పదిహేన్నేళ్లకు పైగా పత్రికా రంగంలో పనిచేస్తోన్నందున ఆ రంగం విశేషాల్ని మీతో పంచుకోనివ్వండివాళ. మీడియాలో పాత్రికేయుల సమావేశాలకు ప్రాధాన్యత తెలియందికాదు. అందులోనూ రాజకీయ నాయకులు, వేదికలు ఏర్పాటు చేసే ప్రెస్‌మీట్ల తీరును కనుక పరిశీలిస్తే, ఆయా పార్టీల నడవడికను మనం అర్ధం చేసుకునే అవకాశముంది.
ప్రస్తుత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో ఒకనాటి అనుభవాన్ని ముందుగా ప్రస్తావించటం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను. అది 1998. అప్పటికే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎదుర్కోబోతోన్న తొలి ఎన్నికలు అవి. తెలుగుదేశానికే వాతావరణం అనుకూలంగా ఉందన్న భావన నెలకొని ఉంది. ఆ సమయంలో కాంగ్రెసు నాయకుడు కొణిజేటి రోశయ్య ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చారు. ప్రకటించిన ఆనాటి కార్యక్రమం మాత్రం ఒంగోలు బస్సుస్టాండు పక్కనే నిర్మించిన వైశ్యా భవన్ ప్రారంభం. కానీ అంతర్గతంగా ఎన్నికల సంబంధిత వ్యవహారం విధిగా ఉండే ఉంటుందని అప్పట్లో ఒంగోలు పట్టణంలో ఈనాడు విలేకరిగా పనిచేస్తున్న నేను ముందే ఊహించాను. కీడెంచి మేలెంచటం విలేకరులు అనుసరించాల్సిన విధానమని నా నమ్మకం. ఆ ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి రోశయ్య పోటీబడుతున్నారు. అందులోనూ మా గురువు (కీర్తిశేషులు) బీసీ నారాయణరావు ఎప్పుడూ అంటారూ, ”పోటీచేసినా, చేయకపోయినా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రోశయ్య కొత్త కోటీశ్వరుడవుతాడయ్యా”. ఇదీ నా మనస్సులో ఉంది. ఈ నేపథ్యంలో నేను అప్రమత్తంగా ఉన్నాను. వైశ్యా భవన్ ప్రారంభ కార్యక్రమం, అనంతరం సభకూడా ముగిసింది. ఇంకేముంటుందని విలేకరులంతా పుస్తకమూ, పెన్నూ సర్దుకుని వెళ్లిపోయారు. వాళ్లకు కనపకుండా పక్కకు తప్పుకుని, బహిరంగంగా ఏర్పాటు చేసిన సభలోకి ప్రవేశించాను. గుంపు మధ్య ఆసీనుడయ్యాను. అక్కడున్నవాళ్లంతా మాట్లాడుకుంటుండటంతో వాతావరణం గందరగోళంగా ఉంది. కొద్ది నిమిషాల్లోనే ప్రారంభమయింది అసలు వ్యవహారం. జిల్లా నలుమూలల నుంచీ అరుదెంచిన వాణిజ్య ప్రముఖులు ఒక్కొక్కరుగా వేదికమీదున్న రోశయ్య వద్దకు చేరటం… తొలుత దండ వేయటం … చెవిలో గుసగుస … ఎవరికి తగిన విధంగా వాళ్లు మూట అందజేసి కిందకు దిగటం. దాన్నంతా ఆసక్తిగా గమనిస్తూ అవసరమయిన సమాచారాన్ని బుర్రలో ముద్రేసుకుంటున్నాను. రాసుకుంటుంటే బయట పడతాను కదా మరి!. అలా అలా గంటకు పైగా గడిచింది. ఆ సమయంలో నన్ను గమనించిన వాళ్లెవరో ఎవరికో ఉప్పందించినట్లుంది. అంతే ఒక్కసారిగా నా వైపు చేతులు చూపిస్తూ నలుగురయిదుగురు, ”ఒరేయ్, ఈనాడోడురా, పట్టుకోండి – పట్టుకోండి” అంటూ అరుపులు, కేకలతో నావైపు దూసుకు రావటం కన్పించింది. అంతే… నేనూ అప్రమత్తమయ్యాను. లేస్తూనే పరుగందుకున్నాను. సమీపంలోని రోడ్డును దాటి అవతలున్న రెండు నక్షత్రాల హోటల్లో దూరాను. నా వెంట పడ్డవాళ్లు స్ధానికులు కానందున రోడ్డు దాటి వచ్చేందుకు సాహసించలేదు కాబట్టి బతికిపోయాను. కాసేపు అక్కడే గడిపి చల్లగా ఆఫీసుకు చేరిపోయి వార్త రాసేశాను. ఆ వార్త పూర్తి పాఠం ప్రచురణకు నోచుకోకపోవటం వేరే విషయమనుకోండి. మరోసారి పాత్రికేయుల సమావేశంలో రోశయ్యను ప్రశ్నించటాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుయాయులు బూతులతో నన్ను ఎదుర్కోవటం ఎన్నటికీ మరచిపోలేను. ఇదండీ సౌమ్యుడని అత్యధికులు భావించే మన ముఖ్యమంత్రి రోశయ్య(అనుయాయుల)తో నా (భయంకర) అనుభవం.
27 జూలై
Posted by srinivas on జూలై 27, 2010 at 12:14 సా.
మౌర్యా హోటల్ లోకి పారిపోయారా:)
Posted by తెలుగిల్లు on జూలై 27, 2010 at 3:52 సా.
yes
Posted by చదువరి on జూలై 27, 2010 at 5:17 సా.
నెనరులు. ఇలాంటి విశేషాలు చెప్పగలవారు పాత్రికేయులే. మీరు మరిన్ని రాయాలి, మేం చదవాలి సార్.
Posted by తెలుగిల్లు on జూలై 28, 2010 at 4:21 ఉద.
నెనరులు. మీ స్పందనతో ఉప్పొంగిపోయానంటే నిజ్జంగా నిజం