కోకోకోలాగారూ ఇక దయచేయండి! క్విట్‌ ఇండియా!!


ఇక్కడి శ్రమ – ఇక్కడి భవనాలు – ఇక్కడి నీళ్లు – ఇక్కడి చక్కెర – ఇక్కడి రసాయనికాలు, ఇక్కడి సీసాలు – ఇక్కడి పరికరాలు – ఇక్కడి వాహనాలు – ఇక్కడి తాగుబోతులు = కోకోకోలా.

ఇంతవరకూ అందరికీ తెలిసిందే. అయితే కొందరికే తెలిసిన రహస్యం ఏమంటే…. ఏటా ఎనిమిదివేల కోట్ల రూపాయల లాభాల్ని కోకోకోలా యజమానులు భారతదేశాన్నుంచి తరలించుకుపోతున్నారు. విదేశీ బహూళజాతి సంస్థ మనల్ని మోసం చేసేందుకు, దగా చేసేందుకు, మన కళ్లు చూసే నిజాన్ని అబద్ధం చేసేందుకు, మన మనస్సును కొనేసేందుకు తన పేరును స్థానికీకరించింది. హిందూస్థాన్‌ కోకోకోలా బెవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అని పేరు పెట్టుకుంది.
అత్యంత ఆధునిక యంత్రాలతో చక్కెర నీళ్లలో తన సొంత తయారీ విషాలను కలిపేందుకు వినియోగిస్తున్నందున ఎనిమిదివేల కోట్ల రూపాయల్ని తరలించుకుపోయే ఈ సంస్థలో మనవారికి కనీసం ఎనిమిది వేలమందికి కూడా ఉపాథి దొరకలేదు.
మన భూగర్భజలాలను పాతాళందాకా తోడేస్తుండటంతో ఈ పరిశ్రమున్న ప్రతిచోటా నీటి కరువు సాధారణమయింది. ఈ సంస్థకు చెందిన అతిపెద్ద కర్మాగారం ఉన్న కేరళలోని పెరుమట్టి ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయి కరువు ఏర్పడటంతో దూరప్రాంతాల నుంచి నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. దీనికిగాను ఏటా రూ. 20 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యులున్న సంఘం లెక్కలు వేసింది. అన్నిచోట్లా ఇదే తీరు. అంతేనా! సీసాలు కడిగిన నీరు భూమిలోకి ఇంకిన కారణంగా కాలుష్యం విస్తరిస్తోంది. వీటన్నింటికంటే మించి కోలా మద్యంకన్నా ప్రమాదకరమయిన జబ్బుల్ని అమాయకులికి అంటిస్తోంది. దంతాలు, ఎముకలు, మూత్రపిండాలు, జీర్ణకోశవ్యవస్థను రోగపూరితం చేస్తుంది. ఇది క్యాన్సరు కారకం కూడా. ఊబకాయం ఏర్పడి,  ఫలితంగా మధుమేహం, గుండె, రక్తపోటు, పక్షవాతం జబ్బులకూ ఆస్కారం ఇస్తోందని వైద్య నిపుణులు తేల్చిచెప్పారు. దీన్లో వినియోగించే కెఫిన్‌ అనే పదార్ధం కారణంగా ఒకటికి రెండుసార్లు తాగినవాళ్లు చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌, ఇప్పుడు కృష్ణ కుమారుడు మహేష్‌బాబు చెప్పకుండానే రోజూ తాగేందుకు అలవాటు పడతారు. తాగకపోతే చిరాకు, కోపం, ఉద్రేకం సమస్యలు ఏర్పడతాయి, తాగితే కంటి జబ్బులు, తలనొప్పి, నరాల వాపు, వెంట్రుకలు ఊడిపోవటం, మతిమరుపు ఇలా పలు వ్యాధులు ఆవరిస్తాయి. ఇదంతా నిజ్జంగా నిజమే. నిర్థారణకోసం మీ వైద్యుడితో చర్చించండి. కోపెన్‌హాగెన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం పరిశీలనలో మరో అంశం తేలింది. ఈ కిల్‌డ్రింకుల్ని వదలకుండా రోజూ తాగే పురుషుల్లో వీర్య సామర్థ్యం 30 శాతంమేర తగ్గిపోయినట్లు నిర్థారించారు.
1978లో జనతా ప్రభుత్వం కోకోకోలా సంస్థను దేశం నుంచి సాగనంపింది. అయితే 1990లో ప్రారంభమయిన సరళీకరణ ఆర్థిక విధానాల పుణ్యమా అని కోలాకు మళ్లీ ప్రభుత్వం నుంచి ఘన స్వాగతం లభించింది. అది వస్తూవస్తూనే తోడుగా పెప్సీనికూడా తెచ్చి మన నెత్తినెక్కించింది. ఆరోగ్య, పర్యావరణ విషయాల్లో తేడా లేదుగానీ దేశవాళీ సంస్ధ పార్లేను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలుచేసింది. పార్లే ఉత్పాదనల్లో ఒక్కొక్కదానిని ఉపసంహరించుకుంటూ కోలాను ఏకైక కిల్‌డ్రింకుగా భారతీయులకు ఒంటబట్టించే పనిలో కోకోకోలా యాజమాన్యం తలమునకలుగా వ్యవహారాలు నడుపుతోంది. పార్లే ఉత్పాదనల్లో పేరున్న గోల్డ్‌స్పాట్‌కు ఇప్పటికే మంగళం పాడింది. అత్యంత ఆదరణ ఉన్న థమ్స్‌అప్‌ను మరుగుపరిచేందుకు ప్రస్తుతం పావులు కదుపుతోంది.
ఈ దశలోనయినా మనమంతా ఆలోచించాలి. అసలు కోకోకోలాకే మనం మంగళం పాడాలి. పర్యావరణను దారుణంగా దెబ్బతీస్తోన్న ఈ కోలాను సాగనంపాలి. కోలాకు చెప్పిచూద్దామని అనుకుంటారేమో, ఆ విషయంలో కోలా చాలా తెలివిగలది. విచారణకు ప్రభుత్వం ఆదేశించినా, వాళ్ల ముందుకు ఆ సంస్థ రానేరాదు. పరోక్షంగానయినా సమాధానం ఇవ్వదు. ఇక్కడి విభిన్న ఆలోచనలను ఉపయోగించుకుని బతికిపోతోంది. కేరళలో కోకోకోల కర్మాగారాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం మూసివేయించగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చాటుమాటుగా కోలాకు మద్దతు ఇవ్వటం ఎవరికోసమో? ఎందుకోసమో? వివరించాలి. పైగా ప్రభుత్వం పైనే కోర్టుకెక్కి మూతేసిన కర్మాగారాన్ని తీర్పరాకమునుపే తిరిగి తమ దుకాణాన్ని పునరుద్ధరించుకున్నారు.
చల్లచల్లనిది… కమ్మకమ్మనిదీ అని రాగాలు తీస్తూ మన జేబుల్లోంచి డబ్బులు పీక్కొని మనల్నే జబ్బులపాలు చేస్తోన్న ఈ కోకోకు వీడ్కోలు పలకాలి.

చివరిగా నా అనుభవాన్ని మీతో పంచుకోనీయండి. పాత్రికేయుడిగా రోజూ అనేకమందిని కలిసే క్రమంలో టీ తాగని నాకు కూల్‌డ్రింకు ఇప్పించి నాయకులు, అధికారులు దానికి బానిసను చేశారు. ఎవ్వరూ ఇప్పించని రోజున నేనే కొనుక్కుని తాగేవాడిని. ఇలా రోజూ లీటరుకు తక్కువ కాకుండా కిల్‌డ్రింకు అలియాస్‌ విషపదార్థం, అలియాస్‌ కీటకనాశిని అలియాస్‌ మరుగుదొడ్డి పరిశుభ్రదాయినికి నా శరీరం అలవాటు పడింది. అలా కొనసాగుతుండగా ఓ మంచి ఉదయాన  శాస్త్రవేత్తలు తమ పరిశోధనా ఫలితాలను విడుదల చేశారు. కూల్‌డ్రింకుల పేరిట మనం తాగుతోన్న రంగు చక్కెర నీళ్లు నిజానికి కిల్‌డ్రింకులని తేల్చిపారేశారు. దాన్లో కీటకనాశినులు మోతాదుకు మించి ఉన్నాయని నిర్థారించారు. అదే సమయంలో వారి పరిశోధనలను ప్రజలకు వివరించే పనిలో జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు థమ్స్‌అప్‌తో మరుగుదొడ్లు  కడిగి మిలమిల మెరిపించి చూపారు. ఇంకేముంది, నా గుండెల్లో దడదడ. అంతే ఆనాటి నుంచీ దాదాపుగా కిల్‌డ్రింకులకు విడాకులిచ్చేశాను.

మరి అందరం కలిసి (నేను నిర్థారించుకున్నాను. మీరూ నిర్థారించుకోండి)

కోకోకోలా – క్విట్‌ ఇండియా! అందామా మరి…
కోకోకోలా – మమ్మల్ని వదలవమ్మా !! అంటూ గదుముదామా !!


6 వ్యాఖ్యలు

  1. Yes, it is addictive and harmful to the digestion system spoils lining in stomach. I left coke in 2002 and I am better after that.

    స్పందించండి

  2. కోకోకోలా – క్విట్‌ ఇండియా..
    good post andi..

    స్పందించండి

  3. ఇంతకాలమూ కూల్ కూలుగా హాయ్ హాయిగా మజా మజాగా మేము తాగిన కోకోకోలా మరుగుదొడ్డి పరిసుభ్రదాయినా…అయ్యబాబోయ్… ఎందుకండీ లేని రోగాలు తెచ్చుకోవడం. మానేస్తే పోలా..అవునూ 8 వేల కోట్ల రూపాయలు దేసం నుంచి దొచుకుపోతున్నా… దేశీయ పరిస్రమలను నాశనం చేస్తున్నా ప్రభుత్వాలు పత్తించుకోకపోవడం దారుణం..ఇందులో ఎంత కమీషన్లు కొట్టెస్థున్నారో…

    స్పందించండి

  4. సాధ్యమంటారా?

    మరో ‘యూరన్ కోలా’ మొరార్జీ పుట్టాలేమో!

    అప్పట్లో రాత్రికి రాత్రి దేశమంతటా తమ కార్యకలాపాల్ని మూసేసి, పారిపోయిన కోకాకోలా యాజమాన్యానికి అప్పటి జార్జి ఫెర్నాండెజ్ లాంటి ఖలేజా వున్న నాయకుడెవడున్నాడు ఇప్పుడు?

    చూద్దాం!

    స్పందించండి

  5. హిందూస్థాన్‌ కోకోకోలా బెవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అని పేరు పెట్టుకుంది
    >>
    ఏ కంపెనీ అయినా, అలాగే పేరు మార్చుకోవాలి. అంతెందుకు మైక్రోసాఫ్ట్ ను ఇండియా లో “మైక్రోసాఫ్ట్ ఇండియా” అంటారు.

    తాగకపోతే చిరాకు, కోపం, ఉద్రేకం సమస్యలు ఏర్పడతాయి,
    >>
    పర్సోనల్ గ నాకెప్పుడూ ఇలా అనిపించలేదు, అదేమంత అడిక్షాన్ కాదు.

    కోకోకోలా – క్విట్‌ ఇండియా! అందామా మరి…
    >>
    అందాం, మరి మన దగ్గర ప్రత్యామ్నయం ఉందా?

    స్పందించండి

  6. అది కోకా-కోలా కాదండీ రక్త కోలా..

    మన డబ్బులనే పిండి మళ్ళా మన రక్తంలోకే విషాల్ని ఇంజెక్ట్ చేసే ఇలాంటి రసాయనిక ఉత్పత్తులను మన దేశం నించి తరిమి కొట్టాల్సిందే! విదేశీయులు మన మీద కన్ను వేసింది మన దేశంలోని సంపదనంతా అప్పనంగా దోచుకుని భారతీయుల్ని బికారుల్ని చెయ్యడానికే అన్న నిజం గమనించే మేధస్సు ఇవాళ ఎంతమందికి ఉంది? ఇలాంటి వాళ్ళని,వాళ్ళ ఉత్పత్తుల్ని తన్ని తగలెయ్యాల్సిందే!

    స్పందించండి

Leave a reply to Old Monk స్పందనను రద్దుచేయి