- ప్రజాస్వామ్యమనే భవనానికి పత్రికా రంగం నాలుగో స్త్తంభమని భావిస్తారు. మిగతా మూడు స్తంభాలమాదిరిగానే నాలుగోదీ శిధిలావస్థకు చేరింది. పత్రికల, టీవీ చానళ్ల యాజమాన్యాల్లో అత్యధికులు అవినీతికీ, అక్రమాలకూ, సొంత లాభాలు పోగేసుకునే పనిలో కూరుకుపోయిన నేపథ్యంలో ఇప్పుడు విలేకరుల వ్యవస్థ కూడా అదే దోవపట్టింది. దేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మండలస్థాయిదాకా వ్యవస్థీకృతమయిన విలేకరులు నీతి నిజాయితీలను కట్టగట్టి బంగాళాఖాతంలో పాతరేశారు. నజరానాలు లేందే ప్రకటనలు పత్రికలకు ఎక్కటం అరుదయింది. కనీసం కలంతోపాటు తెల్లకాగితాల పుస్తకమన్నా ఇవ్వకపోతే కాగితం మీద కలం పెట్టలేని విలేకరి కూడా పాత్రికేయుల సమావేశానికి పోడంటే అతిశయోక్తి కాదు. అవినీతి పరాకాష్టకు చేరటంతో తమ విలేకరులను కూడా ఆయా సంస్థలే స్ట్రింగ్ ఆపరేషను నిర్వహించి పట్టుకోవలసిన దుర్గతి దాపురించింది. గతంలో టీవీ9లో రాజశేఖర్ పట్టుబడగా, శుక్రవారం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో ఆ సంస్థ విలేకరితోపటు విశాలాంథ్ర, ఆంధ్రప్రభ కంట్రీబ్యూటర్లు కూడా చిక్కుకోవటం విశేషం. అయితే ఇది నిజంగా అక్రమాలను అరికట్టేందుకు జరిగిందా? లేక సదరు విలేకరిని బయటకు పంపేందుకు కుట్ర జరిగిందా? అన్నది తేలాలి. అక్రమ సంపాదనలో తిరుమల విలేకరులు ప్రథములు. వారి ఆదాయం నెలకు కనీసం లక్ష రూపాయలు అంటే దాన్లో ఆశ్చర్యపోవాల్సిన పనేలేదు. ఇటీవల పట్టుబడిన టీవీ 9 విలేకరి వీ. షణ్ముగాన్ని ఆ సంస్థ రాజీమార్గంగా తొలగించింది. టీటీడీ అతనిపై కేసు పెడితే తమ సంస్థ పరువు పోతుందన్న భయంతో టీవీ 9 యాజమాన్యం ఇద్దరు జర్నలిస్టుల సంఘం నాయకుల సహాయంతో అతనిని తొలగించే విధంగా రాజీచేసుకున్నారు. అయితే దొరికాడు కాబట్టి షణ్ముగం దొంగ. మిగతావారంతా దొరకని దొంగలు.