ఇది తెలుగిల్లు 50వ రచన
”ఏ పదాల వెనుక ఏ నిజాలు దాగున్నాయో తెలుసుకోనంతకాలం మళ్లీమళ్లీ మోసపోతూనే ఉంటాము” – అంటారు ఓ సామాజిక విశ్లేషకుడు.
గత వారం రోజులుగా మీడియా, పోలీసు వ్యవస్థలు రెండూ తెలుగు సినీమాయాలోకం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ”టాలీవుడ్,” ‘డ్రగ్ రాకెట్,’ ‘హైటెక్ వ్యభిచారం’ (ఈ సంకర భాషను మీ మాదిరిగానే నేనూ వినలేక ఛస్తున్నానంటే నమ్మండి!) ఈ మూడు పదాల చుట్టూ అందరినీ గిరగిరా తిప్పేస్తున్నారు.
‘డ్రగ్స్ వలయంలో మహానగరం’
‘మత్తులో సినీ జగత్తు’
డ్రగ్స్ మాఫియాకు రాజధాని అడ్డా”
పదాలేమయినా పత్రికలన్నీ హైదరాబాదు, అందులోనూ ప్రత్యేకించి సినీరంగం మత్తుపదార్ధాల వాడకానికి కేంద్రమయిందని వాపోయాయి.
అంటే ఉన్నఫళంగా మీడియా, పోలీసు వ్యవస్థలకు, వాటి బాధ్యులకూ మత్తు పదార్థాలమీద, వ్యభిచారం మీద ఎందుకు రోత పుట్టినట్లు?
రాజధాని పోష్ కాలనీలకు, అప్పనంగా డబ్బు ఒళ్లోవాలిపోయేవారికీ, వారి బిడ్డలకూ సంబంధించిన ఈ సంఘటనల మీదే ఎందుని చూపుసారించారు?
సినీ పరిశ్రమ సంబంధీకులు మత్తు పదార్థాల వాడకం ఇప్పుడే ప్రారంభించారా? గతంలో లేనేలేదా?
సినీ నటులు వ్యభిచారానికి ఇప్పుడే దిగారా? గతంలో ఈ తరహా పనులు లేనేలేవా?
గతంలోనూ ఉంటే నివారణకు ఏమి చర్యలు తీసుకున్నారు?
ఇప్పుడే ప్రారంభమయితే ఈ తప్పిదాలు ఏదో ఉపద్రవంలా వచ్చిపడ్డాయా? సినీ పరిశ్రమ తప్పిదం లేదా?
ఇప్పుడు ఇంకో కోణంలో చర్చించేందుకు అనుమతివ్వండి!!
రాష్ట్రమంతటా వ్యాపారకూటములు విచ్చలవిడిగా నిర్వహిస్తోన్న గొలుసుకట్టు మద్యం దుకాణాలను ఎత్తేయించేందుకు ఈ రెండు వ్యవస్థలూ రాజధాని డ్రగ్ రాకెట్ తీరులోనే ఎందుకు స్పందించలేదు?
బెల్టుషాపులని ముద్దుగా పిలుచుకుంటున్న ఆ గొలుసుకట్టు దుకాణాల్లో లక్షలాది మంది నిరు పేదలు, మధ్యతరగతి మొగోళ్లు తమ పెళ్లాం పుస్తెల్ని తాకట్టుపెట్టి తాగుతోన్న విషయం పోలీసుకు తెలియదా? మద్యానికి డబ్బులివ్వలేదంటూ కొడుకులు తల్లిని సైతం మట్టుబెట్టిన సంగతులు అడపాదడపా కావచ్చు వింటున్నాం కదా?
అసలు దుకాణాల మాటలా ఉంచి కనీసం చట్టాన్ని చట్టుబండలు చేసి నిర్వహిస్తోన్న, సమాజాన్ని నిర్వీర్యం చేస్తోన్న గొలుసుకట్టు మద్యం దుకాణాల భరతం ఎందుకు పట్టరు?
రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి, రాజధాని నుంచి కూడా ఢిల్లీ, ముంబాయి, పునే తదితర ప్రాంతాల వ్యభిచార కేంద్రాలకు వేలాది మంది ఆడపిల్లలు తరలిపోతుండగా, తరలిస్తుండగా పోలీసు ఏమి చేస్తోంది?
వాస్తవానికి రెండో జాబితా ప్రశ్నలకు పోలీసు నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఏనాడూ సూటి జవాబు రాలేదు. రాదు కూడా.
మీడియా కూడా విధానపరంగా ఈ వ్యవహారాలపై ఓ పట్టుపట్టిన దాఖలాలు లేవు. (అడపాదడపా వ్యక్తుల స్పందనలు, కొందరు విలేకరులు స్పందించటం వేరే.)
ఇవీ ప్రభుత్వ రెండు కోణాలు.
అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఏవో మతలబులు ఉన్నట్లేనని భావించాలి.
తమ మనుగడను దెబ్బతీసే వ్యవహారాలను మరుగున పడేసి అనవసర వ్యవహారాల చుట్టూ సమాజాన్ని మోహరించాలన్నదే అ మతలబు. అదే కుట్ర.
ఒకటి … బాధల వలయంలో చిక్కుకున్న సామాన్యుడు మత్తులో గమ్మత్తుగా పడిపోవటం – రెండోది … లాభాల కొండల్ని మూటగట్టుకోవటం.
వీటన్నింటికీ మించి మత్తు ఆవరించిన సామాన్యుడెప్పుడూ అసలు కారణాలను గుర్తించటం, తప్పిదాలను ప్రశ్నించటం సాధారణంగా కానిపని. కుళ్లిపోయిన వ్యవస్థ కొనసాగాలనుకునేవారికి కావాల్సింది అదేగా మరి.
ఆకలితో నకనకలాడే తన కడుపునూ, తమ కుటుంబీకుల కడుపునూ నింపుకునేందుకు రెడ్‌లైట్ ఏరియాలకు చేరుతోన్న (బలవంతంగా చేరుస్తోన్న) యువతులు తప్పిదాల సుడిలో చిక్కుకుని విలవిలలాడటం తప్ప కారకుల కాలరు పట్టుకోరు. అయితే ఈ తీరు ఎల్లకాలమూ కొనసాగదనుకోండి.
అదే సందర్భంలో హైటెక్ వ్యభిచారమని ప్రచారం చేసుకోవటం ఉన్నత శ్రేణి వ్యాపారాలకు ప్రత్యేకించి దీర్ఘకాలంలో లాభాలు పండిస్తాయి. మత్తు పదార్థాల వ్యాపార రహస్యాలను కనుగొన్న పోలీసులు వాటని ఆర్భాటంగా ప్రచారం చేయటం కూడా వ్యాపార ప్రకటనే. అయితే దీనిని పోలీసు కమిషనరు ఏకే ఖాన్ వ్యక్తిగత నిజాయితీతో ముడిపెట్టి పరిమితులు విధించుకుంటే విస్తృతమయిన వ్యవస్థ లోపాలను గుర్తించలేము. సరిజేసుకోలేవు. ఖాన్ నిజాయితీకి ధన్యవాదాలు చెబుదాం. ఆయన మహా వ్యవస్థలో ఒక సూక్ష్మా తి సూక్ష్మ శకలం మాత్రమే.
తమ లాభాలను పండించుకునే పనిలోనే అక్కడ ఘోరాతి ఘోరాలను చూసీ చూడనట్లు వదిలేయటం వెనుక, ఇక్కడ చిన్న వ్యవహారాలనే భూతద్దంలో చూపటం కూడా వ్యాపారాభివృద్ధే ప్రధాన ధ్యేయం.
ఈ వ్యవహారాల్లో ప్రభుత్వ వైఖరిలోని రెండు కోణాలను సూటిగా అర్ధం చేసుకోవటమే మన కొత్త కోణం. చెడుగుల నివారణకు ఎవరిదారిలో వారు, ఎవరికి వీలున్న చోట వారు, ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఏ రూపాన వీలయితే ఆ రూపాన ప్రయత్నించటమే మన కొత్త కోణం. బోలెడన్ని దారుల్లో, బోలెడన్ని ఆలోచనల్లో ఉమ్మడి అంశాలను ఏకీకృతంగా నడిపేందుకు ప్రయత్నించటమే మన కొత్త కోణం.
మన లక్ష్యాలను నెరవేర్చుకోవటమే కొత్త కోణం.
Posted by Sriram on ఆగస్ట్ 25, 2010 at 5:26 ఉద.
Good Analysis.
Posted by Hateweb on ఆగస్ట్ 25, 2010 at 12:15 సా.
మీరు చెబుతున్న పోలీస్ ఆఫీసరేమీ పత్తిత్తు కాదు. ఆయనా ఇలాంటి వివాదాల్లో బాగానే సంపాదించుకుంటున్నాడు.
Posted by rama krishna on ఆగస్ట్ 25, 2010 at 3:48 సా.
belt shoplanu pattukunte elaagandee. prabhutvaaniki aadaayam taggipodoo. meeru perkonna vaatilo aadaayam ledu kadaa..
Posted by gajula on ఆగస్ట్ 25, 2010 at 7:04 సా.
evaro annatlu “all are currupt unless,otherwise prooved”.meeru cheppina vishayaalu andariki telusu,chedugula nivaaranaku manamemi cheyagalamo,etlaa cheyyalano chebite bhaguntundi
Posted by m bindumadhavi on ఆగస్ట్ 26, 2010 at 10:51 ఉద.
మరేనండీ మన పక్కన పిడుగులు పడుతున్నా పట్టించుకోని నిబ్బరం అలవాటు చేసేసుకున్నాము కదా మరి! అంతకంటే ఆమాన్య మానవుడు ఏమి చెయ్యగలడు పాపం.
అక్కడికీ సంఘటితమైన స్వంచ్చంద సంస్థలు నిస్వార్ధం గా తమకి చేతనైనది త్రుణమో పణమో చేస్తూనే ఉన్నారు పాపం. చెయ్యగలిగినంత చేసి, సమస్య గురించి సగటు జీవికి కొంత స్ప్రుహ కలిగించే ప్రయత్నం లో క్రుతక్రుత్యులు అవుతున్నారు,ఏదో ఉడతా భక్తి గా.
అందుకు వారిని అభినందించి, ప్రోత్సహించవలసిందే.
సమాజం లోని చాలా రుగ్మతలకి కారణం అవుతున్నదేమో ప్రభుత్వమా? వాళ్ళకి పాలనాధికారం కట్టబెట్టి, పన్నులు కట్టి, వాళ్ళే సమస్యలకి కారకులవుతూంటే వారిని మినహాయించి మిగిలిన వాళ్ళంతా తలో చెయ్యీ వేసి, (సాటి మనుషుల మీద జాలితో) మనకి మనమే పరిష్కరించుకోవటమా? బాగుందండీ, విధానం.
ఆ వలయం లో చిక్కుకోని మధ్య తరగతి మానవుడు పాపం ఆ స్ప్రుహ తో తన వంతు తానుగా ఆ జోలికి వెళ్ళకుండా ఉండటమే సమాజానికి తను చెయ్యగలిగిన గొప్ప సహాయం. నిత్య జీవిత సంఘర్షణలోనే తెల్లారి పోతుంటే, తనకున్న పరిమితుల్లో తనేమి చెయ్యగలడు, పాపం!
సాధారణ పాలనాంశం గా, ఒక సంక్షేమ ప్రభుత్వం చెయ్యవలసిన పనిని ఒక వ్యక్తో, ఓ మోస్తరు పరిమాణం కలిగిన స్వంచ్చంద సంస్థో చెయ్యటం ఎంత కష్టమో మనకి తెలియదా?
కానీ సమస్యల ఊబి లో సమాజం గిలగిల లాడుతూ ఉంటే మొద్దు నిద్ర పోవటం ప్రభుత్వానికి చేతనైనంత గా మనకి చేత కాదు కదండీ, అందుకని మన వంతు మనం ప్రయత్నిద్దాము.