దయ్యం గియ్యం … భయం గియం – డాక్టర్‌ వీ. బ్రహ్మారెడ్డి


వీ. బ్రహ్మారెడ్డి – జనవిజ్ఞానవేదిక తొలి అధ్యక్షుడు. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలోని పాపిరెడ్డిపాలెం గ్రామంలో పుట్టిన ఆయన ప్రస్తుతం ప్రముఖ వైద్య బ్రహ్మ. అయితే ఒకనాడాయనకు శవాలన్నా, దయ్యాలన్నా విపరీతంగా భయం. చిన్నప్పటి నుంచీ దయ్యాల కథలు వినీ వినీ అవంటేనే కలలో కూడా దడుసుకునేవాడు. అయితే శవాల్ని కోసి చదవాల్సిన ఎంబీబీఎస్‌ను ఆయన ఎలా పూర్తి చేశాడు మరి?? ఆయన మాటల్లోనే చదువుదాం.

నాకు దయ్యాలంటే మహా భయం. మా ఊళ్లో రచ్చబండ దగ్గర దయ్యాల కథల్ని పెద్దోళ్లు చెబుతుంటే వినేవాడిని. అలా దయ్యం కథ విన్నరోజు రాత్రి కల నిండా దయ్యాలే. అలాగని దయ్యాల కథల్ని వినకుండా ఉండలేకపోయేవాడిని. ఎవరయినా చనిపోతే ఆ ఇంటివైపు కనీసం నెలరోజులన్నా వెళ్లేవాడిని కాదు. శవాలన్నా, దయ్యాలన్నా అంత భయం.
శవాల్ని మా ఊరి బీడులో పూడ్చేవాళ్లు. బడికి సెలవొస్తే ఎద్దుల్ని మేపటానికి ఆ బీటికి పోయేవాడిని. మా ఎద్దులేమో, పాడెలకు చుట్టిన చొప్పను తినేందుకుశ్మశానంలోకి జొరబడేవి. వాటికి బాగానే ఉండేది. నాకేమో జ్వరం వచ్చినట్లు అన్పించేది. లోపలికి అడుగుపెట్టేవాడిని కాదు. శ్మశానమంటే దయ్యాల అడ్డా అనుకునేవాడిని. ఎడ్లను బయటకు రమ్మంటూ బిగ్గరగా అరిచేవాడిని. రాళ్లు విసిరి ఎట్లానో వాటిని బయటకు రప్పించి ఇంటిదోవ పట్టేదాకా చెమటలు పట్టేవి.
ఇదంతా కనిపెట్టిన మా పెద్దన్న ”ఒరేయ్‌, పరీక్ష ఒక్కసారి తప్పినా, ఎద్దులు కాచేపని ఒప్పజెబుతానులే” అనేవాడు.
దీంతో నాకు పరీక్ష తప్పితే ఏమవుతుందో అర్ధమయింది. ఎద్దులూ, శ్మశానమూ, దయ్యాలూ తప్పవని భయపడ్డాను. అందుకని బాగా చదివేవాడిని. పైగా దయ్యాలమీద భయంతో ఎస్‌ఎస్‌ఎల్‌సీ (11వ తరగతి) వరకూ లెక్కల మీద ప్రేమ పెంచుకున్నాను. ఎందుకంటే లెక్కలయితే ఇంజినీరు కావచ్చు. అదీ నా ఆశ. డాక్టరంటే శవాలు, దయ్యాలు అదీ నా భయం.
అయితే నా దురదృష్టం కొద్దీ 11వ తరగతి అయ్యేనాటికి ఇంజినీర్లు ఉద్యోగాలు లేక రోడ్లు కొలవటం ప్రారంభమయింది. అది తెలుసుకున్న మా పెద్దన్న బైపిసీ గ్రూపుతో పియుసి చేర్పించాడు. దయ్యం కంటే నేను జడుసుకునేది మా పెద్దన్నకే. ఇక తప్పదనుకున్నాను. వానపాముల్ని కోయటంతో మొదలు పెట్టి బొద్దింకలు, కప్పలు, చివరకు శవాలు కోయటం … అమ్మో చచ్చానురో అని భయపడిపోయాను.
నా దురదృష్టం కొద్దీ పియుసిలో మంచి మార్కులొచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలో ఎంబీబీఎస్‌ చేరేందుకు అవకాశం వచ్చింది. అప్పటికింకా ప్రవేశ పరీక్షలూ అవీ లేవు. మార్కులతోనే ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించేవాళ్లు. కర్నూలు అనేది ఒకటుందని కూడా తెలియని వాడిని వైద్య కళాశాలలో చేరిపోయాను.
ఎంబీబీఎస్‌ మొదటేడు శవాల కోత పనిలేదు. మళ్లీ బొద్దింకలు, కప్పలు, జలగలు … ఫర్వాలేదనిపించింది. అయినా ధైర్యం సంపాదించుకోవాలని బలమైన కోర్కె పుట్టింది.
ధైర్యం సంపాదించుకోవాలన్న కోర్కె రోజురోజుకూ బలపడింది. రెండో ఏడాది శవాలు వస్తాయిగనుక అప్పటికి ధైర్యం సంపాదించాలని అనుకున్నాను.
