Archive for ఆగస్ట్, 2010

జీ 24 గంటల సరస్వతీ పుత్రా, నమో! నమో!!


ఎలక్ట్రానిక్‌ మీడియా క్షణం క్షణం అత్యుత్సాహానికి గురవుతున్నట్లు కన్పిస్తోంది. అత్యుత్సాహంలో ఏమి మాట్లాడుతున్నారో, ఏమి రాస్తున్నారో పరిశీలించుకోవటం లేదనిపిస్తోంది. రాయాల్సివవారే తమకు తెలిసినంత పైత్యాన్ని కుమ్మరించి పని కానిస్తున్నారు. కొత్త విలేకరులు, సబ్‌ ఎడిటర్ల రాతల్ని అనుభవజ్ఞులు పరిశీలిస్తున్న దాఖలాలు లేవు. అందువలనే బోలెడు బోలెడు తప్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝళిపించిన వార్తా కథనాన్ని ప్రసారం చేస్తూ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో జీ 24 గంటలు అత్యుత్సాహానికి గురయింది. విద్యార్థుల్ని సరస్వతీ పుత్రులని రాసేసింది. నాకు తెలిసినంతవరకూ ఏ పాఠ్యాంశంలోనయినా పండితులయినవారిని సరస్వతీ పుత్రులని అనటం కద్దు. చదువుకుంటున్నవారినీ, చదువులు కొంటున్నవారినీ సరస్వతీ పుత్రులని అంటే ఇక నిజంగా పండితులని ఏమనాలో జీ 24 గంటల కార్యనిర్వాహకులే తేల్చి చెప్పాలి. సరస్వతి   చదువుల తల్లి కాబట్టి, చదువుకునేవాళ్లందరూ ఆమె పుత్రులని రాసేసినట్లుంది. అయితే మన సంప్రదాయం అలా లేదు.  కనీసం ఒక అంశంలోనయినా పండితులయితేనే వారిని సరస్వతీ పుత్రులుగా పరిగణిస్తారు. దానికి భిన్నంగా విద్యార్థుల్ని సరస్వతీ పుత్రులని పలవరించిన జీ 24 గంటల సరస్వతీ పుత్రా నమో! నమో!!

తెలుగులో ఆలోచిద్దాం … తెలుగులోనే మాట్లాడదాం … తెలుగులో రాద్దాం

తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా తెలుగువాళ్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
తెలుగు పిడుగు మనింటి వెలుగు గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతి సందర్భంగా తెలుగోళ్లందరికీ శుభాకాంక్షలు.
తెలుగు పండుగ సందర్భంగా తెలుగు వెలుగు కోసం నా ముచ్చట్లు ఇవి…

తెలుగు రాత కొరుకుడుపడని ఇనుప గుగ్గీళ్లు కాకూడదు. అప్పుడే తెలుగువాళ్లయినా, తెలుగేతరులయినా మన భాష నేర్చుకునేందుకూ, ఉపయోగించేందుకూ ముందుకొస్తారు.  సంకటి నోట్లో పెట్టుకుంటే జారిపోయిన తీరున తెలుగు రాత ఉండాలి. అదే సందర్భంగా స్థానిక పూల పరిమళాలు వెదజల్లాలి.
మెత్తటి సంకటిలా … పూలపరిమళాలు వెదజల్లేలా రాసేందుకు కొన్ని సూత్రాలు ఇవిగివిగో…
చిన్న వాక్యాలు రాద్దాం.
మనం చిన్న వాక్యాలుగానే మాట్లాడుకుంటాం.
చిన్న వాక్యాలు రాయటం వలన తప్పులూ తక్కువే ఉంటాయి.
అందరికీ సులభంగా అర్ధమవుతుంది.
ఉదాహరణ : రాష్ట్రాన్ని కరువు కమ్మింది. నాలుగు నెలలుగా వర్షాలు లేవు.
ఒక వాక్యంలో ఒక అంశం మాత్రమే ఉంటే సులభంగా అర్ధమవుతుంది.
ఉదాహరణ : గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో వర్షాలు కురవనందున కరువు ఏర్పడి పంటలు ఎండిపోతున్నందున రైతులు విలవిలలాడటంతోపాటు పశువులకు, మనుషులకు తాగునీరు కూడా దొరకటం లేదు. ఈ పెద్ద వాక్యాన్ని ఐదారు వాక్యాలుగా రాస్తే సులభంగా అర్ధమవుతుంది.
చిన్నివాక్యాలు ఇలా :
1. రాష్ట్రాన్ని కరువు కమ్మింది.
2. గత నాలుగు నెలలుగా వర్షాలు కురవలేదు. 3. దీంతో తొలకరికి వేసిన పైర్లు ఎండిపోతున్నాయి.
4. తాగునీటికి కటకట ఏర్పడింది.
5. పశువులకూ నీరు దొరకటం లేదు.
మాట్లాడే భాషనే ఉపయోగిద్దాం.
కొత్త విషయాలకు కొత్త పదాలు సృష్టిద్దాం. అర్ధం కాదన్న పేరిట ఆంగ్ల పదాలు వాడకం వలన తెలుగు భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉదాహరణ : స్వైన్‌ఫ్లూ (ఇది ఆంగ్లం బాగా వచ్చినవారికి మాత్రం అర్ధమవుతుంది) = పంది జలుబు (ఇది అందరకీ అర్ధమవుతుంది.)
ఇంటా, బయట తెలుగువారందరితో విధిగా తెలుగు మాట్లాడాలని నిబంధన పెట్టుకుందాం.
వీలయినంతవరకూ తెలుగులోనే రాసేందుకు ప్రయత్నిద్దాం.
ఉదాహరణ :
కాంట్రాక్టర్‌ = గుత్తేదారు
హోల్‌సేల్‌ = టోకు వర్తకం
కిరోసిన్‌ = గబ్బుచమురు
ఆయిల్‌ = చమురు
కమిటి = సంఘం
రోడ్‌ టర్నింగు = వీధి మొగదల
మరికొన్ని విషయాలు అప్పుడప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచబ్యాంకు… పాలేరు … ఓ బషీరుబాగ్

ఆ మహా దురంతానికి ఇదిగో నా సాక్ష్యం
2000 ఆగస్టు 28.
అంటే సరిగ్గా ఈరోజుకు పదేళ్లు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదు.
ఇందిరాపార్కు నుంచి శాసనసభ వరకూ –
అరుణ పతాకాల రెపరెపలు … ఎటు చూసినా ఎరుపు. ఎర్రెర్రని ఎరుపు. పతాకాలు ఎరుపు – ఆడ, మగ దుస్తులు ఎరుపు – వారి నడకలో ఎరుపు – వారి అరుపులో ఎరుపు – వారి ముఖంలో ఎరుపు – బిగించిన పిడికిలో ఎరుపు.
ఒక్కొక్కరు ఓ మహా ప్రజాసైనికుడు … తమ ఆదాయాలను కొల్లగొడుత్ను ప్రభుత్వంపై ఆగ్రహం – శాసనసభవద్దకు చేరి నేతల్ని నిలదీయాలన్న ఉద్రేకం – ప్రపంచబ్యాంకు విధానాల పట్ల నిరసన – అడ్డుకుంటున్న పోలీసులపట్ల అసహస్యం.
జనం జనం జనమే జనం – ఒకటే జనం … కదిలొస్తున్న  కొండల్లా జనం – పోటెత్తిన సంద్రంలా జనం.
బషీర్‌బాగ్‌, పైదారి…
జన గర్జన … జనహోరు …  సునామీ కెరటాల్లా జనం. శాసనసభవైపుకు పరుగులు… ఉరుకులు… కట్టలు తెంచుకుని లక్ష్యంవైపుగా గురి. గుర్రాలు- పోలీసులు- లాఠీలు- ముళ్లకంచెలా? మాకడ్డంకి అన్నట్లుగా … పదండి ముందుకు- పదండి పోదాం… పదండి తోసుకు- పదండి పదండి. ఎక్కడిదా ప్రపంచబ్యాంకు? ఎవడిచ్చాడు వాడికి ఆదేశించే హక్కు?
చంద్రబాబు… కాదు మన ముఖ్యమంత్రి – ప్రపంచబ్యాంకు జీతగాడు. తేల్చుకుందాం. ఈ భారాలు ఎన్నాళ్లు? ఈ దోపిడి ఎందాకా?
పదండి ముందుకు … పదండి ముందుకు…
అదిగో అదే సమయంలో….
పైదారి కింద –
విరిగిన లాఠీల చప్పుళ్లు …
అయినా చలించని జనం.
గుర్రాల పద ఘట్టనలు…
అయినా ముందుకే ఉరుకుతున్న కార్యకర్తలు.
ఠాం.. ఠాం.. ఠాం.. ఠాం.. ఠాం.. ఠాం.. పోలీసు తుపాకులు…
ఒకడు పడిపోతే వందల మంది…
పెరిగిన ఆగ్రహం …పెరిగిన నినాదాల హోరు
ఓ మహిళామతల్లి… చేతిలో అరుణపతాక.
కటిక పేదరాలుగా కన్పిస్తోంది.
చిరుగుపాతల చీర- అంతకు మించి అతుకులమారి రవిక.
కాళ్లకు అరిగిపోయిన, పాత రెండు రకాల రబ్బరు చెప్పులు.
ముఖంలో ఆగ్రహం. తన బిడ్డల ఉసురుతీసిన కర్కశులపై కట్టలు తెంచుకున్న కోపం.
”చెడు నాబట్టల్లారా! ఎక్కడి లంజకొడకల్లారా మీరు!! మడుసులేనురా మీరు? ఒకబ్బకి, ఒకమ్మకి పుట్టార్రా?. నిలువునా బిడ్డల ప్యాణాలు తీశారే?! అరెరే! ఎన్నడయినా సూశనా? ఈ అన్నాయాన్ని?” తిడుతూ ఊగిపోతోందా తల్లి. నాకయితే ఆమె భారతమాతే అనిపించింది. ఒక్కసారిగా వంతెన గోడదగ్గరకు పరుగు తీసింది మధ్యనుంచి. చేత్తో చెప్పులు ఊడబీకుతుంటే చూసేవాళ్లంతా ”అయ్యో! దూకేలాగుందే” అనుకుని, అని ఉరికి ఆమెను పొదిపి పట్టుకున్నారు. భరతమాత ఊరుకుందా? విదిల్చిపారేసింది అందరినీ. చేతనున్న చెప్పుల్ని కిందున్న పోలీసులకేసి కసిదీరా విసిరింది ఒకదానివెంట మరొకటి. అవి పోలీసులకు తగిలాయో? లేదో? కానీ మిన్నంటిన జనాగ్రహానికి ప్రతీక ఆమె.
ముగ్గురి ఉసురు తీసిన మానవ మృగాలు…
వందలాది మందిని గాయపరిచిన అనాగరికులకు…
అక్కడ జనం ఉండటం ఇష్టంగా లేదు. తరిమేయటానికి ఉపక్రమించారు.
పైదారి మధ్యలో ఉన్న నేను మిత్రులతో కలిసి వెనక్కు మళ్లక తప్పలేదు. అయినా వాళ్లు పోలీసులు కదా! లాఠీలతో వడ్డనలు… ఇటు ఉండనివ్వరు, అటు పోనివ్వరు. చేసేది లేక వంతెన గోడలు దూకే ప్రయత్నం చేస్తే వాటర్‌ క్యానన్లతో రసాయనికాలు, రంగులు కలిపిన నీళ్ల పిచికారీ. ఆ నీళ్లు మీదపడితే మొదట బట్టలకు రంగు, కొద్దిసేపటికే ఒళ్లంతా జిల. కళ్లు మంటలు. ప్రాణాలే కోల్పోయిన యోధులు, ఒళ్లంతా గాయాలపాలయిన వందలాది కార్యకర్తలు కళ్లముందుండగా వళ్లు జిల, కళ్ల మంటల్ని ఎవరు పట్టించుకునేది. పోలీసులు తరమటంతో పక్కనే ఉన్న ఓ శ్మశానంలో రెండు గంటలపాటు నిరీక్షించి, తర్వాత బంధువుల ఇంటికి చేరుకున్నాము.
భోజనం అనంతరం మళ్లీ వీధుల్లో బడి ఆసుపత్రి వెంట ఆసుపత్రికి వెళ్లి ఒంగోలువాళ్లు ఎక్కడెక్కడున్నారో తెలుసుకుంటూ… ఆహారం, మందులు అందించాం. అవసరమయినవాళ్లకు అవసరంమేర నగదు కూడా ఇచ్చాము. అదీ ఆనాటి నా అనుభవం.
అప్పుడు నేను ఒంగోలు పట్టణంలో ఈనాడు విలేకరిగా పనిచేస్తున్నాను. ప్రపంచబ్యాంకు ఆదేశాలమేరకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్తు ధరల్ని పెంచింది. ఇది  వినియోగదారులకు భారమయింది. వామపక్షాలు రోడ్డెక్కాయి. వంద రోజులపాటు నిత్యం ఆందోళనే. నిత్యం నిరసనలే. పాత్రికేయుడిగా పోరాటాల సమాచారాన్ని సేకరిస్తూ, వార్తలు రాస్తూ నేనూ భాగస్వామినయ్యాను. పోరాటాన్ని ఉదృతం చేసే లక్ష్యంతో హైదరాబాదులో నిరసన తెలిపే కార్యక్రమానికి వామపక్షాలు పిలుపు. కాంగ్రెసుకూడా జతచేరింది.
ఆ రోజు రోజూ మాదిరిగానే తెల్లవారింది.
ఒంగోలు మిత్రులతో కలిసి నిరసనలో పాల్గొనేందుకు ఉదయాగమన వేళ నేనూ హైదరాబాదు చేరుకున్నాను.
ఇందిరాపార్కు నుంచి ఊరేగింపు.
ఆ తర్వాత కాసేపటికే కాల్పులు.
ఆ సాయంత్రం మాత్రం రోజూ మాదిరిగా పొద్దుగుంకలేదు.
ప్రపంచబ్యాంకు కాలుపెట్టిన ప్రతిచోటా జరిగిన విధ్వంసాలకు ప్రతిరూపమే బషీర్‌బాగ్‌ దురంతం.
ఫలితంగా అనంతరకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరపతనం.
కాంగ్రెసు పునరాగమనం.
తీరా గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెసు నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా చంద్రబాబు చెప్పుల్లో కాళ్లు దూర్చి పెద్ద పాలేరుగా వ్యవహారాలు.
ఖమ్మం జిల్లా ముదిగొండలో కాసింత నీడ అడిగిన పాపానికి ఏడుగురిని పొట్టనబెట్టుకున్న పెద్ద పాలేరు… ఇప్పుడు మరో పాలేరు. ప్రపంచబ్యాంకు మాత్రం ఆదేశాలు జారీచేస్తూనే ఉంది. చాపకింద నీరులా చేరుతూ మహా ప్రమాదాలకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాయి. ఇదీ నా సాక్ష్యం. బషీర్‌బాగ్‌ దురంతంలో అశువులుబాసిన యోధులకు నివాళి. ఆనాటి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి అనంతరం కోలుకున్న మిత్రులు కిరణ్‌చంద్ర (ఇంజినీరు), జగదీష్‌ (పాత్రికేయుడు) ప్రపంచబ్యాంకు వ్యతిరేక పోరాటంలో కొనసాగటం ప్రశంసనీయం. వారికి నా హృదయపూర్వక నెనరులు.

కోకోకోలాగారూ ఇక దయచేయండి! క్విట్‌ ఇండియా!!


ఇక్కడి శ్రమ – ఇక్కడి భవనాలు – ఇక్కడి నీళ్లు – ఇక్కడి చక్కెర – ఇక్కడి రసాయనికాలు, ఇక్కడి సీసాలు – ఇక్కడి పరికరాలు – ఇక్కడి వాహనాలు – ఇక్కడి తాగుబోతులు = కోకోకోలా.

ఇంతవరకూ అందరికీ తెలిసిందే. అయితే కొందరికే తెలిసిన రహస్యం ఏమంటే…. ఏటా ఎనిమిదివేల కోట్ల రూపాయల లాభాల్ని కోకోకోలా యజమానులు భారతదేశాన్నుంచి తరలించుకుపోతున్నారు. విదేశీ బహూళజాతి సంస్థ మనల్ని మోసం చేసేందుకు, దగా చేసేందుకు, మన కళ్లు చూసే నిజాన్ని అబద్ధం చేసేందుకు, మన మనస్సును కొనేసేందుకు తన పేరును స్థానికీకరించింది. హిందూస్థాన్‌ కోకోకోలా బెవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అని పేరు పెట్టుకుంది.
అత్యంత ఆధునిక యంత్రాలతో చక్కెర నీళ్లలో తన సొంత తయారీ విషాలను కలిపేందుకు వినియోగిస్తున్నందున ఎనిమిదివేల కోట్ల రూపాయల్ని తరలించుకుపోయే ఈ సంస్థలో మనవారికి కనీసం ఎనిమిది వేలమందికి కూడా ఉపాథి దొరకలేదు.
మన భూగర్భజలాలను పాతాళందాకా తోడేస్తుండటంతో ఈ పరిశ్రమున్న ప్రతిచోటా నీటి కరువు సాధారణమయింది. ఈ సంస్థకు చెందిన అతిపెద్ద కర్మాగారం ఉన్న కేరళలోని పెరుమట్టి ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయి కరువు ఏర్పడటంతో దూరప్రాంతాల నుంచి నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. దీనికిగాను ఏటా రూ. 20 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యులున్న సంఘం లెక్కలు వేసింది. అన్నిచోట్లా ఇదే తీరు. అంతేనా! సీసాలు కడిగిన నీరు భూమిలోకి ఇంకిన కారణంగా కాలుష్యం విస్తరిస్తోంది. వీటన్నింటికంటే మించి కోలా మద్యంకన్నా ప్రమాదకరమయిన జబ్బుల్ని అమాయకులికి అంటిస్తోంది. దంతాలు, ఎముకలు, మూత్రపిండాలు, జీర్ణకోశవ్యవస్థను రోగపూరితం చేస్తుంది. ఇది క్యాన్సరు కారకం కూడా. ఊబకాయం ఏర్పడి,  ఫలితంగా మధుమేహం, గుండె, రక్తపోటు, పక్షవాతం జబ్బులకూ ఆస్కారం ఇస్తోందని వైద్య నిపుణులు తేల్చిచెప్పారు. దీన్లో వినియోగించే కెఫిన్‌ అనే పదార్ధం కారణంగా ఒకటికి రెండుసార్లు తాగినవాళ్లు చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌, ఇప్పుడు కృష్ణ కుమారుడు మహేష్‌బాబు చెప్పకుండానే రోజూ తాగేందుకు అలవాటు పడతారు. తాగకపోతే చిరాకు, కోపం, ఉద్రేకం సమస్యలు ఏర్పడతాయి, తాగితే కంటి జబ్బులు, తలనొప్పి, నరాల వాపు, వెంట్రుకలు ఊడిపోవటం, మతిమరుపు ఇలా పలు వ్యాధులు ఆవరిస్తాయి. ఇదంతా నిజ్జంగా నిజమే. నిర్థారణకోసం మీ వైద్యుడితో చర్చించండి. కోపెన్‌హాగెన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం పరిశీలనలో మరో అంశం తేలింది. ఈ కిల్‌డ్రింకుల్ని వదలకుండా రోజూ తాగే పురుషుల్లో వీర్య సామర్థ్యం 30 శాతంమేర తగ్గిపోయినట్లు నిర్థారించారు.
1978లో జనతా ప్రభుత్వం కోకోకోలా సంస్థను దేశం నుంచి సాగనంపింది. అయితే 1990లో ప్రారంభమయిన సరళీకరణ ఆర్థిక విధానాల పుణ్యమా అని కోలాకు మళ్లీ ప్రభుత్వం నుంచి ఘన స్వాగతం లభించింది. అది వస్తూవస్తూనే తోడుగా పెప్సీనికూడా తెచ్చి మన నెత్తినెక్కించింది. ఆరోగ్య, పర్యావరణ విషయాల్లో తేడా లేదుగానీ దేశవాళీ సంస్ధ పార్లేను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలుచేసింది. పార్లే ఉత్పాదనల్లో ఒక్కొక్కదానిని ఉపసంహరించుకుంటూ కోలాను ఏకైక కిల్‌డ్రింకుగా భారతీయులకు ఒంటబట్టించే పనిలో కోకోకోలా యాజమాన్యం తలమునకలుగా వ్యవహారాలు నడుపుతోంది. పార్లే ఉత్పాదనల్లో పేరున్న గోల్డ్‌స్పాట్‌కు ఇప్పటికే మంగళం పాడింది. అత్యంత ఆదరణ ఉన్న థమ్స్‌అప్‌ను మరుగుపరిచేందుకు ప్రస్తుతం పావులు కదుపుతోంది.
ఈ దశలోనయినా మనమంతా ఆలోచించాలి. అసలు కోకోకోలాకే మనం మంగళం పాడాలి. పర్యావరణను దారుణంగా దెబ్బతీస్తోన్న ఈ కోలాను సాగనంపాలి. కోలాకు చెప్పిచూద్దామని అనుకుంటారేమో, ఆ విషయంలో కోలా చాలా తెలివిగలది. విచారణకు ప్రభుత్వం ఆదేశించినా, వాళ్ల ముందుకు ఆ సంస్థ రానేరాదు. పరోక్షంగానయినా సమాధానం ఇవ్వదు. ఇక్కడి విభిన్న ఆలోచనలను ఉపయోగించుకుని బతికిపోతోంది. కేరళలో కోకోకోల కర్మాగారాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం మూసివేయించగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చాటుమాటుగా కోలాకు మద్దతు ఇవ్వటం ఎవరికోసమో? ఎందుకోసమో? వివరించాలి. పైగా ప్రభుత్వం పైనే కోర్టుకెక్కి మూతేసిన కర్మాగారాన్ని తీర్పరాకమునుపే తిరిగి తమ దుకాణాన్ని పునరుద్ధరించుకున్నారు.
చల్లచల్లనిది… కమ్మకమ్మనిదీ అని రాగాలు తీస్తూ మన జేబుల్లోంచి డబ్బులు పీక్కొని మనల్నే జబ్బులపాలు చేస్తోన్న ఈ కోకోకు వీడ్కోలు పలకాలి.

చివరిగా నా అనుభవాన్ని మీతో పంచుకోనీయండి. పాత్రికేయుడిగా రోజూ అనేకమందిని కలిసే క్రమంలో టీ తాగని నాకు కూల్‌డ్రింకు ఇప్పించి నాయకులు, అధికారులు దానికి బానిసను చేశారు. ఎవ్వరూ ఇప్పించని రోజున నేనే కొనుక్కుని తాగేవాడిని. ఇలా రోజూ లీటరుకు తక్కువ కాకుండా కిల్‌డ్రింకు అలియాస్‌ విషపదార్థం, అలియాస్‌ కీటకనాశిని అలియాస్‌ మరుగుదొడ్డి పరిశుభ్రదాయినికి నా శరీరం అలవాటు పడింది. అలా కొనసాగుతుండగా ఓ మంచి ఉదయాన  శాస్త్రవేత్తలు తమ పరిశోధనా ఫలితాలను విడుదల చేశారు. కూల్‌డ్రింకుల పేరిట మనం తాగుతోన్న రంగు చక్కెర నీళ్లు నిజానికి కిల్‌డ్రింకులని తేల్చిపారేశారు. దాన్లో కీటకనాశినులు మోతాదుకు మించి ఉన్నాయని నిర్థారించారు. అదే సమయంలో వారి పరిశోధనలను ప్రజలకు వివరించే పనిలో జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు థమ్స్‌అప్‌తో మరుగుదొడ్లు  కడిగి మిలమిల మెరిపించి చూపారు. ఇంకేముంది, నా గుండెల్లో దడదడ. అంతే ఆనాటి నుంచీ దాదాపుగా కిల్‌డ్రింకులకు విడాకులిచ్చేశాను.

మరి అందరం కలిసి (నేను నిర్థారించుకున్నాను. మీరూ నిర్థారించుకోండి)

కోకోకోలా – క్విట్‌ ఇండియా! అందామా మరి…
కోకోకోలా – మమ్మల్ని వదలవమ్మా !! అంటూ గదుముదామా !!


టీవీ9కి ఇదేం రోగం!

కులాల కుంపట్లు రేపే పనికి టీవీ9 పూనుకుంది.
‘కులం సంకెళ్లను తెంచేద్దాం’ అంటూ నిమిషానికోసారి నినాదాన్ని చూపించే టీవీ9 బుధవారంనాడు తనకు తానే కులం సంకెళ్లను తగిలించుకోవటం ఎగతాళిమారిపని. హైదరాబాదుకు చెందిన విష్ణుప్రియను ఆమె మామే లైంగిక వేధింపులకు గురిచేయటం బయటపడటంతో టీవీ9 స్పందించటం ప్రస్తుతించదగినదే. విష్ణుప్రియకు ప్రజల అండదండల్ని సమకూర్చే పనిని టీవీ9 చేపట్టింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే  ప్రజలందరి మద్దతునూ ఆమెకు సమకూర్చిపెట్టే పనికి టీవీ9 గండికొట్టిందని ఆరోపించక తప్పదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భద్రి అతివాగుడు వలన విష్ణుప్రియకు నష్టం జరిగుంటుందన్న ఆందోళన తెలుగిల్లును వెంటాడింది. విష్ణుప్రియ సామాజిక వర్గానికి చెందిన ఓ పెద్దమనిషి టీవీ9కు ఫోను చేసి తాను ఆమెకు అండగా ఉంటానని చెబుతుండగానే, భద్రి ఆవేశపడిపోయారు. మీ కులానికే చెందిన విష్ణుప్రియకు మీరంతా మద్దతుగా నిలవాలిగదా? అంటూ అనవసరమయిన వాగుడు వాగారు భద్రి. ఆ పెద్దాయన విష్ణుప్రియను తప్పుపట్టి మాట్లాడితే అప్పుడు భద్రి ఆవేశపడితే అర్ధం ఉంటుందేమో?
ఆయన ఒకపక్కన తాను, తన మిత్రులు విష్ణుప్రియకు అన్ని విధాలా అండగా ఉంటామని, భయపడవద్దనీ చెబుతున్నా … భద్రి అడ్డం పడటం ఎందుకో? అర్ధం కాలేదు. మన బిడ్డలాంటి బిడ్డ విష్ణుప్రియ పడరాని పాట్లు పడుతోంది, మనమంతా మనుషులంగా  మద్దతు ఇద్దామని నచ్చచెప్పాలి. అంతేగానీ మీ కులం కాబట్టి మద్దతు ఇవ్వాలని కోరటం తెలిసి చేసినా, తెలియక చేసినా విష్ణుప్రియ మామకు పరోక్షంగా ఉపకరిస్తుందేమో? ఫలానా కులస్తులారా! మీ కులానికి చెందిన విష్ణుప్రియ బాధల్లో ఉంది. ఆమె కులానికి చెందినవాళ్లంతా మద్దతు ఇవ్వాలని కోరితే ఏమవుతుందో? మాజీ కమ్యూనిస్టు? రవిప్రకాష్‌ కార్యనిర్వాహకుడిగా నడుస్తోన్న టీవీ9కు చెప్పాల్సిన పని ఉందనుకోను. ఒక కులం వాళ్ల మద్దతు కోరితే ఈ దేశంలో ఇతర కులాల వాళ్లంతా … ”ఓహో ఇది మనకు సంబంధమే లేని వ్యవహారం” అనుకునే ప్రమాదం లేదా? అయినదానికీ, కానిదానికీ నిత్యం కులాల కుంపటి రగిలే ప్రాంతంలో ఇలాంటి పిలుపులు విశాల మద్దతుకు గండికొడతాయన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? కులాల కుంపట్లు మంచిది కాదనేగదా? మీరు రోజంతా చూపుతోంది. మరి ఆ కంపునే మీరు ఎందుకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం . విష్ణుప్రియకు మంచి ఆశించేనా? పరోక్షంగా విష్ణుప్రియ మామను రక్షించాలనుకున్నారా? ఏమయినా ప్రత్యేకించి ఇలాంటి విషయాల్లో మనం మద్దతు తెలపాల్సిన వాళ్లకు కులం తోకలు ఉంటే వాటికి కత్తెరేసి మాట్లాడితే వాళ్లకు మేలు జరుగుతుంది. విశాల ప్రాతిపదికన, మానవత్వం ప్రాతిపదికన మద్దతు సమీకరించవచ్చు. సరే, తెలిసో – తెలియకో జరగరానిది జరిగిపోయింది. ఇక ముందయినా ఇలాంటి తప్పిదాలు జరక్కుండా ఉంటే మంచిది కదా!

ప్రభుత్వానికి రెండు కోణాలు మనకు కావాలి కొత్త కోణం

ఇది తెలుగిల్లు 50వ రచన
”ఏ పదాల వెనుక ఏ నిజాలు దాగున్నాయో తెలుసుకోనంతకాలం మళ్లీమళ్లీ మోసపోతూనే ఉంటాము” – అంటారు ఓ సామాజిక విశ్లేషకుడు.

గత వారం రోజులుగా మీడియా, పోలీసు వ్యవస్థలు రెండూ తెలుగు సినీమాయాలోకం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ”టాలీవుడ్‌,” ‘డ్రగ్‌ రాకెట్‌,’ ‘హైటెక్‌ వ్యభిచారం’ (ఈ సంకర భాషను మీ మాదిరిగానే నేనూ వినలేక ఛస్తున్నానంటే నమ్మండి!) ఈ మూడు పదాల చుట్టూ అందరినీ గిరగిరా తిప్పేస్తున్నారు.
‘డ్రగ్స్‌ వలయంలో మహానగరం’
‘మత్తులో సినీ జగత్తు’
డ్రగ్స్‌ మాఫియాకు రాజధాని అడ్డా”

పదాలేమయినా పత్రికలన్నీ హైదరాబాదు, అందులోనూ ప్రత్యేకించి సినీరంగం మత్తుపదార్ధాల వాడకానికి కేంద్రమయిందని వాపోయాయి.
అంటే ఉన్నఫళంగా మీడియా, పోలీసు వ్యవస్థలకు, వాటి బాధ్యులకూ మత్తు పదార్థాలమీద, వ్యభిచారం మీద ఎందుకు రోత పుట్టినట్లు?
రాజధాని పోష్‌ కాలనీలకు, అప్పనంగా డబ్బు ఒళ్లోవాలిపోయేవారికీ, వారి బిడ్డలకూ సంబంధించిన ఈ సంఘటనల మీదే ఎందుని చూపుసారించారు?
సినీ పరిశ్రమ సంబంధీకులు మత్తు పదార్థాల వాడకం ఇప్పుడే ప్రారంభించారా? గతంలో లేనేలేదా?
సినీ నటులు వ్యభిచారానికి ఇప్పుడే దిగారా? గతంలో ఈ తరహా పనులు లేనేలేవా?
గతంలోనూ ఉంటే నివారణకు ఏమి చర్యలు తీసుకున్నారు?
ఇప్పుడే ప్రారంభమయితే ఈ తప్పిదాలు ఏదో ఉపద్రవంలా వచ్చిపడ్డాయా? సినీ పరిశ్రమ తప్పిదం లేదా?
ఇప్పుడు ఇంకో కోణంలో చర్చించేందుకు అనుమతివ్వండి!!
రాష్ట్రమంతటా వ్యాపారకూటములు విచ్చలవిడిగా నిర్వహిస్తోన్న గొలుసుకట్టు మద్యం దుకాణాలను ఎత్తేయించేందుకు ఈ రెండు వ్యవస్థలూ రాజధాని డ్రగ్‌ రాకెట్‌ తీరులోనే ఎందుకు స్పందించలేదు?
బెల్టుషాపులని ముద్దుగా పిలుచుకుంటున్న ఆ గొలుసుకట్టు దుకాణాల్లో లక్షలాది మంది నిరు పేదలు, మధ్యతరగతి మొగోళ్లు తమ పెళ్లాం పుస్తెల్ని తాకట్టుపెట్టి తాగుతోన్న విషయం పోలీసుకు తెలియదా? మద్యానికి డబ్బులివ్వలేదంటూ కొడుకులు తల్లిని సైతం మట్టుబెట్టిన సంగతులు అడపాదడపా కావచ్చు వింటున్నాం కదా?
అసలు దుకాణాల మాటలా ఉంచి కనీసం చట్టాన్ని చట్టుబండలు చేసి నిర్వహిస్తోన్న, సమాజాన్ని నిర్వీర్యం చేస్తోన్న గొలుసుకట్టు మద్యం దుకాణాల భరతం ఎందుకు పట్టరు?
రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి, రాజధాని నుంచి కూడా ఢిల్లీ, ముంబాయి, పునే తదితర ప్రాంతాల వ్యభిచార కేంద్రాలకు వేలాది మంది ఆడపిల్లలు తరలిపోతుండగా, తరలిస్తుండగా పోలీసు ఏమి చేస్తోంది?
వాస్తవానికి రెండో జాబితా ప్రశ్నలకు పోలీసు నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఏనాడూ సూటి జవాబు రాలేదు. రాదు కూడా.
మీడియా కూడా విధానపరంగా ఈ వ్యవహారాలపై ఓ పట్టుపట్టిన దాఖలాలు లేవు. (అడపాదడపా వ్యక్తుల స్పందనలు, కొందరు విలేకరులు స్పందించటం వేరే.)
ఇవీ ప్రభుత్వ రెండు కోణాలు.
అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఏవో మతలబులు ఉన్నట్లేనని భావించాలి.
తమ మనుగడను దెబ్బతీసే వ్యవహారాలను మరుగున పడేసి అనవసర వ్యవహారాల చుట్టూ సమాజాన్ని మోహరించాలన్నదే అ మతలబు. అదే కుట్ర.
ఒకటి … బాధల వలయంలో చిక్కుకున్న సామాన్యుడు మత్తులో గమ్మత్తుగా పడిపోవటం – రెండోది … లాభాల కొండల్ని మూటగట్టుకోవటం.
వీటన్నింటికీ మించి మత్తు ఆవరించిన సామాన్యుడెప్పుడూ అసలు కారణాలను గుర్తించటం, తప్పిదాలను ప్రశ్నించటం సాధారణంగా కానిపని. కుళ్లిపోయిన వ్యవస్థ కొనసాగాలనుకునేవారికి కావాల్సింది అదేగా మరి.
ఆకలితో నకనకలాడే తన కడుపునూ, తమ కుటుంబీకుల కడుపునూ నింపుకునేందుకు రెడ్‌లైట్‌ ఏరియాలకు చేరుతోన్న (బలవంతంగా చేరుస్తోన్న) యువతులు తప్పిదాల సుడిలో చిక్కుకుని విలవిలలాడటం తప్ప కారకుల కాలరు పట్టుకోరు. అయితే ఈ తీరు ఎల్లకాలమూ కొనసాగదనుకోండి.
అదే సందర్భంలో హైటెక్‌ వ్యభిచారమని ప్రచారం చేసుకోవటం ఉన్నత శ్రేణి వ్యాపారాలకు ప్రత్యేకించి దీర్ఘకాలంలో లాభాలు పండిస్తాయి. మత్తు పదార్థాల వ్యాపార రహస్యాలను కనుగొన్న పోలీసులు వాటని ఆర్భాటంగా ప్రచారం చేయటం కూడా వ్యాపార ప్రకటనే. అయితే దీనిని పోలీసు కమిషనరు ఏకే ఖాన్‌ వ్యక్తిగత నిజాయితీతో ముడిపెట్టి పరిమితులు విధించుకుంటే విస్తృతమయిన వ్యవస్థ లోపాలను గుర్తించలేము. సరిజేసుకోలేవు. ఖాన్‌ నిజాయితీకి ధన్యవాదాలు చెబుదాం. ఆయన మహా వ్యవస్థలో ఒక సూక్ష్మా తి సూక్ష్మ శకలం మాత్రమే.
తమ లాభాలను పండించుకునే  పనిలోనే అక్కడ ఘోరాతి ఘోరాలను చూసీ చూడనట్లు వదిలేయటం వెనుక, ఇక్కడ చిన్న వ్యవహారాలనే భూతద్దంలో చూపటం కూడా వ్యాపారాభివృద్ధే ప్రధాన ధ్యేయం.
ఈ వ్యవహారాల్లో ప్రభుత్వ వైఖరిలోని రెండు కోణాలను సూటిగా అర్ధం చేసుకోవటమే మన కొత్త కోణం. చెడుగుల నివారణకు ఎవరిదారిలో వారు, ఎవరికి వీలున్న చోట వారు, ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఏ రూపాన వీలయితే ఆ రూపాన ప్రయత్నించటమే మన కొత్త కోణం. బోలెడన్ని దారుల్లో, బోలెడన్ని ఆలోచనల్లో ఉమ్మడి అంశాలను ఏకీకృతంగా నడిపేందుకు ప్రయత్నించటమే మన కొత్త కోణం.
మన లక్ష్యాలను నెరవేర్చుకోవటమే కొత్త కోణం.

ఎవడబ్బ సొమ్మాని కులికేరురా!

చట్టసభల ప్రతినిధులు మన మొలతాడుతో మనల్నే ఉరితీసే ఘనాపాఠీలు. ఆరుగాలం చమటోడ్చే రైతన్న ఫలసాయాన్ని మెక్కే ఈ బేరగాళ్లు వాళ్లకు ఆత్మహత్య బహూమతిని తరచూ ప్రదానం చేస్తుంటారు. కోట్లుంటేనేమి? కొట్టోడు పెట్టే కొసరు ఎంత బాగుంటదో! అంటూ చిన్న బెల్లం ముక్కను లొట్టలేసుకుంటూ తినేవాడు నా మిత్రుడొకడు. ఈ ఘనాపాఠీలు మామూలోళ్లు కాదు సుమా… వందల కోట్ల విలువయిన ఆస్తిపాస్తులున్న కుబేరులు – ఆపై ప్రపంచంలోనే అత్యధిక జీతాలు పుచ్చుకుంటున్న పెద్దమనుషులు. నాబోటోడి ఆదాయంతో పోలిస్తే (పోనీ సగటు భారతీయుడందాము) కనీసం 104 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నట్లు లెక్కలు విదితం చేస్తున్నాయి. అన్నట్లు ఇప్పుడు మళ్లీ 300 శాతం పెంచుకున్నారు. పెంచాల్సిన పనేలేదని వెర్రోళ్లు ఎర్రోళ్లు ఎదురు తిరిగితే ఈ పెద్ద మనుషులు అలిగి మంచమెక్కారు. వాళ్లేమన్నా విద్యుత్తు ధర పెంచొద్దంటూ బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపే సామాన్యులా?- గుర్రాలతో తొక్కించి, గొట్టాలతో నీళ్లు చిమ్మించి, చివరకు తుపాకి తూటాలతో పొట్టనబెట్టుకోవటానికి. అందుకనే రాజా సింగ్‌ వెంటనే ఒప్పేసుకున్నారు మరి. ఎంపీ ఒక్కొక్కడు ఏడాదికి జీతభత్యాల రూపాన రూ. 57 లక్షలు అక్షరాలా యాభై ఏడు లక్షల రూపాయలు మేసేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జీతభత్యాల విషయంలో దేశంలోనే ఆదర్శంగా ఉన్న పశ్చిమబెంగాలు లెక్కల్ని చూద్దాం. ఆ రాష్ట్ర శాసనసభ్యులు అసోం కన్నా ఆరు రెట్లు తక్కువ జీతాలు తీసుకుంటున్నారు. అన్నీ కలుపుకుని ఆ రాష్ట్ర శాసనసభ్యులకు రూ. 12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. అది కూడా ఏడాది నుంచే అమలు చేస్తున్నారు. పెంచిన తర్వాత కూడా జార్ఘండ్‌ కన్నా నాలుగు రెట్లు తక్కువ జీతాన్ని బెంగాలు ఎమ్మెల్యే తీసుకుంటున్నాడు. జీతభత్యాలు పెంచాలని ఆ రాష్ట్ర కాంగ్రెసు, తృణమూల్‌ శాసనసభ్యులు ఒత్తిడి చేయగా … ”సామాన్యుడికి సరైన జీవన ప్రమాణం సమకూరక సతమతమవుతుంటే, శాసనసభ్యులు తమ జీతాలు పెంచమనటం సక్రమమైన ఆలోచన కాదని శాసనసభాపతి హషీం నమ్రతగా కొట్టిపారేశారనుకోండి. ఈశాన్యంలో ఉన్న త్రిపుర కూడా శాసనసభ్యుల జీతభత్యాల విషయంలో ఆదర్శం పాటిస్తోందని లెక్కలు పట్టిచూపుతున్నాయి. ఆ రాష్ట్ర శాసనసభ్యుడి జీతం రూ. 12 వేలు కాగా, మంత్రుల జీతం రూ. 12300, ముఖ్యమంత్రి కేమో రూ. 12500. అందుకనే కదా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్యసర్కార్‌కు ఒక చొక్కా ఒంటి మీద ఉంటే మరొకటి తీగ మీద ఆరుతూ ఉంటుంది. ఇది ఎవరో చెప్పగా నేను చెబుతున్నది కాదు సుమా! నేను విజయవాడలో పని చేస్తున్న సమయంలో ఓసారి ఆయన అక్కడకు వచ్చారు. మేము వెళ్లే సరికి అతిథి గృహం ముందు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రక్షకభటులు కునుకు తీస్తుండగా, ఆయనేమో స్నానాల గదిలో చేరి తన రెండో చొక్కాను ఉతికిపారేస్త్తోన్న దృశ్యం మా కంటబడి కన్నీరుబికిందంటే నమ్మండి. గత తొమ్మిదేళ్లలో జార్ఘండ్‌ శాసనభ్యుల జీతాలు ఐదు దఫాలు పెరిగాయి. ఇప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ్యులు రూ. 49,333 పుచ్చేసుకుంటున్నారు. అదే అసోం చట్ట ప్రతినిధులకు రూ. 72034 గిడుతోంది. ఇన్నింటిని ప్రస్తావించుకున్న మనం ఘనత వహించిన మన శాసనసభ్యుల జీతాల రహస్యం మాట్లాడుకోవద్దూ! ఎంత లెండి మనోళ్లు రూ. 37 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. అదండీ సంగటి.
శ్రీశ్రీ ప్రశ్నిస్తారూ…

సందులలో, గొందులలో
పందులవలె
మనదీ ఒక బ్రతుకేనా?

నీకన్నా, నాకన్నా, మనందరికన్నా
వందరెట్లు అధిక జీతంబుచ్చుకుంటూ
మన వేళ్లతో మనల్నే పొడిచేవాడెవ్వడనిన
వాడి పేరు పార్లమెంటు సభ్యుడు కాదా తెలుగుబాల!

హై’-ధర-‘బాదు’లో నేను పరాయివాడిని!

అవును నా రాష్ట్ర రాజధాని ‘హై’-ధర-‘బాదు’లో నేను పరాయివాడిని. ఈ పరాయి నరకాన్ని, భూలోక నరకాన్ని నేను భరించలేను. ఎప్పటికప్పుడు మా ఊరికి పారిపోదామని బుర్ర తెగగోల పెడుతూనే ఉంది. అయితే భాగ్యనగరంతో పెనవేసుకున్న కొన్ని బంధాలు నన్ను ఇక్కడ కట్టిపడేస్తున్నాయి. భాగ్యనగరంలో అడుగుపెట్టి ఐదేళ్లవుతున్నా నగరం నాకింకా పరాయిదిగానే కొనసాగుతోంది.
నగరం నన్ను కలుపుకోలేక పోయిందో? నగరంతో నేను మిళితం కాలేకపోయానో? ఏమో?! మొత్తం మీద నేను పరాయివాడిగానే క్షణాల్ని యుగాలుగా దొర్లిస్తున్నాను నా అవసరం కొద్దీ.
మా ఊళ్లో మా అమ్మ మెడలు విరిగేలా గడ్డి మోపులు మోస్తుంది. గేదెల్ని మేపుతుంది. వెన్న నిండిన పాలను మదర్‌ డెయిరీవాడికి అమ్మితే లీటరుకు పాతిక్కూడా రాదు. పచ్చిపాల నుంచి వెన్నంతా చిలికిన ప్లాస్టిక్‌ పొట్లానికి పాతికపైనే ఇచ్చుకుంటూ నేనూ భాగ్యనగరంలో భాగస్వామినేనని అనుకోనా?
భాగ్యనగరమ్మా! ఉదయాన్నే నోరారా నమిలేందుకు ఒక్క వేప్పుల్ల ఉందామ్మా? క్లోజ్‌- అప్‌తో పళ్లు తోముకుంటే అడోళ్లతో – మగాళ్లు, మగాళ్లతో – ఆడోళ్లు క్లోజ్‌గా ముద్దాడుకోవచ్చంటూ మీ టీవీ తెగతెగ వాగేస్తున్నా నాకు ఆ వేప్పుల్లమీద మమకారం పోలేదమ్మా. క్షమించు తల్లీ.!
చెంబట్టుకుని అలా అలా చేల గట్లదాకా వెళ్లి ప్రకృతి మాత ఒడిలో కాలకృత్యాలు తీర్చుకున్న మొన్నటి రోజులు మళ్లీ రావేమోనని తెగ దిగులేస్తోంది రోజూ.
కావిడితో తెచ్చిన చెరువు నీళ్లతో తొట్టి నిండగానే, రంగు- రుచి – వాసన లేని గిలకల బావి నీళ్లు తెచ్చుకుని తాగిన నాకు ఇక్కడి బొద్దింకలు గుంపులు గుంపులుగా చచ్చి కంపుకొట్టే సంపు నీళ్లతో సరిపెట్టుకోమంటే ఎలా తల్లీ? నేను నీవాడినేనని అనుకోలేకపోతున్నాను. ఏమీ అనుకోకు భాగ్యమ్మా!
అలా వీధిలో కాలు బెడుదునా…అన్నో, బావో, మావో అంటూ పలకరించకపోతేమానె, అటూఇటూ బుర్రుబుర్రున తిరిగే బాబుల్లో ఎవడో ఒకడు పొడిచేస్తుంటే ఇది నాదేని ఎలా తలవను తల్లీ? మా ఊళ్లో వానొస్తే వొళ్లంతా త్రుళ్లింతేగదా! మరి ఇక్కడేది తల్లీ? చినుక్కు చిటుక్కు మంటే భయమే. గిలకల్లోతున మురుగునీళ్లు. ప్రవాహాన్ని చిమ్ముకుంటూ వెళ్లే వాహన చోదకులు. చిమ్మిన మురుగు మీద పడి అటు పోవాలో? తిరిగి ఇంటికి వెళ్లాలో? తేలక రోజూ కొట్టుమిట్టాడే నేను భాగ్యనగరంలో ఓ అభాగ్యుడ్ని.
ఎండకాచిన వేళ చూద్దామా? రోడ్డులో ఎక్కడయినా కూసింత ఖాళీ దొరికితే కాలు పెడదామని చూస్తే అబ్బే ఉండదే. అదేనమ్మా, భూమంతా ఉమ్మి, కేకరించి ఊసిన ఉమ్మి, ఖైనీ ఉమ్మి, గుట్కా ఉమ్మి, ఉబుసుకుపోక వేసిన ఉమ్మి, అలవాటుగా వేసిన ఉమ్మి. దగ్గిదగ్గి దగ్గిన ఉమ్మి, తుమ్మి, తుమ్మి తుమ్మిన ఉమ్మి. కాలు పెడదామంటే భయం, భయం. ఏ ఉమ్మి ఏ రోగాన్ని అంటిస్తుందో తెలియక, భయం భయం.
ఆరెంకల జీతగాళ్లను దృష్టిలో పెట్టుకుని గజం స్థలం ‘గజ’మంత పలికితే ఈ ‘హై’ టెక్‌ సిటీలో నా నీడ మాటేమిటి?
మున్నూట అరవై రోజులూ చెమటోడ్చి బుట్టలకెత్తిన టమోట మా ఊళ్లో కిలో పావలాకు కొని, పాతిక్కి అమ్ముతున్న హై’ధర’బాద్‌లో నేనూ ఒకడిననుకుని నన్ను నేను వంచన చేసుకోమంటావా? భాగ్యనగరమ్మా!
కిలో రూ. 20 పడని బియ్యానికి నలభై వసూలు చేస్తుంటే ఇది నా భూమేనని భజాయించటం సాధ్యమేనా నా వంటి నల్ల మాస్టారూ?
వీధి వెంట పోతుంటే భుజం రాసుకుందని వాడ్ని వెదికి వెదికి ప్రాణం తీసే మనుషుల్ని నా వాళ్లని ఎలా? అనుకోను భాగమతీదేవీ?
అలా సాయం సమయమయితే కాసింత మంచి గాలి తగులుద్దని ఆశపడితే ముక్కుపుటాలు మండుకుపోయే రసాయనిక వాయువు.
లేస్తే అబద్ధాలు, వాడికి నమస్కారం పెట్టకపోతే ఖాండ్రింపులు ఇదేమి తల్లీ!
అదుంటే కొండమీద కోతయినా దిగొస్తుందన్నట్లుగా, డబ్బు స్నేహాలు…కంపు బంధుత్వాలు.
ప్లాస్టిక్‌ పువ్వులు … ప్లాస్టిక్‌ నవ్వులు … గ్లిజరిన్‌ ఏడుపులు.
ఇప్పుడు చెప్పమ్మా? నేను ఇంటోడినా? పరాయోడినా?

”ముదనష్టపోళ్లారా … ఎక్కడెక్కడదీ చాలకుందే మీకు!”

”ముదనష్టపోళ్లారా … ఎక్కడెక్కడదీ చాలకుందే మీకు!” అంటూ పాలబూత్‌ దగ్గర చేతిలో దినపత్రికతో కూర్చున్న ఓ పెద్దాయన తుపుక్కున ఉమ్మి పెద్దపెద్దగా కేకలు పెడుతుండటం నా కంటబడింది శనివారం ఉదయం. ఇంటికెళ్లి చూద్దునుగదా, పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు వార్త చదివిన ఆ పెద్దాయనకు కడుపు మండిందని అర్ధమయింది నాకు.
అవును మరి. ఎవరికయినా కడుపు మండదూ మరి?
ప్రస్తుత పార్లమెంటునే తీసుకుందాం. తాము కోటీశ్వరులమని లోక్‌సభలో 542 కిగాను ఓ 300 మంది, రాజ్యసభలో 215 మందికిగాను ఓ 95 మంది రాతపూర్వకంగా వాళ్లకు వాళ్లే చెప్పుకున్నారు. ఇప్పుడేమో, జీతాలు పెంచమంటూ అలకబూనితే కోపం నషాళానికి అంటకపోతే తప్పు. రక్తపోటు పెరిగి గబగబా నాలుగు బూతులు తిట్టి శాంత పడకపోతే మనిషేనా అని ఎవరినయినా అనుమానించక తప్పదేమో! అన్నట్లు కోటీశ్వరులు కోటీశ్వరుల గురించి చర్చిస్తారుగానీ, డొక్కలెండేవాడి గురించి చర్చిస్తారా? మన పిచ్చికాకపోతే. వాడికి ఓటేయనేల? ఇప్పుడు నోరుపారేసుకోనేల? అంటూ పేపరు పెద్దాయన పక్కనున్న చిన్నోడు వేసిన ప్రశ్నా ఆలోచించదగినదే. చేతులు కాలాక ఆకులు పట్టుకునేకన్నా ముందే జాగ్రత్త పడలేమా?
14వ లోక్‌సభలో (2004) 154 మంది కోటీశ్వరులు ఉండగా ఇప్పుడా సంఖ్య రెట్టింపయింది. కాంగ్రెసు పార్టీకి ప్రస్తుత లోక్‌సభలో 206 మంది సభ్యులుండగా అందులో 138 మంది కోటీశ్వరులే. లోక్‌సభ సభ్యులందరికీ రూ. 3075 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల సంఘానికి వాళ్లిచ్చిన ఆధారాలు పట్టిచూపుతున్నాయి. వాస్తవ విలువయితే దీనికి ఎన్ని రెట్లు అదనంగా ఉంటుందో వేరేగా లెక్కలు వేసి మరీ విడమరిచి చెప్పాల్సిన పనిలేదు. దీనికితోడు లెక్కకు రాని ఆస్తులు ఇంకెన్ని ఉంటాయో వెలికి తీసి చెబితే బహూశా కోట్లాది మందికి మూకుమ్మడిగా గుండెపోట్లు రావచ్చని నా ప్రగాఢ భయం. పారిశ్రామికవేత్తలు తమను తాము రక్షించుకోవటానికి శాసన వేదికల్లోకి చొచ్చుకొస్తున్న తీరుకు ఇది నిదర్శనం.
గత లోక్‌సభ ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం రూ. 1120 కోట్లు వెచ్చించగా, అభ్యర్థుల ఖర్చు రూ. 10 వేల కోట్లకు పైమాటేనని నిపుణులు అంచనా వేశారు. చట్టం ప్రకారమయితే కేవలం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే గత ఎన్నికల్లో పోటీబడిన మొత్తం అభ్యర్థులందరూ కలిపి ఖర్చుపెట్టుకోవచ్చు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ బొర్ర విరిచి చెప్పుకునే దేశంలో చట్టాలు చేయవలసిన నేతలే వాటిని ఛిద్రం చేసేస్తున్నారు. దోసకాయ దొంగతనం చేసిననాడే అన్నట్లుగా ఇక మేలుకోకపోతే … రేపటిని ఊహించటం కూడా కష్టమే. గత సర్పంచి ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఔటర్‌ రింగురోడ్డు సమీపంలోని ఓ గ్రామానికి సర్పంచిగా గెలిచిన పెద్దాయన తాను ఐదు కోట్లు ఖర్చుపెట్టానని చెప్పుకున్న విషయం మరుద్దామన్నా నాకయితే మరుపుకు రావటం లేదు. ఎకరం పది కోట్ల రూపాయలు పలికే 70 ఎకరాల పోరంబోకు భూమి ఉన్న పంచాయితీకి అంత ఖర్చుపెట్టక పోతే ఎలా గెలుస్తానని ఆయన ప్రశ్నించాడు. అందులో పదెకరాలు దక్కించుకున్నా కొన్ని తరాలు కాలుమీద కాలేసుకుని బతకొచ్చుగదా?! అని అసలు విషయం చల్లగా చెప్పాడా పెద్దమనిషి. పంచాయతి మొదలు లోక్‌సభ సభ్యుడిదాకా రహస్య నినాదం ఒక్కటే… అది ‘సొంతం’. అదీ సంగతి. తెలుసుకుని మసలుకోకపోతే తప్పు వాళ్లది కాదు. మనదే.
ఎంపీల జీతాల పెంపును గతంలో వలే ఈసారి కూడా వామపక్షాలు ప్రధానంగా సీపీఎం సభ్యులు వ్యతిరేకించటం ప్రశంసనీయం. రాష్ట్ర శాసనసభ్యులు ఇప్పటికి నాకు తెలిసి కనీసం మూడుసార్లు కోట్ల రూపాయల విలువయిన ఇళ్ల స్థలాల్ని కొట్టేయగా, సీపీఎం సభ్యులు మాత్రమే తీసుకోకపోవటం విశేషమేకదా మరి.! అన్నట్లు లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ కోటీశ్వరుల జాబితాలో వామపక్ష సభ్యులు లేరు. ప్రతిపక్ష బీజేపీకి లోక్‌సభలో 58 మంది కోటీశ్వరులున్నారు. అదే రాజ్యసభలో కాంగ్రెసుకు 33 మంది కోటీశ్వరులుండగా, బీజేపీకి 21 మంది ఆ జాబితాలో ఉన్నారు. తెర వెనుక ఉంటే కుదరని పరిస్థితుల్లో కోటీశ్వరులు తెర ముందుకు వస్తోన్న స్ధితిని ఇదంతా పట్టి చూపుతోంది. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి చవాన్‌ ఎన్నికల సమయంలో రూ. 75 కోట్ల విలువయిన వార్తల్ని వివిధ పత్రికల్లో రాయించుకున్నట్లు ప్రముఖ పాత్రికేయుడు పి సాయినాథ్‌ హిందూ దినపత్రికలో లెక్కలు వేశారు. అయితే చవాన్‌ లెక్కల్లో మాత్రం పత్రికా ప్రకటనల ఖర్చు కేవలం రూ. 5379 మాత్రమే. ఇదీ మన ప్రజాస్వామ్యం. పత్తికట్టెలు.
మన ప్రజాకవి వేమన అంటారూ….
”మేడి పండు చూడ మేలిమైవుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు”.

వీధికో వీరేశలింగం పుట్టాల!

