హై’-ధర-‘బాదు’లో నేను పరాయివాడిని!

అవును నా రాష్ట్ర రాజధాని ‘హై’-ధర-‘బాదు’లో నేను పరాయివాడిని. ఈ పరాయి నరకాన్ని, భూలోక నరకాన్ని నేను భరించలేను. ఎప్పటికప్పుడు మా ఊరికి పారిపోదామని బుర్ర తెగగోల పెడుతూనే ఉంది. అయితే భాగ్యనగరంతో పెనవేసుకున్న కొన్ని బంధాలు నన్ను ఇక్కడ కట్టిపడేస్తున్నాయి. భాగ్యనగరంలో అడుగుపెట్టి ఐదేళ్లవుతున్నా నగరం నాకింకా పరాయిదిగానే కొనసాగుతోంది.
నగరం నన్ను కలుపుకోలేక పోయిందో? నగరంతో నేను మిళితం కాలేకపోయానో? ఏమో?! మొత్తం మీద నేను పరాయివాడిగానే క్షణాల్ని యుగాలుగా దొర్లిస్తున్నాను నా అవసరం కొద్దీ.
మా ఊళ్లో మా అమ్మ మెడలు విరిగేలా గడ్డి మోపులు మోస్తుంది. గేదెల్ని మేపుతుంది. వెన్న నిండిన పాలను మదర్‌ డెయిరీవాడికి అమ్మితే లీటరుకు పాతిక్కూడా రాదు. పచ్చిపాల నుంచి వెన్నంతా చిలికిన ప్లాస్టిక్‌ పొట్లానికి పాతికపైనే ఇచ్చుకుంటూ నేనూ భాగ్యనగరంలో భాగస్వామినేనని అనుకోనా?
భాగ్యనగరమ్మా! ఉదయాన్నే నోరారా నమిలేందుకు ఒక్క వేప్పుల్ల ఉందామ్మా? క్లోజ్‌- అప్‌తో పళ్లు తోముకుంటే అడోళ్లతో – మగాళ్లు, మగాళ్లతో – ఆడోళ్లు క్లోజ్‌గా ముద్దాడుకోవచ్చంటూ మీ టీవీ తెగతెగ వాగేస్తున్నా నాకు ఆ వేప్పుల్లమీద మమకారం పోలేదమ్మా. క్షమించు తల్లీ.!
చెంబట్టుకుని అలా అలా చేల గట్లదాకా వెళ్లి ప్రకృతి మాత ఒడిలో కాలకృత్యాలు తీర్చుకున్న మొన్నటి రోజులు మళ్లీ రావేమోనని తెగ దిగులేస్తోంది రోజూ.
కావిడితో తెచ్చిన చెరువు నీళ్లతో తొట్టి నిండగానే, రంగు- రుచి – వాసన లేని గిలకల బావి నీళ్లు తెచ్చుకుని తాగిన నాకు ఇక్కడి బొద్దింకలు గుంపులు గుంపులుగా చచ్చి కంపుకొట్టే సంపు నీళ్లతో సరిపెట్టుకోమంటే ఎలా తల్లీ? నేను నీవాడినేనని అనుకోలేకపోతున్నాను. ఏమీ అనుకోకు భాగ్యమ్మా!
అలా వీధిలో కాలు బెడుదునా…అన్నో, బావో, మావో అంటూ పలకరించకపోతేమానె, అటూఇటూ బుర్రుబుర్రున తిరిగే బాబుల్లో ఎవడో ఒకడు పొడిచేస్తుంటే ఇది నాదేని ఎలా తలవను తల్లీ? మా ఊళ్లో వానొస్తే వొళ్లంతా త్రుళ్లింతేగదా! మరి ఇక్కడేది తల్లీ? చినుక్కు చిటుక్కు మంటే భయమే. గిలకల్లోతున మురుగునీళ్లు. ప్రవాహాన్ని చిమ్ముకుంటూ వెళ్లే వాహన చోదకులు. చిమ్మిన మురుగు మీద పడి అటు పోవాలో? తిరిగి ఇంటికి వెళ్లాలో? తేలక రోజూ కొట్టుమిట్టాడే నేను భాగ్యనగరంలో ఓ అభాగ్యుడ్ని.
ఎండకాచిన వేళ చూద్దామా? రోడ్డులో ఎక్కడయినా కూసింత ఖాళీ దొరికితే కాలు పెడదామని చూస్తే అబ్బే ఉండదే. అదేనమ్మా, భూమంతా ఉమ్మి, కేకరించి ఊసిన ఉమ్మి, ఖైనీ ఉమ్మి, గుట్కా ఉమ్మి, ఉబుసుకుపోక వేసిన ఉమ్మి, అలవాటుగా వేసిన ఉమ్మి. దగ్గిదగ్గి దగ్గిన ఉమ్మి, తుమ్మి, తుమ్మి తుమ్మిన ఉమ్మి. కాలు పెడదామంటే భయం, భయం. ఏ ఉమ్మి ఏ రోగాన్ని అంటిస్తుందో తెలియక, భయం భయం.
ఆరెంకల జీతగాళ్లను దృష్టిలో పెట్టుకుని గజం స్థలం ‘గజ’మంత పలికితే ఈ ‘హై’ టెక్‌ సిటీలో నా నీడ మాటేమిటి?
మున్నూట అరవై రోజులూ చెమటోడ్చి బుట్టలకెత్తిన టమోట మా ఊళ్లో కిలో పావలాకు కొని, పాతిక్కి అమ్ముతున్న హై’ధర’బాద్‌లో నేనూ ఒకడిననుకుని నన్ను నేను వంచన చేసుకోమంటావా? భాగ్యనగరమ్మా!
కిలో రూ. 20 పడని బియ్యానికి నలభై వసూలు చేస్తుంటే ఇది నా భూమేనని భజాయించటం సాధ్యమేనా నా వంటి నల్ల మాస్టారూ?
వీధి వెంట పోతుంటే భుజం రాసుకుందని వాడ్ని వెదికి వెదికి ప్రాణం తీసే మనుషుల్ని నా వాళ్లని ఎలా? అనుకోను భాగమతీదేవీ?
అలా సాయం సమయమయితే కాసింత మంచి గాలి తగులుద్దని ఆశపడితే ముక్కుపుటాలు మండుకుపోయే రసాయనిక వాయువు.
లేస్తే అబద్ధాలు, వాడికి నమస్కారం పెట్టకపోతే ఖాండ్రింపులు ఇదేమి తల్లీ!
అదుంటే కొండమీద కోతయినా దిగొస్తుందన్నట్లుగా, డబ్బు స్నేహాలు…కంపు బంధుత్వాలు.
ప్లాస్టిక్‌ పువ్వులు … ప్లాస్టిక్‌ నవ్వులు … గ్లిజరిన్‌ ఏడుపులు.
ఇప్పుడు చెప్పమ్మా? నేను ఇంటోడినా? పరాయోడినా?

6 వ్యాఖ్యలు

  1. Daadapu ga maa feeling kuda ide nandi.

    స్పందించండి

  2. meeru intodu kaabatte inthalaa bhadapadutunnaru.vokappudu bhaagyamma vollantha prakruthe,kaani nedu vikrthi(vikruthangaa )ayindi.

    స్పందించండి

  3. posted by urk..vja

    palletoori mattivaasana… kalmasham leni manushula madhya jeevinchina meeru…kaankreetu keekaaranyamlo enthagaa vilavilalaadutunnaaro kadaa…maa feeling koodaa ide ani srikanth garu raasaaru kadaa… ante meeru endari hrudaya spandanalano pratibimbimchaaranna maata..meere annaarugaa konni bandhaalu ikkada katti padesthunnaayani.. maatru graamam py mee mamakaaraaniki abhinandhanalu. maavoori nunchi vellina o ias koodaa ilaage ante entha baagunu…

    స్పందించండి

  4. hi sir, “వాసన లేని గిలకల బావి నీళ్లు ” word choodagane yevaro maa voori athane anukunnanu,
    mee profile choosi confirm chesukunnanu(nenu mee voori Edumudi) vaadine, inkoti nenu mee naveen ki classmate ni kooda.

    స్పందించండి

  5. మీరన్నట్లు …”ఎండకాచిన వేళ చూద్దామా? రోడ్డులో ఎక్కడయినా కూసింత ఖాళీ దొరికితే కాలు పెడదామని చూస్తే అబ్బే ఉండదే. అదేనమ్మా, భూమంతా ఉమ్మి, కేకరించి ఊసిన ఉమ్మి, ఖైనీ ఉమ్మి, గుట్కా ఉమ్మి, ఉబుసుకుపోక వేసిన ఉమ్మి, అలవాటుగా వేసిన ఉమ్మి. దగ్గిదగ్గి దగ్గిన ఉమ్మి, తుమ్మి, తుమ్మి తుమ్మిన ఉమ్మి. కాలు పెడదామంటే భయం, భయం. ఏ ఉమ్మి ఏ రోగాన్ని అంటిస్తుందో తెలియక, భయం భయం.”……….

    భాగ్య నగరమే కాదు ఏ నగర పరిస్తుతులైనా దరి దాపు ఇంతే. కాకుంటే కొన్ని నగరాల్లో.. ఖైనీ ఉమ్మి, గుట్కా ఉమ్మి..
    ఉండకపోవచ్చు కాని మిగిలిన వెతలన్నీ మామూలే. డ్రైనేజి వసతులకు, నీతి వసతులకు, రోడ్ల నిర్మాణానికి ,విద్యుత్ సరఫరాకి, ప్రభుత్వ వైద్య సదుపాయాలకూ, డబ్బెక్కడ మిగులుతుంది? పౌరుల్ని ,వాణిజ్య సముదాయాలనూ రిక్షా వాళ్ళను చిన్న చిదుకు వ్యాపారుల్ని వేధించి పిండి వసూలు చేసిన ట్యాక్సులు ప్రజా ప్రతినిదులనబడే జలగలు పీలుస్తుంటే ,కంట్రాక్టర్ లనబడే రాబందులు చెండుకు తింటుంటే,మునిసిపల్ అధికారులనబడే గుంటనక్కలు అనునిత్యం అవసరాలకొరకు తమ వద్దకు వచ్చే , ప్రజలనే పీనుగుల కోసం కాచుకు కూర్చొంటే …అన్ని నగరాలూ ఒకటే అభాగ్య నగరాలై పోవడానికి.
    కాకుంటే పరిమితుల్లో తేడా …అంతే …..ఆక్రోశాలు వదిలెయ్యండి ఆచరణకు దిగండి….Nutakki

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: