ఇది తెలుగిల్లు 50వ రచన
”ఏ పదాల వెనుక ఏ నిజాలు దాగున్నాయో తెలుసుకోనంతకాలం మళ్లీమళ్లీ మోసపోతూనే ఉంటాము” – అంటారు ఓ సామాజిక విశ్లేషకుడు.
గత వారం రోజులుగా మీడియా, పోలీసు వ్యవస్థలు రెండూ తెలుగు సినీమాయాలోకం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ”టాలీవుడ్,” ‘డ్రగ్ రాకెట్,’ ‘హైటెక్ వ్యభిచారం’ (ఈ సంకర భాషను మీ మాదిరిగానే నేనూ వినలేక ఛస్తున్నానంటే నమ్మండి!) ఈ మూడు పదాల చుట్టూ అందరినీ గిరగిరా తిప్పేస్తున్నారు.
‘డ్రగ్స్ వలయంలో మహానగరం’
‘మత్తులో సినీ జగత్తు’
డ్రగ్స్ మాఫియాకు రాజధాని అడ్డా”
పదాలేమయినా పత్రికలన్నీ హైదరాబాదు, అందులోనూ ప్రత్యేకించి సినీరంగం మత్తుపదార్ధాల వాడకానికి కేంద్రమయిందని వాపోయాయి.
అంటే ఉన్నఫళంగా మీడియా, పోలీసు వ్యవస్థలకు, వాటి బాధ్యులకూ మత్తు పదార్థాలమీద, వ్యభిచారం మీద ఎందుకు రోత పుట్టినట్లు?
రాజధాని పోష్ కాలనీలకు, అప్పనంగా డబ్బు ఒళ్లోవాలిపోయేవారికీ, వారి బిడ్డలకూ సంబంధించిన ఈ సంఘటనల మీదే ఎందుని చూపుసారించారు?
సినీ పరిశ్రమ సంబంధీకులు మత్తు పదార్థాల వాడకం ఇప్పుడే ప్రారంభించారా? గతంలో లేనేలేదా?
సినీ నటులు వ్యభిచారానికి ఇప్పుడే దిగారా? గతంలో ఈ తరహా పనులు లేనేలేవా?
గతంలోనూ ఉంటే నివారణకు ఏమి చర్యలు తీసుకున్నారు?
ఇప్పుడే ప్రారంభమయితే ఈ తప్పిదాలు ఏదో ఉపద్రవంలా వచ్చిపడ్డాయా? సినీ పరిశ్రమ తప్పిదం లేదా?
ఇప్పుడు ఇంకో కోణంలో చర్చించేందుకు అనుమతివ్వండి!!
రాష్ట్రమంతటా వ్యాపారకూటములు విచ్చలవిడిగా నిర్వహిస్తోన్న గొలుసుకట్టు మద్యం దుకాణాలను ఎత్తేయించేందుకు ఈ రెండు వ్యవస్థలూ రాజధాని డ్రగ్ రాకెట్ తీరులోనే ఎందుకు స్పందించలేదు?
బెల్టుషాపులని ముద్దుగా పిలుచుకుంటున్న ఆ గొలుసుకట్టు దుకాణాల్లో లక్షలాది మంది నిరు పేదలు, మధ్యతరగతి మొగోళ్లు తమ పెళ్లాం పుస్తెల్ని తాకట్టుపెట్టి తాగుతోన్న విషయం పోలీసుకు తెలియదా? మద్యానికి డబ్బులివ్వలేదంటూ కొడుకులు తల్లిని సైతం మట్టుబెట్టిన సంగతులు అడపాదడపా కావచ్చు వింటున్నాం కదా?
అసలు దుకాణాల మాటలా ఉంచి కనీసం చట్టాన్ని చట్టుబండలు చేసి నిర్వహిస్తోన్న, సమాజాన్ని నిర్వీర్యం చేస్తోన్న గొలుసుకట్టు మద్యం దుకాణాల భరతం ఎందుకు పట్టరు?
రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి, రాజధాని నుంచి కూడా ఢిల్లీ, ముంబాయి, పునే తదితర ప్రాంతాల వ్యభిచార కేంద్రాలకు వేలాది మంది ఆడపిల్లలు తరలిపోతుండగా, తరలిస్తుండగా పోలీసు ఏమి చేస్తోంది?
వాస్తవానికి రెండో జాబితా ప్రశ్నలకు పోలీసు నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఏనాడూ సూటి జవాబు రాలేదు. రాదు కూడా.
మీడియా కూడా విధానపరంగా ఈ వ్యవహారాలపై ఓ పట్టుపట్టిన దాఖలాలు లేవు. (అడపాదడపా వ్యక్తుల స్పందనలు, కొందరు విలేకరులు స్పందించటం వేరే.)
ఇవీ ప్రభుత్వ రెండు కోణాలు.
అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఏవో మతలబులు ఉన్నట్లేనని భావించాలి.
తమ మనుగడను దెబ్బతీసే వ్యవహారాలను మరుగున పడేసి అనవసర వ్యవహారాల చుట్టూ సమాజాన్ని మోహరించాలన్నదే అ మతలబు. అదే కుట్ర.
ఒకటి … బాధల వలయంలో చిక్కుకున్న సామాన్యుడు మత్తులో గమ్మత్తుగా పడిపోవటం – రెండోది … లాభాల కొండల్ని మూటగట్టుకోవటం.
వీటన్నింటికీ మించి మత్తు ఆవరించిన సామాన్యుడెప్పుడూ అసలు కారణాలను గుర్తించటం, తప్పిదాలను ప్రశ్నించటం సాధారణంగా కానిపని. కుళ్లిపోయిన వ్యవస్థ కొనసాగాలనుకునేవారికి కావాల్సింది అదేగా మరి.
ఆకలితో నకనకలాడే తన కడుపునూ, తమ కుటుంబీకుల కడుపునూ నింపుకునేందుకు రెడ్‌లైట్ ఏరియాలకు చేరుతోన్న (బలవంతంగా చేరుస్తోన్న) యువతులు తప్పిదాల సుడిలో చిక్కుకుని విలవిలలాడటం తప్ప కారకుల కాలరు పట్టుకోరు. అయితే ఈ తీరు ఎల్లకాలమూ కొనసాగదనుకోండి.
అదే సందర్భంలో హైటెక్ వ్యభిచారమని ప్రచారం చేసుకోవటం ఉన్నత శ్రేణి వ్యాపారాలకు ప్రత్యేకించి దీర్ఘకాలంలో లాభాలు పండిస్తాయి. మత్తు పదార్థాల వ్యాపార రహస్యాలను కనుగొన్న పోలీసులు వాటని ఆర్భాటంగా ప్రచారం చేయటం కూడా వ్యాపార ప్రకటనే. అయితే దీనిని పోలీసు కమిషనరు ఏకే ఖాన్ వ్యక్తిగత నిజాయితీతో ముడిపెట్టి పరిమితులు విధించుకుంటే విస్తృతమయిన వ్యవస్థ లోపాలను గుర్తించలేము. సరిజేసుకోలేవు. ఖాన్ నిజాయితీకి ధన్యవాదాలు చెబుదాం. ఆయన మహా వ్యవస్థలో ఒక సూక్ష్మా తి సూక్ష్మ శకలం మాత్రమే.
తమ లాభాలను పండించుకునే పనిలోనే అక్కడ ఘోరాతి ఘోరాలను చూసీ చూడనట్లు వదిలేయటం వెనుక, ఇక్కడ చిన్న వ్యవహారాలనే భూతద్దంలో చూపటం కూడా వ్యాపారాభివృద్ధే ప్రధాన ధ్యేయం.
ఈ వ్యవహారాల్లో ప్రభుత్వ వైఖరిలోని రెండు కోణాలను సూటిగా అర్ధం చేసుకోవటమే మన కొత్త కోణం. చెడుగుల నివారణకు ఎవరిదారిలో వారు, ఎవరికి వీలున్న చోట వారు, ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఏ రూపాన వీలయితే ఆ రూపాన ప్రయత్నించటమే మన కొత్త కోణం. బోలెడన్ని దారుల్లో, బోలెడన్ని ఆలోచనల్లో ఉమ్మడి అంశాలను ఏకీకృతంగా నడిపేందుకు ప్రయత్నించటమే మన కొత్త కోణం.
మన లక్ష్యాలను నెరవేర్చుకోవటమే కొత్త కోణం.