Archive for ఆగస్ట్ 17th, 2010

ఉచితంగా ఇస్తే అమృతమూ విషమే

”ఎంకటసుబ్రావ్‌, దగ్గు మందు ఒహటియ్యి”
అభ్యర్థించాడు ఉపాధ్యాయుడు చిలుకూరి వెంకయ్య నన్ను.
”డాక్టరు గారికి చూపించుకో, ఒకటికి  రెండు ఇస్తాను” సలహా ఇచ్చాను.
ఉచిత వైద్య శిబిరాన్ని ముగించి వాహనం ఎక్కబోతోన్న డాక్టర్‌ ఎం కృష్ణారావు చెంతకు గబగబా పరుగెత్తి తన బాధను వివరించాడు వెంకయ్య,
కాఫ్‌ సిరప్‌ … 1 అని రాసి వెంకయ్య చేతిలో పెట్టారు డాక్టర్‌ కృష్ణారావు.
దాన్ని చూసి రెండు దగ్గుమందు సీసాల్ని వెంకయ్య చేతిలో పెట్టీపెట్టగానే…. ”ఏందీ, చెత్త మందులా ఏందీ? ఒకటడిగితే రెండిచ్చావు” అంటూ వ్యంగ్యంగా నవ్వాడు వెంకయ్య.
”పంతులుగారూ, పార్క్‌-డెవిస్‌ కంపెనీ చెత్తదో, మంచిదో నువ్వే తెలుసుకో, ఆ తర్వాత ఎన్ని విమర్శలయినా చెయ్యి ఒప్పుకుంటాను. కానీ తొందరపాటు మంచిది కాదు. ఒకటికి రెండు ఎందుకిచ్చావంటావా? చైన్‌స్మోకర్లకి ఒకటికి రెండు కాదు నాలుగు మందులు తాగినా దగ్గు తగ్గటం అనుమానమే. మిత్రుడువని రెండిచ్చాను.” అంటూ వివరించటంతో తలదించుకుని వెళ్లిపోయాడు వెంకయ్య పంతులు.
మనస్తత్వాల విశ్లేషణకు ఉపకరిస్తుందన్న భావనతో ఆగస్టు 15న నా జన్మభూమి ఈదుమూడి(ప్రకాశం జిల్లా)లో మా నాన్న పేరిట ఏర్పాటు చేసిన కావూరి కోటేశ్వరరావు పంతులు స్మారకార్థ సంస్థ (కాకోరాస్మాసం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో చోటుచేసుకున్న సంఘటనను ప్రస్తావించాను.
మరో సంగతి…
”హలో, వెంకటసుబ్బారావుగారేనా?” ఒంగోలు అమ్మ కంటి ఆసుపత్రి పీఆర్వో తాటికొండ వీర వసంతరావు నుంచి ఫోను.
”వసంతరావుగారూ, నేనే, చెప్పండి.”
”కంటి ఆపరేషన్ల కోసం మీరు తీసుకొచ్చిన 12 మందిలో సోమయ్యంట తెగ గొడవ చేస్తున్నాడండి. మీరు వెంటనే రావాలి సార్‌” తాడికొండ అభ్యర్థన.
”అసలేమి జరిగిందండీ” ప్రశ్నించాను.
”ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసేవారందరి దగ్గరా, మా స్టాఫ్‌ 50 రూపాయలచొప్పున తీసుకుంటారండీ. మిగతా 11 మందీ ఇచ్చారు సార్‌, ఈ సోమయ్య మాత్రం ఇవ్వనని గొడవ చేస్తున్నాడు. అవసరమయితే ఇంటికి తిరిగిపోతానుగానీ, డబ్బులు మాత్రం చచ్చినా ఇవ్వనంటున్నాడు” వివరించారు తాటికొండ.
”వాళ్లు కటిక పేదలండీ, ఇచ్చినవాళ్ల దగ్గర తీసుకోండి. ఇవ్వని వాళ్లను వదిలేయకూడదూ? సలహా ఇచ్చాను.
”అట్ల వదిలేయటం మొదలు పెడితే, మాకు ఒక్కరు కూడా ఇవ్వరండి. మేము చెంగేసుకుని పోవాల్సిందే.” కోపం ధ్వనించింది ఆయన గొంతులో.
”సరే ఒక్కరేకదా ఇవ్వాల్సింది. అదేదో నేనే సర్దుబాటు చేస్తానులెండి” రాజీ ప్రతిపాదన చేశాను.
”అట్లయితే సరేలెండి, అయినా మీరొకసారొచ్చి, సోమయ్యకు బుద్ధి చెప్పాలి”
”సరేలెండి, ముందు ఆపరేషన్లు మొదలు పెట్టండి. నేను పనిచూసుకుని ఆసుపత్రికొస్తాను.” సముదాయించి ఫోను పెట్టేశాను.
ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని నాతో ఒప్పందం చేసుకుని కాకోరాస్మాసం నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్న అమ్మ కంటి ఆసుపత్రి పీఆర్వో తీరిది. ముడుపులు ఇవ్వననటం గోలంటాడు.
అంధత్వ నివారణ సంస్థ నిధులతో నిర్వహిస్తోన్న కార్యక్రమం ద్వారా లాభాల మూటలు పోగోసుకుంటూ కూడా పేద రోగులపై నిర్వాహకులు దాష్టీకం చేస్తున్నారు.
వాస్తవానికి కంటి శస్త్ర చికిత్స చేయించుకోదలచిన వారిని వారి ఇంటి నుంచి ఆసుపత్రికీ, ఆసుపత్రి నుంచి వారింటికీ తీసుకుపోయి, తీసుకువచ్చేందుకుగాను సంస్థే వాహనాన్ని సమకూర్చాలి. రోగులకు భోజనమూ, ఉపాహారాన్నీ ఉచితంగా అందజేయాలి. అదే విధంగా అవసరమయిన మందుల్నీ ఉచితంగానే ఇవ్వాలి. కానీ ఇదేమీ ఆ సంస్థ చేయటం లేదు. అంటే చేస్తున్నట్లు నివేదికల్లో రాసుకుని నిధుల్ని మింగుతారన్నమాట. దీనికితోడు కంటిలోపల అమర్చే అద్దాన్ని కూడా చెప్పినదానికన్నా తక్కువ ఖరీదుది వినియోగించి దానిలోనూ మిగుల్చుకుంటున్నారు. తొలివిడతగా శస్త్రచికిత్సలు చేయించిన 12 మందికీ నా సొంత ఖర్చుతో భోజనం ఏర్పాటు చేశాను. రోగులే సొంతంగా బస్సు ఛార్జీలు భరించి ఒంగోలు వెళ్లివచ్చారు. ఇదీ పేదల పథకాల అమలు తీరూతెన్ను.
అన్నట్లు ఉచిత వైద్య శిబిరంలో మా గ్రామస్తులు 500 మందికి వైద్య సేవలు అందుకున్నారు. మధుమేహ నిపుణులు ఎం కృష్ణారావు, దంత వైద్యులు వేమూరి సురేష్‌, కంటి వైద్యులు రత్నం, శ్రీదేవి శిబిరంలో వైద్య సేవలు అందజేశారు. కాకోరాస్మాసం ఉచితంగా మందులు అందజేసింది. మధుమేహపరీక్షల్ని కూడా ఉచితంగా చేయించింది.