మొన్నటి తరం తీరూతెన్నుల్ని నేటి తరానికి పరిచయం చేయాలన్న ఆశయంతో మా వేలువిడిచిన తాతగారి సంగతిని గుర్తుచేయనీయండి.! ల్యాప్‌ట్యాప్‌ను సైతం మూడు క్షణాల్లో విప్పేసి, ఆరు క్షణాల్లో బిగించే ఈనాటి సాంకేతిక నైపుణ్య తరానికీ స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి తరానికీ – నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ూంది.
మా నాన్న ద్వారా నేను విన్న ఈ సంఘటనకు స్వతంత్ర భారతదేశమంత వయస్సు ూండి ూంటుందని నా ఊహ. అన్నట్లు ఈ సంఘటనతో సంబంధంలేదుగానీ మా నాన్నను స్వతంత్రపార్టీ నాయకుడు ఆచార్య ఎన్‌జి. రంగా (అత్యధికులకు ఆయన కాంగ్రెసు నాయకుడిగానే తెలుసేమో?) ూపాధ్యాయ ఉద్యోగం వేయించారు. రాజకీయాలంటేనూ, సాహిత్యం అంటేనూ చెవికోసుకునే మానాన్న, రేడియో కార్యక్రమాల్ని ఇంట్లో ఉన్న అత్యధిక సమయం వెచ్చించి బీరుపోకుండా (ఈ పదానికి అర్ధం ఒక్కటీ వదలకుండా అని) వింటుండేవాడు. రేడియో అంటే అంతిష్టం ఉన్నందునేమో, ఆ రోజుల్లోనే రూ. 500 వెచ్చించి జపాను తయారీ శాన్యో రేడియోను కొనుగోలు చేశారు. మొన్నమొన్నటిదాకా కూడా ఉన్న ఆ రేడియోతో నాకు కూడా చెప్పుకోదగిన అనుబంధమే ఏర్పడింది. అసలు కథనంతో సంబంధం లేని మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించనీయండి…. దాదాపు అన్ని పాటల్నీ ఘంటసాల, పీ సుశీల పాడినట్లు చెప్పటం రేడియోలో వినీవిని వాళ్లిద్దరూ భార్యాభర్తలని అనుకునేవాడ్ని నేను. ఆ రేడియో శబ్ధం జగ్గయ్య కంఠంలా ఖణఖణలాడేది.
ఓ రోజు మానాన్న పాఠశాల జీతాల సొమ్ము తెచ్చేపనిలో ఒంగోలు వెళ్లాడు. మా ఊళ్లో పంచాయతీది కాక మా ఇంట్లో మాత్రమే ఆ రోజుల్లో రేడియో ఉండేదట. అందువలన సాయంత్రం అయ్యేసరికి ఊరి పెద్దలంతా రేడియో వినేందుని మా ఇంటికి వేంచేసేవారు. రేడియో కొన్న తర్వాత మొట్టమొదటిసారిగా మా నాన్న ఊళ్లో లేకపోవటంతో ఆ సాయంత్రం ఇంటికొచ్చిన పెద్దలు రేడియో పెట్టమంటూ మా ఇంట్లోనే ఒక భాగంలో ఉండే మా చిన్న నాయనమ్మ భర్త కోటయ్యను కోరారు. మా నాన్న రేడియో పెడుతుండగా రోజూ చూసిన తాత సులభంగానే మోత మోగించాడు. ఆ రోజుల్లో గ్రామాల్లో ఏడు గంటలకల్లా భోజనాలు పూర్తిచేసి పడుకుంటుండేవారు. అందువలన ఆ సమయానికల్లా రేడియో శ్రోతలు ఇళ్లకు వెనుదిరిగి వెళ్లిపోయేవారు. ఆ ఆనవాయితీ ప్రకారమే శ్రోతలంతా వెళ్లిపోగానే రేడియోను ఆపేయాల్సి వచ్చింది. అదిగో, అప్పుడొచ్చిపడింది అసలయిన చిక్కు. తాత రేడియో ఆపటం చూడకపోవటంతో ఏమి చేయాలో తెలియక తికమకపడ్డాడు. చేతికందిన వాటినీ, వీటినీ తిప్పాడు. ఎంతకీ రేడియో ఆగిపోలా. చివరకు ఆయనకు ఒక విచిత్రమయిన ఆలోచన తట్టింది. ఇంకేమంది దాన్ని అమలు చేశాడు. ఇంట్లో అదనంగా ఉన్న ఒక్కొక్క దుప్పటినీ రేడియోపై కప్పి చూశాడు. ఉన్న బట్టలన్నీ కప్పినా పాటలో, మాటలో విన్పిస్తూను ూన్నాయి. అప్పుడు గోనె సంచులన్నీ తీయించి వాటిపై కప్పించాడు. మొత్తం మీద రేడియో మీద కొండలా కప్పుపడిన తర్వాత దాని పలుకులు బయటకు వినపడఁండా పోవటంతో తాతతోపాటు ఇంట్లోవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. విద్యాశాఖ కార్యాలయంలో పని ూండటంతో ఆ రోజంతా ఒంగోలులోనే ఉండి మరుసటి రోజు బడి సమయానికి ఇంటికి తిరిగొచ్చిన మా నాన్న రేడియో స్థానంలో గోనె సంచుల కుప్ప కనపడి అదేమని అడగటంతో అసలు విషయం బయట పడింది. ఎంతో ఇష్టంతో, శక్తికి మించి వ్యయం చేసి కొన్న రేడియోకు తాత పట్టించిన గతిని చూసిన ఆయనకు కోపం తారాస్థాయికి చేరింది. తనదైన పద్ధతిలో తాతపై కోపం వ్యక్తం చేశాడు మా నాన్న. ఆనాటి నుంచీ తాత రాచపుండు వ్యాధితో చనిపోయేదాక కూడా ఆయనతో మాట్లాడలేదంటే మా నాన్న ఏస్థాయిలో రేడియోను ప్రేమించాడో అర్ధం చేసుకోవచ్చు. ఆ రోజులు అలాంటివి మరి. పాత తరం పంతాలూ, పట్టింపులూ అలా ఉండేవి. సంప్రదాయాల్నీ, నమ్మకాల్ని కూడా అదేతీరున అమలు చేసేవాళ్లు. అవి మంచివయినా, చెడువయినా!
26 జూలై
Posted by NoName on జూలై 26, 2010 at 1:30 సా.
హా హా
మీ కథ వస్తువు బాగుంది. అలా నా చిన్నతనం లోకి తీసుకుని వెళ్ళింది. మా తాతగారి ఇంట్లో KREFT Germany ది వాల్వ్ రేడియో వుండేది. దానికి మూడో కన్ను లాగా మధ్యలో ఓ ట్యూన్ బల్బ్ ఆకుపచ్చగా వెలిగేది. ఆన్ చేసాక 2నిముషాల మౌనం పాటించి కాని రొద చేసేది కాదు. నా చిన్న నాటి రేడియోను గుర్తు తెప్పించిన మీ టపాకు నా జోహార్లు.
Posted by కొత్తపాళీ on జూలై 26, 2010 at 2:16 సా.
పాతకాలపు వాల్వుల రేడియోని ఒక ఇరవైనాలుగ్గంటలపాటు పవరాఫ్ చెయ్యకుండా ఉంటే ఏమవుతుంది? బహుశా ఒకటో రెండో వాల్వులు వేడెక్కి మాడిపోయి ఉంటాయి.
Posted by రవిచంద్ర on జూలై 26, 2010 at 3:26 సా.
వామ్మో… తెలియక చేసిన పొరపాటుకు మీ తాతగారితో చనిపోయేదాకా మాట్లాడలేదా… రేడియో అంటే మీ నాన్న గారికి ఎంత ప్రేమో…
Posted by తెలుగిల్లు on జూలై 26, 2010 at 3:45 సా.
కొత్తపాళీ గారూ,
అది వాల్వుల రేడియో కాదు. నేరుగా విద్యుత్తుతో పనిచేసేది కాదు. ముద్ద బ్యాటరీ అని ఆరు మాసాలపాటు వచ్చేది. దానిని వినియొగించేవారు.