నేరగాళ్లకు నేతలు అండదండలు ఇస్తారన్న విషయం తెలియనివారుండరంటే అతిశయోక్తికాదు. నేతలు కన్నెర్రజేస్తే పారిపోయే విలేకరులుంటారన్న నిజం అందరికీ విపులంగా తెలియకపోవచ్చేమో బహూశా. అయితే ఈరెండూ మిళితమైన ఓ సంఘటనను చెప్పనీయండి.
పదేళ్ల క్రితంవరకూ గూండాలకూ, ప్రత్యేకించి కిరాయి హంతకులకు ఒంగోలు నిలయంగా ఉండేది. అంటే ఇప్పుడు లేరని కాదు. ఆనాడు పట్టణం పూర్తిగా గూండాల చేతుల్లో ఉండేదంటే నిజం. నేను చెప్పబోయే సంఘటన హంతకులుగా ముద్రపడినవారంతా ఒకరిచేతుల్లో మరొకరు రాలిపోయిన తర్వాత చోటుచేసుకుంది.
ఒంగోలు సుందరయ్యభవన్‌రోడ్డు నందున్న ఓ ప్రైవేటు
పాఠశాల బుజ్జాయిల్ని ఓ స్థానిక యువ గూండాగాడు రోజూ ఏడిపించటం ప్రారంభించాడు. విరామ సమయంలో ఆడుకుంటున్న ఆడపిల్లల్ని ఏదో ఒక నెపంతో తాకటం, వక్రంగా మాట్లాడటంతో కొందరిలో భయం ఏర్పడింది. ఆడుకుంటున్న సమయంలో చిన్నారులు రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేస్తుంటే వీడు తొంగి చూడటం, వంగి రాళ్లు విసరటమూ నిత్యకృత్యంగా సాగించాడు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే స్థానిక మహిళ ఒకరు ఈ తతంగాన్నంతా గమనించింది. మూత్రవిసర్జన చేస్తున్న ఓ చిన్నారిపైకి గూండాగాడు గులకరాయి విసరటం ఓ రోజు ఆమె కంటబడింది. ఏ పిసరంతయినా మానవత్వమున్న ఎవ్వరినయినా గుండెలు పిండేసే ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక గూండాగాడిని కూకలేసింది. అంతేవాడు తిరగబడ్డాడు. చంపుతానంటూ బెదిరించాడు. దీంతో చేసేదిలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతో ఇంతో ప్రజల్లో పలుకుబడి ఉన్న మహిళ కావటంతో పోలీసులకు స్పందించక తప్పలేదు. వాడిని వెంటనే అదుపులోకి తీసుకుని ఊచలు లెక్కపెట్టేపని పెట్టారు. అయితే అదెంతో సేపు కొనసాగలేదు. ఒంగోలు ప్రజాప్రతినిధిగారి వ్యక్తిగత కార్యదర్శిగారిని గూండాగారి బంధువులు కలిసి వాడ్ని విడిపించమని వేడుకున్నారు. నాయకుడి గెలుపు కోసం తామెంత కష్టపడిందీ చిలవలు- పలవలు కలగలిపి చెప్పుకున్నారు. అంతే కార్యక్రమం మొదలయింది. పోలీసుస్టేషనకు ఫోను ఆదేశం పోయింది. గూండాగాడిని తక్షణమే విడుదల చేయమని హూకూం జారీ అయింది. ఫలితం గూండాగాడు బయటికొచ్చాడు. బాధితుల కోసం నిత్యం శ్రమించే ఆ మహిళ భయపడటంతో కొందరు ఈ సమాచారాన్ని నా చెవినబడేశారు. నేను వెంటనే రంగంలోకి దిగాను. చకచకా సమాచారాన్ని సేకరించాను. ఈ వ్యవహారం మొత్తం వారివారి సూటి మాటల పొందికతో ప్రత్యేక వార్తాకథనంగా రూపుదిద్దుకుంది. తెల్లవారేసరికల్లా ‘నేరగాళ్లకు నేతల అండదండ’ శీర్షికతో రంగురంగుల్లో పాఠకులందరికీ వడ్డన జరిగింది. ఆ ప్రజాప్రతినిధి అక్రమాలపై ఎవ్వరూ నోరు, కలమూ విప్పని నేపథ్యంలో సాహసించావంటూ పలువురి నుంచి నాకు ఫోన్లు అందాయి. ఉదయం తొమ్మిది గంటల సమయంలో స్టాఫ్ రిపోర్టరు నుంచి కూడా ఆకాశం ఎత్తున అభినందనలు అందాయి. తాను అప్పటికే ఆ వార్తను 17సార్లు చదివాననీ, అయినా తనివి తీరలేదని చెప్పుకొచ్చాడు. ఉదయం 10 గంటల వేళ తీరిగ్గా నిద్రలేచి, ఆ తర్వాత మరింత తీరిగ్గా పత్రికా పఠనం చేస్తుండగా తనపై రాసిన అండదండ వార్తను చూసిన సదరు ప్రజాప్రతినిధికి కోపం కట్టలు తెంచుకుంది. ఆయన ఇంటి పంచలో చేరిన అనుయాయులయితే విలేకరిగాడి కాళ్లు విరగ్గొట్టాలంటూ ప్రతినలు బూనారు. ఆయనగారి కార్యదర్శిగారి నుంచి స్టాఫ్ రిపోర్టరుకు తొలిఫోను వచ్చింది. ఆయనగారి భయంకర ఘర్జనలకు రిపోర్టరు బెదిరిపోయాడు. ఫోను పెట్టేసిన తర్వాత అతని స్వరం మారిపోయింది. పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్లు ముఖం మాడిపోయింది. వణుకు ప్రారంభమయింది. డోసు కొంత తగ్గించి రాసినట్లయితే బాగుండేదేమో సుబ్బారావు అన్నాడు నాతో. ఆ తర్వాత ప్రజాప్రతినిధి ఇంటినుంచి మళ్లీ మళ్లీ ఫోన్లు. దీంతో గుడ్లు తేలేసిన విలేకరి ఆయనింటికెళ్లి క్షమాపణలు చెప్పుకునేందుకు సిద్ధపడ్డాడు. అయితే నేను లేకుండా వెళ్లలేనంటాడు. క్షమాపణ చెప్పి వెంటనే వెనుదిరుగుదామని వేడుకున్నాడు. చేయని తప్పుకు క్షమాపణలు కాదుగదా, పొరబాటున కాలో, చెయ్యో తగిలితే వెంటనే నాలుక స్పందించి చెప్పే సారీ అని కూడా చెప్పబోనని తేల్చిచెప్పాను. అసలు వారి ఇంటి ఛాయలకు కూడా రాబోనని ఎదురుతిరిగాను. నేను పనిచేసే పత్రికలో తొలినాళ్లలో సబ్‌ఎడిటరుగా బాధ్యతలు నిర్వర్తించిన ఓ పెద్దమనిషిని ప్రజాప్రతినిధి దగ్గరకు రాయబారం చేసేందుకు పంపారు. మా పెద్దాయన చనువుగా ఆయన కోపం తగ్గించి వచ్చేసినా రిపోర్టరుగారి వణుకు మాత్రం తగ్గలేదు. పూర్తిగా చేతులెత్తేసి అలాంటి వార్తలు రాయొద్దనీ, రాస్తే తన ఉద్యోగం ఊడుతుందనీ కన్నీళ్లపర్యంతం అయ్యాడు.
కొసమెరుపు : నెల్లూరు జిల్లాకు చెందిన జాతీయనాయకుడూ, ఒంగోలు ప్రజాప్రతినిధి కలిసి వెళ్లి హైదరాబాదులో పత్రికాధిపతికి ఫిర్యాదు చేశారు. అంతకు ముందే నా వార్తలపై పత్రికాధిపతిని రెండుసార్లు కలిసినట్లు నాకు పక్కా సమాచారం ఉంది. తనపై కక్షకట్టి లేనిపోని అబద్ధాలతో వార్తలు ప్రచురిస్తున్నారని ఫిర్యాదు చేశారు. డెస్క్ ఇన్‌ఛార్జి దీనికంతటికీ కారణమని ఆరోపించారు. ఆయన చెబితే కావూరి వార్తలు రాసి తనను భ్రష్టు పట్టిస్తున్నారని వివరించారు. దీంతో పత్రికాధిపతి స్పందించి డెస్క్ ఇన్‌ఛార్జిని ప్రకాశం నుంచి కృష్ణాజిల్లాకు బదిలీ చేశారు. అయితే రాజకీయనాయకుల మాటలు విని తన మచ్చలేని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసిన పద్థతికి నొచ్చుకున్న డెస్క్ ఇన్‌ఛార్జి రాజీనామా చేశారు. ఇప్పుడాయన వ్యాపారం చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు. అయితే సుబ్బారావు కారణంగా తాను రాజీనామా చేయవలసి వచ్చిందని ఆయన ఏనాడూ, ఎవరిదగ్గరా వ్యాఖ్యానించకపోవటం ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. నేను కూడా విధిలేక ఆ పత్రిక నుంచి కొన్నాళ్ల తర్వాత బయటకు రాక తప్పలేదు. ఆ విషయాలు మరోసారి….
Archive for ఆగస్ట్ 2nd, 2010
2 ఆగ