తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా తెలుగువాళ్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
తెలుగు పిడుగు మనింటి వెలుగు గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతి సందర్భంగా తెలుగోళ్లందరికీ శుభాకాంక్షలు.
తెలుగు పండుగ సందర్భంగా తెలుగు వెలుగు కోసం నా ముచ్చట్లు ఇవి…
తెలుగు రాత కొరుకుడుపడని ఇనుప గుగ్గీళ్లు కాకూడదు. అప్పుడే తెలుగువాళ్లయినా, తెలుగేతరులయినా మన భాష నేర్చుకునేందుకూ, ఉపయోగించేందుకూ ముందుకొస్తారు. సంకటి నోట్లో పెట్టుకుంటే జారిపోయిన తీరున తెలుగు రాత ఉండాలి. అదే సందర్భంగా స్థానిక పూల పరిమళాలు వెదజల్లాలి.
మెత్తటి సంకటిలా … పూలపరిమళాలు వెదజల్లేలా రాసేందుకు కొన్ని సూత్రాలు ఇవిగివిగో…
చిన్న వాక్యాలు రాద్దాం.
మనం చిన్న వాక్యాలుగానే మాట్లాడుకుంటాం.
చిన్న వాక్యాలు రాయటం వలన తప్పులూ తక్కువే ఉంటాయి.
అందరికీ సులభంగా అర్ధమవుతుంది.
ఉదాహరణ : రాష్ట్రాన్ని కరువు కమ్మింది. నాలుగు నెలలుగా వర్షాలు లేవు.
ఒక వాక్యంలో ఒక అంశం మాత్రమే ఉంటే సులభంగా అర్ధమవుతుంది.
ఉదాహరణ : గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో వర్షాలు కురవనందున కరువు ఏర్పడి పంటలు ఎండిపోతున్నందున రైతులు విలవిలలాడటంతోపాటు పశువులకు, మనుషులకు తాగునీరు కూడా దొరకటం లేదు. ఈ పెద్ద వాక్యాన్ని ఐదారు వాక్యాలుగా రాస్తే సులభంగా అర్ధమవుతుంది.
చిన్నివాక్యాలు ఇలా :
1. రాష్ట్రాన్ని కరువు కమ్మింది.
2. గత నాలుగు నెలలుగా వర్షాలు కురవలేదు. 3. దీంతో తొలకరికి వేసిన పైర్లు ఎండిపోతున్నాయి.
4. తాగునీటికి కటకట ఏర్పడింది.
5. పశువులకూ నీరు దొరకటం లేదు.
మాట్లాడే భాషనే ఉపయోగిద్దాం.
కొత్త విషయాలకు కొత్త పదాలు సృష్టిద్దాం. అర్ధం కాదన్న పేరిట ఆంగ్ల పదాలు వాడకం వలన తెలుగు భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉదాహరణ : స్వైన్‌ఫ్లూ (ఇది ఆంగ్లం బాగా వచ్చినవారికి మాత్రం అర్ధమవుతుంది) = పంది జలుబు (ఇది అందరకీ అర్ధమవుతుంది.)
ఇంటా, బయట తెలుగువారందరితో విధిగా తెలుగు మాట్లాడాలని నిబంధన పెట్టుకుందాం.
వీలయినంతవరకూ తెలుగులోనే రాసేందుకు ప్రయత్నిద్దాం.
ఉదాహరణ :
కాంట్రాక్టర్ = గుత్తేదారు
హోల్‌సేల్ = టోకు వర్తకం
కిరోసిన్ = గబ్బుచమురు
ఆయిల్ = చమురు
కమిటి = సంఘం
రోడ్ టర్నింగు = వీధి మొగదల
మరికొన్ని విషయాలు అప్పుడప్పుడు తెలుసుకుందాం.
Posted by nrahamthulla on ఆగస్ట్ 29, 2010 at 1:12 సా.
రాష్ట్రంలో ఉగాది పర్వదినం నుంచి పూర్తి స్థాయిలో తెలుగులోనే పరిపాలన ఉంటుందని 25.2.2010న ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడించారు.తెలుగు భాష అభివృద్థికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖనూ ఏర్పాటు చేస్తామన్నారు.తొందరగా అమలైతే బాగుండు.