”మీడియాలో చెప్పేందుకు మంచే లేదా?” రాతలు- కోతలు బ్లాగరు, హర్రర్, టెర్రర్ కథా రచయిత కస్తూరి మురళీకృష్ణ ప్రశ్న.
రాసేందుకు అరవీర భయంకర, భయోత్పాత, నెత్తుటి మరకల, కక్షలు – కార్పణ్యాల, పగలు – హత్యల, అత్యాచారాల, దెయ్యాల, లేనిపోని ఆలోచనల కథలే ఉన్నాయా? మనిషినీ, సమాజాన్నీ సంస్కరించేందుకు, చైతన్యపరిచేందుకు, మంచి భవితవ్యాన్ని ఒడిసిపట్టేందుకు అవసరమయిన ఆలోచనల్ని పాఠకుల్లో కలిగించేందుకు కథలు – కాకరకాయలు రాయొచ్చుగదా? అని ఎవరయినా అడిగితే ఎట్లుంటుందో? కస్తూరి ప్రశ్న కూడా అదే తీరున ఉంది.
తనకు నచ్చిన కథల్ని తాను రాసుకునే హక్కు కస్తూరికి ఉన్నప్పుడు మీడియాలోనూ చెడునే చెప్పేందుకు ఇతరుకూ అంతే హక్కు ఉందని ఆయనకు తెలియదని అనుకోలేకపోతున్నాను. వేయి ఆలోచనల్ని వికసించనీయమన్న దానికి భిన్నంగా ఇలానే చేయండని ఆయన సుతిమెత్తగా ఆదేశాలు జారీచేయటం వెనుక ఏ మతలబూ లేదంటే నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. ఎందుకంటే ఆయన జాగృతిలో అనుభవజ్ఞుడు మరి.
విమర్శించేవాడికి వేయి నాలుకలంటూ ఆయనే విమర్శలకు దిగటం గురివింద గింజతనం కదూ!
మీడియాలో చెడును చూసేవాళ్లంతా పరాజితులనీ, గుర్తింపుల లేక ఏడ్చేవాళ్లనీ, వాళ్ల సొంత సమస్యల్ని అందరికీ చుట్టి అలా చూడటం తగదనీ తగుదునమ్మా అంటూ ధర్మోపదేశాలు చేయటం యాజమాన్యాల పక్కన చేరి బాధితుల్ని గేలిసేయటం అవునో? కాదో? తేల్చి చెప్పాలని కస్తూరివారికి సవాలు విసురుతున్నాను.
అసలు ఆ మాటకొస్తే చెడును గురించి చెప్పేవాళ్లు మంచేలేదని ఎవరన్నా అన్నారా? అనకుండానే కస్తూరికి అనుమానం ఎందుకొచ్చినట్లో? ఎందుకొచ్చి ఉంటుందంటే…
విఐ లెనిన్ మహాశయుడు అంటారూ, ఏ పదాల వెనుక ఏ అర్థాలున్నాయో తెలుసుకోనంతకాలం మోసపోతూనే ఉంటాం. ఈ నేపథ్యంలో ఆ పెద్దమనిషి ఉపదేశాల వెనుక ఏ ఉద్దేశం దాగి ఉందో పరిశీలించి వెలికి తీయాలన్నదే ఈ రాతల వెనుక ఉన్న ఉద్దేశం.
కస్తూరి రాతలన్నీ బలహీనుల్ని మరింత బలహీనుల్ని చేసేవే. భయపడేవారిని మరింత భయపెట్టేవే. ఆయన రాతలేవీ బడుగులకు ఊతమిచ్చేవి కాదు. గాయపడినవారికి ఔషదం కాదు. బలహీనులకు బలమిచ్చేవి కాదు. పాఠకుడి బలహీనతలను సొమ్ముచేసుకునే పత్రికల యాజమాన్యాలను సంతోషపెట్టి సొమ్ము చేసుకుని ఊరుకుంటే పట్టించుకోవలసిన పనేలేదు. పాఠకులు, ప్రజలు ఒకనాటికి కాకపోయినా మరో నాటికయినా తమకు ఏది అవసరమో దాన్నే తీసుకుంటారనీ, ఆచరిస్తారనీ నమ్మకమున్నవాడిని. అందుకనే వేయి ఆలోచనల్ని ఆహ్వానించాలని భావిస్తాను. ఎవర్నో విమర్శిస్తే మీకెందుకు దురద అని కస్తూరి వారు ప్రశ్నించే ప్రమాదమూ ఉంది. వ్యక్తిగా ఎవరి అభిప్రాయాలు వారివి. బ్లాగెక్కి అరిస్తే ఊరుకోవటం ఎలా? అందులోనూ మీడియాలో ఉన్న నేను, మీడియా తప్పుల్ని అంతో ఇంతో ఈసడించుకుంటున్నానాయొ మరి. మౌనం కొన్ని సమస్యల్ని పరిష్కరించేమాట వాస్తమేగానీ, తప్పుడు అభిప్రాయాలను పాదుకొల్పే ప్రమాదమూ ఉంది. గోటితో పోయేనాడే గిల్లేస్తే పోతుందని నమ్మకం నాది.
కస్తూరి గారి మంచి వాళ్ల రహస్య జాబితా చూస్తే మీడియాను తప్పుపట్టేవాళ్లంతా వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకున్నారన్న అపోహ కలిగిస్తున్నది. గొంగట్లో తింటూ వెంట్రుకల్ని తిట్టటం ఉపయోగం లేదని చెడును చూసేవారికి తెలుసని నా ప్రగాఢ విశ్వాసం. అసలు గొంగట్లో తినంగాక తినం, కంచం కావాలి … అంటూ వాళ్లు పెడుతోన్న కేకలు నాకు స్పష్టంగా వినపడుతున్నాయి. కస్తూరివారికి వినపడకపోతే ఇంకేమయినా సమస్య ఉందేమో పరిశీలించుకోవాలి. మీడియా కుళ్లిపోయి కంపుకొట్టటానికి ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది బాధ్యులు కాదనీ, యాజమాన్యాలు, యాజమాన్యాల స్థానంలో ఉన్న పెట్టుబడి, ఆ పెట్టుబడికి ప్రియపుత్రులయిన పాలకవర్గాలే దానికి బాధ్యులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాటి వ్యవస్థే అసలు నేరస్థురాలు. ఇక కస్తూరివారన్నట్లు కొందరు మంచివారు లేకపోలేదు. వారికి చేయెత్తి మొక్కాల్సిందే. వారిని గురించి చెప్పుకోవలసిందే. వారికి మద్దతు ఇవ్వాల్సిందే. అయితే ఆ మంచివాళ్లంతా మౌనం వీడాలి. బయటకొచ్చి బాధితుల పక్షం వహించాలి. కస్తూరిలాంటి వాళ్లంతా అందుకోసం కృషి చేస్తే సంతోషం. శుభం.
కడుపు నిండినవాడు చెప్పేది కవిత్వం … కడుపు మండినవాడు చేసేది పోరాటం.
వేయి పూలు పూయనిద్దాం. లక్షలాది ఆలోచనలు వికసించనిద్దాం.
అంటే చెప్పేదాన్ని చెప్పనీయండి. పాఠకులు వాళ్లకు కావాల్సిందేదో వాళ్లే హంసల్లా ఆస్వాదిస్తారు.