నా కథలు

పసిడి కల
రచన : వెంకట సుబ్బారావు కావూరి


అది శాంతిపురం గ్రామం. ఆ ఊళ్లో ఓ చెరువు. ఆ చెరువులో పెద్దపెద్ద చేపలు, బుల్లిబుల్లి చేపలు, బుజ్జిబుజ్జి చేపలు ఎన్నెన్నో పెరుగుతున్నాయి.
వాటిల్లో తళతళా మెరిసే పెద్దచేప పేరు బంగారం. బంగారాఁకి ఇటీవలే ఓ బుజ్జిచేప పుట్టింది బుజ్జిచేపకు పసిడి అని పేరుపెట్టింది బంగారం. చెరువు మెట్టుపక్కనే బంగారం ఓ ఇల్లు కట్టి అందుతో తన పసిడితో ఉంటోంది.
రోజులు గడిచేకొద్దీ పసిడి ఎదుగుతూ ఉంది. మొదట్లో తమ గూటిలోనే ఒంటరిగా ఆడుకునేది. కొద్దిరోజుల తర్వాత గూటి బయట తిరుగుతూ అటూ, ఇటూ వెళ్లే తన వయస్సు చేపల్ని పలకరించి పరిచయం చేసుకోవటం, వాటితో కలిసి ఆడుకోవటం ప్రారంభించింది. వాటిలో కాసారం, కాలువి, వాగుణి, వంకజ, మడుగుజ, అబావి, చెర్వుణి, సంద్రత, నదిమ లాంటి బుజ్జిబుజ్జి చేపలు పసిడికి స్నేహితులయ్యాయి. అవన్నీ కలిసి రోజూ ఆటపాటలు మొదలుపెట్టాయి. బుజ్జిచేపల్ని మింగేందుకు వచ్చే పెద్ద చేపల పన్నాగాల్ని ఈ బుజ్జి చేపలు ముందే పసిగట్టేవి. వాటి వెనకే తిరుగుతూ బురిడీ కొట్టించేవి. అయినా తమ మీదకు వచ్చే పెద్ద చేపను అందరూ కలిసి చుట్టుముట్టి ఎటూ కదలకుండా చేసేవి. బుజ్జి చేపల ఎగతాళికి తట్టుకోలేక ఆ చేప చివరకు వాటిని క్షమాపణ కోరి బతుకుజీవుడా అంటూ పారిపోయేవి.
పసిడి ఇంట్లో ఉన్నప్పుడు చెరువులో జరిగే అనేక విషయాల్ని తన తల్లి బంగారాన్ని ప్రశ్నించి తెలుసుకునేది. అనుమానాల్ని తీర్చుకునేది.
ఓరోజు పసిడికి బంగారం అన్నం పెడుతోంది. పసిడి అటూఇటూ గంతులు వేస్తూ తింటోంది. ఆ సమయంలో పసిడికి భలే అనుమానం వచ్చింది.
”అమ్మా, ఈ అన్నం ఎక్కడ నుంచి మనకు వస్తోంది?” తల్లిని ప్రశ్నించింది పసిడి.
”అన్నం ఎక్కడ నుంచి వస్తోందో? నీకు చెప్పేకన్నా చూపిస్తాను. అప్పుడు బాగా అర్ధం అవుతుంది నీకు. రేపు ఉదయం నిన్నుకూడా వేటకు తీసుకుపోయి అన్నీ చూపిస్తాను. సరేనా? అడిగింది బంగారం.”
”భలే! భలే!! నిజంగా నన్నుకూడా రేపు వేటకు తీసుకుపోతావా? అమ్మా!” రెట్టించి అడిగింది పసిడి.
”పసిడి తల్లీ, నిజంగా తీసుకుపోతానమ్మా, పొద్దుపోయింది. ఇక హాయిగా నిద్రపోమ్మా” బతిమలాడింది బంగారం.
”అయితే మంచి కథ చెప్పమ్మా. వింటూ నిద్రపోతాను” అడిగింది పసిడి.
”అనగనగనగా…. బంగారం కథ చెబుతుండగానే పసిడి హాయిగా నిద్రకు ఉపక్రమించింది.
మరుసటి రోజు ఉదయం…
”పసిడీ, లేమ్మా! తెల్లారింది.” ఇంటి బయట విహరిస్తూ, బంగారం కేక వేసింది.
”నాకు నీమాటలు వినపడవు.” కళ్లు తెరవకుండానే పసిడి తిరిగి జవాబిచ్చింది.
”బుజ్జీ లేవాలి. మనం వేటకు వెళ్లి ఆహారం తెచ్చుకోవాలి.” మళ్లీ పిలిచింది బంగారం.
”నాకేమీ వినిపించలేదు.” ఒకవైపు నుంచి మరోవైపు తిరిగి పడుకుంటూ చిన్నగా గునిసింది పసిడి.
”అలాగయితే నేనే వచ్చేస్తున్నా!” హెచ్చిరించింది బంగారం.
”ఆహ్హాహ్హాహ్హా …. అలాగా నేను నీకు కనపడనుగా?” తల్లిని వెక్కిరించింది పసిడి.
”దొంగా, నిజంగా వచ్చేస్తున్నా, నేను వచ్చానంటే నీకు ఒక్కటిచ్చుకుని నిద్ర లేపుతా చూడు.” అంటూ వట్టొట్టిగా బెదిరించింది బంగారం.
‘ నిజమే చెబుతున్నానమ్మా. నేన్నీకు కనపడను.” అంది పసిడి.
”ఎందుకు కనపడవూ? ప్రశ్నించింది బంగారం.
”నేను కలగంటున్నాగా?! అందుకు.”
”కలగనేవాళ్లు బయటకు కనపడరా”
”అవును, నేను మేఘాలు ఎక్కి ఆకాశంలో విహరిస్తున్నట్లుగా కలగంటుంటే నీకు మన చెరువులో ఎట్లా కనపడతానమ్మా?” గలగలా నవ్వులు రువ్వుతూ అడిగింది పసిడి. అది విన్న బంగారానికి నవ్వాగలేదు. అలలు అలలుగా నవ్వులు … అహహహాహాహా… ఒకటే నవ్వులు.
”నిజమే చెబుతున్నానమ్మా, నేను నీకు కనపడను.” అంది మళ్లీ పసిడి.
”ఎందుకు కనపడవు?” ప్రశ్నించింది బంగారం.
”ఎందుకనా?, నేను కలగంటున్నాగా అందుకు”
”కలగనేవాళ్లు ఇతరులకు కనపడరా?” రెట్టించి అడిగింది బంగారం.
”అవును, నేను మేఘాలు ఎక్కి ఆకాశంలో విహరిస్తున్న కలగంటుంటే నీకు చెరువులో ఎలా కనపడతాను మరి.?” గలాగలా నవ్వుతూ తల్లిని అడిగింది పసిడి. బంగారానికి మళ్లీ నవ్వొచ్చింది అలలు అలలుగా. తల్లితోపాటు పసిడికీ నవ్వొచ్చింది. తల్లీకూతుళ్ల నవ్వులు వారి గూటిలో ప్రతిధ్వనించాయి. అలలతోపాటు చెరువంతటా వ్యాపించాయి.
బంగారం, పసిడి నవ్వులు విన్నాయి మిగిలిన చేపలు. ఏమి జరిగిందో తెలుసుకుందామని వారింటిపైపుగా బయలుదేరాయి.
తాను కన్న కలను ఊరించి ఊరించి మరీ చెప్పింది పసిడి. అలాంటి కల తమకు రానందుకు బుజ్జిబుజ్జి చేపలు తెగ బాధపడ్డాయి. మబ్బుల్లో తేలాడుతున్నట్లు, చినుకులు పడుతుండగా అల్లీబిల్లీ ఆటాడుతున్నట్లు, పడవలో ఎక్కి కేరింతలు కొడుతూ చెరువంతా తిరుగుతున్నట్లు …. అలా కలలుగనాలని తలా ఒకరకంగా ఊహించుకుంటూ పగటి కలల్లోకి జారిపోయాయి బుజ్జిబుజ్జి చేపలన్నీ.
తన బిడ్డ మేఘాల్లో విహరిస్తున్నట్లుగా కలగంటూ తనకు కనపడనని చెప్పిన విషయాన్ని బంగారం తోటి చేపలకు వివరించింది. పసిడి కలను విన్న, దాని ఊహాశక్తికి పెద్ద చేపలు అబ్బురపడ్డాయి. తమ చిన్నతనపు కలల్ని గుర్తుచేసుకుంటూ ఆనందపడ్డాయి. ఆ కలల్ని మిగతా వాటికి చెబుతూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాయి.
అప్పుడు చెరువంతా చేపల నవ్వులతో ప్రతిధ్వనించింది.

4 వ్యాఖ్యలు

  1. it is a very nice story. thank you. i read to my child and he also enjoyed. keep writing and keep sending.

    స్పందించండి

  2. మళ్ళి కొత్త కథలు ప్రచురించలేదేమి? ప్రచురించండి..చదవాలని వుంది సర్ !

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: