ప్రైవేటు డెయిరీ ఏజంట్ల మాటేమోగానీ, హైదరాబాదు నగరంలో విజయ డెయిరీ ప్రతినిధులు మాత్రం వినియోగదారులతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధర వసూలు చేయటం, కోరిన ఎస్‌ఎన్‌ఎఫ్ పాలు లేవనటం, 200 మిల్లీ లీటర్ల ప్యాకింగ్ అడిగితే ఊరు పేరూ లేని డెయిరీవి ఇవ్వటం, అదేమని అడిగితే తిట్లకు దిగటం మామూలయింది. రాంనగర్ చౌరాస్తా ఏజంటు విజయడెయిరీతోపాటు అన్ని రకాల పాలూ విక్రయిస్తాడు. వాస్తవానికి ఇలా అన్ని రకాలూ అమ్మటం నిబంధనలకు విరుద్ధం. సరే చూసీచూడనట్లు పోదామనుకుంటే విజయ పాలకు బదులు వేరు రకం అంటగడుతుంటాడు. ప్రత్యేకించి 200 మిల్లీలీటర్ల విజయ డెయిరీ ప్యాకెట్లను దాచిపెట్టి సుగుణ పాలు అమ్మటం కద్దు. ఎవరయినా విజయపాలు కావాలని అడిగినా, లేవంటాడు. చూసి అడిగితే వాటిని దుకాణాల వాళ్లకోసం తెప్పించానని తప్పుకోజూస్తాడు. విజయపాల ప్యాకెట్లు పగిలిపోతున్నందున తెప్పించటం లేదంటాడు. దీనికితోడు రూ. 4.50కు బదులు రూ. 5 వసూలు చేస్తాడు. అడిగితే చిల్లర లేదంటాడు. గట్టిగా అడిగితే చిల్లర తెచ్చుకుని తీసుకుపొమ్మంటాడు. అదే ఇతర డెయిరీల 200 మిల్లీలీటర్ల పాలకు మాత్రం రూ. 5.50 తీసుకుని చిల్లర ఇస్తాడు. ఇదంతా విజయ డెయిరీ యాజమాన్యం అనుసరిస్తోన్న దివాలాకోరు విధానాల ఫలితంగానే జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవటం, అక్రమార్కుల నుంచి సొంత లబ్ధి పొంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నందునే వినియోగదారుల మన్నన పుష్యలంగా ఉన్న ప్రభుత్వ సంస్థ ఇలా ఏడుస్తోంది. కూర్చున్న కొమ్మను నరుక్కోవటమంటే ఇదేనన్న జ్ఞానం విజయ డెయిరీ సిబ్బందికి ఉంటే పరిస్థితి ఇలా ఉండదు. ఎవరన్నా ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా, చర్య తీసుకోకపోగా ఫలానావాడు మీ మీద ఆరోపణలు చేస్తున్నాడని ఏజంట్లకే ఉప్పందిస్తారు. దీంతో ఆ ఏజంటు ఆ వినియోగదారుడిని ఏదో ఒకటి ఆధారం చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తాడు. చిల్లరలేదంటాడు ఒకసారి, స్టాకు లేదంటాడు మరోరోజు, అవసరమయి అడిగితే రోజూకన్నా ఎక్కువ పాలు ఇవ్వనంటూ పేచీలకు దిగుతాడు. ఇదీ విజయ డెయిరీ (లో)పాల కథ.