Archive for సెప్టెంబర్, 2010

దాతల సొమ్మును దాచుకుంటూ కన్నంలో దొరికన కర్నూలు ఎ మ్మెల్యే వెంకటేష్‌


వరద బాధితుల కోసం పోయినేడాది దాతలు అందించిన విలువయిన సామాన్లనూ, నిత్యావసర సరుకుల్నీ కర్నూలు శాసనసభ్యుడు, రాయలసీమ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు టిజి వెంకటేష్‌ దోచుకుని, దాచుకున్న వైనం వెల్లడయింది. సినీ, టివి, రంగస్థల కళాకారులు హైదరాబాదు నుంచి ఆనాడు పంపిన దుస్తులు, స్టౌలను టీజీకి చెందిన మౌర్య ఇన్‌ హోటలు నుంచి అతని గోదాముకు ఎపి 02 వి 5632 నంబరు లారీలో 30 జనవరి 2010న తరలిస్తుండగా సిపిఎం కార్యకర్తలు పట్టుకున్నారు. ఏడాదిపాటు తన హోటలులో భద్రంగా పెట్టుకున్న సామగ్రిని కర్నూలు నగర శివార్లలోని సఫా ఇంజనీరింగ్‌ కళాశాల ఎదుట ఉన్న  గోదాముల్లోకి మారుస్తూ వెంకటేష్‌ సిబ్బంది పట్టుబడ్డారు. సిపిఎం నాయకులు కె రాజగోపాల్‌, ఎం రాజశేఖర్‌, సత్యం, ఎల్లప్ప తదితరులు మౌర్య ఇన్‌ దగ్గర నుంచే లారీని వెంబడిస్తూ మీడియాకూ, అధికారులకు సమాచారం అందించారు. లారీలో తరలించిన సామాన్లకు తోడు గోదాములో బియ్యం, కందిపప్పు, టివిలు, స్టౌలు, దుస్తులు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అయితే సిపిఎం కార్యకర్తలు అందజేసిన సమాచారంతో ఆక్కడకు చేరుకున్న స్థానిక సిఐ నాయుడు చర్య ఏమీ తీసుకోకుండా వాటిని చూసి వెళ్లిపోవటం నేతల అవినీతిపట్ల అధికారుల తీరును పట్టిచూపుతోంది. పైగా ఆ సమాన్లను బాధితులకు పంచేందుకు ప్రయత్నిస్తుండగా సిపిఎం కార్యకర్తలు వాటిని ఎత్తుకు పోయేందుకు ప్రయత్నించినట్లుగా కథ అల్లటం విశేషం. దాతలు అందజేసిన సామాన్లను ప్రభుత్వ అధీనంలో కాకుండా టీజీ గోదాముల్లోనూ, హోటలులోనూ ఎందుకు నిల్వచేశారో చెప్పాల్సిన బాధ్యత వెంకటేష్‌ది కాగా దొంగసరుకును పట్టుకున్న వారిపైకి నేరాన్ని నెట్టేందుకు టీజీ ప్రయత్నించటం దొంగే దొంగ అన్నట్లుగా ఉండలేదూ! పైగా పోయినేడాది అక్టోబరు రెండో తేదీన వచ్చిన వరదలకు బాధితులయిన వారికి ఆందించేందుకు అదే నెలలో దాతలు ఇచ్చిన సాయాన్ని ఇప్పటిదాకా పంచకపోవటానికి కారణం ఏమిటో కూడా ఆయనే విప్పి చెప్పాలి. దాతలు ఇచ్చిన బియ్యం, కందిపప్పును టిజి వెంకటేష్‌ తన పేరుతో ముద్రించిన సంచులలో పోసి బాధితులకు పంపిణీ చేస్తూ వరదల సమయంలోనే ఒకసారి పట్టుబడ్డాడు. అపర దానకర్ణుడనని నిత్యం తనకు తానే ప్రచారం చేసుకునే టీజీ అసలు లీలలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. తన పరిశ్రమలోకి నీళ్లు వచ్చే అవకాశాన్ని పసిగట్టి ముందస్తు చర్యలు తీసుకున్న వెంకటేష్‌, వరదల వల్ల తనకు అపార నష్టం వాటిల్లిందనీ, రెండు నెలలకు పైగా మూసి వేయాల్సి వచ్చిందనీ ఫిర్యాదు చేసి 100 కోట్ల రూపాయలను బీమా సంస్థల నుంచి వసూలు చేసుకున్నట్లు విమర్శలున్నాయి. ఇదే వరదల్లో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వారికి ఇప్పటి దాకా ఒక్క పైసా బీమా కూడా దక్కలేదు. ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది వేల రూపాయలు తప్ప టీజీ చేతివాటం కారణంగా దాతలు అందించిన సహాయం కూడా కర్నూలు వరద బాధితులకు అందలేదు. కర్నూలు నగరంలో చిన్నివ్యాపారి నుంచి కోట్లాది రూపాయల వరకూ వ్యాపారం చేసుకునే వారు వేలాది మంది నష్టపోతే ఎమ్మెల్యేగా వారికి అండగా ఉండి సహాయం అందించక పోగా టిజి వెంకటేష్‌ దాతలు ఇచ్చిన సహాయాన్ని స్వాహా చేయటం నేటి నేతల తీరును పట్టిచూపుతోంది.

ఎవరి వ్యక్తిగత బతుకులు వారిష్టం! బజార్లో నిలబడితే అక్కినేనినయినా అంటాం!!

ఎవరి వ్యక్తిగత బతుకులు వారిష్టం!
బజార్లో నిలబడితే అక్కినేనినయినా అంటాం!!

అంటే బజార్లో నిలబడిన ప్రతివాడినీ అనికాదులెండి. బజార్లో నిలబడి నోటికొచ్చిన కూతలు కూసేవారిని అని అర్ధం చేసుకుందురూ.
ఇంతకూ ఇప్పుడు అక్కినేని నోటికొచ్చిన కూతలు ఏమి కూశాడంటారా? చెబుతాను, చెబుతాను.
అన్నట్లు అ…ఆ ల పెద్దమనిషి అక్కినేని నాగేశ్వరరావు జోలికి వెళ్లటం పెద్ద సాహసమేననిపిస్తోంది. కొంత భయం కూడా ఉందనుకోండి. అయినా దిగాక చలి చలి అని గుంజుకునేవాడిని కాదులెండి.
సాయం చేయటం ఏమోగానీ హాని చేయనివాడు,
ఆచితూచి మాట్లాడేవాడు,
మాటల్లో హేతుబద్ధత చూపేవాడు,
స్వయంకృషితో ఎదిగినవాడు, ‘అ..ఆ’ పేరిట అక్కినేని ఆలోచనలను అందరికీ పంచినవాడు…
కొన్నాళ్లపాటు మంచి సినిమాలు తెలుగోళ్లకు చూపినవాడు, మంచి నటన ప్రదర్శించినవాడయిన అక్కినేనిలో నాకెక్కడో కూసింత స్వార్ధం కన్పిస్తుంటుంది. ఆ మాటంటున్నానంటే స్వార్ధం లేనివాడెవ్వడని పలువురు నామీదకు దూకే ప్రమాదం ఉంది. అందుకని మరికొంత వివరిస్తాను. మనం చేసింది, మనం వాగింది … ఎదుటివాడు తప్పన్నప్పుడు, ఒకపరి తడిమి చూసుకుని కాదని కచ్చితంగా తేలితే సరే. కాకుంటే బహిరంగంగా ఒప్పుకోకపోతేమానే, కనీసం అలాంటి విషయాల్లో మౌనం వహిస్తే మంచిదని నా భావన.
కానీ అక్కినేని ఆ జ్ఞానాన్ని ప్రదర్శించకపోవటం కనీసం ఆయన కుమారుడి శివ విడుదలయిన కాలం నుంచీ గమనిస్తున్నాను. అంతకు ముందు సంగతి నాకు తెలియదు.
అసలే మనది రెండు రెళ్లు నాలుగన్నందుకు గూండాలు గుండ్రాళ్లు విసిరే సీమ. అలాంటి సీమలో, అలాంటి వాతావరణంలో సైకిలు చైన్లను పరిచయం చేసిన ఘనత శివ సినిమాది. కనీసం ఇంట్లో పెద్దవాళ్లకో, సమాజానికో భయపడి హింసకు దూరంగా మసిలే కుర్రోళ్లను కూడా సైకిలు చైను పడితే బాగుండునని బాధించిన సినిమా అది. పట్టించిన సినిమా అది. అహింసతో ఏమీ కాదని, హింస, ధ్వంసరచనే మార్గమని నేర్పించిన సినిమా అది. అలాంటి సినీరాజాన్ని కొడుకు మీద ప్రేమతో అక్కినేనిలాంటి పెద్దమనిషి, నాగేశ్వరరావులాంటి వేలాది మంది విసనకర్రల్ని కలిగినవాడు పొగిడితే ఇంకేమన్నా ఉందా? ఔనని సమాజం తలూపే ప్రమాదం లేదూ?! గుడ్డిగా అనుసరించే ప్రమాదం లేదూ?!
పైగా తరచూ ఆయనో రహస్యం చెబుతుంటాడు. పరిమితంగా మద్యం సేవిస్తే అది ఆరోగ్యమట. దాన్లో నిజానిజాలమాట దేవుడెరుగు, పరిమితంగా తాగటం అసలు సాధ్యమేనా? (అక్కినేని లాంటి ఒకరిద్దరి విషయం కాదు.) తొలుత మద్యాన్ని మనిషి తాగితే, ఆ తర్వాతే మద్యమే వాడ్ని తాగుతుందన్న విషయం అక్కినేనికి తెలియదా? మద్యం స్వభావమే అది. అమృతం పేరిట దేవతలే (సురులు) (సురులు = సురాపానము చేయువారు, సుర = సారాయి) ఎన్నెన్ని మోసాలకు పాల్పడ్డారో పురాణాల్లో విన్నదే. అందువలన అక్కినేని లాంటి పెద్దమనిషి తాగంగాలేంది, పైగా తాగటం తప్పేకాదని చెప్పంగా లేంది మనమూ తాగేద్దామనుకుని తాగించేసిన పాపం అక్కినేనికి ఉంది. అంతెందుకు ఆయన కుమారుడు నాగార్జున, తాను చాటుమాటుగా మందు సీసాలను దుర్గం చెరువుకు ఎత్తుకు పోయి తాగొచ్చానని తరచూ చెప్పటం వినలేదూ?! ఈ తండ్రీకొడుకులు తాగితే తాగారు. నాది, నీది తాగలేదు కాబట్టి వదిలేద్దాం. అయితే మేము తాగుతాం, అది తప్పేమీ కాదు, పైగా ఆరోగ్యం కూడానూ అని చెప్పే హక్కు వీళ్లకెవరిచ్చారన్నదే తెలుగిల్లు ప్రశ్న. వీళ్లేమన్నా ఆహార నిపుణులా? లేదా వైద్య నిపుణులా? ‘దాదా’సాహెబ్‌పాల్కే పురస్కార గ్రహీతగారూ, గ్రహించారా? మా విన్నపం.
పైగా అక్కినేని ఇప్పుడంటారూ, సినిమాలను విమర్శించొద్దని.

అక్కినేని 87వ జన్మదినోత్సవం సందర్భంగా 28 సెప్టెంబరు 2010న తెలుగు విశ్వవిద్యాలయంలో శృతిలయ ఆర్స్ట్‌ అకాడమి నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని ఇలా వివాదస్పదంగా హెచ్చరిక చేశారు. ఆయన ఇంకా ఏమంటారంటే…”ప్రస్తుత సమాజంలో అన్ని రంగాలూ వ్యాపారంగా మారిపోయాయి. (అందరూ దొంగలే, నేనూ దొంగనే అని సమర్థించుకున్నట్లుగా) మరెందుకోగానీ కొందరు సినిమా రంగాన్ని విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? (కచ్చితంగా సమంజసమే. సినిమాయే సమాజం … సమాజమే సినిమా అన్నట్లుగా ఉన్న నేపథ్యంలో దానిని ప్రత్యేకంగా పరిగణించకపోతే ఎలా? తొలిరోజు తొలిఆట టిక్కెట్ల కోసం ప్రాణాలను సైతం లెక్కపెట్టని యువతరం ఎదిగి, నానాటికీ విస్తరిస్తోందని మీకు తెలియంది కాదుగా?!) పైగా సినిమాని సినిమాగా చూడాలట. మీరూ సినిమాని సినిమాగా తీస్తే అది కుదురుతుందేమో? అక్కినేని సార్‌. సినిమాలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలట. సినిమాల్లో మాధుర్యం ఉందా? ఉంటే, గింటే నటుల ఖాతాలకు చేరే కోట్లలో ఉందేమో? ప్రేక్షకుడికి మిగిలింది జుట్టుపీక్కోవటమే. అంతేగానీ, కళనూ, కళాకారుల్నీ విమర్శించొద్దట! గుడ్డలిప్పుకుని మీరు ఆడే తైతక్కలు ఒక కళ. మీ ముఖం కాదు, మీ మాట కాదు – మీకు మా భాష రాదు, మా భావాలు తెలియవు, మా సంస్కృతి తెలియదు, మా సంప్రదాయం అసలే తెలియదు, మా అలవాట్లు తెలియవు, మీ గొంతు కాదు, మీ పాట కాదు – మీ గళం కాదు, ఎగిరేది మీరు కాదు, చివర్లో శత్రువుని తన్నేది, తొలుత వాడితో తన్నించుకునేది మీరు కాదు … అయినా మిమ్మల్ని (మిమ్మల్ని అంటే అక్కినేని కాదు- ఈనాటి నటనాగ్రేసరులనూ, గ్రేసరమ్మలనూ) కళాకారులుగా మేము చూడాలంటారా? ఆనందించాలంటారా? అసలెట్లా కనపడుతున్నాం, మీకళ్లకు? గొర్రెల్లాగానా? బర్రెల్లాగానా?  అసలు బుర్రలేనోళ్లలాగానా? మట్టితో నిండిన బుర్రలు కలిగినోళ్లలాగానా?

ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను చెప్పండి…
ఇదిగో ఒకటో ప్రశ్న :
మీ కుమారుడు నాగార్జునకు 2008లో హఠాత్తుగా వైఎస్‌ పాలనపై ప్రేమ పుట్టుటకు కారణం ఏమిటి? దాని వెనుక ఏ మతలబూ లేనేలేదంటారా?
రెండో ప్రశ్న, పలు అనుబంధ ప్రశ్నలూను :
మీ కుమారుడు నాగార్జునకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర తెలుసా?
తెలిస్తే భూమి ఎవరి చేతుల్లో ఉండాలని ఆ వీరులు తేల్చిచెప్పారు?
మీ కుమారుడికి ఎంత భూమి ఉంది?
ఆ పోరాటంలో ఒకడని మీరు చెబుతోన్న రాజయ్య ఆశయాలకూ నాగార్జున ఆశయాలకూ ఎక్కడన్నా పొంతన ఉందని మీరు అనుకుంటున్నారా?
అసలు టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావుకూ సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటానికీ సంబంధం ఏముందని రాజన్న సినిమా విషయంలో నాగార్జున ఆయనని సంప్రదించాడు. దాని వెనుక ఏ మతలబూ దాగిలేదా?
అక్కినేనీ,  దీనిపై నోరు విప్పండి. అంతేగానీ అయినదానికీ, కానిదానికీ నోరు పారేసుకోకండి. తిరిగి తీసుకోలేనిది నరం లేని నాలుక విసిరే మాటలేనని మీ అ..ఆ..లో ఏదో ఒక రూపాన రాసి ఉంటారులే.

”ఉ.. ట్టి.. కె.. క్క.. లే.. న్నా.. య.. నా — స్వర్గానికి మాత్రం ఎగబాకుతా”


వెనకటికెవరో ముసలమ్మ ఉట్టికెక్కలేనుగానీ, స్వర్గానికి మాత్రం ఎగబాకుతానందట.
అట్లా ఏడ్చింది మన ఘనత వహించిన ప్రభుత్వం సాధిస్తోన్న అభివృద్ధి ఫలాల చిట్టా.
”2015కల్లా మా దేశంలో దరిద్రానంతా తుడిచేస్తాం”  అంటూ సింగు ఈజ్‌ కింగ్‌ ప్రభుత్వం ఇటీవల ఐక్యరాజ్యసమితికి హామీ ఇచ్చింది. ఈ ఐక్యరాజ్యసమితి కూడా మనదేశ ఓటర్ల మాదిరే ఒట్టి పిచ్చిదయినా అయిఉండాలి కాకుంటే మోసగత్తె అయినా అయి ఉండాలి.
ఎందుకంటే?
మనదేశంలో 2008-09లో కొత్తగా 3.36 కోట్ల మంది దరిద్రుల జాబితాలో చేరారు. అంతేనా ఈ ఏడాది మరొక ఐదు కోట్ల మంది నిష్ట దరిద్రులయ్యారని ప్రపంచబ్యాంకు తేల్చిచెప్పింది.
మరి కుబేరుల సంగతో…
మన దేశంలో కుబేరుల సంఖ్యకూడా పెరిగింది. పైగా 2008-09తో పోలిస్తే కుబేరులు రెట్టింపు పెరిగారు.
ఇంతకీ రెట్టింపు అంటే దరిద్రుల సంఖ్యలా కోట్లలో ఉంటుందని ఎవరన్నా అనుకుంటే దరిద్రంలో కాలేసినట్లే. 2010లో మనదేశంలో 1.27 లక్షల మంది కుబేరులున్నట్లు తేలింది. అదే 2008-09లో కుబేరుల సంఖ్య వారిలో సగం మంది.
అన్నట్లు దేశ జనాభాలో కుబేరుల శాతం ఎంతో తెలుసా? కేవలం 0.01 అదండీ అసలు సంగతి. అయితే స్థూల జాతీయాదాయంలో వారిది మూడింట ఒకొంతు. అంటే ప్రతి మూడు రూపాయల్లోనూ ఒక రూపాయి మొత్తం జనాభాలో కనీసం ఒక్కశాతమన్నా లేని వారిదే.
మరి ఈ లెక్కల్ని బట్టి 2015నాటికి దేశంలో దరద్ర నిర్మూలన సాధ్యమో? కాదో? ఎవరివారే అంచనా వేసుకోవచ్చు. అయితే ఒక్కటి… ఆహారం, నీరు, ఆరోగ్యం, చదువు తదితర రంగాలు ఇదే తీరున
కొనసాగితే మాత్రం దేశంలో తప్పకుండా దరిద్రుల నిర్మూలన జరుగుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.
గత ఏడాది అంటే 2009 -10లో ప్రభుత్వం కేవలం ఐదు లక్షల రెండు వేల కోట్ల రూపాయల పన్ను రాయితీలు కల్పించింది. దీంట్లో ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. కాకపోతే ఈ రాయితీల్లో 99 శాతం కేవలం కుబేరులే లాభం పొందారని మాత్రం గొణుక్కోక, సణుక్కోక తప్పదు.
మరికొన్ని లెక్కలూ డొక్కలూ… (1990 ప్రకారం)
1. దేశ జనాభాలో 37.2 శాతం మంది నిష్ట దరిద్రులున్నారు.
2. 53.5 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. అయితే ఏంటంట? ఏమీ లేదు మహాశయా! కాకపోతే ఈ లెక్కలు తల్లులకు అందుతోన్న పౌష్టికాహారం యొక్క బలాన్నీ, వారికి అందుతోన్న ఆరోగ్యం యొక్క గొప్పతనాన్నీ తేటతెల్లం చేస్తుంది అంతే.
3. ప్రతి 1000 మంది పిల్లల్లోనూ 125 మంది ఆహారలేమితో, అనారోగ్యంతో ఐదేళ్ల లోపే మృత్యుఘంటికలు మోగించుకుంటూ వెళ్లిపోతున్నారు.
4. ప్రతి లక్షమందిలోనూ 437 మంది మహిళలు ప్రసవ సమయంలో ఈ నాటికీ చనిపోవటం నిజ్జంగా నిజం.
5. ప్రతి 1000 మంది నవజాత శిశువుల్లోనూ 80 మంది పుట్టీ పుట్టక ముందే చనిపోతున్నారు.
అదండీ మన సంగతులు.
మనిషన్నవాడు ఆలోచించాలి మరి!
మనసున్నవారు స్పందించాలి పరి పరి
!!

ఎగసాయం … తెలుగు పల్లెల జీవన ధారావాహిక – 3


”రైతు వ్యతిరేకి మంత్రి వాలినేని వనవాసరెడ్డి” ”డౌన్‌డౌన్‌”
రైతుల ఉసురు తీస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ”పొణిజేటి పోశయ్య”
”డౌన్‌డౌన్‌”
”పచ్చని పొల్లాల్లో చిచ్చు పెడుతున్న జెన్‌-కో”
”డౌన్‌డౌన్‌”
”ఉపసంహరించుకోవాలి – ఉపసంహరించుకోవాలి”
”థర్మల్‌ పవర్‌ ప్లాంటు కోసం పచ్చని పొలాల సేకరణ కార్యక్రమాన్ని”
”మా ప్రాణాలు పోయినా”
”మా పొలాల్ని వదులుకోం”
వందలాది రైతు కుటుంబాలకు చెందిన ఆడ, మగ, పిల్లా, జెల్లా, ముసలి, ముతక చీరాల- ఒంగోలు రోడ్డుమీద చేరి నిరసనకు పూనుకోవటంతో అటూ ఇటూ వాహనాలు బారులుదీరి  నిలిచిపోయాయి. బస్సు నాగులుప్పలపాడు చేరి ఆగిపోయింది. నినాదాల ప్రతిధ్వని వీరయ్య చెవికి సోకటంతో నిద్రమత్తు వదిలింది. అన్నం తిని బస్సెక్కటంతో నిద్రాదేవి వీరయ్యను వరించింది.
”ఏందంటరా? అది!” అర్ధంకాక సాంబయ్యను అడిగాడు.
”కనపర్తి రైతులు కక్కాయ్‌. పవర్‌ ప్లాంటు వద్దని రాస్తారోకో చేస్తున్నారు. అమ్మనబ్రోలు జయంతి బాబుండలా, అదే రైతు సంఘమని వస్తంటాడుగదా, వీళ్లందరినీ అతగాడే పోగేసినట్లున్నాడు.” అప్పటిదాకా గమనించినదంతా వివరించి చెప్పాడు సాంబయ్య. మధ్యాహ్నం 12 గంటలకు రైతుల్ని పోలీసులు అరెస్టు చేయటంతో వాహనాలు తిరిగి పరుగులు ప్రారంభించాయి.
29 సెప్టెంబరు 2010న తెలుగు పల్లెల జీవన ధారావాహిక – 4

ఎగసాయం … తెలుగు పల్లెల జీవన ధారావాహిక – 2

చెరువు మొగదల నుంచే గుయ్యిమని హారను కొట్టుకుంటూ ఇంకొల్లు నుంచి బస్సొచ్చింది. ఈదుమూడి రైతులంతా సంచుల్నీ, గోతాముల్నీ చేతబట్టుకుని లోపలికి జొరబడ్డారు. వాళ్లతోబాటే సాంబయ్య కూడా ఎక్కాడు. సామ్రాజ్యం చెప్పటంతో సాంబయ్య కక్కాయి వీరయ్య అతన్ని క్షణం క్షణం గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ ఒకే సీట్లో కూర్చున్నారు. బస్సు వేగం పుంజుకుంది. వీరయ్య మనసు గతంలోకి పరుగు తీసింది.
సాంబయ్య చిన్నప్పుడే తండ్రి వెంకటరత్నం చనిపోయాడు. జానెడు జానెడు చుట్టలేకుండా వెంకటరత్నాన్ని ఎవ్వరూ చూసినోళ్లు ఆ వూళ్లోనే కాదు, ఆయన ఇంట్లో కూడా లేరు. నోటికి రాచపుండు పుట్టి సాంబయ్యకు రెండేళ్ల వయస్సప్పుడు ఆయన పోయాడు. రాచపుండుకు చుట్టతాగుడే కారణమని మదరాసు క్యాన్సరు ఆసుపత్రి పెద్ద డాక్టరు చెప్పాడు. రోగం ముదిరిపోయినాక వచ్చినందున చేసేదేమీ లేదని వెంకటరత్నాన్ని ఆసుపత్రికి తీసుకుపోయిన వీరాంజనేయులుకి రహస్యంగా చెప్పాడాయన. మూడు నెలలకన్నా ఎక్కువ బతక్కపోవచ్చని జాగ్రత్తలు చెప్పాడు. ఆయన చెప్పినట్లే రెండు రోజులు ముందే వెంకటరత్నం చనిపోయాడు. వదిన తప్ప దిక్కులేని ఆ కుటుంబాన్నీ ఓ కంట కనిపెట్టుకుని నెట్టుకొచ్చాడు వీరయ్య. వీరయ్యతోనే సాంబయ్యకు తండ్రి తాలూకు ప్రేమ అంతో ఇంతో దక్కింది. సాంబయ్యను తన బిడ్డలతోపాటే వీరయ్య చదివించాలనుకున్నా, ఊళ్లో పదో తరగతి అయిన తర్వాత ఇక పోనని మొండికేశాడు. ఆ విషయం తెలిసి ఇంటికల్లా వచ్చి మరీ,
”చదువు మానేస్తే చంకనాకిపోతావురో” హెచ్చరించాడు ఆ ఊరివాళ్లంతా ఆప్యాయంగా మల్లారప్పంతులని పిలుచుకునే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పొనుగుబాటి వెంకటసుబ్బారావు. చదువుకుంటే ఏమి లాభమో కథలుకథలుగా చెప్పిచూశాడు పంతులుగారు. ఆయనకు ఎదురు చెప్పలేక మౌనం పాటించాడు సాంబయ్య.
”మానేయాలనే అనుకుంటే నాకు చెప్పకుండా నిర్ణయం తీసుకోకురా సాంబయ్యా.” అంటూ రెండు గంటల తర్వాత వెళ్లిపోయాడాయన.
అయినా సాంబయ్య ఆలోచనలో మార్పు రాలేదు.
సాంబయ్యకు తల్లిని ఒంటరిగా వదిలి చదువుకునేందుకు అటు ఒంగోలో, ఇటు చీరాలో పోవాలనిపించలేదు. ఆసలా ఆలోచననే తట్టుకోలేకపోయాడు. వీరయ్య ఓ రోజు ఇంటికొచ్చి, కాలేజిలో చేరేందుకు చీరాల బయలుదేరమంటే ఏడుపుకు లంకించుకున్నాడు. అన్నం కూడా తినకుండా పోనంటే పోనని మొండికేశాడు. బలవంతంగా కాలేజీలో చేరిస్తే ఏమవుద్దోనని తల్లి భయపడింది.
”పెడద్రపోడు. ఎంతజెప్పినా ఇంటంలేదుగా, పోనియ్యి. వాడి కరమ. ఎవులు కరమకి ఎవులు బాద్దులబ్బాయి” చేసేది లేక బాధతోనే సాంబయ్య తల్లి కొడుకుని సమర్ధించింది.
”అట్టా అంటే ఎట్టొదినా? పిల్లలకి తెలియకపోతే పెద్దోళ్లమి చెప్పాలిగానీ.” ఇంకా నచ్చచెప్పబోయాడు వీరయ్య.
”కాదులేబ్బాయి. ఆడది ఎదురు సెబుతుందని అనుకోబాక. సిన్నప్పటినుంచీ సూడ్డంలా. వాడు అడ్డం తిరిగితే ఏ పనన్నా సేయించగలిగామా ఏనాడయినా”
”ఏదో సిన్నా, సితకా పన్లు ఏరు వదినా, ఇది జీవితానికి సంబందించింది. అట్టా సూడగూడదు.”
తల్లితోపాటు వ్యవసాయంలో పడ్డాడు ఆనాటి నుంచీ.
ఉండూరయితే తానున్నా లేకున్నా, కొడుక్కి అండగా ఉంటారని సాంబయ్యకు 22 ఏళ్లు రాగానే తూర్పుబజారు ఉప్పల రాఘవయ్య కూతురు సామ్రాజ్యంతో పెళ్లి చేసింది. వీరయ్య దంపతులే పెళ్లి పీటలమీద కూర్చుని ఆ శుభకార్యాన్ని పూర్తిచేశారు. ఉప్పుగుండూరు మలుపుల్లో వాహనాలు ఎదురు రాకుండా డ్రైవరు హారను కొట్టటంతో వీరయ్య ఆలోచనలకి బ్రేకు పడింది. స్టాండులో ఆగింది బస్సు.
”జీడిపప్పు మిఠాయి … జీడిపప్పు మిఠాయి”
”వాటర్‌ ప్యాకెట్‌ … వాటర్‌… వాటర్‌ ప్యాకెట్‌”
”కాలక్షేపానికి బఠానీలు, కాలక్షేపానికి బఠానీలు”
ఒకేసారి కుర్రాళ్లంతా బస్సును చుట్టుముట్టి కేకలు వేస్తుండటంతో అక్కడంతా గలభాగలభాగా ఉంది.
వీరయ్య బయటకు పారజూశాడు. ఎదురుగా అరుగుమీద బాచింపట్ల వేసుకుని కూర్చున్న నాషా భక్తరాజు కన్పించాడు. మహానుభావుడు ఆ ఊరికి నలభై ఏళ్లపాటు సర్పంచిగా చేశాడు. ఆయనకు పోటీ ఉండేదే కాదు. వయస్సు మళ్లినందున ఎవరినన్నా మంచి కుర్రవాడ్ని పెట్టాలని ఆయన బతిమలాడితేగానీ ఆ ఊళ్లో మొదటిసారిగా పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు. పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, లావు బాలగంగాధరరావుకు కొరియర్‌గా పనిచేసిన మహానుభావుడిగా ఆ ప్రాంత గ్రామాలన్నింటా గౌరవ మర్యాదలు అందుకుంటూ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడాయన. భక్తరాజు బస్సుకేసి చూస్తుండటంతో వీరయ్య కిటికీ నుంచి చెయ్యి బయటపెట్టి ఆయనకు నమస్కారం పెట్టాడు. ప్రతిగా భక్తరాజు నవ్వుతూ చేయెత్తి ఊపాడు. బస్సు బయలుదేరింది.

28 సెప్టెంబరు 2010న ఎగసాయం … 3

ఎగసాయం ……. తెలుగు పల్లెల జీవన ధారావాహిక -1

‘ఎగసాయం’ శీర్షికన తెలుగు గ్రామీణ జనుల జీవన వైవిధ్యాన్ని చూపుతో నేను రాస్తోన్న ధారావాహిక నేటి నుంచీ తెలుగిల్లు బ్లాగు యవనికపై ప్రారంభమవుతోంది. బహూశా ఇది మిగతా భాషల మాటేమోగానీ తెలుగు బ్లాగ్లోకంలో మాత్రం తొలి ప్రయోగమని భావిస్తున్నాను. ఈ ప్రయోగం అనుకున్నది అనుకున్నట్లు ఫలవంతం అయితే అప్పుడు నమ్రతగా గర్విస్తాను. ఎప్పటికప్పుడు మీ సలహాలు, సూచనలు నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఒప్పుల్ని పట్టించుకోకపోయినా సరే, కానీ తప్పుల్ని మాత్రం వెంటనే విమరనాత్మకంగా తెలియజేస్తారని భావించటంలో స్వార్థం కన్నా, మరింత ఒళ్లొంచి పనిచేసేందుకు పనికొస్తుందన్న కోరికే అధికంగా ఉందంటే మీరు నమ్మాలి మరి.

”ఏవయ్యోయ్‌!” బయటనుంచి సాంబయ్యని కేకేస్తూనే ఇంట్లోకి వచ్చింది ఆయన భార్య సామ్రాజ్యం.
మంచం మీద దిగాలుగా కూర్చున్న సాంబయ్య, ఏందన్నట్లుగా భార్య వంక చూశాడు మౌనంగా.
”దిగులుబెట్టుకుని కూసుంటే పనులవుతయ్యంటయ్యా? కట్టాలు కలకాలం ఉండవంటారు. అందరూ ఒంగోలుకు పోతన్నారు ఇత్తనాల కోసం. లేచి, కాసింత సద్దిబువ్వదిని నువ్వూబోయిరా, లే.” సామ్రాజ్యం భర్తను సముదాయించింది.
సాంబయ్యలో చలనం కన్పించలేదు. కాసేపు ఆ పనీ, ఈ పనీ అన్నట్లుగా అటూ ఇటూ తిరుగుతూ గడిపిన సామ్రాజ్యం మళ్లీ భర్త దగ్గరకు వచ్చింది.
”లేవయ్యా! ఎవరన్నా ఇంటే నవ్విపోతారు. కట్టాలు మానవులుకి కాక మానులకొత్తాయంటయ్యా?, లే. కట్టాలొచ్చినప్పుడే మనుసు రాయిజేసుకోవాలయ్యా”. సామ్రాజ్యం భర్త భుజం పట్టుకుని లేవదీసింది. గాబు దగ్గరకు తీసుకుపోయి నీళ్ల చెంబు సాంబయ్య చేతిలో పెట్టి వంటింట్లోకి పోయింది.
ఇక తప్పేదన్నట్లుగా  సాంబయ్య కాళ్లూ, చేతులూ కడుక్కొని వంటగదిలోకి పోయి పీట మీద కూర్చున్నాడు. అతడి ముఖంలో దిగులు ఛాయలు ఏ మాత్రం తగ్గలేదు.
”తొందరగా కానియ్యి, ఒంగోలు బస్సొచ్చే ఏలయింది. అందరితోబాటు పోతే కాయితికాలయ్యీ పూరితి జెయ్యటం ఇబ్బంది లేకుండా పోయిద్ది.” పళ్లెంలో అన్నమూ, గోంగూర వడ్డించి భర్త ముందు పెట్టి చెప్పింది సామ్రాజ్యం. దోసకాయ చెంబుతో మంచినీరు పెట్టింది.
”రాత్తిరేపిన ఊరమిరపకాయలుండయి, పెట్టమంటా? అడిగింది సామ్రాజ్యం.
”ఊ” అన్యమనస్కంగానే జవాబిచ్చాడు సాంబయ్య.
ఊర మిరపకాయల గిన్నెను భర్త ముందు పెట్టిందామె. మామూలుగానయితే కడుక్కున్న కాళ్లారకముందే అన్నం తినటం పూర్తిచేసేవాడు సాంబయ్య. ఇప్పుడు మాత్రం ముద్ద మింగుడు పడటం లేదు. నాలుగు మెతుకులు కలిపి నోట్లో పెట్టుకున్నా గొంతు దిగటం లేదు. కష్టంగా మింగుతూ భోజనం పూర్తయిందనిపించి లేచాడు.
సాంబయ్య బాధ చూసి విత్తనాల కోసం తానుపోవాలని ఆలోచించింది సామ్రాజ్యం. అయితే ఇంటిదగ్గర సాంబయ్య ఒక్కడినీ వదిలేసి పోతే అసలే దిగుల్లో ఉన్న భర్త కానిదేదన్నా చేసుకుంటాడని భయపడింది. పది మందితోపాటు విత్తనాలకోసం ఒంగోలు వెళ్తొస్తేనన్నా కొంత బాధ తగ్గుతుందని భావించిందామె. ఆ ఆలోచనతోనే సాంబయ్య దిగాలుగా ఉన్నా పదే పదే వెంటబడి తొందరపెడుతోంది.
”ఇదిగో ఇత్తనాలకి డబ్బు లోపల జేబిలో పెట్టుకో. ఇయ్యేమో చారిజీలకీ, కరుసులకీ సరిపోతయి. నా పేరనుండ పాసుపుత్తకమూ, నీపేరుతో ఉండిన పాసు పుత్తకమూ ఈ సంచిలో పెట్టినా. అట్ట బోయి బట్టాండుకాడ కూసో. సుబ్బయ్య బావ, ఎంకటరావన్నాయి, మీ కక్కాయి అందరూ అక్కడే ఉండారు. జాగ్రత్తలు చెబుతూ భర్త సాంబయ్యని సాగనంపింది సామ్రాజ్యం.

మీ ఆశీర్వచనాలు కోరుతున్నాను
రేపే ధారావాహిక …2

రెఫ్పోడు … పలకల బస్సు – నా చిన్ననాటి వార్తలు


నా చిన్నప్పుడు (అప్పుడు గుంటూరు జిల్లా – ఒంగోలు తాలూకా) మా ఊరికి (ఇప్పుడు ప్రకాశం జిల్లా – నాగులుప్పలపాడు మండలం- ఈదుమూడి) నాలుగు ప్రైవేటు బస్సులు తిరిగేవి.
రూపం, పనిని బట్టి వాటికి జనమే పేర్లు పెట్టేశారు. అవెంత సహజంగా ఉండేవో! ఇప్పటిలా వాటి రూపంతోనూ, పనితోనూ, స్థానిక భాషతోనూ సంబంధం లేకుండా పటాటోపపు పేర్లు ప్రజల నోట విన్పించేవే కాదు. ఇప్పుడు చూడండి … శీతలహంస (ఏసీ పనిచేయక హింస), మయూరి (నెమలి మాదిరిగానే గంటకు ఐదు కిలోమీటర్లు నడిచేది), సూపర్‌ లగ్జరీ (బిగుసుకుపోయిన అద్దాలు, వాలిపోయిన సీట్లు), లగ్జరీ (ఖరీదులో మిన్న సౌకర్యాలు సున్న), ఎక్స్‌ప్రెస్‌ (ఉదయం ఐదు గంటలకు చేరవలసిన బస్సు గడియారంలో సాయంత్రం అదే సంఖ్య చూపించే సమయానికి చేరే వాహనం) ఇలా ఏడుస్తున్నాయి.
సరే, చీరాల నుంచి మా ఊరి మీదుగా అద్దంకికి నాలుగు బస్సులు నడిచేవి. వాటిలో ఒకదాని పేరు రెఫ్పోడు… ఊరి చివర ఉండగానే ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకుగాను డ్రైవర హారను మోగించేవాడు. ఆ హారను రెఫ్ప్‌ … రెఫ్ప్‌ … రెఫ్ప్‌ … రెఫ్ప్‌ అంటూ శబ్దం వచ్చేది. దాన్ని బట్టే ఆ బస్సుకు రెఫ్ఫోడు (రెఫ్ప్‌ + వాడు) అని జనమే పేరు పెట్టారు. ఇంకోదాని పేరు పలకల బస్సు … రూపాన్ని బట్టి దానికా పేరు పెట్టారు. మిగతా బస్సుల మూలలు విశాలంగా ఉండేవి. అద్దాలకు కూడా వంపులుండేవి. ఈ బస్సుకేమో కచ్చితంగా గీతగీసినట్లు వంచి ఉండేది. అద్దాలేమో వంకర లేకుండా బస్సు మొత్తాన్నీ చూస్తే దీర్ఘచతురస్రాకారంగా ఉండేది. మూడోది పచ్చబస్సు … దాని రంగును బట్టే ఆ పేరొచ్చింది. మిగతా బస్సులు నాలుగయిదు రంగులతో ఉంటే ఇది మాత్రం నిండుగా పచ్చదనంతో ఉండేది. ఇక నాలుగో బస్సు పేరు గుర్తుకు తెచ్చుకునేందుకు ఎంత ప్రయత్నించినా వెలికిరావటం లేదు. అయితే నాకు తెలిసి కొన్నాళ్లే ఈ బస్సులు నడిచాయి. రాష్ట్ర ప్రభుత్వం బస్సుల్ని జాతీయం చేయటంతో మా ఊరికి బస్సులు రావటం ఆగిపోయింది. ఆగి పోయిన కాలం నాకు గుర్తులేదుగానీ, చివరకు ఆర్టీసి బస్సు 1985కుగానీ ప్రయాణం ప్రారంభించలేదు. ఆ మధ్య కాలమంతా మా గ్రామస్తులు ఎనిమిది కిలోమీటర్లు నడిచి ఉప్పుగుండూరులో బస్సులు ఎక్కేవాళ్లు. తిరుపతి, మదరాసు తదితర దూర ప్రాంతాలకయితే పొలాలమీదుగా చిన్నగంజాం నడిచెళ్లి అక్కడ రైలు బండి ఎక్కేవాళ్లు. 1950 ప్రాంతాల్లో ఒంగోలు – చీరాల ఒకటి రెండు బస్సులు తిరిగేవట. ఆ బస్సుల్ని బొగ్గుతో నడిపేవారని పెద్దవాళ్లు చెప్పగా విన్నాను. బస్సులోనే రాక్షసి బొగ్గును కుప్పగా పోసుకుని అవసరం మేరకు దానిని ఇంజినులో వేసి మండిస్తుంటే బస్సు నడిచేదట. దానికి ఓ చిన్న పరిశ్రమకు ఏర్పాటు చేసినంత పొగ గొట్టం ఉండేదట. 1980కు ముందు చీరాల – ఒంగోలుకు ఆర్టీసివాళ్లు మూడు రూపాయలు వసూలు చేసేవాళ్లు. అదే ఉప్పుగుండూరు నుంచి ఒంగోలుకు రెండు రూపాయలు, ఉప్పుగుండూరు – చీరాలకయితే రూపాయి ఉండేది. ఇప్పుడు వాటి ధరలు ఏడెనిమిది రెట్లు పైగా పెరిగింది. అన్నట్లు నాకు ఊహ వచ్చిన తర్వాత 1977లో తొలిసారిగా కడవకుదురు అనే ఊళ్లో రైలెక్కి అమ్మనబ్రోలుకు వెళ్లాను.

తింటే గారెలే … అహహహ పిల్లిపెసర్ల గారెలే తినాలి

”తింటే గారెలే తినాలి – వింటే భారతమే వినాలి” అంటారు పెద్దలు. అంటే రుచిలో గారెలకు మరేవీ సాటిరావు. నవరసాలూ కలగలిసిన భారతాన్ని కథగా వింటే అంత రుచ్యంగా ఉంటుంది. అందులోనూ ఈ సామెత ఇప్పటిదికాదు. భారతం తొలుత పుక్కిట పురాణం. అప్పటికింకా లిపి లేదు. అందువలన చరిత్ర, కథలూ, నమ్మకాలూ, వైద్యం ఇలా ప్రతిదీ కేవలం నాలుక ద్వారా మాత్రమే తర్వాత తరానికి చేరేవి. అంటే ఈ సామెత కూడా వినేకాలం నాటిది. భారతానికీ, గారెలకూ పోలిక పెట్టారంటే రెండూ ఒకే కాలానివయితేనే కదా! అబ్బో… గారెల వంటకమూ భారతం పుక్కిట రూపాన ఉన్న కాలంనాటిదన్నమాట.
ఈ రచన మినప గారెల గొప్పదన్నాన్నీ, భారతం కాలప్రమాణాల్నీ చర్చించటానికి కాదు సుమా. గారెలందు పిల్లిపెసర్ల గారెలు వేరయా! అని గుర్తుచేయటానికి. నా చిన్నతనంలో తిన్న పిల్లిపెసర్ల గారెల రుచి పాతికేళ్లు గడచినా మరచిపోలేకపోతున్నానంటే నిజ్జంగా నిజం. పిల్లిపెసర్ల గారెల్ని ఒక్కసారన్నా తిని చూడండి. మీరూ అంతే. జీవితంలో మరచిపోలేరు.
అయితే ఇక్కడొక చిక్కుంది. పిల్లిపెసర్లు దొరకటం ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది. అయితే మనసుంటే మార్గం ఉండకపోదన్నట్లుగా ప్రయత్నిస్తే దొరక్కపోవు. అపరాల అమ్మకం కేంద్రాలయిన ఒంగోలు, నర్సరావుపేటల్లో ప్రయత్నిస్తే దొరకొచ్చు. పిల్లి పెసర కూడా మినుము జాతికే చెందిన పంట. అయితే దీనిని పశువుల గడ్డి కోసం సాగు చేస్తారు. దీని గింజలు పెసల్లో నాలుగోవంతు మాత్రమే ఉంటాయి. అందుకనే దీనిని పిల్లి (చిన్న) పెసలని పిలుస్తారు.
సరే దొరకబుచ్చుకుంటే వాటిని వండే విధానం తెలియదని మదనపడాల్సిన పనేలేదు. ఎందుకంటే మినపగారెలు చేయటం ఎలాగో, పిల్లిపెసర్లతో గారెలు చేయటమూ అంతే. అన్నట్లు ఉల్లిపాయలు (అమ్మో! ఉల్లిపాయలు ఇప్పుడు కిలోగ్రాము రూ. 20 పలుకుతోందట) పచ్చిమిర్చి, అల్లం తరుగు వేయటం మర్చిపోకండేం!
చివరిగా ఒక్కమాట. మీకు పిల్లిపెసర్లు దొరికితే ఎక్కడ లభ్యమయ్యాయో, మన బ్లాగర్లందరికీ టముకు వేయటం మరచిపోకండి. తర్వాత… పిల్లిపెసర్ల గారెలు చేసుకుని మనసారా తినండి. తిన్న తర్వాత ఆ అనుభూతుల్ని అందరితో పంచుకోవటం కూడా మరచిపోవద్దండోయ్‌!

కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్‌! వెయ్యిమంది గూండాలకు బాస్‌!!


రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీజీ వెంకటేష్‌ ప్రజల హక్కుల భక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. టిజికి కర్నూలు హిట్లరన్న పేరొచ్చింది. ఆయన ప్రజాప్రతినిధిగా కన్నా గూండాల నాయకుడిగానే రాణిస్తున్నాడు. వెయ్యి మందికి పైగా గూండాలు ఆయన కొలువులో ఉపాధి పొందుతున్నారంటనే వాస్తవ పరిస్థితిని పట్టిచూపుతోంది. రాజు వెడలె రవి తేజము లలరగ అన్నట్లుగా టీజీ వెంట నిత్యం ఐదారు వందలమంది గూండాలు వెన్నంటి ఉంటున్నారట.
అంతేలేకుండా సాగుతోన్న ఆయన అక్రమాలను ఎవరు ప్రశ్నించినా వారిపై గూండాలను ఉసిగొల్పటం టీజీ తన హక్కుగా భావిస్తున్నాడనిపిస్తోంది. అభివృద్ధి పథకాలను సొంతం చేసుకునేందుకు ఆయన పడరానిపాట్లు పడుతూ అదేమన్నవారిని గూండాలతో దాడులు చేయించటం సాధారణమయింది. తన బ్లీచింగ్‌ పరిశ్రమ నుంచి సరుకును సరఫరా చేయకుండానే  రాష్ట్రంలోని నగరపాలక, వందలాది పురపాలక, వేలాది పంచాయతీల నుంచి సొమ్ముచేసుకోవటం ఎప్పటి నుంచో గుట్టుగా సాగుతోంది. గతేడాది తుంగభద్ర పొంగి కర్నూలు నగర ప్రజలను ముంచెత్తిన వరదలు టీజీకి కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయి. తన బ్లీచింగ్‌, తదితర పరిశ్రమలు, వాటి గోదాములు నీట మునిగాయని బీమా సంస్థల నుంచి కోట్ల రూపాయలను వెంకటేష్‌ కొల్లగొట్టుకున్నాడు. అంతవరకూ అయితే పోనీలే అనుకోవచ్చు. అదే సందర్భంలో ఒక్క కిలో బ్లీచింగు పొడిని కూడా సరఫరా చేయకుండానే కర్నూలు నగరపాలక సంస్థ నుంచి రూ. 60 లక్షల రూపాయల్ని మూటగట్టుకోవటమే ఆయన అక్రమాలకు పరాకాష్ట. ఇదీ మన శాసనసభ్యుల తీరు. టీజీ అక్రమాలను ప్రశ్నిస్తున్నాడన్న కోపంతో నాలుగయిదు దఫాలుగా నగరపాలక సభ్యుడిగా గెలుస్తోన్న కార్పోరేటరు పుల్లారెడ్డిని ఆగస్టులో గూండాలతో కొట్టించాడు. తనను ప్రశ్నించారన్న ఆక్రోశంతోనే ఈ నెలలోకూడా మరో ఇద్దరిని హత్య చేయించేందుకు ఆయన గూండాలు విఫలయత్నం చేశారు.
కర్నూలు నగరంలో కీలక కేంద్రంలో ఉన్న క్రిస్టియన్‌ సంఘానికి చెందిన ఎస్‌టిబిసి కళాశాల మైదానంలో ఐదు కోట్ల రూపాయలకు పైగా విలువచేసే ఎకరం స్థలాన్ని ఆక్రమించి దుకాణ సుముదాయాన్ని నిర్మిస్తున్నాడు. అదే విషయాన్ని విద్యార్థులు పురపాలకశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి సెప్టెంబరు 25న  ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీజీ ఆ విద్యార్థులపై తన గూండాలను ఉసిగొలిపి దాడి చేయించాడు. పోలీసులను ఆదేశించి వారిపై కేసులు పెట్టించాడు.
ఇది టీజీ సొంత వ్యవహారశైలే అయినా ఇదే తీరున పలువురు శాసనసభ్యులు ప్రజల హక్కులను హరిస్తున్నారు. మాన, ప్రాణాలను నిలువునా దోచుకుంటున్న హిట్లర్లనూ, ముస్సోలినీలను నిలువునా పాతరేసే రోజు ఎప్పుడొస్తుందోగదా?!

అతడు మద్య వ్యతిరేక యుద్ధంబున ఆరితేరినాడు

తాగొచ్చి గొడవ చేసే తండ్రి తీరు ఆ విద్యార్థిని ఆలోచింపజేసింది. ఇంటి దగ్గర చదువుకోలేని వాతావరణం అతనిని చేతలకు పురిగొల్పింది. మద్యం నుంచి తండ్రిని విముక్తి చేస్తేనే తన వ్యథతోపాటు గ్రామంలో పలు సమస్యలు పరిష్కారమవుతాయని పదిహేనేళ్ల ఆ పదో తరగతి విద్యార్థి బుర్రలో మెదిలింది. తనకొచ్చిన ఆలోచనను పెద్దలకు చెబితే ఎగతాళి చేశారు. తోటి విద్యార్థులను అడిగితే ”వామ్మో, అంతపని మనవల్లేమవుతుంది?” అంటూ నిరాశపరిచారు. ఆ పరిస్థితుల్లో మద్యం బాధితుడయిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఒకరు తోడుగా నిలిచాడు. ఇద్దరూ కలిసి ‘మద్య నిషేధం విధించండి. మద్యాన్ని తరిమికొట్టండి’ అంటూ రాసిన ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ వీధులెంట తిరగటం ప్రారంభించారు. కొందరు హేళన చేసినా వాళ్లు వెనుదిరగలేదు. ఇద్దరితో ప్రారంభమైన ప్రదర్శన గంట తిరిగే లోపే వారికి వందల మంది తోడయ్యారు. ఆ వ్యవహారం పెద్దల కళ్లు తెరిపించింది. మద్యం వ్యతిరేక ఉద్యమం ఉధృతమైంది. 11 రోజుల అనంతరం అధికార యంత్రాంగం కదిలింది. మద్య నిషేధ కమిటీ సభ్యులు ఆ గ్రామాన్ని సందర్శించారు. మద్యం వ్యతిరేక ఉద్యమకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో సారా ఉత్పత్తి చేసినా, అమ్మినా, తాగినా తీవ్రచర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. అధికారులు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామం పరిస్థితి ఇదీ. మద్య వ్యతిరేక ఉద్యమం ప్రారంభించిన విద్యార్థికి ఇంతటి మద్దతు రావడం వెనుక ఆ గ్రామంలో గత రెండేళ్లలో సారా తాగి 130 చనిపోవటం ప్రధాన కారణం.
కృష్ణా జిల్లా తిరువూరు సరిహద్దులో ఉన్న ముత్తగూడెంలో 800 కుటుంబాలున్నాయి. వారిలో దళితులు, గిరిజనులే అధికం. వారంతా భూమిలేని నిరుపేదలు. రెక్కాడితే డొక్కాడని కూలీలు. ఆ గ్రామంపై ఐదేళ్ల క్రితం మద్యం వ్యాపారుల కన్ను పడింది. అప్పటి వరకూ ఆ గ్రామంలో కొందరు బయటి ప్రాంతానికి వెళ్లి తాగేవాళ్లు. అలాంటి గ్రామంపై కన్నేసిన వ్యాపారులు కొందరు ధనిక యువకులను ప్రలోభపెట్టారు. వారికి ముడి సరుకుల్ని అందజేసి సారా తయారీని అక్కడే ప్రారంభించారు. దానిని దళారుల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికితోడు గ్రామంలో విచ్చలవిడిగా గొలుసుకట్టు మద్యం దుకాణాలనూ నెలకొల్పారు. ఈ గ్రామంలో 40 మంది దొంగ మద్యం వ్యాపారులున్నట్లు పోలీసులు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో ఆ గ్రామంలో 170 మంది చనిపోగా, వారిలో 130 మంది మద్యం వలనే ప్రాణాలు విడిచారని తేల్చారు. ఇదే ఉద్యమం రూపుదాల్చడానికి కారణమయింది.
దళిత కుటుంబానికి చెందిన బి వెంకటకృష్ణ ముత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడి సోదరి ఇంటర్మీడియట్‌ చదువుతోంది. తండ్రి కోటేశ్వరరావు వంటల మేస్త్రి. కోటేశ్వవరరావుకు పనున్నా లేకున్నా తాగి ఇంటికి రావడం, భార్యను తిట్టడం, ప్రశ్నిస్తే పిల్లలను కొట్టడం రివాజయింది. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరైనా అదీ పూర్తి చేసుకోలేకపోయాడు. కోటేశ్వరరావు నిత్యం చేసే గొడవతో ఆ పిల్లలకు ఇంటి దగ్గర చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇంటి దగ్గర చదవటం లేదని ూపాధ్యాయులతో తరచూ దెబ్బలు తినాల్సి వచ్చేది. దీంతో అక్కా తమ్ముడు మాట్లాడుకున్నారు. తండ్రిలో మార్పు రావాలంటే సారాను మానిపించాలి. ఇదే సమస్యతో బాధపడుతోన్న మరో విద్యార్థి కృష్ణారెడ్డి వారికి తోడయ్యాడు. ఆ విధంగా సెప్టెంబరు తొమ్మిదో తేదీ రాత్రి ఆ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. గంట సేపటి తర్వాత పలువురు వారితో చేతులు కలిపారు.
ముత్తగూడెంలో 160 మందికి వితంతు పింఛన్లు అందుతున్నాయి. లబ్ధిదారుల్లో 130 మంది మద్యం బాధిత కుటుంబాలకు చెందిన మహిళలే. అందరిదీ 40 ఏళ్లలోపు వయస్సే. వీరిలో ఏ ఒక్కరికీ సెంటు భూమి లేదు. కూలికి వెళ్తేనే పూట గడిచే పరిస్థితి వారిది.
10వ తేదీన గ్రామంలో విద్యార్థులు ప్రదర్శన చేశారు. మద్యం మహమ్మారితో భర్తలను కోల్పోయిన బాధిత మహిళలు కూడా విద్యార్థులతో చేతులు కలిపారు. దీంతో గుడుంబా తయారీదారులను గుర్తించి సరుకును ధ్వంసం చేయటం ప్రారంభమయింది. ఈ క్రమంలో కొందరికి బెదిరింపులు వచ్చాయి. కనీసం  మద్యం గొలుసు దుకాణాలనయినా నిర్వహించుకునేందుకు ఒప్పుకోకపోతే ఇబ్బందులు తప్పవని గ్రామానికి చెందిన పెత్తందారి ఒకడు బెదిరించినా మహిళలు లొంగలేదు.
విద్యార్థులు, మహిళలకూ సహకరించేందుకు యువత నడుం కట్టింది. ఇది ఉద్యమం విజయవంతానికి తోడ్పడింది. 12 రోజుల నుంచీ ఆ గ్రామంలో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. తాగినవారు వీధుల వెంట కనపడడం లేదు. ఉద్యమాన్ని ప్రారంభించిన వెంకటకృష్ణ తండ్రి కోటేశ్వరరావు బుద్ధిగా ఉండడంతోపాటు పనికి వెళ్తున్నాడు. చిన్నవాడయినా తన కుమారుడు కళ్లు తెరిపించాడంటూ తనను పలుకరించిన వారి వద్ద కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు.
తడిక నిర్మల భర్త శివయ్య తాగితాగి ఐదు నెలల క్రితం చనిపోయాడు. మద్య నిషేధ ఉద్యమంలో ఆమె ముందున్నారు. సెంటు భూమి లేని ఆమె తన ఇద్దరు పిల్లలనూ చిన్నాచితకా పనులు చేసి చదివిస్తోంది.
సారాకి బానిసై భర్త చనిపోయిన జి నర్సమ్మ తన ముగ్గురు పిల్లల్ని బతికించుకునేందుకు  సారా అమ్ముతూ ఉద్యమతో కళ్లు తెరిచింది. కూలికి వెళ్లటం ప్రారంభించింది.