Archive for జూలై 28th, 2010

సొసంత్ర దినాన మా ఊళ్లో ఉచిత వైద్యశిబిరం

ఇప్పటి బుడుగులు, సీగానపెసూనాంబలూ ఇండిపెండెంట్స్‌ డే అంటూ పలికే ఆంగ్ల పలుకుల్ని మేము చిన్నప్పుడు నాలుక తిరక్క సొసంత్ర దినమని అనేవాళ్లం. కేవలం చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకునేందుకే స్వాతంత్య్ర దినోత్సవాన్ని వికృతిగా రాశాను.
సరే అసలు విషయానికొస్తాను.  మా నాన్న కావూరి కోటేశ్వరరావు ప్రథమ వర్థంతి సందర్భంగా గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ మా గ్రామంలో (ఈదుమూడి, నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా)  ఉచిత వైద్యశిబిరం తదితర కార్యక్రమాల్ని నిర్వహించాను. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15న ‘కాకోరాజ్ఞాసం’ (కావూరి కోటేశ్వరరావు జ్ఞాపకార్థ సంస్థ) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. ఈ శిబిరంలో కన్ను, దంత, మధుమేహం, సాధారణ వైద్య నిపుణులు పాల్గొంటారు. మధుమేహూలతోపాటు, వచ్చే అవకాశం ఉందని గుర్తించినవారికి కూడా రక్త పరీక్షలు చేయిస్తాము. బరువు, బీపీ, ఎత్తు కొలిచి కాకోరాజ్ఞాసం ప్రచురించిన చేతి పుస్తకంలో నమోదు చేసి వారికి అందజేస్తాము. అన్నట్లు ఈ పుస్తకంలో మధుమేహ సంబంధిత సమాచారాన్ని ప్రచురిస్తున్నాము. తమ ఆరోగ్య పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకునేందుకు వీలుగా పట్టికల్ని కూడా ఇస్తున్నాము. ఉచితంగా మందులు అందజేస్తాము. పిల్లలకు టూత్‌పేస్ట్‌, బ్రష్‌ ఇస్తాము. అవసరమయినవారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించేందుకు ఒంగోలులో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఫిబ్రవరిలో తొలుత గ్రామంలో ఆరోగ్య సర్వే నిర్వహించాము. గ్రామంలో 400 మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. కుటుంబ నేపథ్యం, ఊబకాయం తదితర అంశాల ఆధారంగా మరొక 300 మంది త్వరలో మధుమేహం బారిన పడే ప్రమాదం ఉందని గుర్తించారు. ఆహార అలవాట్లను మార్చుకుని, రోజూ అరగంటపాటు నడిస్తే మధుమేహం సమస్యను మూడేళ్ల నుంచి పదేళ్ల వరకూ వాయిదా వేసేందుకు అవకాశం ఉందని నిపుణలు వారికి సూచించారు. గ్రామంలో 600 మందికి రక్తపోటు ఉంది. ఇక 45 ఏళ్లు దాటిన వారందరూ ఏదో ఒక స్ధాయిలో కాళ్లనొప్పులబారిన పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే ప్రతినెలా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని ఆనాడు భావించాను. అయితే హైదరాబాదులో ఉంటున్నందున దూరాభారం రీత్యా నా కోరికను అమలు చేయలేకపోయాను. అందుకనే ముఖ్యమయిన సందర్భాలలోనయినా వైద్య సేవలు అందించేందుకు సమాయత్తమవుతున్నాను. పలువురు మిత్రుల సహకారంతో వేలాది రూపాయల విలువయిన సేవల్ని నా జన్మభూమికి అందజేస్తున్నాను. ఇది నా కనీస ధర్మంగా భావిస్తున్నాను. ఉపాధ్యాయుడిగా పేరుగడించిన మా నాన్నకు నేనిచ్చే నివాళి ఇది.

నిన్న సొమరిపోతు నేడు రామదూత బాబా

అవును. మొన్నటి సోమరిపోతు ఎంకటేసుల్లు నేడు రామదూతగా వెలుగొందుతున్నాడు. వీధులెంట అడుక్కుతిన్న ఎంకటేసుల్లు బాబాగా ఎదిగి 110 ఎకరాల సాగునీటి చెరువును ఆక్రమించాడు. మరోపక్కనున్న అటవీభూమిని కబ్జాచేసి కట్టడాలు నిర్మించాడు. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కేంద్రమంత్రి బాలు, రాష్ట్ర డిజిపి గిరీష్‌కుమార్‌, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి సునీల్‌శర్మ సహా ఎందరో రాజకీయ ప్రముఖులు, మరెందరో ఉన్నతాధికారులు ఇప్పుడు ఆయన శిష్యులు. వీళ్లంతా తరచూ రామదూత ఆశ్రమాన్ని సందర్శిస్తుండటం బహిరంగ రహస్యం. గిరీష్‌కుమార్‌ అయితే ఎంకటేసుల్లు ఉరఫ్‌ రామదూత ఉరఫ్‌ కబ్జాదారు కాళ్లమీద బహిరంగంగా బోర్లాపడటం వ్యక్తిగా ఆయనిష్టమేగానీ, ఓ ఉన్నతాధికారిగా చేయకూడని నేరం, ఘోరం.
శాస్త్రీయతపట్ల మక్కువగల పౌరుడిగా, పాత్రికేయుడిగా నేను ఈ ఎంకటేసులుపై 2002లోనే అందరికన్నా ముందు కలంతో పోరాటానికి తెరలేపాను. అన్నట్లు ఈ ఎంకటేసుల్లు ఆశ్రమం ప్రకాశం జిల్లా చాగల్లు గ్రామం చెంత ఓ వైపు కొల్‌కతా – చెన్నయ్‌ రైలు మార్గానికీ ఐదో నంబరు జాతీయ రహదారికి నడుమన విస్తరిస్తోంది. తిరుపతి, చెన్నయ్‌కు రైల్లోనో, బస్సులోనే వెళ్లే ప్రయాణికులు సింగరాయకొండ దాటిన తర్వాత కావలికి చేరబోతున్నామనగా ఈ ఆశ్రమాన్ని చూడవచ్చు. ఐదో నంబరు రహదారి వెంట 60 – 70 అడుగుల ఎత్తున దేవతా విగ్రహాలు ఉన్నదే రామదూత ఆశ్రమం.
అప్పుడప్పుడే ఆశ్రమం మొగ్గతొడుగుతున్న సమయంలో నేనూ, నా సహచర పాత్రికేయుడు ఎస్‌వీ బ్రహ్మంతో కలిసి రామదూతను 2002 ప్రథమార్ధంలోనే ఓ ఆటాడించాను. ఓ చక్కటి ఉదయాన రామదూతను ఆశ్రమంలో కలిసి పేరుసహా అన్నీ అబద్ధాలే చెప్పి నా సమస్యలకు పరిష్కారం కోరాను. ఎవ్వరి భవిష్యత్తునయినా తాను ముందే రంగరించి చెబుతానని చెప్పుకునే ఎంకటేసుల్లు ఒక్కటంటే ఒక్క అబద్ధాన్నీ పట్టుకోలేకపోవటంలో ఆశ్ఛర్యం ఏముంది. ఆశ్రమానికి పది వేలు సమర్పించుకుంటే చాలు డిఎస్‌సీలో నాకు ఉపాధ్యాయ ఉద్యోగం రాకుండా అడ్డగిస్తోన్న శని బలహీన పడుతుందని నాతో రామదూత బేరం పెట్టాడు. అంత ఇచ్చుకోలేని పేదవాడినని వేడుకోగా, కనీసం ఐదు వేలన్నా ఇచ్చి, ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత ఎక్కువ ఇచ్చు కుంటే నా భవిష్యత్తు అంత