Archive for జూలై, 2010

కూడలికి దయ కలిగేనా?

నా బ్లాగు తెలుగిల్లును తొలినాటి నుంచీ ఊరేగిస్తోన్న మాలిక, హారిక నిర్వాహకులకు ధన్యవాదాలు, ఈ రోజు నుంచీ నా బ్లాగును కరుణించిన జల్లెడ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఇక కూడలి వారికి ఎప్పుడు దయ కలుగుతుందో మరి?

వెధవలకు పదవులు … దళారులకు బాధ్యతలు

వెధవలకు పదవులు, దళారులకు బాధ్యతలు అప్పగించిన ఫలితాన్ని అనుభవిస్తున్నాం. అదీ ఇదీ అని లేదు. అన్ని రంగాల్లోనూ వెధవలూ, దళారులదే రాజ్యం, భోజ్యం.
నిన్నటికి నిన్న చూడండి. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్ధినులు తమను చుట్టుముట్టిన సమస్యల్ని పరిష్కరించమంటూ మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. వసతి గృహం ఆవరణలో చేరిన నాలుగు వేలమంది విద్యార్థినులు ధైర్యంతో, స్థైర్యంతో పోరాటం ప్రారంభించిన పోరాటాన్ని టీవీలో చూస్తుంటే భలే ముచ్చటేసింది. అంటే నేను శునకానందం పొందానని కాదండోయ్‌! వాళ్ల పోరాటం చూస్తూ, నేను భవిష్యత్తునుగాంచాను. రేపో, మాపో బ్రిటీష్‌ ఇండియాతో పోల్చదగిన పరిణామాలు చోటుచేసుకుంటాయని అన్పిస్తోంది. అయితే ఈ వ్యవహారాల్లో సరయిన సంఘాలు జోక్యం చేసుకోవాలనుకోండి.
నాసిరకం భోజనం, అధిక సంఖ్యతో కిక్కిరిసిన గదులు, నీటి కొరత, చాలని బస్సులు, అధిక ఫీజలు, తిరిగి చెల్లించని ఫీజుల సొమ్ము (రీయింబర్స్‌మెంట్‌) ఇలా పలు సమస్యలతో విద్యార్థినులు విసిగి వేసారి చివరకు పోరాటబాట పట్టారు. 20- 22 ఏళ్ల ఆ విద్యార్థినులు పరిణితి ప్రదర్శించారు.
సరే, వారి పోరాటం ఒక ఎత్తయితే – ఆ పోరాటాన్ని చిత్రీకరించేందుకు చేరిన మీడియా వ్యవహారం మరో ఎత్తు. అందరి కంటే ముందు అక్కడకు చేరి ఎక్సిక్లూజివ్‌ జబ్బచరుచుకుంటూ లైవ్‌ ఇచ్చిన ఓ టీవీ ఛానల్‌ నిజంగా దళారి పాత్ర పోషిస్తుంటే, మీడియావాడిగా నాకు తెగ సిగ్గేసింది. స్వర్గ నరకాలుంటే, నాతోసహా మీడియా రంగంలో పనిచేసే ప్రతిఒక్కడికీ యముడు నరకాన్నే కేటాయిస్తాడనటంలో రవ్వంత అనుమానం లేదు.
తమ ఈతి బాధల్ని పరిష్కరించమని రోడ్డెక్కిన ఆ చిన్నారి విద్యార్థుల్ని తక్షణమే పోరాటం ఆపేయమని విజ్ఞప్తి చేస్తూ ఆ ఛానలు స్క్రోలింగ్‌లు తెగ నడిపింది. ఆ ఛానలు యాజమాన్యానికిగానీ, ఆ విలేకరి మహాశయుడిగానీ ఏమన్నా ముడుపుల మూటలు ముట్టాయా? అన్న అనుమానం నాకు వచ్చింది.
చదువుల తల్లులు తమ సమస్యల్నీ, అధికారుల నియంతృత్వ పోకడల్నీ, అక్రమాలనూ ఒక్కొక్కొటిగా, మూకుమ్మడిగా చెబుతూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రారుని కడిగేస్తుంటే విలేకరులు ఏమి చేయాలి. వాస్తవాల్ని లేఖించాలి. లేదా చూపించాలి. అంతేగానీ రిజిస్ట్రారుని ఇవతలికి ఈడ్చుకొచ్చి గొట్టం పెట్టి మాట్లాడించటం అంటే దాని వెనుక ఏదో మతలబు ూన్నట్లు కాదా? దీంతో నాలుగు వేల మంది బాలికల్లో అత్యధికులు చెల్లాచెదురయ్యారు. అప్పటిదాకా బాలికల కళ్లల్లో కన్పించిన మెరుపులు మాయమయ్యాయి. ూరుములు చల్లబడ్డాయి. ఛానలు కోరిక నెరవేరింది. విలేకరులు లిఖించటతోపాటు, చూపించటంతోపాటు ూద్యమాలపై ఇలా కొత్తరకంగా వేటు వేయగలరని సదరు ఛానలు లోకానికి చూపింది. ఇప్పటిదాకా దళారి పనులు చేయలేదని కాదుగానీ, ఈ సంఘటన ఆసరగా చేసుకుని దొంగలు, అవినీతిపరులు, అక్రమార్కులు, నియంతలు విలేకరులను వినియోగించుకునేందుకు ఇదో కొత్తదారి కూడా వుందని తెగ సంబరపడిపోతారేమో ఇక.?
( మీడియాలో నేనూ భాగమయినందుకు క్షమాపణలతో…)

వేడేడి అన్నం + కొత్తావకాయ పచ్చడి + ముద్ద పప్పు + కూసింత నెయ్యి = స్యర్గం

అమ్మ చేతి వంటలా … ఘంటసాల పాటలా … కరుణిశ్రీ పద్యంలా … కొయిలమ్మ కంఠంలా … ఇ లయరాజా సంగీతంలా ఎవడు కనిపెట్టాడొగానీ ఆవకాయ అంతకంటే మధురమయినది. నాలాంటి పల్లెటూరి వాళ్ల ముందు ఆవకాయ రుచిపై రాగం తీస్తే మేనమామ ముందు అమ్మ పుట్టిల్లు గురించి పొగిడినట్లు కాదూ ? ఇదంతా కొత్త తరం అందులోనూ నగరపొళ్లకొసమే. ఓ నాగరిక అమ్మాయిలూ , అబ్బాయిలూ మీకు వీలుంటే చవులూరించే  కొత్తావకాయ తిని బర్గర్లతో, పిజ్జాలతో  జిహ్వ చచ్చిన మీ నోళ్లకు చైతన్యం కలిగించండి.  అన్నట్లు  ఆవకాయ తెగ నచ్చేసిందని ఒకటే తింటే రాచపుండు రాచ మర్యాద చేసే ప్రమాదం వుంటుంది జాగ్రత్త సుమా. అన్నట్లు అతి సర్వత్రా వర్జయేత్ గుర్తుంచుకోండి. సరే ఆవకాయ సంగతి ఆవలబెట్టి ఇప్పుడు అసలు మామిడికాయ సంగతి చూద్దాం. ఎన్నెన్నో మామిళ్లలోన ఈది పూర్ణ మధురం? బహుశా ఎక్కువమంది నూజివీడు మామిడీ అంటారనుకుంటా. అలా అంటే మామిడి గుజ్జులో కాలేసినట్లే. అలాంటివారందరికీ వులవపాడు ఒకటి వుందనీ, అది ప్రకాశం జిల్లాలో వుందనీ, ఆ వూరి మామిడి మధురాతి మధురమనీ తెలియదనుకోవాలి. కొల్కతా – చెన్నై జాతీయ రహదారిలో ఒంగోలు – కావలి  నడుమ వులవపాడు వుంది.  చెన్నై వ్యాపారులు ముందే టొకుగా కొనుగోలు చేస్తారు కాబట్టి హైదరాబాదు వాసులకు వులవపాడు మామిడి లభ్యమయ్యే అవకాశం లేదు.  వచ్చే వేసవిలోనయినా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మీకు ఎవరయినా తెలిసి వుంటే తెప్పించుకోండి. అప్పటిదాకా నా మధురాక్షరాలను నెమరు వేసుకుంటూ మధురం… మధురం అనుకోండి మరి.

మంచి పేరు సూచించరూ

తెలుగులో రాజకీయ వారపత్రిక పెట్టేందుకు ప్రణాళిక  సిద్ధం చేస్తున్నాము. మంచి పేరు సూచించండి. ఇది తెలుగువాడి వేడికి ప్రతిబింబంగా వుండాలని ఆకాంక్షిస్తున్నాము. లౌకికతత్యం, సమైక్యత, ప్రత్యామ్నాయ రాజకీయాలు పత్రిక మూలాలు. తెలుగిల్లు, ప్రతిధ్యని ఇవి ఎలా వున్నాయి. మీరు ఏ పేరును సూచిస్తారు. వెంటనే స్పందించరూ.