Archive for ఆగస్ట్ 3rd, 2010

ఎందుకని? ఎందుకని? ఎందుకని? అట్లెందుకు? ఇట్లెందుకు?

ఆరుగాలం కష్టపడ్డా రైతన్నకు అప్పుల తిప్పలు తప్పవు ఎందుకని?
తెల్లబట్టల దళారోడికి డబ్బే, డబ్బు ఎందుకని?
సంచులతో సొమ్మిస్తే జేబులకు కూడా సరుకురాదు ఎందుకని?
కొనబోతే కొరివి … అమ్మబోతే అడవి
ఎందుకని? ఎందుకని? ఎందుకని?

ఇవన్నీ ఇప్పటిదాకా విన్నాం! కన్నాం!!
ఎప్పటిలా ప్రశ్నలు, నినాదాల దగ్గరే ఆగిపోతే నిజం తెలియదు. ఎవరు ఏమి చెప్పినా కాబోలనుకుని గంగిరెద్దుల్లా తలలూపి, బాధ దిగమింగి మన పనికి మనం వెళ్లిపోతాం. బాధలు నీడల వలె ఎప్పటికీ మననంటే ఉంటాయి. ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ తదితరులు గత ఆరేళ్లుగా ఇదిగో ధరలు తగ్గుతాయి … అదిగో తగ్గుతాయంటూ ఊరిస్తున్నా సమస్య యధాతథంగా ఎందుకు ఉంటుందో చూద్దాం.
ఈ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలంటే ఏదో ఒక వినియోగ వస్తువు పూర్వాపరాల్ని పరిశీలించటం అవసరం.
శనగను ఉదాహరణగా తీసుకుని ఈ ప్రశ్నల్ని తేల్చివేసేందుకు నన్ను ప్రయత్నించనీయండి.
రైతు అమ్మకం ధర క్వింటాలు రూ. 2000
క్వింటాలు శనగలకు ఉత్పత్తయ్యే పప్పు 75 కిలోలు.
అంటే 75 కిలోల శనగపప్పు ఖరీదు రూ. 2000
కిలో ఒక్కింటి ధర సుమారుగా రూ. 26. 50
అదే శనగపప్పును వినియోగదారుడు కొంటున్న ధర కిలో తక్కువలో తక్కువ రూ. 40 నుంచి ఎక్కువ రూ. 55 వరకూ ఉంది.
అటు తయారీ ఖరీదుకూ, ఇటు కొనుగోలు ధరకూ కిలోకు తేడా రూ. 13.50 నుంచి రూ. 28.50 వరకూ ఉంది.
ఈ సొమ్ము ఎవరెవరికి దక్కుతోందో చూద్దాం. రైతు నుంచి శనగల్ని దళారులు కొనుగోలు చేస్తారు. వారి నుంచి బట్టీ యజమాని కొని శనగపప్పు ఉత్పత్తి చేస్తాడు. బట్టీల నుంచి శనగపప్పును టోకు వర్తకుడు కొని చిల్లర వర్తకుడికి పంపిణీ చేస్తాడు. చిల్లర వర్తకుడి నుంచి వినియోగదారుడికి చేరుతుంది. ఈ వ్యవహారంలో శనగల్ని పండించే రైతు, బట్టీ యజమాని, చిల్లర వర్తకుడు, వినియోగదారులు బడుగులు. (చిల్లర వర్తకులంటే బిగ్‌బజారు, స్పెన్సర్‌, మోర్‌, రిలయన్స్‌ తదితర సూపర్‌బజార్లు కాదండోయ్‌) శనగలు కొనే దళారి, పప్పు టోకు వ్యాపారి ఒక వర్గం. శనగలు పప్పగా మారే క్రమంలో రవాణా ఖర్చుతోపాటు బట్టీ ఖర్చు ఉంటుంది. వాస్తవానికి బట్టీ యజమానికి చెల్లించే ఖరీదు శనగ పొట్టు ఖరీదుకు సమానంగా ఉంటుంది. అయినా ఈ రెండు పనులకూ కలిపి ఎక్కువలో ఎక్కువ ప్రతి కిలోకూ రూ. 3.50 ఖర్చవుతుందని అనుకున్నా పప్పు ఖరీదు రూ. 