Archive for ఆగస్ట్ 6th, 2010

”అందర్నీ కవుల్ని చేస్తా” … శ్రీశ్రీ

”మీరు కోరుకునే సామ్యవాదం వస్తే, అప్పుడు ఎలాంటి కవిత్యం రాస్తారు” ఓ ప్రేక్షకుడి ప్రశ్న.

”అందరిచేతా కలం పట్టించేందుకు కవిత్వం రాస్తా … అందర్నీ కవుల్ని చేస్తా … అందరి చేతా కవితలు రాయిస్తా” తడుముకోకుండా జవాబిచ్చారు శ్రీశ్రీ.

నాకు తెలిసిన పరిమిత సమాచారం మేరకు ఈ తరహా వివరణ శ్రీశ్రీ మరెక్కడా ఇవ్వలేదని నా నమ్మకం.

సామ్యవాద ఆవిష్కరణాననంతరం అందరినీ కవుల్ని చేసేందుకు కవిత్వం రాస్తానన్న ఆనాటి అద్భుత దృశ్యానికి నేను కూడా సాక్షినే.

అది 1979. మధ్యాహ్నం 3 గంటలు.
ప్రకాశం జిల్లా చీరాల పట్టణం. కస్తూరిబా బాలికోన్నత పురపాలక పాఠశాల ఆవరణ. అక్కడ విరసం ఆధ్యర్యంలో సభ జరుగుతోంది. శ్రీశ్రీ ఏకైక ఉపన్యాసకుడు. వాస్తవం చెప్పాలంటే శ్రీశ్రీ ఉపన్యాసంలో అందర్నీ కవుల్ని చేసేందుకు కవిత్వం రాస్తానన్న జవాబు తప్ప మరే విషయమూ నాకు ఇప్పుడు గుర్తులేదు.
ఆనాటి దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోనివ్వండి.

మొత్తం ముప్పై, నలభై మంది ఉంటారేమో ఆ సభలో. శ్రీశ్రీ ఉపన్యాసం ముగిసింది. కార్యకర్త ఒకరు కొబ్బరి బోండాం అందించారు. కొబ్బరి నీళ్లను సేవించిన అనంతరం,  ప్రశ్నలుంటే సంధించమని ఆహ్వానిస్తూనే శ్రీశ్రీ సిగిరెట్‌ వెలిగించారు. సిగిరెట్‌ను నేరుగా నోట్లో పెట్టుకోకుండా వేళ్ల మధ్య బిగించారు. బొటనవేలు – చూపుడు వేలును మడిచి వాటి సందులోనుంచి పొగ పీల్చటం చూస్తే నాకు భలే అన్పించింది. అందులోనూ పాపం, పుణ్యం, ప్రపంచమార్గం ఇంకా వంటబట్టని వయస్సాయె మరి.
ఇక అసలు విషయానికొస్తే… ఒకటి రెండు ప్రశ్నలు, జవాబులు పూర్తయిన తర్వాత దూసుకొచ్చిన ప్రశ్న ఎవరు వేసారో తెలియదుగానీ నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది.

”మీరిప్పుడు సామ్యవాదాన్ని కాంక్షిస్తూ కవిత్వం రాస్తున్నారు. మరి ఆ సామ్యవాదం వచ్చిన తదుపరి మీ కవిత్వం ఎలా ఉంటుందో చెబుతారా?” అనడిగారు.

దానికాయన జవాబిచ్చిన తర్వాత ”మరి సామ్యవాదం ఎప్పుడొస్తుందంటారు?” మరెవరో అడిగారు.

”సామ్యవాదాన్ని నేను కచ్చితంగా చూసే పోతానని  గట్టి నమ్మకముంది” ఇది ఆయన ప్రగాఢమైన ఆకాంక్షనూ, నమ్మకాన్నీ పట్టిచూపిన జవాబు.