ఎందుకని? ఎందుకని? ఎందుకని? అట్లెందుకు? ఇట్లెందుకు?

ఆరుగాలం కష్టపడ్డా రైతన్నకు అప్పుల తిప్పలు తప్పవు ఎందుకని?
తెల్లబట్టల దళారోడికి డబ్బే, డబ్బు ఎందుకని?
సంచులతో సొమ్మిస్తే జేబులకు కూడా సరుకురాదు ఎందుకని?
కొనబోతే కొరివి … అమ్మబోతే అడవి
ఎందుకని? ఎందుకని? ఎందుకని?

ఇవన్నీ ఇప్పటిదాకా విన్నాం! కన్నాం!!
ఎప్పటిలా ప్రశ్నలు, నినాదాల దగ్గరే ఆగిపోతే నిజం తెలియదు. ఎవరు ఏమి చెప్పినా కాబోలనుకుని గంగిరెద్దుల్లా తలలూపి, బాధ దిగమింగి మన పనికి మనం వెళ్లిపోతాం. బాధలు నీడల వలె ఎప్పటికీ మననంటే ఉంటాయి. ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ తదితరులు గత ఆరేళ్లుగా ఇదిగో ధరలు తగ్గుతాయి … అదిగో తగ్గుతాయంటూ ఊరిస్తున్నా సమస్య యధాతథంగా ఎందుకు ఉంటుందో చూద్దాం.
ఈ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలంటే ఏదో ఒక వినియోగ వస్తువు పూర్వాపరాల్ని పరిశీలించటం అవసరం.
శనగను ఉదాహరణగా తీసుకుని ఈ ప్రశ్నల్ని తేల్చివేసేందుకు నన్ను ప్రయత్నించనీయండి.
రైతు అమ్మకం ధర క్వింటాలు రూ. 2000
క్వింటాలు శనగలకు ఉత్పత్తయ్యే పప్పు 75 కిలోలు.
అంటే 75 కిలోల శనగపప్పు ఖరీదు రూ. 2000
కిలో ఒక్కింటి ధర సుమారుగా రూ. 26. 50
అదే శనగపప్పును వినియోగదారుడు కొంటున్న ధర కిలో తక్కువలో తక్కువ రూ. 40 నుంచి ఎక్కువ రూ. 55 వరకూ ఉంది.
అటు తయారీ ఖరీదుకూ, ఇటు కొనుగోలు ధరకూ కిలోకు తేడా రూ. 13.50 నుంచి రూ. 28.50 వరకూ ఉంది.
ఈ సొమ్ము ఎవరెవరికి దక్కుతోందో చూద్దాం. రైతు నుంచి శనగల్ని దళారులు కొనుగోలు చేస్తారు. వారి నుంచి బట్టీ యజమాని కొని శనగపప్పు ఉత్పత్తి చేస్తాడు. బట్టీల నుంచి శనగపప్పును టోకు వర్తకుడు కొని చిల్లర వర్తకుడికి పంపిణీ చేస్తాడు. చిల్లర వర్తకుడి నుంచి వినియోగదారుడికి చేరుతుంది. ఈ వ్యవహారంలో శనగల్ని పండించే రైతు, బట్టీ యజమాని, చిల్లర వర్తకుడు, వినియోగదారులు బడుగులు. (చిల్లర వర్తకులంటే బిగ్‌బజారు, స్పెన్సర్‌, మోర్‌, రిలయన్స్‌ తదితర సూపర్‌బజార్లు కాదండోయ్‌) శనగలు కొనే దళారి, పప్పు టోకు వ్యాపారి ఒక వర్గం. శనగలు పప్పగా మారే క్రమంలో రవాణా ఖర్చుతోపాటు బట్టీ ఖర్చు ఉంటుంది. వాస్తవానికి బట్టీ యజమానికి చెల్లించే ఖరీదు శనగ పొట్టు ఖరీదుకు సమానంగా ఉంటుంది. అయినా ఈ రెండు పనులకూ కలిపి ఎక్కువలో ఎక్కువ ప్రతి కిలోకూ రూ. 3.50 ఖర్చవుతుందని అనుకున్నా పప్పు ఖరీదు రూ. 30 పడుతుంది. దళారి, పప్పు టొకు వ్యాపారి, చిల్లర వ్యాపారి కలిపి పది శాతం చొప్పున లాభాలు వేసుకుంటే ప్రతి కిలోకూ మరొక తొమ్మిది రూపాయల చొప్పున ఖరీదు పెరుగుతుంది. అప్పుడు కిలో శనగపప్పు ఖరీదు ఎట్టి పరిస్థితుల్లోనూ రూ. 39కి మించకూడదు. ఈ విధంగా చూస్తే ఒక రకం పప్పును రూ. 40 అమ్మటం సరయినదేనని అనుకోవాలి. అయితే రూ. 40కి అమ్మే పప్పు ఉత్పత్తికి నాసిరకం శనగల్ని వినియోగిస్తారు. వాటిని క్వింటాలు రూ. 1000 నుంచి రూ. 1200 లోపే కొనుగోలు చేస్తారు. దీనికితోడు వాటిల్లో మట్టి, రాళ్లు, పుల్లలు, పొట్టు, నూక కూడా ఉండటం కద్దు. ఇవన్నీ కలిపి 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకూ ఉంటాయని అందరికీ తెలిసిందే. తూకం మోసాలు సరేసరి. అంటే అటు రైతు ఇటు వినియోగదారుడికే కన్నీళ్లన్నమాట. ఇలా బియ్యం మొదలు ఏ వ్యవసాయ ఉత్పత్తిని తీసుకున్నా ఇదే తీరున దళారులు లాభాల కొండల్ని పేర్చుకుంటున్నారు.
శనగ సాగుకు ఎకరానికి రూ. 20 వేలదాకా ఖర్చవుతుండగా సగటున ఎనిమిది క్వింటాళ్లు దిగుబడి అవుతుంది. క్వింటాలు రెండు వేల రూపాయలు పలికితే రూ. 16 వేల రాబడి, రూ. 4000 నష్టం రైతుకు మిగులుతుంది. అదే ఇంట్లో వాళ్లంతా కష్టపడితే, అదీ సొంత భూమయితే దానికి దానికి సరిపోతుంది. మొత్తం మీద రైతుకు మిగిలేదేమీ ఉండదు.
బియ్యం పరిస్థితీ అంతే. నెల్లూరు సన్నాలు ఇప్పుడు క్వింటాలు రూ. 1000 పలుకుతోంది. మరవేయిస్తే క్వింటాలుకు 55 కిలోలదాకా ముడి బియ్యం దిగుబడవుతుంది. పాలిష్‌లో తగ్గుదల, రవాణా ఖర్చులమేర ఐదు కిలోలు తగ్గించి లెక్కవేస్తే కిలో మంచి బియ్యం ఖరీదు రూ. 20 పడుతుంది. మర ఖర్చుకంటే అధికంగానే తవుడు ద్వారా సమకూరుతుంది. అంటే మిల్లు ఖర్చూ లేకపోగా మరి కొంత కలిసి వస్తుంది. మరి నాణ్యమయిన బియ్యాన్ని ఎక్కడయినా కిలో రూ. 20కు అమ్ముతున్నారా? నాసిరకం మాత్రమే ఆ ధరకు దొరుకుతున్నాయి. రూ. 1000 వెచ్చించి కొనుగోలు చేసే ధాన్యం నుంచి ఉత్పత్తి చేసే బియ్యాన్ని రూ. 34 అమ్ముతున్నారు. అంటే ప్రతి కిలోకూ దళారులకు రూ. 14 అంతకంటే అధికంగా దక్కుతోంది. దళారులు ఇన్నిన్ని లాభాలు పోగేసుకుంటుంటే ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు???.

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: