ఓ ప్రసాదు … ఇద్దరు తాగుబోతులు … ఈదుమూడి గ్రామం

అవును, నా చిన్నప్పుడు అంటే ముప్పై ఏళ్ల క్రితం సంగతనుకోండి, మా గ్రామంలో ఇద్దరే తాగుబోతులుండేవారు. తాగుబోతులంటే వాళ్లేదో తప్పతాగి రోజంతా వీధుల్లో దొర్లుతూ ఉండి ఉంటారనుకునేరు! అదేమీ కాదు. ఎప్పుడో… ఏ పండక్కో తాగేవాళ్లు. కాకపోతే తక్కువ తాగేవాళ్లకోసం మరో పదం లేక అలా రాయవలసి వచ్చిందంతే. తాగినా ఇంట్లో పడుకునేవాళ్లు. అయితే సంక్రాంతి రోజున మాత్రం వాళ్లు బయటపడేవాళ్లు. చెరువులో తెప్ప ఊరేగింపు జరిగేదప్పుడు. ఆ ఉత్సవం కోసం ఊరుఊరంతా చెరువు దగ్గర చేరేది. నిండా ఉత్తేజం, ఉత్సాహం, ఉల్లాసంతో నిర్వహించే ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం సాధ్యంకానిపని. అందువలన ఇద్దరు తాగుబోతులు కూడా చెరువు కట్టమీద చేరేవాళ్లు. సహజంగానే వారిలోనూ ఉత్సాహం పెచ్చరిల్లి ఎవరితోనో గిల్లికజ్జాలకు దిగేవాళ్లు. ఊరంతటికీ అదో ఉత్సాహం. అదో వార్త. అదో చర్చనీయాంశం. వాళ్లను ఇళ్లకు లాక్కుపోయేందుకు బంధువులు తెగ ప్రయత్నాలు చేసేవాళ్లు. ము..లం…కొ..ల్లారా అంటూ పెద్దలు తిడుతుంటే, వాళ్లు మరింత రెచ్చిపోయేవాళ్లు. చివరకు ఎప్పుడో గొడవ సద్దుమణిగాక… ‘చెల్లియో చెల్లకో’ అంటూ కమ్మటి గొంతుకలతో పౌరాణిక నాటకాల పద్యాలు పాడి అందరికీ ఆనందం పంచేవాళ్లు.
తెల్లవారితే మళ్లీ మామూలే. ఆ విషయం ఆ తాగుబోతులకుగానీ, వాళ్లు తగాదా పడినవాళ్లకుగానీ గుర్తున్నట్లే ఉండేది కాదు. కాకపోతే  సంక్రాతి సెలవుల తర్వాత ప్రారంభమయ్యే బడిలో పంతుళ్లు వచ్చేదాకా పిల్లలం గుంపులు గుంపులుగా చేరి వాళ్లిద్దరి గురించి చిలవలు పలవులు మాట్లాడుకునేవాళ్లం. కొందరు వాళ్ల మాటల్ని అనుకరించి అందరినీ నవ్విస్తే, ఇంకొందరు నటించి మరీ ఆకట్టుకునేవాళ్లు. అంతలో హెడ్మాస్టరు మండవ శేషాద్రిగారొస్తున్నారని ఎవరో చూసి కేక పెట్టటంతో అందరం తరగతి గదుల్లోకి పరుగులు తీసేవాళ్లం. ఇక అంతే సంగతులు. తాగుబోతుల వ్యవహారం మళ్లీ ఏ పండుగొస్తేనే తప్ప ఎవ్వరూ గుర్తుపెట్టుకునేవాళ్లుకాదు. ఆనాటి పరిస్ధితులు అవి. ఊళ్లో ఎక్కడో మారుమూల ప్రభుత్వ సారా దుకాణం ఉండేది. బయటనుంచి వచ్చిపోయేవాళ్లు తాగుతుండేవారని చెప్పుకునేవారు. 1983-85 వరకూ మా గ్రామంలో అదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత అంతా మారిపోయింది.

కల్లు మానండోయ్‌ !
కళ్లు తెరవండోయ్‌ !!
అన్న గాంధీజీ విధానం తిరగబడింది.

మందు తాగండోయ్‌ !
మంచం ఎక్కండోయ్‌ !!
అన్న ధోరణితో సాగుతోన్న పాలనలో ఇప్పుడు మా ఊళ్లో ఓ అరడజను గొలుసుకట్టు మద్యం దుకాణాలు జోరుజోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు మద్యం తాగని వాళ్లను లెక్కించేందుకు వేళ్లు కూడా ఎక్కువేనేమో!

ప్రకటనలు

One response to this post.

  1. నిఖార్సైన నిజం చెప్పారు. కాంగ్రెస్ కల్చర్ గుర్రపుడెక్క మొక్కలా దేశమంతా పాకి ఇంటికో ప్రసాదు వచ్చే కాలం దూరం లేదు.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: