తెలివి తక్కువోళ్లు ఇంటిని నిర్మిస్తే … తెలివిగలోళ్లు అందులో నివశిస్తారని తేల్చేశారు తెల్లోళ్లు.
”ఇల్లు కట్లిచూడు … పెళ్లి చేసి చూడు” అంటూ మనోళ్లు ఎప్పటి నుంచో బెదిరిస్తూనే ఉన్నారు.
తెల్లోళ్లు తేల్చేసిన సూత్రమూ, మనోళ్ల బెదిరింపూ రెండూ నిజ్జంగా నిజ్జమేనని ఇటీవలి నా అనుభవమూ పట్టిచూపింది.
అప్పుడెప్పుడో గత శతాబ్దం చివర నేను ఒంగోలులో ఈనాడు విలేకరిగా పనిచేస్తున్న సమయమది. అప్పటి ఒంగోలు శాసనసభ్యుడు ఈదర హరిబాబు ఓపికచేసి విలేకరులకు తలా కాసింత ఇంటి స్థలాన్ని మంజూరు చేయించారు. కంచె ఏర్పాటుకంటూ విలేకరుల సంఘ నాయకులు మా నుంచి తలాకాస్త వసూలు చేశారు. దాన్ని కంచె ఏర్పాటుకు వినియోగించకుండా స్థలాల పంపిణీకి సహకరించారంటూ రెవెన్యూ సిబ్బంది కొందరికి బంగారపు ఉంగరాలను సమర్పించారు. ఎట్లయితేనేం నాలుగు సెంట్ల స్థలం నా చేతిలో పడింది. అన్నట్లు ఇక్కడొక సంఘటనను గుర్తుచేసుకోవాలి. ఈనాడు సిబ్బంది ప్రభుత్వ స్థలాల్ని తీసుకోకూడదంటూ యాజమాన్య ప్రతినిధులు కొందరు కుయ్యికుయ్యిమన్నారు. దీంతో నేను తొలుత స్పందిస్తూ, ”ప్రభుత్వ స్థలం తీసుకునేందుకు నేను అన్ని విధాలా అర్హుడినే. కాబట్టి స్థలం తీసుకుంటాను. అట్లా స్థలం తీసుకోవటం ఈనాడు విధానాలకు విరుద్ధమయితే నేను బయటకు వెళ్లేందుకు ఈ క్షణంలోనయినా సిద్ధమే.” అంటూ తేల్చి చెప్పాను. దీంతో ఏమనుకున్నారో ఏమో, ఆ ప్రతినిధులు మౌనం వహించారు. అయితే కుయ్యికుయ్యిమన్నవాళ్లుకూడా బినామీ పేరుతో స్థలాన్ని కొట్టేశారనుకోండి.
ఇక్కడ ఇంకొక తమాషా గుర్తుకొస్తోంది. స్థలం చేతబడకముందే ఓ విలేకరి దాన్ని రూ. 40 వేలకు గుండుగుత్తగా అమ్మేశాడు. ఇదెప్పడు తెలిసిందంటే…. స్థలాలను కొలవటం పూర్తిచేసి అందరమూ ఇళ్ల ముఖం పట్టాము. అప్పుడా విలేకరి తన జేబులో నుంచి మద్యం సీసా తీసి గటగటా తాగేశాడు. ఆ సీసాను తన స్థలంలోకి విసిరేస్తూ ” ఓ నా స్థలమా ఇదే చివరి చూపు” అని నాటకీయంగా పలకటంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అట్లా మొదలయిన అమ్మకాలు 60 మందిలో ఆరుగురు విలేకరులను మాత్రమే ఇప్పుడక్కడ మిగిల్చింది. ఎన్టీఆర్ జర్నలిస్టుల కాలనీలో స్ధలం మొదలు పూర్తయిన ఇంటిదాకా అమ్మకమయిపోయి ఇప్పుడు ఎవరెవరో అక్కడ కాపురాలు పెట్టేశారు. ఆనాడు రూ. 40 వేలకు అమ్ముడుపోయిన స్థలం ఇప్పుడు సరిగ్గా పదేళ్ల తర్వాత అక్షరాలా పాతిక లక్షల రూపాయలు పలుకుతోంది. ఈ కాలనీలో స్థలం తీసుకున్న విలేకరులలో ఈ పదేళ్లలో కొందరు మరోసారి, మరి కొందరు రెండుసార్లు కూడా స్థలాల్ని ఉచితంగా పొందారు. నా మిత్రుడొకడు దాన్లో వచ్చిన స్థలాన్ని రూ. 3.70 లక్షలకు అమ్మి, దాంతో మళ్లీ మళ్లీ కొంటూ ఈరోజున ఓ అపార్టుమెంటులో మూడు పడక గదుల ఇంటితోపాటు కోటి రూపాయల్ని సొంతం చేసుకున్నాడు. స్థలాన్ని జాగ్రత్తగా చేతులు మారిస్తే లాభాల మూటలు దక్కించుకోవచ్చన్న దానికి ఈ సంఘటనే మంచి ఉదాహరణ.
నాకొచ్చిన స్థలంలో మా నాన్న పింఛను సొమ్ముతో అరకొరగా ఇంటిని నిర్మించిన నేను తెలివితక్కువవాడినో?
ఆ ఇంటికి ఇప్పుడు రూ. 3500 అద్దె వసూలు చేస్తో తెలివిగలవాడినో నేనయితే తేల్చలేను సుమా!
అయితే ఇతరుల కన్నా తొలినుంచీ వెయ్యి రూపాయల నుంచి రూ. 2000 దాకా తక్కువకే ఇంటిని అద్దెకు ఇచ్చిన నన్ను మాత్రం మా వాళ్లు ఒఠ్ఠి తెలివి తక్కువ దద్దమ్మగానే చూస్తారు. కొందరు గడుసులు నా ముఖానే అనేస్తారు కూడా నండోయ్! నన్ను ఐదేళ్ల పాటు మాటలతో బురిడీ కొట్టించి రూ. 1200 మాత్రమే అద్దె చెల్లించిన ఆయర్వేద వైద్యుడు ఖాళీ చేయటంతో ఇంటికి ఇటీవల మరమ్మతులు చేయించే సందర్భంగా తెల్లోడి సూత్రం, మనోడి బెదిరింపూ నిజ్జంగా నిజమేనని తేలింది.
ఇరవై వేలతో పనులు పూర్తవుతాయని దిగితే రూ. 75 వేల దగ్గర తేలటం మొదటి తెలివితక్కువ.
వారం రోజులు సెలవు పెట్టి ఒంగోలు వెళ్లిన నేను మొదటి మూడు రోజులూ చిన్నపాటి పనిని కూడా చేయించలేకపోవటం రెండో తెలివితక్కువ.
ఐదు వేల రూపాయలతో సన్‌షేడ్ వేసిన గంటలోనే కురిసిన వర్షానికి అదంతా నా కళ్లముందే నేలకూలటం తెలివి తక్కువతనానికి మూడో నిదర్శనం.
రెండు వేల ఇటుక ఖరీదు రూ. 5700 మాత్రమే ఉండగా బంధువు నా దగ్గర రూ. 6200 వసూలు చేసినా కిమ్మనకుండా ఉండటం నాలుగో తెలివి తక్కువతనం.
కేవలం ఐదు గంటలపాటు ఇటుకలు, ఇసుక మోసే పనికి ఒక్కొక్కరికి రూ. 300 చొప్పున చెల్లించటం ఐదో తెలివితక్కువతనం.
వీటన్నింటికీ మించి పక్కింటోడు బెత్తెడు స్థలం కూడా లేకుండానే కిటికీలు పెట్టినా మౌనంగా ఉన్నాను చూడండి తెలివితక్కువకు మహా నిదర్శనం. మంత్రిగారికి దగ్గరి బంధువని చెప్పుకునే ఇంకొకడు నా స్థలాన్ని జానెడు అక్రమించినా కనీసం అడగక పోవటం మహామహా తెలివితక్కువ తనానికి భలే ఉదాహరణ. వాడే మూర ఆక్రమించి నా స్థలంలో ఓ స్తంభాన్ని కట్టాడు. ఇదీ నా తెలివి తక్కువ తనమే. అంతేనా వాడు తన ఇంటిని కట్టుకుంటూ విసిరిన ఇటుకల దెబ్బకు నాలుగుసార్లు మా నీళ్ల గొట్టం పగిలిపోతే నా జేబునే ఖాళీ చేసుకుంది కాక నేను తెలివితక్కువవాడినని టముకు వేసుకుంటున్నాను చూడండి. దీనికి మించిన తెలివి తక్కువ తనం ఉండనే ఉండబోదని మా ఇంటి కొత్తగోడను గుద్ది మరీ ఒప్పుకోక తప్పదు.
ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం మరొక డజను తెలివితక్కువతనపు ఉదాహరణలను అవలీలగా రాయగలను. కానీ అలా రాసేస్తే నా బుర్రలో కనీసం మట్టయినా ఉందా? లేక ఇంతవరకూ ఎవ్వరూ వ్యాఖ్యానించని పదార్థమేదయినా ఉందా? అని అందరూ హాశ్చర్యపోయే ప్రమాదం ఉందని కొద్దిగా తెలివి ప్రదర్శించాను లెండి. అవునూ మనలో మన మాట ఎలా ఉంది నా తెలివి!
Archive for ఆగస్ట్, 2010
19 ఆగ
తెలివి తక్కువోళ్లు ఇంటిని నిర్మిస్తారు తెలివిగలోళ్లు అందులో నివశిస్తారు
18 ఆగ
మరోమారు అచ్చుకు సిద్ధమవుతున్న తెలుగిల్లు
”పదివేలో, పదిహేను వేలో మీ ఇష్టం ఎంత కావాలో తీసుకోండి. మంచి పనికి నా వంతు సహాయం చేయకపోతే అంతకన్నా అన్యాయం ఏముంటుంది? అన్నారు ఒంగోలు కేబీ రెస్టారెంట్ అధినేత గోరంట్ల పెద్ద వీరయ్య. తెలుగిల్లు మూడో సంచికను అచ్చొత్తించే పనిలో హైదరాబాదు నుంచి ఒంగోలు వెళ్లిన నేను ఆయనను ఆగస్టు 16వ తేదీన కలిశాను. ”అవునూ, రూ. 20 వేలు ఇవ్వొచ్చుగా?” నా ప్రశ్నార్థక సూచన. ”అలాగే, ఎప్పుడూ అడిగినవాడవు కాదు. నోరు తెరిచి అడిగిన తర్వాత కాదనటం ఎట్లా? అంటూ వెంటనే మద్దతు పలికారాయన. ఈ సందర్భంగా పర్యావరణకు సంబంధించిన చర్చ దూరింది. రోజూ కేబీ రెస్టారెంట్ల నుంచి వందల సంఖ్యలో ప్లాస్టిక్ కవర్లు వినియోగంలోకి వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ వాటి వలన పర్వావరణకు జరుగుతోన్న నష్టాన్ని వీలయినంత మేర తగ్గించేందుకు తన వంతు కృషి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆయన కోరిక వీలయినంత త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను. జనాభా సమస్యకు తనవంతుగా పెద్ద వీరయ్య తీసుకున్న పరిష్కారాన్ని ఈ సందర్భంగా మిత్రులకు గుర్తుచేశాను. దాదాపు పదేళ్ల క్రితం ఆయన నోట విన్నానావిషయాన్ని. తనకు వివాహం కాకముందు తొలిసారి చెన్నై (అప్పుడు మద్రాసు) వెళ్లిన సందర్భం అది. చీరాల్లో రైలెక్కారు. రైలంతా కిటకిట. ఒకటే జనం. మద్రాసు సెంట్రల్‌లో దిగారు. ఫ్లాట్‌ఫాం అంతా జనం. ఒకటే జనం. కాలుతీసి ముందుకు పెట్టలేనంత ఒత్తిడి. చేతనున్న సూట్‌కేసును చేతుల వెంట లాక్కోలేనంత ఇరుకు. చివరకు సూట్‌కేసును నెత్తిపైకి తీసుకుంటేగానీ కొద్దికొద్దిగానయినా ముందుకు కదలలేని పరిస్ధితి. అప్పుడే ఆయన మదిని అధిక జనాభా సమస్య తొలిచింది. ఏమయినా సరే ఒక్క బిడ్డతోనే సరిపెట్టేకోవాలని 19 ఏళ్ల పెద్ద వీరయ్య ఆనాడే నిర్ణయించుకున్నారు. తన నిర్ణయాన్ని ఆచరించి చూపారు తర్వాత. ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇప్పటికి దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే ఒకే బిడ్డతో ఆయన సరిపెట్టుకున్నారు. తగినంత ఆస్తిపాస్తులున్నా, తనకు వారసుడు లేడని పలువురిలా ఆయన స్వార్థానికి పోలేదు. అదీ ఆయన దేశభక్తి. సరే, తెలుగిల్లు పత్రిక విషయానికొస్తే, ఇప్పటికి రెండు పత్రికలు విడుదలయ్యాయి. ఆగస్టు నెలాఖరులోగా మూడో పత్రికను అచ్చొత్తిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. ఒంగోలుకు చెందిన నా మిత్రుడు మారెళ్ల సుబ్బారావు తండ్రి వెంకటేశ్వర్లు ఏడో వర్ధంతి సందర్భంగా వైద్య సంబంధిత విషయాలతో తెలుగిల్లును ప్రచురించాలని నిర్ణయించాము. అచ్చు ఖర్చులకుగాను ఒంగోలు మిత్రులు కొందరు ఆర్థిక సాయం అందజేసేందుకు హామీ ఇచ్చేశారు. వారి సాయంతోనే ఒంగోలు పట్టణంలో ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బ్లాగు మిత్రులు ఎవరయినా తమ రచనలు పంపితే ప్రచురించేందుకు పరిశీలించగలము. సమాజానికి హాని చేయని ఏ రచననయినా పంపవచ్చు. పంపుతారు కదూ?
17 ఆగ
ఉచితంగా ఇస్తే అమృతమూ విషమే
”ఎంకటసుబ్రావ్, దగ్గు మందు ఒహటియ్యి”
అభ్యర్థించాడు ఉపాధ్యాయుడు చిలుకూరి వెంకయ్య నన్ను.
”డాక్టరు గారికి చూపించుకో, ఒకటికి రెండు ఇస్తాను” సలహా ఇచ్చాను.
ఉచిత వైద్య శిబిరాన్ని ముగించి వాహనం ఎక్కబోతోన్న డాక్టర్ ఎం కృష్ణారావు చెంతకు గబగబా పరుగెత్తి తన బాధను వివరించాడు వెంకయ్య,
కాఫ్ సిరప్ … 1 అని రాసి వెంకయ్య చేతిలో పెట్టారు డాక్టర్ కృష్ణారావు.
దాన్ని చూసి రెండు దగ్గుమందు సీసాల్ని వెంకయ్య చేతిలో పెట్టీపెట్టగానే…. ”ఏందీ, చెత్త మందులా ఏందీ? ఒకటడిగితే రెండిచ్చావు” అంటూ వ్యంగ్యంగా నవ్వాడు వెంకయ్య.
”పంతులుగారూ, పార్క్-డెవిస్ కంపెనీ చెత్తదో, మంచిదో నువ్వే తెలుసుకో, ఆ తర్వాత ఎన్ని విమర్శలయినా చెయ్యి ఒప్పుకుంటాను. కానీ తొందరపాటు మంచిది కాదు. ఒకటికి రెండు ఎందుకిచ్చావంటావా? చైన్‌స్మోకర్లకి ఒకటికి రెండు కాదు నాలుగు మందులు తాగినా దగ్గు తగ్గటం అనుమానమే. మిత్రుడువని రెండిచ్చాను.” అంటూ వివరించటంతో తలదించుకుని వెళ్లిపోయాడు వెంకయ్య పంతులు.
మనస్తత్వాల విశ్లేషణకు ఉపకరిస్తుందన్న భావనతో ఆగస్టు 15న నా జన్మభూమి ఈదుమూడి(ప్రకాశం జిల్లా)లో మా నాన్న పేరిట ఏర్పాటు చేసిన కావూరి కోటేశ్వరరావు పంతులు స్మారకార్థ సంస్థ (కాకోరాస్మాసం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో చోటుచేసుకున్న సంఘటనను ప్రస్తావించాను.
మరో సంగతి…
”హలో, వెంకటసుబ్బారావుగారేనా?” ఒంగోలు అమ్మ కంటి ఆసుపత్రి పీఆర్వో తాటికొండ వీర వసంతరావు నుంచి ఫోను.
”వసంతరావుగారూ, నేనే, చెప్పండి.”
”కంటి ఆపరేషన్ల కోసం మీరు తీసుకొచ్చిన 12 మందిలో సోమయ్యంట తెగ గొడవ చేస్తున్నాడండి. మీరు వెంటనే రావాలి సార్” తాడికొండ అభ్యర్థన.
”అసలేమి జరిగిందండీ” ప్రశ్నించాను.
”ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసేవారందరి దగ్గరా, మా స్టాఫ్ 50 రూపాయలచొప్పున తీసుకుంటారండీ. మిగతా 11 మందీ ఇచ్చారు సార్, ఈ సోమయ్య మాత్రం ఇవ్వనని గొడవ చేస్తున్నాడు. అవసరమయితే ఇంటికి తిరిగిపోతానుగానీ, డబ్బులు మాత్రం చచ్చినా ఇవ్వనంటున్నాడు” వివరించారు తాటికొండ.
”వాళ్లు కటిక పేదలండీ, ఇచ్చినవాళ్ల దగ్గర తీసుకోండి. ఇవ్వని వాళ్లను వదిలేయకూడదూ? సలహా ఇచ్చాను.
”అట్ల వదిలేయటం మొదలు పెడితే, మాకు ఒక్కరు కూడా ఇవ్వరండి. మేము చెంగేసుకుని పోవాల్సిందే.” కోపం ధ్వనించింది ఆయన గొంతులో.
”సరే ఒక్కరేకదా ఇవ్వాల్సింది. అదేదో నేనే సర్దుబాటు చేస్తానులెండి” రాజీ ప్రతిపాదన చేశాను.
”అట్లయితే సరేలెండి, అయినా మీరొకసారొచ్చి, సోమయ్యకు బుద్ధి చెప్పాలి”
”సరేలెండి, ముందు ఆపరేషన్లు మొదలు పెట్టండి. నేను పనిచూసుకుని ఆసుపత్రికొస్తాను.” సముదాయించి ఫోను పెట్టేశాను.
ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని నాతో ఒప్పందం చేసుకుని కాకోరాస్మాసం నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్న అమ్మ కంటి ఆసుపత్రి పీఆర్వో తీరిది. ముడుపులు ఇవ్వననటం గోలంటాడు.
అంధత్వ నివారణ సంస్థ నిధులతో నిర్వహిస్తోన్న కార్యక్రమం ద్వారా లాభాల మూటలు పోగోసుకుంటూ కూడా పేద రోగులపై నిర్వాహకులు దాష్టీకం చేస్తున్నారు.
వాస్తవానికి కంటి శస్త్ర చికిత్స చేయించుకోదలచిన వారిని వారి ఇంటి నుంచి ఆసుపత్రికీ, ఆసుపత్రి నుంచి వారింటికీ తీసుకుపోయి, తీసుకువచ్చేందుకుగాను సంస్థే వాహనాన్ని సమకూర్చాలి. రోగులకు భోజనమూ, ఉపాహారాన్నీ ఉచితంగా అందజేయాలి. అదే విధంగా అవసరమయిన మందుల్నీ ఉచితంగానే ఇవ్వాలి. కానీ ఇదేమీ ఆ సంస్థ చేయటం లేదు. అంటే చేస్తున్నట్లు నివేదికల్లో రాసుకుని నిధుల్ని మింగుతారన్నమాట. దీనికితోడు కంటిలోపల అమర్చే అద్దాన్ని కూడా చెప్పినదానికన్నా తక్కువ ఖరీదుది వినియోగించి దానిలోనూ మిగుల్చుకుంటున్నారు. తొలివిడతగా శస్త్రచికిత్సలు చేయించిన 12 మందికీ నా సొంత ఖర్చుతో భోజనం ఏర్పాటు చేశాను. రోగులే సొంతంగా బస్సు ఛార్జీలు భరించి ఒంగోలు వెళ్లివచ్చారు. ఇదీ పేదల పథకాల అమలు తీరూతెన్ను.
అన్నట్లు ఉచిత వైద్య శిబిరంలో మా గ్రామస్తులు 500 మందికి వైద్య సేవలు అందుకున్నారు. మధుమేహ నిపుణులు ఎం కృష్ణారావు, దంత వైద్యులు వేమూరి సురేష్, కంటి వైద్యులు రత్నం, శ్రీదేవి శిబిరంలో వైద్య సేవలు అందజేశారు. కాకోరాస్మాసం ఉచితంగా మందులు అందజేసింది. మధుమేహపరీక్షల్ని కూడా ఉచితంగా చేయించింది.
12 ఆగ
పియాతిపియమైన నా బిడ్డలారా! ఇనండి నా వ్య(క)థ!!
”నా అరవైనాలుగో పుట్టినరోజు సుబాకాంక్సలు తెలిపిన పియాతిపియమైన నా బిడ్డలందరికీ నెనరులు సెబదామని మీ ముందుకొచ్చిన. అంత మాతరాన వక్కముక్క సెప్పిపోదలసుకోలా. ముక్కెమయిన నాలుగు ఇసయాలు సెప్పుకోనీండి మరి.
పెపంచకంలో అందరిమాదిరిగానే నా పుటకలో తేడా లేదు. అయితే ఆదిమజాతి తరవాత పుట్టిన నా బిడ్డలు బెంబాండమయినోల్లయినందున నన్ను బెంబాండంగా ఎదగదీశారు. సిందునది పెరీవాహకంలో ఎగసాయం అదీ సేత్తా బాగా ఎదిగిపోయారు. నాగరికత నేరుసుకున్నారు. సిందునది నాగరికత అని పెపంచకంలోవాల్లందరూ పిలిసేవాల్లులే. అట్టెందుకని పిలిసేవాల్లో ఆనాటి సంగతులు కొన్ని సెబుతా. నీల్లను కాలవలుదీసి పొలాల్ని తడిపి ఎగసాయం సేసేవాల్లు. పంటలు బాగా దిగబడయ్యేవి. సేతినిండా లచ్చిముంటే ఇంకేముంది, సక్కటి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఊరి పేరు మెసపుటోనియాలే. అన్నట్లు మొదట ఈదుల సంగతి సెబతా. ఒక్కోటీ ఎంతుండేదనుకుంటన్నారూ, వందేసి అడుగులుండేది. నా కూతర్లందరూ బంగారపు నగలు దిగేసుకుని తిరిగేవాల్లు. ఒకరెక్కువ లేదు, ఒకరు తక్కువా లేదు. అందరూ పనిసేసేవాల్లు. వచ్చినదాన్ని అందరూ కలిసి పంచుకునేవాల్లు. అట్టుండేదారోజుల్లో. అట్టా అట్టా సాగితే ఇంకేముంటది సెప్పుకోవటానికి. మన కండమే, ఆసియా మద్దె ప్యాంతంలో పెద్ద కరువొచ్చి తండోపతండాలుగా వాల్ల ఆవులయ్యీ తోలుకోని ఆరుయులంట వాల్లొచ్చినారు. ఆరుయులో, ఆకతాయిలో వచ్చినందుకు నాకు బాదేమీ లేదు. సమస్యల్లా, నా బిడ్డలమీద దాడి సేసారు. ఊల్లకు ఊల్లనే నాశనం సేసేసినారు. మెసపుటోనియానయితే అగ్గిపాలుసేసేసారు. కాలవల గట్టుల్ని తొలగించినారు. అడ్డం పడి రచ్చించుకోబోయిన నా బిడ్డల్ని నిలువునా నరికిపోగులేశారు. నల్లోలని సీదరించుకున్నారు. ఎండనక, వాననక పనిసేసేరకవని ఈసడించుకున్నారు. నా దవిడ జాతిని రచ్చించుకో పెయత్నించిన వాల్లందర్నీ రాచ్చసులని పేరుబెట్టారులే. వాల్లంతా దురమారగపోల్లని కతలల్లారు. అబద్దాల కతల్ని తాటాకులమీద రాసేసినారు. సివరాకరికి బతికున్న నా దవిడ జాతి బిడ్డలందరినీ కొట్టి, ఇప్పుడు దచ్చాది అంటారే ఇటేపుకి తరిమేసినారు. ఉత్తరాది ప్యాంతాన్ని ఆరుయులు ఆక్రమించుకున్నారు బిడ్డలారా! సరే అందరూ నా బిడ్డలేనని మనసును దిటవు సేసుకున్నా. నా సొంత బిడ్డలు తరవాత్తరవాత ఇడిపోయి నాలుగు కుటుంబరాలు పెట్టుకున్నారు. అన్నట్టు కొత్త బాసలు కూడా నేరుసుకున్నారులే. గోదారి, కిట్న, గుండలకమ్మ నదుల పెక్కనా, నల్లమల అడవి ప్యాంతంలో ఇల్లేసుకుని తెనుగు మాటలాడే నా బిడ్డల్ని తెలుగోల్లని అన్నారు. తెలుగోల్లలో యానాదులే తొలితరం బిడ్డలు. వాల్లకు ఎన్ని తెలుసనుకుంటన్నారు!. బాస బాగా వచ్చేది. ఆకులు అలమలతో ఎంత వైదగం నేరుసుకున్నారో! అబ్బో వాటిని మల్లీ ఎలికితీత్తే ఇదేశాలనుంచి తెచ్చుకుంటన్న ఔసదాలు అయ్యీ పనేలేదనుకోండి. తెనుగు బాసలో అది లేదు, ఇది లేదని ఆంగలమో అదేదో మాటలాడతుండారు సూడండి. ఎరకలోల్లని పిలిసి ఒక్కసారి కదిలించి సూడండి. సంగతలన్నీ వాల్లదగ్గరుండాయి.
ఆ తరవాత రోజుల్లో రాజులొచ్చినారు. నా రంగప్పల సెమను ఆరగించటం తప్ప వాల్లకింకేమీ పని ఉండేది కాదు. అన్నట్టు యుద్దాలు సేసేవాల్లనుకోండి. అయితే ఇసిత్రం సూడండి. రాజులు రాజులు కొట్టుకుంటన్నా, నా గ్యామాలు సురచ్చితంగా ఉండేయి. కులవని, కలవగూడదనీ, బ్యామ్మలనీ, సూదురులని కొన్ని బయంకరమయిన సమస్యలున్నా, సొయంపోసితంగా ఉండేయి. తయారు సేసిన సామగ్రిని మారిపిడి సేసుకుని నా బిడ్డలు బతికేవాల్లు. తెల్లోల్లు వచ్చినతరవాత మల్లీ మారుపొచ్చింది. నా బిడ్డలు కట్టపడి పండించిన పత్తినీ, సెమటోడిసి బూదేవి పొట్టసీలిసి ఎలికితీసిన కనిజాలనీ వాల్ల దేశం తీసకపోయారు. నా బిడ్డలు నేసిన బట్టల్ని పాడుసేసి వాల్లు మిల్లుల వస్తరాల్ని అమ్మి సొమ్మెత్తకపోయెటోల్లు. అంతెందుకు బిడ్లలారా! ఉప్పుమీదకూడా పన్నేసి దండుకున్నారు. తెల్లోల్ల దురాగతాలు సూడలేకే గదా, నా కడగొట్టుబిడ్డ బగతుసింగు ఎదురు తిరిగింది. ఎంత సురుకయిన బిడ్డో, తలపకొస్తేనే కళ్లమ్మట ఒకటే నీల్లు. వాడు బతుకుంటేనా, నేను ఇట్టుండేదాన్నా? సుబాసు బాబు… అబ్బో వాడిని గురించి ఎక్కవ సెబితే నా ఉసురు తగులుద్ది. రామరాజు అడవి బిడ్డల్ని కలిపేసుకుని ఎంత యుద్దం సేసినాడు తెల్లోల్లతో. తరవాత తరవాత సెప్పుగోదగిన నా బిడ్డల్లో సుందరయ్యే. తెల్లోల్లు ఎల్లిపోయిన్తర్వాత రాజసబకు ఎట్టబోయినాడే తెలసా? అందరూ అప్పటికే కార్లలో పోతంటే నా బిడ్డ మాత్తరం సైకలేసుకుని పోయెవాడు. సుందరయ్య సేతుల్లోకి నన్ను బెట్టుంటే ఎంతబాగా బతికేదాన్నో, అయినా నా కరమకాకపోతే, నా బిడ్డేననుకో కాంగిరెసుగాడిని గురించి సెడ్డగా సెప్పాలిసి వత్తంది. వాడిని ఎవరూ దగ్గరసేరనీయమాకండి. వాడు దొంగ, వాడొక ఖూనీకోరు. ఎన్నెన్ని అత్తియాచారాలు సేసినాడో! వాడిదగ్గర లేని సెండాలం లేదనుకోండి. బిడ్డలారా! జాగరత. ఇంకొంతమంది నా పేరు కూడా జత పెట్టుకుని మతవని మీ దగ్గర కొత్తారు. దేవుడిని బజారకీడసవద్దన సెప్పండేం. అన్నట్టు మీకు తెలవంది ఏముంది బిడ్డలారా! కొన్ని కొన్ని ఇసయాలు మీకు గురుతుసేసానంతే. సిట్టసివరగా ఒక్కమాట సెబుతా. సేతులెత్తి దండం పెడతా! నన్ను మల్లీ ఒక్కసారి ఇముక్తిరాలిని సేయండి. ఉప్పును ముందుబెట్టి సొసంతరం తెచ్చుకోని ఆ ఉప్పునుగూడా విదేశాలకి ఇచ్చేత్తన్న పాలకుల నుంచి నన్ను బంద ఇముక్తిరాలిని సేసేయండి బిడ్డలారా! అప్పటిదనకా నాకు ఎన్ని పుట్టిన రోజులొచ్చినా సంతోసం లేదు. సంతురుపితి లేదు. ఇంకే సంగతులూ నాకొద్దు. నన్ను ఇముక్తి సేసేయండి. ఇదొకటే కోరిక.
10 ఆగ
అమెరికా … భూతల స్వర్గం కాదు – భూతాల నరకం
భూలోక స్వర్గమని కొందరు అభివర్ణించే అమెరికా వ్యవస్థ వాస్తవానికి మేడిపండు చందమని ఆ దేశ ప్రభుత్వ లెక్కలే పట్టిచూపుతున్నాయి. వందలాది మూడో ప్రపంచ దేశాలను దోచుకున్న సొమ్ముతో మిలమిలా మెరిసిపోతోన్న అమెరికాలో విద్యార్థులపై నానాటికీ పెరుగుతోన్న పీడనే వాస్తవ పరిస్థితిని పట్టిచూపుతోంది. ఆ దేశ ప్రాథమిక విద్యారంగ స్థాయిలో చోటుచేసుకుంటున్న హింస, పౌర రంగానికి ఏమాత్రమూ తీసిపోదు. సాంస్కృతిక అరాచకత్వం ఆదేశంలో టీవీల, సినిమాల రూపంలో విద్యార్థుల భవితకు చేటు తెస్తున్నాయి.
85 శాతం పాఠశాలల్లో దొంగతనంగానీ, హింసాత్మక సంఘటనగానీ చోటుచేసుకుంటున్నట్లు ప్రభుత్వ లెక్కలు విదితం చేస్తున్నాయి.
కనీసం ఏటా 20 శాతం పాఠశాలలపై రౌడీ మూకలు దాడులు చేస్తున్నారు.
2007 విద్యా సంవత్సరంలో 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయస్సున్న విద్యార్థుల్లో 32 శాతం మంది వేధింపులకు గురయ్యారు.
తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివే విద్యార్థుల్లో 29 శాతం మంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు.
పాఠశాలల్లో జరిగే గొడవలకు వారానికి కనీసం ఒక్కరన్నా ఆసుపత్రులపాలవుతున్నారు.
ఉన్నతపాఠశాల విద్యార్థులు ప్రతి ఐదుగురిలో ఒకరి దగ్గర మారణాయుధం ఉన్నట్లు ఓ పరిశీలన తేల్చింది.
ఏ రోజు పరిశీలించినా కనీసం రెండు లక్షల మంది విద్యార్థుల వద్ద తుపాకులు దొరుకుతున్నట్లు తేల్చారు.
కనీసం 21 శాతం మంది ప్రాథమిక విద్యార్థులు సరదాగా ఏడిపించే ఆకతాయిల వేధింపులకు గురవుతున్నారు.
18 మంది విద్యార్థులు పుకార్ల కారణంగా మానసిక వేధింపులకు గురవుతున్నారు.
11 శాతం మంది విద్యార్థులు తోపులాట, కొట్లాట, ఉమ్మటం, తిట్లకు గురవుతున్నారు.
9 ఆగ
చౌడమ్మతో పాలనే కాదు … విషాన్నీ తాగించవచ్చు
నిరుటిలా మళ్లీ కానీకు నేస్తం
చవితి వస్తోంది
వస్తోంది – వస్తోంది
పిల్లలూ తొందరపడండి!
మీమీ పాలు మీరే తాగేయండి !!
లేకుంటే పోయినేడు రుచిమరిగిన ఎలుక వాహనుడు
‘తలతన్యత’ ఆధారంగా పాలన్నీ పీల్చేయొచ్చు
బొంబాయి గణేశుడి ఫోనందుకుని
బొబ్బేపల్లి వినాయకుడూ పాలను తాగేయొచ్చు
అందుకే పిల్లలూ!
మీ మీ పాలను మీరే తాగేయండి!!
ఆనక హమెరికాలోనూ – హయిర్లాండులోనూ హదే జరిగిందని
హూంకరించి మరీ పేపరోళ్లు పంచరంగుల్లో వార్తలు రాసేస్తారు మరి
అందుకే పిల్లలూ మీ మీ పాలను మీరే తాగేయండి తొందరపడి!
కవిత పేరిట రాసిన దీంట్లో ఎంత కవిత్వం ఉందో నాకు తెలియదు.
1996 సెప్టెంబరులో దీన్ని రాశాను. ఆ రోజుకు సరిగ్గా ఏడాది క్రితం వినాయకుడు పాలు తాగాడన్న వార్త దేశ, విదేశాల్లో రాజ్యమేలింది. ఓ రాజకీయపార్టీ ఈ తతంగాన్ని నేర్పుగా నడిపిన దాఖలాలు తర్వాత వెల్లడయ్యాయనుకోండి. మరుసటి ఏడాది వినాయక చవితి రాబోతున్న సమయంలో నా మెదడు కణాలు చెకచెకా కదిలి ఈ కవిత?ను కుమ్మరించాయి.
ఇది కవిత కాకపోతే పోయిందిగాక! దాన్నలా ఉంచుదాం.
అనంతపురం జిల్లా ధర్మవరంలో చౌడేశ్వరీ మాత సోమవారం ఉదయం నుంచీ ఆవుపాలను గటాగటా చెంచాలతో తాగేస్తోందని తెగులు (క్షమించాలి- తెలుగు అని రాయాల్సింది లెండి) టెలీవిజన్లలో చూసి ఆనాటి నా రాతల్ని గుర్తుకు తెచ్చుకున్నాను. సాధారణంగా దాదాపు పగలంతా వార్తా ఛానళ్లకు కళ్లప్పగించి ఉండే నేను ఈ రోజు రాత్రి 12 గంటల వరకూ వాటివైపే చూడలేదు. పొద్దుగూకుతున్న సమయంలో మాత్రం ఓ టీవీ సమీపంలో నేను ఉన్నందున నిర్థిష్టంగా కాదుగానీ, ఎక్కడో విగ్రహం పాలు తాగుతుందని యాంకరమ్మ బుసకొడుతూ, రొప్పుతూ చెబుతుండగా నా చెవినబడింది.
దీంతో నేను స్పందించి దినపత్రికల తాజా వార్తలను అన్వేషించాను. ఈ పురాతన వ్యవహారం వివరాలేమన్నా దొరుకుతాయేమోనని. వెతికితే ఎవ్వరూ పెట్టినట్లు కనపడలేదు. ఈ వ్యవహారాన్ని వింత అని సాక్షి టీవీ వ్యాఖ్యానించటంతోనే నాకు వాంతి వచ్చినంత పనయింది. చౌడేశ్వరీ మాత ఉదయం నుంచీ అదేపనిగా చెంచాలతో పాలు తాగుతూనే ఉందంట! (ఎందుకమ్మా పూజారికి పెద్ద లావు పని పెట్టావు?) అందులోనూ ఓ భక్త్తుడు చెబుతున్నదాని ప్రకారం, అతనికి అమ్మవారు గత రాత్రి కలలోకి వచ్చి ఆవుపాలు తెమ్మని చెప్పిందంట! ఆవుపాలు తెమ్మంటే ఆశ్చర్యపోయాడంట! అబద్ధాలకయినా అంతుండొద్దూ?! దేవుళ్లకి ఆవుపాలుగాక గేదెపాలు ఎక్కడన్నా? ఎప్పుడన్నా వాడే సంప్రదాయం ఉందా? నాకు తెలిసినంత వరకూ లేనేలేదు. కాకపోతే ఆవుపాలు లేకపోతే గేదెపాలు వినియోగించి సర్దుబాటు చేసుకోవటం అంటారా! ముమ్మాటికీ ఉంటుందని ఒప్పుకుంటాను. కాబట్టి సదరు భక్తాగ్రేసరుడు ఏదో లబ్ధి ఆశించే అమ్మ తన కలలోకి వచ్చిందని టీవీలకు ఎక్కాడని నా వాదన. ఈ రెండో అంశాన్నీ పక్కనుంచుదాం.
మూడో అంశానికొస్తే అమ్మవారు చెంచాతోనే పాలు తాగటం ఎందుకో? ఆవు పాలు తాగాలని భారీ కోరిక కలగటమే నిజమయితే ఎవరయినా? అలా నెమ్మదిగా చెంచాలతో పాలు తాగుతారా? నేనయితే మాత్రం ఎంత ఎక్కువ వీలయితే అంత భారీ మొత్తాన్ని ఒకేసారి పొట్టలోకి చేర్చేందుకు తాపత్రయ పడతాను.
అయితే ఇక్కడే ఉంది మతలబు.
అదే తలతన్యతా సూత్రం.
కొసను పట్టుకు ఎగబాకే ద్రవపదార్ధ లక్షణమే తలతన్యతా సూత్రం. చెంచాలో నిండుగా పాలుపోసి చౌడమ్మ మూతి దగ్గర పెట్టగానే శాస్త్రానికి సహజంగానే రెక్కలొస్తాయి. అంటే తలతన్యతా సూత్రం పనిచేయటం ప్రారంభిస్తుందన్నమాట. అంటే పాలు అనే ద్రవపదార్ధం చౌడమ్మ మూతి వాలును ఆధారం చేసుకుని ఎగబాకుతాయి. ఎగబాకిన పాలు సహజంగానే నేలపాలవుతాయి. ఇక్కడా అదే జరిగి ఉండాలి తప్ప మరొకటి కానేకాదు. ఎంతసేపటికీ చౌడమ్మ మూతి దగ్గర ఖాళీ అవుతోన్న చెంచాను చూపటం తప్ప పరిసర ప్రాంతాలనుగానీ, నేలనుగానీ, దేవాలయం నుంచి బయటకు నీరు వెళ్లే కాలువనుగానీ, ఆ నీరు చేరే వీధిలో మురుగు నీటి కాలువనుగానీ టీవీ ఎందుకు చూపటం లేదో ఆలోచించాలి? అలా చూపితే కిటుకు బయటపడిపోతుందని దేవుడిపేరిట లబ్ధి పొందేవారికి తెలుసు కదా! గుట్టు రట్టవకుండా చూసుకోవలసిన బాధ్యత టీవీ యాజమాన్యాలకూ ఉంటుందన్నది వేరే విషయం అనుకోండి. అందువలనే కెమెరా కిందకు దృష్టి సారిస్తే జారిపోతోన్న పాలు కన్పించి తీరతాయి. నేలను చూపితే అక్కడ మడుగు కట్టిన పాలూ కన్పిస్తాయి.
దీన్ని నిరూపించే ప్రయోగాలు ఎవరికి వాళ్లమే చేసుకోవచ్చు. కోసుగా పెదవులున్న దేవత విగ్రహం, గుర్రం తోక, చేతి వేళ్లు, కోకోకోలా సీసా కోసు భాగం ఇలా దేన్నయినా తీసుకోవచ్చు. కొనదేరిన భాగం దగ్గర నిండుగా ఏదయినా ద్రవ పదార్ధాన్ని పోసిన చెంచాను ఉంచితే చౌడమ్మ చేసిన పనే ఇవీ చేస్తాయి. ఆఖరుకు విషాన్ని పెట్టినా గటగటా తాగేస్తాయి సుమా! చౌడమ్మ కూడా దీనికి మినహాయింపు కానేకాదు.
సత్యం పట్ల గౌరవమున్నవారెవరయినా, దేవత బొమ్మను తీసుకుని పాలు, తర్వాత నీరు, తర్వాత కోకోకోలా ఇలా ఒకదాని తర్వాత ఒకదానిని పెట్టి చూడండి. ఎంత సేపయినా, ఎంత ద్రవపదార్ధాన్నయినా తాగేస్తూనే ఉంటుంది. అయితే ఆ ద్రవపదార్ధం పెదవుల కిందుగా మెడ, పొట్ట, కాళ్లను ఆధారం చేసుకుని నేలకు చేరటాన్నీ చూడవచ్చు. మడుగూ కన్పిస్తుంది. అలా అలా కొన్ని ద్రవపదార్ధాలను తాగించిన తర్వాత ధైర్యం ఉంటే (సవాలు కాదు, వ్యంగ్యం అసలు కాదు సుమా) ఏదయినా ద్రవరూప విషాన్ని పెట్టి చూడండి. ఆ విగ్రహం దాన్నీ తాగేయటాన్ని గమనించండి. అలా జరగకపోతే, జరగలేదని ఎవరయినా నిరూపిస్తేః పలు శాస్త్రీయ వేదికలు ప్రకటించిన కోట్ల రూపాయల్ని ఎవ్వరయినా ఇట్టే కోట్టేయొచ్చు. పైగా తమతమ శాస్త్రీయ వేదికలను వాటి నిర్వాహకులు రద్దు చేసుకుంటారు. శాస్త్ర ప్రచారాన్ని ఉన్నపళాన నిలిపివేస్తారు. దేవుళ్లనూ, దేవతలనూ పూజించటం ప్రారంభిస్తారు. శాస్త్రం లేనేలేదని అంతా దేవుడి సృష్టేనని బహిరంగంగా ప్రకటిస్తారు. అప్పుడంతా దేవుడి మయం. ఏకశిలాసదృశ్యం. ఆస్తికవాదానిదే రాజ్యం. ఏమంటారు!?
8 ఆగ
దయ్యం గియ్యం … భయం గియం – డాక్టర్ వీ. బ్రహ్మారెడ్డి
వీ. బ్రహ్మారెడ్డి – జనవిజ్ఞానవేదిక తొలి అధ్యక్షుడు. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలోని పాపిరెడ్డిపాలెం గ్రామంలో పుట్టిన ఆయన ప్రస్తుతం ప్రముఖ వైద్య బ్రహ్మ. అయితే ఒకనాడాయనకు శవాలన్నా, దయ్యాలన్నా విపరీతంగా భయం. చిన్నప్పటి నుంచీ దయ్యాల కథలు వినీ వినీ అవంటేనే కలలో కూడా దడుసుకునేవాడు. అయితే శవాల్ని కోసి చదవాల్సిన ఎంబీబీఎస్‌ను ఆయన ఎలా పూర్తి చేశాడు మరి?? ఆయన మాటల్లోనే చదువుదాం.
నాకు దయ్యాలంటే మహా భయం. మా ఊళ్లో రచ్చబండ దగ్గర దయ్యాల కథల్ని పెద్దోళ్లు చెబుతుంటే వినేవాడిని. అలా దయ్యం కథ విన్నరోజు రాత్రి కల నిండా దయ్యాలే. అలాగని దయ్యాల కథల్ని వినకుండా ఉండలేకపోయేవాడిని. ఎవరయినా చనిపోతే ఆ ఇంటివైపు కనీసం నెలరోజులన్నా వెళ్లేవాడిని కాదు. శవాలన్నా, దయ్యాలన్నా అంత భయం.
శవాల్ని మా ఊరి బీడులో పూడ్చేవాళ్లు. బడికి సెలవొస్తే ఎద్దుల్ని మేపటానికి ఆ బీటికి పోయేవాడిని. మా ఎద్దులేమో, పాడెలకు చుట్టిన చొప్పను తినేందుకుశ్మశానంలోకి జొరబడేవి. వాటికి బాగానే ఉండేది. నాకేమో జ్వరం వచ్చినట్లు అన్పించేది. లోపలికి అడుగుపెట్టేవాడిని కాదు. శ్మశానమంటే దయ్యాల అడ్డా అనుకునేవాడిని. ఎడ్లను బయటకు రమ్మంటూ బిగ్గరగా అరిచేవాడిని. రాళ్లు విసిరి ఎట్లానో వాటిని బయటకు రప్పించి ఇంటిదోవ పట్టేదాకా చెమటలు పట్టేవి.
ఇదంతా కనిపెట్టిన మా పెద్దన్న ”ఒరేయ్, పరీక్ష ఒక్కసారి తప్పినా, ఎద్దులు కాచేపని ఒప్పజెబుతానులే” అనేవాడు.
దీంతో నాకు పరీక్ష తప్పితే ఏమవుతుందో అర్ధమయింది. ఎద్దులూ, శ్మశానమూ, దయ్యాలూ తప్పవని భయపడ్డాను. అందుకని బాగా చదివేవాడిని. పైగా దయ్యాలమీద భయంతో ఎస్‌ఎస్‌ఎల్‌సీ (11వ తరగతి) వరకూ లెక్కల మీద ప్రేమ పెంచుకున్నాను. ఎందుకంటే లెక్కలయితే ఇంజినీరు కావచ్చు. అదీ నా ఆశ. డాక్టరంటే శవాలు, దయ్యాలు అదీ నా భయం.
అయితే నా దురదృష్టం కొద్దీ 11వ తరగతి అయ్యేనాటికి ఇంజినీర్లు ఉద్యోగాలు లేక రోడ్లు కొలవటం ప్రారంభమయింది. అది తెలుసుకున్న మా పెద్దన్న బైపిసీ గ్రూపుతో పియుసి చేర్పించాడు. దయ్యం కంటే నేను జడుసుకునేది మా పెద్దన్నకే. ఇక తప్పదనుకున్నాను. వానపాముల్ని కోయటంతో మొదలు పెట్టి బొద్దింకలు, కప్పలు, చివరకు శవాలు కోయటం … అమ్మో చచ్చానురో అని భయపడిపోయాను.
నా దురదృష్టం కొద్దీ పియుసిలో మంచి మార్కులొచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలో ఎంబీబీఎస్ చేరేందుకు అవకాశం వచ్చింది. అప్పటికింకా ప్రవేశ పరీక్షలూ అవీ లేవు. మార్కులతోనే ఎంబీబీఎస్ సీట్లు కేటాయించేవాళ్లు. కర్నూలు అనేది ఒకటుందని కూడా తెలియని వాడిని వైద్య కళాశాలలో చేరిపోయాను.
ఎంబీబీఎస్ మొదటేడు శవాల కోత పనిలేదు. మళ్లీ బొద్దింకలు, కప్పలు, జలగలు … ఫర్వాలేదనిపించింది. అయినా ధైర్యం సంపాదించుకోవాలని బలమైన కోర్కె పుట్టింది.
ధైర్యం సంపాదించుకోవాలన్న కోర్కె రోజురోజుకూ బలపడింది. రెండో ఏడాది శవాలు వస్తాయిగనుక అప్పటికి ధైర్యం సంపాదించాలని అనుకున్నాను.
మొదటి సంవత్సరం సినిమాలు విపరీతంగా చూసేవాడిని. వారానికి మూడు, నాలుగు సినిమాలన్నా చూడాల్సిందే. రెండో ఆట సినిమా చూసి పెద్ద పార్కు (ఇప్పటి కిడ్స్ వరల్డ్) దగ్గరకు వచ్చేసరికి మనసులో ఒత్తిడి పెరిగిపోయేది. నాకు నిజంగా ధైర్యం ఉంటే పార్కు పక్కనుంచి హంద్రీ నది గుండా నేనుండే బుధవారపేట పోవాలని అనుకునేవాడిని. హంద్రీలో తొడలదాకా నీరు పారుతుండేది. అప్పటికింకా గాజులదిన్నె పథకం తయారవలేదు. అందువలనే అన్ని నీళ్లుండేవి. హంద్రీ నది దాటి బుధవారపేట వెళ్లాలంటే ఒక పక్క ముస్లిముల శ్మశానం, మరోపక్క క్రిస్టియన్ల శ్మశానం – వాటి మధ్యనుంచే వెళ్లాలి. కొన్ని లక్షల శవాలు, దయ్యాలు విశ్రాంతి తీసుకునే శ్మశానాలమీదుగా వెళ్లాలంటే గుండె దడదడలాడేది. ఎట్లాగో శ్మశానాలు దాటి బయటపడేవాడిని. మొత్తంమీద దయ్యాలు లేవని తేలేది. ”హమ్మయ్య ఈ రోజు పరీక్ష పాసయ్యాను” అనుకునేవాడిని.
ఆ దోవలో కాకుండా హంద్రీ వంతెన మీదుగా వస్తే వైద్య కళాశాల వచ్చేది. అక్కడకు రాగానే యధా ప్రకారం ”నాకు ధైర్యం, ఉన్నాట్లా? లేనట్లా??” ప్రశ్నించుకునేవాడిని. దాంతో ఒత్తిడి పెరిగిపోయేది. నన్ను నేను పరీక్ష చేసుకోవాలన్న కోరిక పెరిగిపోయేది. ఎడమవైపుకు తిరిగితే బుధవారపేట, కుడివైపుకు మళ్లితే మా కళాశాల. అయితే అక్కడకు రాగానే ఏదో దయ్యం ఆవహించినట్లుగా కళాశాల వైపుకే తిరిగేవాడిని.
నేరుగా అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) విభాగం వైపు వెళ్లే వాడిని. అక్కడ 10- 12 బల్లల మీద శవాలు పడుకుని ఉండేవి. ఆ పక్కనే ఫార్మలిన్ ద్రవం పోసిన పెద్ద సిమెంటు తొట్టిలో 40 శవాల్ని ఉంచేవారు. ఆ గది చుట్టూ ఓసారి తిరిగి ధైర్యం ఉందని నాకు నేనే చెప్పుకుని సంతృప్తిపడి బయటపడేవాడిని. శవాలు దయ్యాల్లా లేచి నన్ను ఏనాడూ భయపెట్టలేదు. అయితే నాకా సమయంలో కాపలాదారు గుర్తుకొచ్చేవాడు. అతను లేచి చూస్తే నన్నూ దయ్యం అనుకునేవాడనుకుంటూ నవ్వుకునేవాడిని. అయితే భయమేమోగానీ అతనూ శవాల గదికి ఆమడ దూరాన ఉండేవాడు.
ఇలా ఓ ఏడాదిపాటు ‘ధైర్యం’ తెచ్చుకోవటానికి ఎన్నోన్నో ప్రయోగాలు చేశాను.
చివరకు అర్ధమయిదేమిటంటే … శవాలతో ప్రమాదం లేదని. శవాన్ని పూడ్చితే మట్టిలో కలిసి పోతుంది. కాలిస్తే గాలిలో కలిసిపోతుంది. ప్రమాదం ఉంటే గింటే బతికున్న వాళ్లతోనేనని.
8 ఆగ
ఓ ప్రసాదు … ఇద్దరు తాగుబోతులు … ఈదుమూడి గ్రామం
అవును, నా చిన్నప్పుడు అంటే ముప్పై ఏళ్ల క్రితం సంగతనుకోండి, మా గ్రామంలో ఇద్దరే తాగుబోతులుండేవారు. తాగుబోతులంటే వాళ్లేదో తప్పతాగి రోజంతా వీధుల్లో దొర్లుతూ ఉండి ఉంటారనుకునేరు! అదేమీ కాదు. ఎప్పుడో… ఏ పండక్కో తాగేవాళ్లు. కాకపోతే తక్కువ తాగేవాళ్లకోసం మరో పదం లేక అలా రాయవలసి వచ్చిందంతే. తాగినా ఇంట్లో పడుకునేవాళ్లు. అయితే సంక్రాంతి రోజున మాత్రం వాళ్లు బయటపడేవాళ్లు. చెరువులో తెప్ప ఊరేగింపు జరిగేదప్పుడు. ఆ ఉత్సవం కోసం ఊరుఊరంతా చెరువు దగ్గర చేరేది. నిండా ఉత్తేజం, ఉత్సాహం, ఉల్లాసంతో నిర్వహించే ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం సాధ్యంకానిపని. అందువలన ఇద్దరు తాగుబోతులు కూడా చెరువు కట్టమీద చేరేవాళ్లు. సహజంగానే వారిలోనూ ఉత్సాహం పెచ్చరిల్లి ఎవరితోనో గిల్లికజ్జాలకు దిగేవాళ్లు. ఊరంతటికీ అదో ఉత్సాహం. అదో వార్త. అదో చర్చనీయాంశం. వాళ్లను ఇళ్లకు లాక్కుపోయేందుకు బంధువులు తెగ ప్రయత్నాలు చేసేవాళ్లు. ము..లం…కొ..ల్లారా అంటూ పెద్దలు తిడుతుంటే, వాళ్లు మరింత రెచ్చిపోయేవాళ్లు. చివరకు ఎప్పుడో గొడవ సద్దుమణిగాక… ‘చెల్లియో చెల్లకో’ అంటూ కమ్మటి గొంతుకలతో పౌరాణిక నాటకాల పద్యాలు పాడి అందరికీ ఆనందం పంచేవాళ్లు.
తెల్లవారితే మళ్లీ మామూలే. ఆ విషయం ఆ తాగుబోతులకుగానీ, వాళ్లు తగాదా పడినవాళ్లకుగానీ గుర్తున్నట్లే ఉండేది కాదు. కాకపోతే సంక్రాతి సెలవుల తర్వాత ప్రారంభమయ్యే బడిలో పంతుళ్లు వచ్చేదాకా పిల్లలం గుంపులు గుంపులుగా చేరి వాళ్లిద్దరి గురించి చిలవలు పలవులు మాట్లాడుకునేవాళ్లం. కొందరు వాళ్ల మాటల్ని అనుకరించి అందరినీ నవ్విస్తే, ఇంకొందరు నటించి మరీ ఆకట్టుకునేవాళ్లు. అంతలో హెడ్మాస్టరు మండవ శేషాద్రిగారొస్తున్నారని ఎవరో చూసి కేక పెట్టటంతో అందరం తరగతి గదుల్లోకి పరుగులు తీసేవాళ్లం. ఇక అంతే సంగతులు. తాగుబోతుల వ్యవహారం మళ్లీ ఏ పండుగొస్తేనే తప్ప ఎవ్వరూ గుర్తుపెట్టుకునేవాళ్లుకాదు. ఆనాటి పరిస్ధితులు అవి. ఊళ్లో ఎక్కడో మారుమూల ప్రభుత్వ సారా దుకాణం ఉండేది. బయటనుంచి వచ్చిపోయేవాళ్లు తాగుతుండేవారని చెప్పుకునేవారు. 1983-85 వరకూ మా గ్రామంలో అదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత అంతా మారిపోయింది.
కల్లు మానండోయ్ !
కళ్లు తెరవండోయ్ !!
అన్న గాంధీజీ విధానం తిరగబడింది.
మందు తాగండోయ్ !
మంచం ఎక్కండోయ్ !!
అన్న ధోరణితో సాగుతోన్న పాలనలో ఇప్పుడు మా ఊళ్లో ఓ అరడజను గొలుసుకట్టు మద్యం దుకాణాలు జోరుజోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు మద్యం తాగని వాళ్లను లెక్కించేందుకు వేళ్లు కూడా ఎక్కువేనేమో!
7 ఆగ
ఎవరికోసం కస్తూరి రాతలు … ఎందుకోసం వారి కోతలు
”మీడియాలో చెప్పేందుకు మంచే లేదా?” రాతలు- కోతలు బ్లాగరు, హర్రర్, టెర్రర్ కథా రచయిత కస్తూరి మురళీకృష్ణ ప్రశ్న.
రాసేందుకు అరవీర భయంకర, భయోత్పాత, నెత్తుటి మరకల, కక్షలు – కార్పణ్యాల, పగలు – హత్యల, అత్యాచారాల, దెయ్యాల, లేనిపోని ఆలోచనల కథలే ఉన్నాయా? మనిషినీ, సమాజాన్నీ సంస్కరించేందుకు, చైతన్యపరిచేందుకు, మంచి భవితవ్యాన్ని ఒడిసిపట్టేందుకు అవసరమయిన ఆలోచనల్ని పాఠకుల్లో కలిగించేందుకు కథలు – కాకరకాయలు రాయొచ్చుగదా? అని ఎవరయినా అడిగితే ఎట్లుంటుందో? కస్తూరి ప్రశ్న కూడా అదే తీరున ఉంది.
తనకు నచ్చిన కథల్ని తాను రాసుకునే హక్కు కస్తూరికి ఉన్నప్పుడు మీడియాలోనూ చెడునే చెప్పేందుకు ఇతరుకూ అంతే హక్కు ఉందని ఆయనకు తెలియదని అనుకోలేకపోతున్నాను. వేయి ఆలోచనల్ని వికసించనీయమన్న దానికి భిన్నంగా ఇలానే చేయండని ఆయన సుతిమెత్తగా ఆదేశాలు జారీచేయటం వెనుక ఏ మతలబూ లేదంటే నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. ఎందుకంటే ఆయన జాగృతిలో అనుభవజ్ఞుడు మరి.
విమర్శించేవాడికి వేయి నాలుకలంటూ ఆయనే విమర్శలకు దిగటం గురివింద గింజతనం కదూ!
మీడియాలో చెడును చూసేవాళ్లంతా పరాజితులనీ, గుర్తింపుల లేక ఏడ్చేవాళ్లనీ, వాళ్ల సొంత సమస్యల్ని అందరికీ చుట్టి అలా చూడటం తగదనీ తగుదునమ్మా అంటూ ధర్మోపదేశాలు చేయటం యాజమాన్యాల పక్కన చేరి బాధితుల్ని గేలిసేయటం అవునో? కాదో? తేల్చి చెప్పాలని కస్తూరివారికి సవాలు విసురుతున్నాను.
అసలు ఆ మాటకొస్తే చెడును గురించి చెప్పేవాళ్లు మంచేలేదని ఎవరన్నా అన్నారా? అనకుండానే కస్తూరికి అనుమానం ఎందుకొచ్చినట్లో? ఎందుకొచ్చి ఉంటుందంటే…
విఐ లెనిన్ మహాశయుడు అంటారూ, ఏ పదాల వెనుక ఏ అర్థాలున్నాయో తెలుసుకోనంతకాలం మోసపోతూనే ఉంటాం. ఈ నేపథ్యంలో ఆ పెద్దమనిషి ఉపదేశాల వెనుక ఏ ఉద్దేశం దాగి ఉందో పరిశీలించి వెలికి తీయాలన్నదే ఈ రాతల వెనుక ఉన్న ఉద్దేశం.
కస్తూరి రాతలన్నీ బలహీనుల్ని మరింత బలహీనుల్ని చేసేవే. భయపడేవారిని మరింత భయపెట్టేవే. ఆయన రాతలేవీ బడుగులకు ఊతమిచ్చేవి కాదు. గాయపడినవారికి ఔషదం కాదు. బలహీనులకు బలమిచ్చేవి కాదు. పాఠకుడి బలహీనతలను సొమ్ముచేసుకునే పత్రికల యాజమాన్యాలను సంతోషపెట్టి సొమ్ము చేసుకుని ఊరుకుంటే పట్టించుకోవలసిన పనేలేదు. పాఠకులు, ప్రజలు ఒకనాటికి కాకపోయినా మరో నాటికయినా తమకు ఏది అవసరమో దాన్నే తీసుకుంటారనీ, ఆచరిస్తారనీ నమ్మకమున్నవాడిని. అందుకనే వేయి ఆలోచనల్ని ఆహ్వానించాలని భావిస్తాను. ఎవర్నో విమర్శిస్తే మీకెందుకు దురద అని కస్తూరి వారు ప్రశ్నించే ప్రమాదమూ ఉంది. వ్యక్తిగా ఎవరి అభిప్రాయాలు వారివి. బ్లాగెక్కి అరిస్తే ఊరుకోవటం ఎలా? అందులోనూ మీడియాలో ఉన్న నేను, మీడియా తప్పుల్ని అంతో ఇంతో ఈసడించుకుంటున్నానాయొ మరి. మౌనం కొన్ని సమస్యల్ని పరిష్కరించేమాట వాస్తమేగానీ, తప్పుడు అభిప్రాయాలను పాదుకొల్పే ప్రమాదమూ ఉంది. గోటితో పోయేనాడే గిల్లేస్తే పోతుందని నమ్మకం నాది.
కస్తూరి గారి మంచి వాళ్ల రహస్య జాబితా చూస్తే మీడియాను తప్పుపట్టేవాళ్లంతా వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకున్నారన్న అపోహ కలిగిస్తున్నది. గొంగట్లో తింటూ వెంట్రుకల్ని తిట్టటం ఉపయోగం లేదని చెడును చూసేవారికి తెలుసని నా ప్రగాఢ విశ్వాసం. అసలు గొంగట్లో తినంగాక తినం, కంచం కావాలి … అంటూ వాళ్లు పెడుతోన్న కేకలు నాకు స్పష్టంగా వినపడుతున్నాయి. కస్తూరివారికి వినపడకపోతే ఇంకేమయినా సమస్య ఉందేమో పరిశీలించుకోవాలి. మీడియా కుళ్లిపోయి కంపుకొట్టటానికి ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది బాధ్యులు కాదనీ, యాజమాన్యాలు, యాజమాన్యాల స్థానంలో ఉన్న పెట్టుబడి, ఆ పెట్టుబడికి ప్రియపుత్రులయిన పాలకవర్గాలే దానికి బాధ్యులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాటి వ్యవస్థే అసలు నేరస్థురాలు. ఇక కస్తూరివారన్నట్లు కొందరు మంచివారు లేకపోలేదు. వారికి చేయెత్తి మొక్కాల్సిందే. వారిని గురించి చెప్పుకోవలసిందే. వారికి మద్దతు ఇవ్వాల్సిందే. అయితే ఆ మంచివాళ్లంతా మౌనం వీడాలి. బయటకొచ్చి బాధితుల పక్షం వహించాలి. కస్తూరిలాంటి వాళ్లంతా అందుకోసం కృషి చేస్తే సంతోషం. శుభం.
కడుపు నిండినవాడు చెప్పేది కవిత్వం … కడుపు మండినవాడు చేసేది పోరాటం.
వేయి పూలు పూయనిద్దాం. లక్షలాది ఆలోచనలు వికసించనిద్దాం.
అంటే చెప్పేదాన్ని చెప్పనీయండి. పాఠకులు వాళ్లకు కావాల్సిందేదో వాళ్లే హంసల్లా ఆస్వాదిస్తారు.
6 ఆగ
”అందర్నీ కవుల్ని చేస్తా” … శ్రీశ్రీ
”మీరు కోరుకునే సామ్యవాదం వస్తే, అప్పుడు ఎలాంటి కవిత్యం రాస్తారు” ఓ ప్రేక్షకుడి ప్రశ్న.
”అందరిచేతా కలం పట్టించేందుకు కవిత్వం రాస్తా … అందర్నీ కవుల్ని చేస్తా … అందరి చేతా కవితలు రాయిస్తా” తడుముకోకుండా జవాబిచ్చారు శ్రీశ్రీ.
నాకు తెలిసిన పరిమిత సమాచారం మేరకు ఈ తరహా వివరణ శ్రీశ్రీ మరెక్కడా ఇవ్వలేదని నా నమ్మకం.
సామ్యవాద ఆవిష్కరణాననంతరం అందరినీ కవుల్ని చేసేందుకు కవిత్వం రాస్తానన్న ఆనాటి అద్భుత దృశ్యానికి నేను కూడా సాక్షినే.
అది 1979. మధ్యాహ్నం 3 గంటలు.
ప్రకాశం జిల్లా చీరాల పట్టణం. కస్తూరిబా బాలికోన్నత పురపాలక పాఠశాల ఆవరణ. అక్కడ విరసం ఆధ్యర్యంలో సభ జరుగుతోంది. శ్రీశ్రీ ఏకైక ఉపన్యాసకుడు. వాస్తవం చెప్పాలంటే శ్రీశ్రీ ఉపన్యాసంలో అందర్నీ కవుల్ని చేసేందుకు కవిత్వం రాస్తానన్న జవాబు తప్ప మరే విషయమూ నాకు ఇప్పుడు గుర్తులేదు.
ఆనాటి దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోనివ్వండి.
మొత్తం ముప్పై, నలభై మంది ఉంటారేమో ఆ సభలో. శ్రీశ్రీ ఉపన్యాసం ముగిసింది. కార్యకర్త ఒకరు కొబ్బరి బోండాం అందించారు. కొబ్బరి నీళ్లను సేవించిన అనంతరం, ప్రశ్నలుంటే సంధించమని ఆహ్వానిస్తూనే శ్రీశ్రీ సిగిరెట్ వెలిగించారు. సిగిరెట్‌ను నేరుగా నోట్లో పెట్టుకోకుండా వేళ్ల మధ్య బిగించారు. బొటనవేలు – చూపుడు వేలును మడిచి వాటి సందులోనుంచి పొగ పీల్చటం చూస్తే నాకు భలే అన్పించింది. అందులోనూ పాపం, పుణ్యం, ప్రపంచమార్గం ఇంకా వంటబట్టని వయస్సాయె మరి.
ఇక అసలు విషయానికొస్తే… ఒకటి రెండు ప్రశ్నలు, జవాబులు పూర్తయిన తర్వాత దూసుకొచ్చిన ప్రశ్న ఎవరు వేసారో తెలియదుగానీ నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది.
”మీరిప్పుడు సామ్యవాదాన్ని కాంక్షిస్తూ కవిత్వం రాస్తున్నారు. మరి ఆ సామ్యవాదం వచ్చిన తదుపరి మీ కవిత్వం ఎలా ఉంటుందో చెబుతారా?” అనడిగారు.
దానికాయన జవాబిచ్చిన తర్వాత ”మరి సామ్యవాదం ఎప్పుడొస్తుందంటారు?” మరెవరో అడిగారు.
”సామ్యవాదాన్ని నేను కచ్చితంగా చూసే పోతానని గట్టి నమ్మకముంది” ఇది ఆయన ప్రగాఢమైన ఆకాంక్షనూ, నమ్మకాన్నీ పట్టిచూపిన జవాబు.