30 పడుతుంది. దళారి, పప్పు టొకు వ్యాపారి, చిల్లర వ్యాపారి కలిపి పది శాతం చొప్పున లాభాలు వేసుకుంటే ప్రతి కిలోకూ మరొక తొమ్మిది రూపాయల చొప్పున ఖరీదు పెరుగుతుంది. అప్పుడు కిలో శనగపప్పు ఖరీదు ఎట్టి పరిస్థితుల్లోనూ రూ. 39కి మించకూడదు. ఈ విధంగా చూస్తే ఒక రకం పప్పును రూ. 40 అమ్మటం సరయినదేనని అనుకోవాలి. అయితే రూ. 40కి అమ్మే పప్పు ఉత్పత్తికి నాసిరకం శనగల్ని వినియోగిస్తారు. వాటిని క్వింటాలు రూ. 1000 నుంచి రూ. 1200 లోపే కొనుగోలు చేస్తారు. దీనికితోడు వాటిల్లో మట్టి, రాళ్లు, పుల్లలు, పొట్టు, నూక కూడా ఉండటం కద్దు. ఇవన్నీ కలిపి 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకూ ఉంటాయని అందరికీ తెలిసిందే. తూకం మోసాలు సరేసరి. అంటే అటు రైతు ఇటు వినియోగదారుడికే కన్నీళ్లన్నమాట. ఇలా బియ్యం మొదలు ఏ వ్యవసాయ ఉత్పత్తిని తీసుకున్నా ఇదే తీరున దళారులు లాభాల కొండల్ని పేర్చుకుంటున్నారు.
శనగ సాగుకు ఎకరానికి రూ. 20 వేలదాకా ఖర్చవుతుండగా సగటున ఎనిమిది క్వింటాళ్లు దిగుబడి అవుతుంది. క్వింటాలు రెండు వేల రూపాయలు పలికితే రూ. 16 వేల రాబడి, రూ. 4000 నష్టం రైతుకు మిగులుతుంది. అదే ఇంట్లో వాళ్లంతా కష్టపడితే, అదీ సొంత భూమయితే దానికి దానికి సరిపోతుంది. మొత్తం మీద రైతుకు మిగిలేదేమీ ఉండదు.
బియ్యం పరిస్థితీ అంతే. నెల్లూరు సన్నాలు ఇప్పుడు క్వింటాలు రూ. 1000 పలుకుతోంది. మరవేయిస్తే క్వింటాలుకు 55 కిలోలదాకా ముడి బియ్యం దిగుబడవుతుంది. పాలిష్‌లో తగ్గుదల, రవాణా ఖర్చులమేర ఐదు కిలోలు తగ్గించి లెక్కవేస్తే కిలో మంచి బియ్యం ఖరీదు రూ. 20 పడుతుంది. మర ఖర్చుకంటే అధికంగానే తవుడు ద్వారా సమకూరుతుంది. అంటే మిల్లు ఖర్చూ లేకపోగా మరి కొంత కలిసి వస్తుంది. మరి నాణ్యమయిన బియ్యాన్ని ఎక్కడయినా కిలో రూ. 20కు అమ్ముతున్నారా? నాసిరకం మాత్రమే ఆ ధరకు దొరుకుతున్నాయి. రూ. 1000 వెచ్చించి కొనుగోలు చేసే ధాన్యం నుంచి ఉత్పత్తి చేసే బియ్యాన్ని రూ. 34 అమ్ముతున్నారు. అంటే ప్రతి కిలోకూ దళారులకు రూ. 14 అంతకంటే అధికంగా దక్కుతోంది. దళారులు ఇన్నిన్ని లాభాలు పోగేసుకుంటుంటే ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు???.

రాఘవాచార్యులు … ఓ గోముఖ వ్యాఘ్రం – ఓ సామాజిక చీడపురుగు – నేటి పార్క్ వుడ్ ఆయూబ్ కు తొలినాటి పునాది.

అవును, రాఘవాచార్యులు నిజంగా ఓ గోముఖ వ్యాఘ్రం. ఓ సామాజిక చీడపురుగు. నేటి పార్క్ వుడ్ ఆయూబ్ కు తొలినాటి పునాది.
