కీర్తిశేషులు నార్ల వెంకటేశ్వరరావు అంటారూ – అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. ప్రజాస్వామ్య మహాసౌథానికి నాలుగో స్తంభమని భావించే పత్రికారంగం నిజాయితీగా వ్యవహరిస్తే … అదే సిరాచుక్క లక్ష అక్రమాలకు తెర.
దీనికి ‘అర్ధరాత్రి టెండర్లలో ఆంతర్యం’ శీర్షికతో నేను ఈనాడులో రాసిన ప్రత్యేక కథనం నిలువుటద్దం …. ఆ వార్తా కథనంతోపాటు ఆనాడు చోటుచేసుకున్న సంఘటల్నీ ఈ రోజు మీతో పంచుకోనీయండి!
పాపయ్య, పెద్ద పాపాలభైరవుడు. ఒంగోలు పురపాలక సంఘంలో కమిషనరుగా పనిచేసిన ఈయన ఆచరణలో క’మీ’షనరు. అంటే చీటికీ మాటికీ కమీషన్లు కొడుతుంటాడనేగా. ”ముడుపులు ముట్టను – పర్సంటేజీలు పట్టను” … పాపయ్య కమిషనరుగా ఒంగోలులో బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నేను రాసిన వార్తకు శీర్షిక. ప్రజా సేవలో నిమగ్నమయి తాను వైవాహిక జీవన మాధుర్యాన్ని కూడా అనుభవించలేకపోతున్నానని తొలిరోజే ఆయన నాతో నేరుగానే చెప్పటం విశేషం. నా కథనంలో ఇది కూడా ఓ ముఖ్యమయిన అంశమే అయినందున దీన్ని ప్రస్తావించాల్సి వచ్చినందుకు క్షమించండి.
ఈ పాపి అందరిమాదిరిగానే వారంరోజులు అదరగొట్టాడు. ఇతర అధికారుల్నీ, సిబ్బందినీ పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత చూడండి పాపయ్య పాపాలకు అంతేలేకుండా సాగటం మొదలయింది. దానికి అనుగుణంగానే నేనూ నిత్యం వెంటబడి కలం కదిలించాను. ముడుపులు మూటగట్టుకోవటంతోపాటు, కార్యాలయంలోనే రోజుకొకరితో పడకేసేవాడు పాపి. ఓ రోజు పాపి సహా నలుగురు అధికారులు కార్యాలయం తలుపులు బిగించుకుని మరీ బండబూతులు తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. సమగ్ర మరుగుదొడ్ల నిర్మాణ పథకం గుత్తేదారు నుంచి ముట్టిన ముడుపులన్నింటినీ (16 శాతం) కమీషనరు మూటగట్టుకుని తీసుకోవటమే దీనికి కారణం. నాలుగు గోడల మధ్య సాగిన ఈ వ్యవహారం కూడా యధాతథంగా మరునాడే రంగులు పూసుకుని ప్రకాశం మినీ మొదటి పేజీలో పాఠకులకు దర్శనమిచ్చింది. దీంతో కలకలం చెలరేగింది. నాలుగు గోడల మధ్యసాగిన వ్యవహారం ఈనాడు విలేకరి కావెసురా( వెంకట సుబ్బారావు కావూరి)కి ఎలా తెలిసింది???? ఇదీ చర్చ. ఆ నలుగురూ మళ్లీ తలుపులు బిగించుకుని, కావూరికి నువ్వు చెప్పావంటే, నువ్వు చెప్పావంటూ మళ్లీ చెంపలు వాయించుకున్నారు గుట్టుగా. అదీ మళ్లీ మరునాడే పత్రికకు ఎక్కింది. మున్సిపాలిటీతో సంబంధమున్న అందరికీ మతి పోయింది. ఇచ్చినవాడు చెప్పడు, తిన్నవాడు చెప్పడు, అడిగినవాడు చెప్పడు, కొట్టినవాడు చెప్పడు, కొట్టించుకున్నవాడు చెప్పడు…. మరి విలేకరికి పూసగుచ్చినట్లు ఎలా తెలుస్తోంది? సమాధానం దొరక్క చివరకు ఒక నిర్ధారణకు వచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన మైక్రో కెమెరాలను కావూరి ఎక్కడో బిగించాడు. వాటి ఆధారంగానే రహస్యాలు రాబడుతున్నాడని ఒకరికొకరు చెప్పుకున్నారు. విలేకరులు అదే నమ్మారు. నాతోనూ అదే చెప్పారు. నేను నవ్వి ఊరుకున్నాను. వాస్తవానికి నా దగ్గర ఏ కెమెరాలూ లేవు. ఉన్నదల్లా కమీషనరు అటెండరుతో స్నేహం, కారు డ్రైవరుతో