Archive for ఆగస్ట్ 20th, 2010

వీధికో వీరేశలింగం పుట్టాల!

అవును, వీధికొక కందుకూరి వీరేశలింగం పంతులు పుట్టాల! ఎందుకనంటే…
మా బంధువులమ్మాయి శైలజ భర్త చనిపోయాడు. హెపటైటిస్‌-బి సోకింది. అందులోనూ మద్యం కూడా సేవించినట్లు అనుమానాలున్నాయి. ఇంకేముంది, హైదరాబాదు తీసుకుపోయినా డబ్బు ఖర్చు తప్ప జబ్బు తగ్గలేదు. 30వ ఏటనే శైలజ భర్త రామారావు అశువులుబాశాడు.
శైలజకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త చనిపోతే ఖనన సమయంలోనే తాము ఇచ్చిన కట్నకానుకల్ని తల్లిదండ్రులు అణాపైసల్తో వసూలు చేసుకోవటం ఇప్పుడు మా ప్రాంతంలో పద్ధతిగా అనుసరిస్తున్నారు. దీనికితోడు ఆ కుటుంబానికి ఉమ్మడి ఆస్థినుంచి రావాల్సిన వాటాను కూడా అప్పుడే రాబట్టుకుంటున్నారు. కట్నం సొమ్ము, వాటా ఆస్థి దక్కకపోతే ఇవాళున్న పరిస్థితుల్లో భర్తను కోల్పోయిన యువతి, బిడ్డలతో బతకటం అంత తేలికకాకపోవటమే ఈ వసూలుకు నాంది పలికింది. దీనికితోడు బిడ్డల చదువు సంధ్యలు ఖరీదవటం కూడా దీనికి దోహదపడింది.
ఇక మా శైలజ విషయంలో ఖననం సందర్భంగా వసూలు తతంగం నడపటం కుదరలేదు. అలాంటి సమయంలో పెద్ద కర్మ రోజున వ్యవహారాన్ని నడుపుతారు. మేమూ అదే ప్రణాళిక వేసుకున్నాము. నేను ముందు జాగ్రత్తగా 50 మందితో పెద్ద కర్మకు హాజరయ్యాను. ఇంకా కాసేపట్లో కర్మకాండల కార్యక్రమం మొదలవబోతుండగా నేను మరొక పెద్ద సాయంతో శైలజ మామను పక్కకు పిలిచి ఆస్తుల విషయాన్ని ప్రస్తావించాను. ఆయన ఒక్కసారిగా నా చేతులు పట్టుకుని… ”ఆ ఒక్కటీ అడక్కండి బాబూ. శైలజ నా కోడలు కాదు. నా కూతురు. ఇద్దరి ఆడపిల్లల్నీ ఎంతవరకు చదువుకుంటే అంత చదివించే బాధ్యత నాది. పెళ్లి చేసే పూచీ నాది. వాళ్లంతా నా దగ్గరే ఉంటారు. దయచేసి మమ్మల్ని విడదీయకండి.” అంటూ అభ్యర్థించాడు. అలాంటి పరిణామం ఏర్పడుతుందని నేను ఊహించలేదు. దాంతో నా నోట మాట రాలేదు. సహజంగా ఆస్తులు ఇవ్వబోమంటూ ఎదురు తిరుగుతుంటారు. చిన్నవాళ్ల చదువు, పెళ్లి ఇలాంటి విషయాలను ముందుకు  తెచ్చి గలభా గలభా చేయటం సహజం. కానీ శైలజ మామ భిన్నంగా వ్యవహరించటం అతని ప్రత్యేకతకు నిదర్శనం. అతను సామాన్యుడు కాడు. ఈ పరిస్థితి ఏదో ఒక సమయంలో వస్తుందని అతనికి తెలియంది కాదు. ఆ మేరకు ఆయన కూడా సంసిద్ధుడయినట్లు అన్పించింది. అందులోనూ నాతో వచ్చిన పెద్ద కూడా పెద్దాయన కోరిక సబబేనంటూ వాదించటం ప్రారంభించాడు. ఇక చేసేది లేక ”సరే పనులు కానిస్తుండండి, నేను ఓ పావు గంటలో ఏ విషయమూ చెబుతాను అంటూ అక్కడ నుంచి వచ్చేశాను. అక్కడ జరిగిన విషయాన్ని మిత్రుల ముందుంచి వారితో చర్చించాను. వాళ్ల మామ కోరిక మాట ఎలాగున్నా, శైలజ మాట ప్రకారం పోవాలని భావించాము. అదే విషయాన్న శైలజతో చెప్పాము. ఇలాంటి విషయాల్లో అనుభవం లేని శైలజ తన మామ పట్ల సానుకూలత వ్యక్తం చేసింది. కోడల్ని కూతురన్న తర్వాత ఆస్తులడగటం మంచిది కాదని లొంగిపోయింది. పెళ్లయి ఆరేళ్లు గడిచినా అత్తమామలకు దూరంగా ఉంటున్నందున వాళ్ల గురించి శైలజ సరిగ్గా అంచనా వేయలేకపోయింది. మేమనుకున్నట్లుగా  శైలజ కోరిక ప్రకారం మౌనం వహించాము.
తర్వాత మూడు నెలలు గడిచిందో లేదో, శైలజ నుంచి ఆమె తల్లిదండ్రులకు బాధాకరమయిన సమాచారం అందటం ప్రారంభమయింది. ఆమెకూ, ఆమె బిడ్డలకూ చిన్న చీకటి గది కేటాయించారు అత్తమామలు. వేరుగా పెట్టారు. పోనీ ఉప్పు, పప్పు అన్నా ఇచ్చారా? అంటే అదీ లేదు. అటు చావకుండా, ఇటు బతక్కుండా అన్నట్లుగా కూసింత  బియ్యం, చింతపండు ఇచ్చి వండుకోమన్నారు. దాంతో యుద్ధం రాజుకుంది. పిల్లలకు ఫీజులు కూడా తాత చెల్లించకపోవటంతో వ్యవహారం వీధికెక్కింది. అయితే పెద్దాయన నోటికి దడిచి పరాయివాళ్లెవ్వరూ నోరు విప్పరు. ఇంట్లోవాళ్లదీ అదే పరిస్థితి. ఆరు నెలలు గడిచే సరికి శైలజ మూటాముల్లె సర్దుకుని పుట్టింటికి రాక తప్పని దుస్థితి ఏర్పడింది.
కోడలు కాదు కూతురు అన్నవాడు చారెడు బియ్యం కూడా ఇవ్వకుండా ఏడిపించటం ఏమిటని ఆరా తీయటం ప్రారంభించాను. అప్పుడు బయట పడింది అసలు విషయం. భూస్వామ్య ‌ సంప్రదాయం. భూస్వామ్య‌ ఆలోచనల ఫలితమే శైలజ బాధలకు హేతువు. ఆస్తి చేజిక్కితే పిల్లల్ని తన దగ్గరకు తరిమేసో, పుట్టింటవారికి అప్పజెప్పో శైలజ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని ఆమె మామ రామారావు బుర్రకెక్కించుకున్నాడు. అదే జరిగితే ఇంకేమన్నా ఉందా అని భయపడ్డాడు. ఆమెకు రెండో పెళ్లి జరగకుండా ఉండాలంటే ఆస్తి పంపకం జరపకపోవటమే దారని నిర్ణయించుకున్నాడు. అప్పుడు చచ్చినట్లు తన కోడలు తన పంచలోనే పడి ఉంటుందని అతగాడి భావన. అయితే అదేమీ చెప్పకుండా ‘కోడలు కాదు కూతురు’ అంటూ నాటకాలాడాడు. మొత్తం మీద నాలుగేళ్లు పోరాడగా, పోరాడగా నాలుగు ఎకరాలుగాను ఎకరం పొలాన్ని పంచి చేతులు దులిపేసుకున్నాడు శైలజ మామగారు. మొత్తం మీద తన కోడలికి రెండో పెళ్లి జరక్కుండా చూసుకోగలిగాననీ, అదే సందర్భంలో ఆస్తి పంపకాన్ని శక్తిమేర అడ్డుకోగలిగానని అతని బంధువుతో వ్యాఖ్యానించటం అతని ఆలోచనాసాలోచనలకు అద్దంపట్టింది. శైలజ పని మొత్తం మీద చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తీరున ఉంది. ఆ రోజునే నాకు అన్పించింది ఏమంటే … ఇంటింటికో వీరేశలింగం పంతులుగారు పుట్టకపోతేమానే కనీసం వీధికొకరన్నా పుట్టాలని. అంటే నిజంగానే అలనాటి రాజమండ్రి వీరేశలింగం పంతులుగారు వీధికొక గర్భిణిని ఎంచుకుని ఆమె పొట్టలోకి చేరిపోయి ఎంచక్కా ఎనిమిది నెలల తర్వాత కేర్‌, కేర్‌ మంటూ భూమ్మీద పడాలని కాదు…. కొద్దిమంది బుర్రల బూజు దులపాలని కోరుకుంటున్నా. బుర్రల బూజు దులుపుకుని బయలు దేరినవాళ్లే ఈ దేశాన్నీ, ఈ సమాజాన్ని అంతో ఇంతో ఉద్ధరిస్తారని నమ్ముతున్నా. ఆడ పిల్లలకు పునర్వివాహాలు చేసి ఆనాటి సమాజాన్ని శక్తిమంతంగా ఎదుర్కొన్న  కందుకూరి నిజంగా పురుషులందు పుణ్యపురుషుడు.
జై కందుకూరి …. జై జై కందుకూరి.