రాఘవాచార్యులు మా పంతులుగారు. తెలుగు పంతులుగారు. మూలం వ్యవసాయమే అయినా, మూడు తరాలుగా పంతుళ్లుగా రాణిస్తోన్న కుటుంబంలో భాగస్వామినయిన నేను మా తాతయ్య వెంకటసుబ్బయ్య లాంటి, మా నాన్న కోటేశ్వరరావుకు సహ ఉపాధ్యాయుడు, మా తమ్ముడు నాగార్జునరావు అదే వృత్తిలో ఉన్నా రాఘవాచార్యుల్ని, అదీ 35 ఏళ్ల తర్వాత ఇలా తిడుతూ గుర్తు చేసుకోవలసి రావటం బాధాకరమే అయినా, సామాజిక బాధ్యతగా భావిస్తున్నాను. బహూశా ఆయన విశ్రాంత దశకు చేరి ఉండవచ్చని భావిస్తున్నాను. ఈ దశలోనయినా ఆయన పశ్చాత్తాప పడతాడని నాకు నమ్మకం లేకే ఆయన పట్ల దురుసుగా వ్యాఖ్యానించాను. ఈ వ్యాఖ్యలు చదివిన వారికి ఆయన అందుబాటులో ఉంటే ఈ రాతల్ని విన్పించటమో, చూపించటమో చేయాలని అభ్యర్థిస్తున్నాను.
తెలుగు పంతులు రాఘవాచార్యులు 70వ దశకంలో ప్రకాశం జిల్లా, ప్రస్తుతం ఇంకొల్లు మండల పరిధిలోని దుద్దుకూరు ఆచార్య రంగా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పనిచేశాడు. ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో నేను ఆయనకు విద్యార్థిని. చిన్ననాటి నుంచే చందమామ పాఠకుడిగా ఎదిగిన నేను తెలుగు పాఠ్యాంశాలంటే చెవికోసుకునేవాడిని. తీర్చిదిద్దిన పెద్ద పంగనామాలు, పంచెకట్టు, నిండు చేతుల తెల్లచొక్కా ఇదీ ఆయన ఆహార్యం. బొంగురు గొంతు. అయితే ఏమాటకామాట చెప్పుకోవాలి. తెలుగు, సంస్కృత భాషలపై నిండుగా పట్టుగలవాడే. ఆంగ్లం కూడా మాట్లాడుతుండేవాడు. ఆరోజుల్లో ఉన్నత పాఠశాల విద్యారంగంలో రాజ్యమేలుతోన్న గైడ్ల సంస్కృతికి ఆయన వ్యతిరేకి. ఇదీ ప్రశంసించదగినదే. నోట్సు కూడా బాగా చెప్పేవాడు. రాయకపోతే ఊరుకునేవాడు కాదు. దీనికితోడు పదో తరగతి విద్యార్థులు కూడా రోజూ చూచిరాత రాయాల్సిందే. అందరి రాతల్నీ రోజూ విధిగా చూసేవాడు. రాయకపోతే ఆయన చేతి బెత్తెం పిల్లల చేతుల్ని వాయగొట్టేవి. బాగా గుండ్రంగా రాసేవాడ్ని కాబట్టి, నా రాత చూస్తూనే వెరీగుడ్డు అంటూ రాసి ”సన్నాఫ్‌ కోటేశ్వరరావు అన్పిస్తున్నావోయ్‌! అంటూ రోజూ మూడోవాడికి వినీ వినపడకుండా ప్రశంసించేవాడు. ఇన్ని మంచి సుగుణాలున్న రాఘవాచారికి పంతులుకుండాల్సిన ప్రథాన లక్షణాలు లేకపోవటమే అసలయిన విషాదం. ఉండకూడనివి ఉండటమే పాపం. అందులో మొదటిది ఎవ్వరినీ ఎదగనిచ్చేవాడు కాదు. తెలివిగలవాళ్లను వెక్కిరించేవాడు. మందమతిని ప్రోత్సహించేవాడు. అయితే నా రాతను ప్రశంసించేవాడని రాసిన నేను ఇక్కడ భిన్నంగా రాయటంలో ఓ మతలబు దాగి ఉంది. మానాన్న ఆ పాఠశాల ఉపాధ్యాయుల సంఘానికి కార్యదర్శిగా ఉండేవాడు. ఒక స్థానంలో ఉన్నవారిని ఇబ్బందులపాలుచేయటం అంటే కొరివితో తలగోక్కోవటమేనని రాఘవాచార్యులు లాంటివారికి ఎవ్వరూ నేర్పాల్సిన పనిలేదు.
నేను ఎనిమిదో తరగతిలో ఉండగా పాఠశాల వార్షికోత్సవాన్ని విశేషంగా నిర్వహించాలని మా ప్రధానోపాధ్యాయుడు చెన్నుపాటి నాగేశ్వరావు తలపెట్టారు. విద్యార్థులకు పోటీల నిర్వహణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల నుంచి కథలు, పాటలు, కవితల్ని ఆహ్వానించారు. ఉత్తమశ్రేణికి బహుమతులు ఇవ్వటంతోపాటు వాటిని వార్షిక సంచికలో ప్రచురించాలని నిర్ణయించామంటూ ప్రకటించారు. బాలల పొదుపు అంశంతో నేను రాసిన వచన కవితను రాఘవాచారికి అందజేసాను. దాన్ని అక్కడికక్కడే చదివిన ఆయన ”దీన్ని నువ్వే రాశావా?” అంటూ పదే పదే ఆశ్చర్యపోయాడు. గుచ్చిగుచ్చి ప్రశ్నించి తరగతి గదిలో నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఆ కవిత ఎత్తిపోతలన్నట్లుగా చిత్రీకరించాడు. మొత్తం మీద దాన్ని చెత్త బుట్టకు చేర్చాడు. దీంతో నన్ను తీవ్ర నిరాశ ఆవరించింది. నాకు రాయటం చేతకాదని నాకు నేనే నిర్థారించుకునేలా రాఘవాచార్యులు చేయగలిగాడు. తెలుగు, హిందీ, ఆంగ్లం దస్తూరి పోటీల్లో నాకు ప్రథమ బహూమతులు దక్కినా రాఘవాచార్యుల తీర్పు ముందు అవి కొరగాకుండా పోయాయి. ఎదుగుదలను దెబ్బతీసే ఈ తరహా అనుభవాలు ఏ మానవుడికీ ఎదురుకాకూడని ప్రగాఢంగా కోరుకుంటున్నాను. ఇది ఒక అనుభమే. రాఘవాచార్యులకు ఇంకొక పెద్ద రోగమే ఉందని ఆనాడు అందరూ చెవులు కొరుక్కునేవారు. ఆయన భార్యాబిడ్డలు వేరే ఎక్కడో ఉండేవారు. తాను ఒంటరిగా ఉంటూ పదో తరగతి విద్యార్థినులకు మాత్రమే ట్యూషను చెప్పేవాడు. అదీ పరిమిత సంఖ్యనే చేర్చుకునేవాడు. అమాయక బాలికల్ని మభ్యపెట్టి వారి శరీరాలతో ఆడుకునేవాడట. తరగతి గదిలోనే అభినందిస్తున్నట్లు నటిస్తూ బాలికల నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకునేవాడు. విద్యార్థులంతా నవ్వుకుంటున్నా పట్టించుకునేవాడు కాదు. ట్యూషనుకు రప్పించుకుని వారిలో కొందరితో శారీరిక సంబంధమూ పెట్టుకునేవాడు. అయితే వారికి గర్భం రాకుండా నిరోద్‌లు వినియోగించేవాడట. ఈ విషయాన్ని ఆనాడు పలువురు నిర్ధారించినందునే ఇలా రాసేందుకు ధైర్యం చేశాను. తల్లి, తండ్రి తర్వాతి స్థానం గురువుదని నమ్మే సమాజంలో ఇలాంటివారు నమ్మకాలకు పంగనామాలు. ఈనాడు ఊరికో పంతులు ఇలాంటివాళ్లు ఉన్నారంటే దానికి రాఘవాచార్యులలాంటివారే పునాదులు వేశారు. వారి శిష్యపరమాణువులే నేటి పార్క్ వుడ్ ఆయూబ్ లు .