బాగుంటుందని భరోసా ఇచ్చాడు. ఉపాధ్యాయ ఉద్యోగం రావటం మాట అంటుంచండి, నాకు డిఎస్సీ రాసేందుకు అవసరమయిన డీఎడ్‌గానీ, బీఎడ్‌గానీ లేదు. నిరుద్యోగిలాగా నటించి, డిఎస్సీలో ఉద్యోగం వస్తుందో? రాదో? రాకుంటే ఏమి చేయాలో? చెప్పమనగానే ఓ తమలపాకుపై పిచ్చిగీతలు గీసి పదివేలకు ఎర వేశాడు. నేను చెప్పిన అబద్ధాలన్నీ ఇక్కడ రాయాలంటే  చాట భారతమే అవుతుందని నమ్మండి. చెరువు భూమిని కాపాడుకోవటానికి రాజకీయనాయకుల్ని బుట్టలో వేసుకున్న ఎంకటేసుల్లు, అటవీ భూమి అక్రమణ కేసుల్నుంచి తప్పించుకోవటానికి ఆ శాఖాధికారి భార్యనే బుట్టలో వేసుకున్న ఘనుడు. ఆమె కూడా ఈ ఆశ్రమంలోనే శాంభవీమాతగా పూజలందుకుంటోంది. ఆమెగారి భర్తగారికి ప్రభుత్వం ఇచ్చిన వాహనం నిత్యం ఆశ్రమంలోనే కొలువుదీరి ఉంటుంది. అయ్యగారితో ముఖాముఖి పూర్తయిన తర్వాత రోజునుంచీ వరుసగా ఆరు రోజులపాటు ప్రజాశక్తి దినపత్రికలో ప్రత్యేక కథనాలు రాశాను. దీంతో ఎంకటేసుల్లు, ఆయన పరివారమూ భయపడిపోయి పెద్దల్ని రోజూ రాయబారం పంపేవాడు. అన్ని రకాలుగా సహకరిస్తానని మొదలు పెట్టి చివరకు బెదిరింపులకూ దిగాడు. అంతకు మునుపే అదే ప్రాంతంలో తిష్టవేసిన బండ్లమాంబతో పోరాటం చేసిన నేను రామదూత శాపనార్ధాలకు లొంగటం అసంభం కదా?. ఆసక్తిదాయకమయిన బండ్లమాంబపై పోరాటం మరోసారి చెబుతానూ! కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో కృష్ణస్వామిపై నేను చేసిన కలం యుద్ధంలో డాక్టర్‌ సమరం కూడా నేరుగా పాలుపంచుకోవటం ఎన్నడూ మరచిపోలేనిది.
సరే చివరిగా చెప్పొచ్చేదేమిటంటే…. మొక్కై వంగనిది మానయి వంగదని పెద్దలన్నట్లుగా ఈ బాబాలు, అమ్మలు పుట్టేందుకు మన సమాజంలో బోలెడు, బోలెడు అవకాశాలున్నాయి. ప్రశ్నకు తావులేని సమాజంలో ఎంకటేసుల్లు, బండ్లమాంబలూ పుట్టగొడుగుల్లా పుడతారంతే. కనీసం ఎవడయినా ప్రశ్నించినప్పుడయినా ఆరా తీసి మద్దతిస్తే, శిక్షిస్తే…. అప్పుడు చాగల్లు సాగునీటి చెరువులు కబ్జా కావు. అటవీ భూములు ఈ తీరున ఆక్రమణలకు గురికావు. అమ్మాయిల జీవితాలు బండ్లమాంబ ఆశ్రమంలో అర్ధాంతరంగా ముగిసిపోవు. కృష్ణస్వామి అక్రమ శృంగారానికి యువకులు బలయిపోరు. సర్వే జన సుఖినోభవంతు అంటూ దీవిస్తే సుఖాలు వళ్లో వాలవు. సర్వ జనులకూ ప్రశ్నించటం నేర్పితే ఈ సమాజం అభివృద్ధి పథం పడుతుంది. ఆసక్తి ఉన్న మిత్రులను చర్చకు ఆహ్వానిస్తున్నాను.