మొదటి సంవత్సరం సినిమాలు విపరీతంగా చూసేవాడిని. వారానికి మూడు, నాలుగు సినిమాలన్నా చూడాల్సిందే. రెండో ఆట సినిమా చూసి పెద్ద పార్కు (ఇప్పటి కిడ్స్‌ వరల్డ్‌) దగ్గరకు వచ్చేసరికి మనసులో ఒత్తిడి పెరిగిపోయేది. నాకు నిజంగా ధైర్యం ఉంటే పార్కు పక్కనుంచి హంద్రీ నది గుండా నేనుండే బుధవారపేట పోవాలని అనుకునేవాడిని. హంద్రీలో తొడలదాకా నీరు పారుతుండేది. అప్పటికింకా గాజులదిన్నె పథకం తయారవలేదు. అందువలనే అన్ని నీళ్లుండేవి. హంద్రీ నది దాటి బుధవారపేట వెళ్లాలంటే ఒక పక్క ముస్లిముల శ్మశానం, మరోపక్క క్రిస్టియన్ల శ్మశానం – వాటి మధ్యనుంచే వెళ్లాలి. కొన్ని లక్షల శవాలు, దయ్యాలు విశ్రాంతి తీసుకునే శ్మశానాలమీదుగా వెళ్లాలంటే గుండె దడదడలాడేది. ఎట్లాగో శ్మశానాలు దాటి బయటపడేవాడిని. మొత్తంమీద దయ్యాలు లేవని తేలేది. ”హమ్మయ్య ఈ రోజు పరీక్ష పాసయ్యాను” అనుకునేవాడిని.
ఆ దోవలో కాకుండా హంద్రీ వంతెన మీదుగా వస్తే వైద్య కళాశాల వచ్చేది. అక్కడకు రాగానే యధా ప్రకారం ”నాకు ధైర్యం, ఉన్నాట్లా? లేనట్లా??” ప్రశ్నించుకునేవాడిని. దాంతో ఒత్తిడి పెరిగిపోయేది. నన్ను నేను పరీక్ష చేసుకోవాలన్న కోరిక పెరిగిపోయేది. ఎడమవైపుకు తిరిగితే బుధవారపేట, కుడివైపుకు మళ్లితే మా కళాశాల. అయితే అక్కడకు రాగానే ఏదో దయ్యం ఆవహించినట్లుగా కళాశాల వైపుకే తిరిగేవాడిని.
నేరుగా అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) విభాగం వైపు వెళ్లే వాడిని. అక్కడ 10- 12 బల్లల మీద శవాలు పడుకుని ఉండేవి. ఆ పక్కనే ఫార్మలిన్‌ ద్రవం పోసిన పెద్ద సిమెంటు తొట్టిలో 40 శవాల్ని ఉంచేవారు. ఆ గది చుట్టూ ఓసారి తిరిగి ధైర్యం ఉందని నాకు నేనే చెప్పుకుని సంతృప్తిపడి బయటపడేవాడిని. శవాలు దయ్యాల్లా లేచి నన్ను ఏనాడూ భయపెట్టలేదు. అయితే నాకా సమయంలో కాపలాదారు గుర్తుకొచ్చేవాడు.  అతను లేచి చూస్తే నన్నూ దయ్యం అనుకునేవాడనుకుంటూ నవ్వుకునేవాడిని. అయితే భయమేమోగానీ అతనూ శవాల గదికి ఆమడ దూరాన ఉండేవాడు.
ఇలా ఓ ఏడాదిపాటు ‘ధైర్యం’ తెచ్చుకోవటానికి ఎన్నోన్నో ప్రయోగాలు చేశాను.
చివరకు అర్ధమయిదేమిటంటే … శవాలతో ప్రమాదం లేదని. శవాన్ని పూడ్చితే మట్టిలో కలిసి పోతుంది. కాలిస్తే గాలిలో కలిసిపోతుంది. ప్రమాదం ఉంటే గింటే బతికున్న వాళ్లతోనేనని.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు

  1. నా అగ్నానం కారణంగా బ్రహ్మారెడ్డి దెయ్యాల కథకు ఓ మిత్రుడు పంపిన స్పందన రద్దయింది. స్పామ్ తొలగించటంలో పొరబాటు జరిగింది. కనీసం ఆ మిత్రుడి పేరన్నా కూడా చూడకుండానే అది నా బ్లాగునుంచి వెళ్లిపోవటం ఎంతో బాధ పెట్టింది. నన్ను క్షమించి ఆ మిత్రుడు మరొక్కసారి తన అభిప్రాయాన్ని పంపితే నన్ను బాధ నుంచి విముక్తి చేసినట్లే.

    స్పందించండి

  2. బ్రహ్మాండంగా వుంది బ్రహ్మారెడ్డి గారు.

    స్పందించండి

  3. manusyulanu srustinche meeru’brahma’ deyyam debbaku docterai manusyulanu kostunnaraa sir

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: