకు కొంతమేర పరిష్కారం చూపవచ్చు. ప్రభుత్వేతర సంస్థలు స్పందించి చేయూత ఇవ్వవవచ్చు. అంతేగానీ వ్యక్తులో, ఏదో ఒక సంస్థో అంతా చేసేస్తే ఇదంతా ఎందుకు దండగ. అది వీలుకానందునే ప్రపంచవ్యాపితంగా రాజకీయాలు, శాసనసభలు, ప్రభుత్వాలు ఉన్నాయి. చేసినా చేయకపోయినా ప్రభుత్వానికే సమస్యను సంపూర్ణంగా పరిష్కరించే సత్తా ఉంటుంది.
అయితే తాను తీసుకోవలసిన చర్యలు తీసుకోని జెపి కసికసిగా కుర్రాళ్లమీద కన్నెర్ర జేశాడు. ప్రభుత్వానికి వాస్తవం చెప్పలేని, ప్రశ్నించలేని ఆయన కళ్లెదుట కనపడినవాళ్లతో యుద్ధానికి దిగాడు.
ఆయనకు ఆ దృక్పధం నుంచి బయట పడనందునే ఇప్పటికీ తాను ఎన్నెన్నో విషయాల మీద తెగతెగ పోరాడుతున్నానని తరచూ చెప్పుకుంటుంటాడు. ఎన్నెన్నో లాభాల్ని తెచ్చిపెట్టానని చెప్పుకుంటుంటాడు. ఎన్నో చట్టాలు తన పోరాటం వలనే వచ్చాయని చెబుతుంటాడు. అయనో విచిత్రం. అయనదో లోకం. ఏం చేద్దాం. కారణం ఏదయినాగానీ ప్రజల సంగతి పట్టాల్సిన వాళ్లు వారికి దూరమయ్యారు. ఆ జాగాలో జరబడిన జెపీలు, స్వాములోర్లు ప్రజల్ని ప్రభావితం చేసేందుకు తెగ చెమటోడ్చుతున్నారు. కానీండి ప్రజలు తెలుసుకునే దాకా… అందరి బొక్కల్నీ విరగదీసేదాకా …. కానీండి. కానీండి.
11 డిసెం




Posted by palla kondala rao on డిసెంబరు 11, 2011 at 5:33 సాయంత్రము
జే పీ అసలు రంగు లోకానికి క్రమ క్రమగా తెలుస్తూనే వుంది మితమా ! ఇలాంటి వాళ్ళు తమకు మాత్రమే అన్నీ తెలుసనుకునే నూతిలొ కప్పళ్ళాంటి కుహనా మేధావులు.
Posted by కృష్ణశ్రీ on డిసెంబరు 13, 2011 at 6:32 సాయంత్రము
మిత్రమా!
జేపీ ఒక అహంకారి.
మేతావి అనే పదానికి సరైన వుదాహరణ అనిపిస్తూంటుంది నాకు.
అరే……! అసెంబ్లీలో–”విశ్వాసం” వుందాలేదా? అంటే యస్ లేదా నో అనకుండా, యేదేదో మాట్లాడుతాడు! బియ్యం యెగుమతి చేసెయ్యమంటాడు……అది అలుసుగా తీసుకొని, ప్రభుత్వం కాని పరిస్థితుల్లో బియ్యం యెగుమతికి అనుమతి ఇచ్చేస్తుంది! బియ్యం రేట్లు చుక్కల్లోకి వెళుతూనే వుంటాయి!
యేమిటో ఇవన్నీ! (బహుశా ప్రభుత్వం నియమించే అనేక కమీటీల్లో/సంఘాల్లో మరిన్ని అవకాశాలు మిస్సవుతాడని భయమేమో!)
ఇలాంటి లోకచెత్తలవల్లా, పెజారాజ్యాలవల్లా యేమీ జరగదు అని మరోసారి ఋజువైపోయింది!
మనమేం చేస్తాం!?