అనుబంధం. అంతే. ఎంత రహస్యమయినా అటెండర్లను బయటకు పంపరు. డ్రైవరుకు తెలియకుండా కారులో ఏదీ జరగదు. అదీ అసలు రహస్యం. అటెండరు మిత్రులు, డ్రైవరు సాబ్‌లు ఎప్పటికప్పుడు అయినదానినీ, కానిదానినీ నాకు పూసగుచ్చేవాళ్లు. విలేకరి మిత్రులూ చూసుకోండి మరి. సరే నా వార్తల ఆధారంగా పాపిమీద ఏసీబీ దాడి చేసింది. ప్రభుత్వం సస్పెండు చేసింది. అయితే పాపి మేనమామ అధికారపార్టీలో పలుకుబడి కలవాడవటంతో (ఆర్టీసీ ఛైర్మను పదవి వెలగబెట్టేవాడు) కొద్ది రోజుల్లోనే విముక్త్తుడయ్యాడు. పాపి మామూలోడు కాదుగదా! నాలుగు రోజులకే మళ్లీ ప్రారంభించాడు పాపపు పనులన్నింటినీ. నా కలమూ కదులుతూనే ఉంది. ఓ రోజు పాపి నాకు ఫోను చేసి ఎంత కావాలో కోరుకోమన్నాడు. వద్దని సూటిగా చెప్పాను. పోనీ పత్రికకు ప్రకటనలు ఇస్తానని ఎరవేశాడు. ఆ పని నాది కాదని నిర్ధ్వందంగా తేల్చి చెప్పాను. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టి ఊచలు లెక్కపెట్టిస్తానంటూ స్వరం పెంచాడు. నీకు చేతనయింది చేసుకోమన్నాను. గూండాల్ని పెట్టి కాళ్లూ, చేతులు తీయిస్తానంటూ ఫోను పెట్టేశాడు. ఓ అరగంట తర్వాత సాక్ష్యం కోసం కొందరు కౌన్సిలర్లను వెంటబెట్టుకుని వెళ్లి పాపిని కలిసి నీకు చేతనయింది చేసుకో, నా ప్రాణం ఉన్నంతవరకూ, నాచేతిలో కలం ఉంచినంతవరకూ దేన్నీ దాయకుండా పౌరులకు చెబుతూనే ఉంటానని నేరుగా చెప్పి వచ్చేసాను. పాపి మొదటిసారిగా వణకటం చూశాను. మనసు తీరా నవ్వుకున్నాను. ఓ అక్రమార్కుడిని అంతలా భయపెడున్నందుకు తెగ గర్వపడిపోయాను. మరో ఆరు నెలలు గడిచింది. పాపి వ్యవహారాలు రోజూ వార్తలయి పౌరులకు చేరుతుండటంతో పాలక పెద్దలకు కూడా విసుగు పుట్టింది. పాపిని పంపేసి ఆ స్థానంలో ఆంజనేయుల్ని (అసలు పేరుకాదు) తెచ్చుకున్నారు. అయితే పాపిని ఊరక పంపదలచుకోలేదు. ఒంగోలు రంగారాయుడు చెరువులో కోటి రూపాయల ఎంపీ నిధులతో ఏర్పాటు చేయదలచిన బోట్‌క్లబ్ పనుల్ని పార్టీ విధేయుడొకరికి అక్రమంగా కట్టబెట్టేందుకుగాను చీకటి పనుల్ని పాపి చేతుల మీదుగా పూర్తి చేయించుకున్నారు. దీనికిగాను పాపికి ఏక మొత్తంగా ఓ లకారందాకా ఇచ్చారు. మందు, బిర్యానీ సరేసరి. అర్ధరాత్రి వేళ కార్యాలయంలోనే తలుపులేసుకుని పాపి ఈ వ్వవహారాన్నంతా చక్కబెట్టాడు. బోటుక్లబ్బు టెండర్ల ప్రచురణ కోసం ఎప్పుడూ కనపడని ఓ స్థానిక పత్రికను ఎంచుకున్నారు. పత్రికను డీటీపీ చేయించి కంప్యూటరులోనే రెండు, మూడు ప్రతుల్ని తీయించారు. రెండో పత్రికగా ఒంగోలులో అంతగా కొనుగోలుదారులు లేనిదానిని ఎంచుకున్నారు. ప్రకటన ప్రచురితమయిన రోజున అక్కడికి వచ్చే 50 ప్రతుల్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇలా పనులన్నీ ఒకేరాత్రి పూర్తి చేశారు. కొత్త కమిషనరుతో సంతకం చేయించి ఊపిరిపీల్చుకున్నారు. ఈ వ్యవహారమంతా రెండో రోజున ‘అర్ధరాత్రి టెండర్లలో ఆంతర్యం’ శీర్షికతో పాఠకులకు చేరింది. అంతే గుత్తేదార్లు, ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. కొందరు గుత్తేదార్లు వార్త ప్రతుల్ని ఏసీబీ మొదలు ముఖ్యమంత్రిదాకా గుట్టుగా పంపారు.
పాలకులు పట్టించుకోలేదుగానీ, మున్సిపల్ విభాగం రాష్ట్ర అధికారులు కన్నేశారు. వివరాలన్నింటినీ సేకరించారు. ఇద్దరు కమిషనర్లు, ఎంఈ, డిఈ, ఏఈ ఇలా ఐదుగురిపై ఒకేసారి వేటేస్తూ డిసెంబరు 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు పౌరులంతా నూతన సంవత్సర వేడులు జరుపుకుంటున్న వేళ పాపి అండ్‌కోకు ఈ ఉత్తర్వులు చేరాయి. కాలం మార్పుతో (క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా) బతుకులు మారబోవన్న ఇంకిత జ్ఞానం ఉన్నవాడిగా నూతన సంవత్సర వేడుకలకు సాధారణంగా దూరంగా ఉండే నాకు ఆ రోజు వార్త సాధించిన స్పందనతో నిజమయిన పండుగ జరుపుకున్నాను. ఆనాటి నుంచీ నా బీటుకు సంబంధించిన అధికారులు, నాయకులు కంటారా ఏ రోజూ నిద్రపోలేదంటే నిజ్జంగా నిజం. మద్యం గురించి నాకు ఈనాటికీ ప్రాథమిక విషయాలు కూడా తెలియవుగానీ, తాము సాధారణంగా సేవించేదానికి రెట్టింపు తాగినా కిక్కురాక, నిద్రపట్టక అల్లాడిపోతున్నామని కొందరు నాతోకూడా అప్పుడప్పుడూ వాపోయేవారు. కాస్త చూసీచూడనట్లు పొమ్మని అభ్యర్థించేవారు. అయినా నా కలానికి ఎన్నడూ పదును పోగొట్టి చూసీచూడనట్లు పోలేదు. అదే నాకు సంతృప్తి. దాంతోనే నా జన్మ ధన్యమయిందని నమ్ముతాను. ‘పత్రికొక్కటున్న చాలు పదివేల సైన్యమ్ము’ అని అందుకేగదా పెద్దలన్నది.
30 జూలై
Posted by chavakiran on జూలై 31, 2010 at 3:36 ఉద.
బాగుంది కానీ ఇప్పటకీ మీరు ఈ డ్రైవర్ అటెండర్ విషయాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది కదా. వారింకా జీవించే ఉండవచ్చు కదా.
Posted by తెలుగిల్లు on జూలై 31, 2010 at 4:10 ఉద.
మిత్రునికి ధన్యవాదాలు. విలేకరి ధర్మాల్లో ముఖ్యమయిన అంశాన్ని గుర్తు చేసినందుకు నెనరులు.
కొత్త విలేకరులకు ఉపయోగ పడుతుందేమోనని రహస్యం వెల్లడించాను. ఆనాటి సిబ్బందిలో కొందరు బయటకు వెళ్లి పోయారు. మరికొందరు ఇంటికెళ్లిపోయారు. ఇంకొందరు అసలే వెళ్లిపోయారు. ఒక్కరే ఉంటే ఇలా రాసినా ప్రమాదమే. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నందున సమస్య లేదని భావిస్తున్నాను. దీనికితేడు ఆనాటి అధికారులు ఎవరూ అక్కడ లేరని తెలిసింది. అయినా మేరు చేసిన హెచ్చరిక నిరంతరం గుర్తుంచుకోవాల్సిన ధర్మం.
Posted by Jagadeesh Reddy on జూలై 31, 2010 at 9:26 ఉద.
మీలాంటి జర్నలిస్టులు చాలా అరుదుగా ఉంటారు… కాసులకి కక్కుర్తి పడి తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి మీలాంటి వారు ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను.
Posted by తెలుగిల్లు on జూలై 31, 2010 at 11:12 ఉద.
మిత్రమా
ధన్యవాదాలు