అవును, వీధికొక కందుకూరి వీరేశలింగం పంతులు పుట్టాల! ఎందుకనంటే…
మా బంధువులమ్మాయి శైలజ భర్త చనిపోయాడు. హెపటైటిస్‌-బి సోకింది. అందులోనూ మద్యం కూడా సేవించినట్లు అనుమానాలున్నాయి. ఇంకేముంది, హైదరాబాదు తీసుకుపోయినా డబ్బు ఖర్చు తప్ప జబ్బు తగ్గలేదు. 30వ ఏటనే శైలజ భర్త రామారావు అశువులుబాశాడు.
శైలజకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త చనిపోతే ఖనన సమయంలోనే తాము ఇచ్చిన కట్నకానుకల్ని తల్లిదండ్రులు అణాపైసల్తో వసూలు చేసుకోవటం ఇప్పుడు మా ప్రాంతంలో పద్ధతిగా అనుసరిస్తున్నారు. దీనికితోడు ఆ కుటుంబానికి ఉమ్మడి ఆస్థినుంచి రావాల్సిన వాటాను కూడా అప్పుడే రాబట్టుకుంటున్నారు. కట్నం సొమ్ము, వాటా ఆస్థి దక్కకపోతే ఇవాళున్న పరిస్థితుల్లో భర్తను కోల్పోయిన యువతి, బిడ్డలతో బతకటం అంత తేలికకాకపోవటమే ఈ వసూలుకు నాంది పలికింది. దీనికితోడు బిడ్డల చదువు సంధ్యలు ఖరీదవటం కూడా దీనికి దోహదపడింది.
ఇక మా శైలజ విషయంలో ఖననం సందర్భంగా వసూలు తతంగం నడపటం కుదరలేదు. అలాంటి సమయంలో పెద్ద కర్మ రోజున వ్యవహారాన్ని నడుపుతారు. మేమూ అదే ప్రణాళిక వేసుకున్నాము. నేను ముందు జాగ్రత్తగా 50 మందితో పెద్ద కర్మకు హాజరయ్యాను. ఇంకా కాసేపట్లో కర్మకాండల కార్యక్రమం మొదలవబోతుండగా నేను మరొక పెద్ద సాయంతో శైలజ మామను పక్కకు పిలిచి ఆస్తుల విషయాన్ని ప్రస్తావించాను. ఆయన ఒక్కసారిగా నా చేతులు పట్టుకుని… ”ఆ ఒక్కటీ అడక్కండి బాబూ. శైలజ నా కోడలు కాదు. నా కూతురు. ఇద్దరి ఆడపిల్లల్నీ ఎంతవరకు చదువుకుంటే అంత చదివించే బాధ్యత నాది. పెళ్లి చేసే పూచీ నాది. వాళ్లంతా నా దగ్గరే ఉంటారు. దయచేసి మమ్మల్ని విడదీయకండి.” అంటూ అభ్యర్థించాడు. అలాంటి పరిణామం ఏర్పడుతుందని నేను ఊహించలేదు. దాంతో నా నోట మాట రాలేదు. సహజంగా ఆస్తులు ఇవ్వబోమంటూ ఎదురు తిరుగుతుంటారు. చిన్నవాళ్ల చదువు, పెళ్లి ఇలాంటి విషయాలను ముందుకు  తెచ్చి గలభా గలభా చేయటం సహజం. కానీ శైలజ మామ భిన్నంగా వ్యవహరించటం అతని ప్రత్యేకతకు నిదర్శనం. అతను సామాన్యుడు కాడు. ఈ పరిస్థితి ఏదో ఒక సమయంలో వస్తుందని అతనికి తెలియంది కాదు. ఆ మేరకు ఆయన కూడా సంసిద్ధుడయినట్లు అన్పించింది. అందులోనూ నాతో వచ్చిన పెద్ద కూడా పెద్దాయన కోరిక సబబేనంటూ వాదించటం ప్రారంభించాడు. ఇక చేసేది లేక ”సరే పనులు కానిస్తుండండి, నేను ఓ పావు గంటలో ఏ విషయమూ చెబుతాను అంటూ అక్కడ నుంచి వచ్చేశాను. అక్కడ జరిగిన విషయాన్ని మిత్రుల ముందుంచి వారితో చర్చించాను. వాళ్ల మామ కోరిక మాట ఎలాగున్నా, శైలజ మాట ప్రకారం పోవాలని భావించాము. అదే విషయాన్న శైలజతో చెప్పాము. ఇలాంటి విషయాల్లో అనుభవం లేని శైలజ తన మామ పట్ల సానుకూలత వ్యక్తం చేసింది. కోడల్ని కూతురన్న తర్వాత ఆస్తులడగటం మంచిది కాదని లొంగిపోయింది. పెళ్లయి ఆరేళ్లు గడిచినా అత్తమామలకు దూరంగా ఉంటున్నందున వాళ్ల గురించి శైలజ సరిగ్గా అంచనా వేయలేకపోయింది. మేమనుకున్నట్లుగా  శైలజ కోరిక ప్రకారం మౌనం వహించాము.
తర్వాత మూడు నెలలు గడిచిందో లేదో, శైలజ నుంచి ఆమె తల్లిదండ్రులకు బాధాకరమయిన సమాచారం అందటం ప్రారంభమయింది. ఆమెకూ, ఆమె బిడ్డలకూ చిన్న చీకటి గది కేటాయించారు అత్తమామలు. వేరుగా పెట్టారు. పోనీ ఉప్పు, పప్పు అన్నా ఇచ్చారా? అంటే అదీ లేదు. అటు చావకుండా, ఇటు బతక్కుండా అన్నట్లుగా కూసింత  బియ్యం, చింతపండు ఇచ్చి వండుకోమన్నారు. దాంతో యుద్ధం రాజుకుంది. పిల్లలకు ఫీజులు కూడా తాత చెల్లించకపోవటంతో వ్యవహారం వీధికెక్కింది. అయితే పెద్దాయన నోటికి దడిచి పరాయివాళ్లెవ్వరూ నోరు విప్పరు. ఇంట్లోవాళ్లదీ అదే పరిస్థితి. ఆరు నెలలు గడిచే సరికి శైలజ మూటాముల్లె సర్దుకుని పుట్టింటికి రాక తప్పని దుస్థితి ఏర్పడింది.
కోడలు కాదు కూతురు అన్నవాడు చారెడు బియ్యం కూడా ఇవ్వకుండా ఏడిపించటం ఏమిటని ఆరా తీయటం ప్రారంభించాను. అప్పుడు బయట పడింది అసలు విషయం. భూస్వామ్య ‌ సంప్రదాయం. భూస్వామ్య‌ ఆలోచనల ఫలితమే శైలజ బాధలకు హేతువు. ఆస్తి చేజిక్కితే పిల్లల్ని తన దగ్గరకు తరిమేసో, పుట్టింటవారికి అప్పజెప్పో శైలజ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని ఆమె మామ రామారావు బుర్రకెక్కించుకున్నాడు. అదే జరిగితే ఇంకేమన్నా ఉందా అని భయపడ్డాడు. ఆమెకు రెండో పెళ్లి జరగకుండా ఉండాలంటే ఆస్తి పంపకం జరపకపోవటమే దారని నిర్ణయించుకున్నాడు. అప్పుడు చచ్చినట్లు తన కోడలు తన పంచలోనే పడి ఉంటుందని అతగాడి భావన. అయితే అదేమీ చెప్పకుండా ‘కోడలు కాదు కూతురు’ అంటూ నాటకాలాడాడు. మొత్తం మీద నాలుగేళ్లు పోరాడగా, పోరాడగా నాలుగు ఎకరాలుగాను ఎకరం పొలాన్ని పంచి చేతులు దులిపేసుకున్నాడు శైలజ మామగారు. మొత్తం మీద తన కోడలికి రెండో పెళ్లి జరక్కుండా చూసుకోగలిగాననీ, అదే సందర్భంలో ఆస్తి పంపకాన్ని శక్తిమేర అడ్డుకోగలిగానని అతని బంధువుతో వ్యాఖ్యానించటం అతని ఆలోచనాసాలోచనలకు అద్దంపట్టింది. శైలజ పని మొత్తం మీద చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తీరున ఉంది. ఆ రోజునే నాకు అన్పించింది ఏమంటే … ఇంటింటికో వీరేశలింగం పంతులుగారు పుట్టకపోతేమానే కనీసం వీధికొకరన్నా పుట్టాలని. అంటే నిజంగానే అలనాటి రాజమండ్రి వీరేశలింగం పంతులుగారు వీధికొక గర్భిణిని ఎంచుకుని ఆమె పొట్టలోకి చేరిపోయి ఎంచక్కా ఎనిమిది నెలల తర్వాత కేర్‌, కేర్‌ మంటూ భూమ్మీద పడాలని కాదు…. కొద్దిమంది బుర్రల బూజు దులపాలని కోరుకుంటున్నా. బుర్రల బూజు దులుపుకుని బయలు దేరినవాళ్లే ఈ దేశాన్నీ, ఈ సమాజాన్ని అంతో ఇంతో ఉద్ధరిస్తారని నమ్ముతున్నా. ఆడ పిల్లలకు పునర్వివాహాలు చేసి ఆనాటి సమాజాన్ని శక్తిమంతంగా ఎదుర్కొన్న  కందుకూరి నిజంగా పురుషులందు పుణ్యపురుషుడు.
జై కందుకూరి …. జై జై కందుకూరి.