ఎలక్ట్రానిక్ మీడియా క్షణం క్షణం అత్యుత్సాహానికి గురవుతున్నట్లు కన్పిస్తోంది. అత్యుత్సాహంలో ఏమి మాట్లాడుతున్నారో, ఏమి రాస్తున్నారో పరిశీలించుకోవటం లేదనిపిస్తోంది. రాయాల్సివవారే తమకు తెలిసినంత పైత్యాన్ని కుమ్మరించి పని కానిస్తున్నారు. కొత్త విలేకరులు, సబ్ ఎడిటర్ల రాతల్ని అనుభవజ్ఞులు పరిశీలిస్తున్న దాఖలాలు లేవు. అందువలనే బోలెడు బోలెడు తప్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝళిపించిన వార్తా కథనాన్ని ప్రసారం చేస్తూ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో జీ 24 గంటలు అత్యుత్సాహానికి గురయింది. విద్యార్థుల్ని సరస్వతీ పుత్రులని రాసేసింది. నాకు తెలిసినంతవరకూ ఏ పాఠ్యాంశంలోనయినా పండితులయినవారిని సరస్వతీ పుత్రులని అనటం కద్దు. చదువుకుంటున్నవారినీ, చదువులు కొంటున్నవారినీ సరస్వతీ పుత్రులని అంటే ఇక నిజంగా పండితులని ఏమనాలో జీ 24 గంటల కార్యనిర్వాహకులే తేల్చి చెప్పాలి. సరస్వతి చదువుల తల్లి కాబట్టి, చదువుకునేవాళ్లందరూ ఆమె పుత్రులని రాసేసినట్లుంది. అయితే మన సంప్రదాయం అలా లేదు. కనీసం ఒక అంశంలోనయినా పండితులయితేనే వారిని సరస్వతీ పుత్రులుగా పరిగణిస్తారు. దానికి భిన్నంగా విద్యార్థుల్ని సరస్వతీ పుత్రులని పలవరించిన జీ 24 గంటల సరస్వతీ పుత్రా నమో! నమో!!
Archive for ఆగస్ట్ 31st, 2010
31 ఆగ