”ఆరోగ్యశ్రీ పథకం ఆయన కులపోళ్ల ఆసుపత్రులకు పోయె, ఉపాథి పథకం ఊరూరా ఆయన ఆశ్రితులకు దక్కె, జలశ్రీ ఏకంగా ఆయనే బినామీ పేర్లతో చేజిక్కించుకునే, భోజనశ్రీని కడుపులపాయ పాలేరు కొడుక్కి కట్టబెట్టె, తవ్వకశ్రీ పథకాన్ని తన బావకీ, బావమరిదికీ, అల్లుడికీ కలిపి రాసిచ్చె, రక్షణశ్రీని ఆయనతో కలిసి ఒకటో తరగతి చదివిన ఓపి కామచంద్రరావుకి అప్పగించె, పరిశ్రమశ్రీని తన కుమారుడికీ, తమిళతంబి పిండియన్ కిమెంట్స్‌కి ఇచ్చేశా, స్థలాల్నేమో పాజకోపాల్‌కి, పొలాల్నేమో మంత్రాటిక్స్ కిసాబ్‌కి రాసిచ్చే, ఇక చదువుకోండి … చదువుకోక పోండి పథకాన్ని తన సేవకుడు కూరిగాడికిచ్చేసే… ఇంకేమున్నాయండీ నా బొంద మీరు ఇవ్వటానికీ, మేము పుచ్చుకోవటానికీ.” ముక్కుమంత్రి ముఖ్యులతో జరిపిన సమావేశంలో అవేశం, ఆందోళన కలగలిపి ఏకధాటిగా ఏకరువు పెట్టాడు సీనియర్ల లీడరు శాలువాయి మర్ధనరెడ్డి.
”అంతా సరేనండి, ఇంకా ఏమున్నాయో వెతకండి. మీకూ తలా ఒకటి పంచుతాను. దయచేసి సీనియర్లుగా మీరంతా నాకు మద్దతు ఇవ్వాలి మరి.” ముక్కుమంత్రి అభ్యర్థించాడు వందోసారి.
”అన్నట్లు మీకు ఇంకొక విషయం గుర్తుచేయాలి. ప్రపంచబ్యాంకు అధికారులు నిన్ననే నన్ను కలిసి వాయగొట్టారు. అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటుతున్నా వాళ్లు అనుకున్నంత వేగంగా వేటుశ్రీ కార్యక్రమాన్ని అమలు చేయటం లేదని కస్సుబుస్సులాడారు. ఇట్లాగే చేస్తే అప్పుల చిప్ప పథకాన్ని తక్షణం రద్దు చేసుకుంటామని హెచ్చరించారు. అందుకని మన రాష్ట్ర ప్రజలు ఇంకా ఊరకూరకే ఉపయోగించుకుంటున్న సేవలు ఏమున్నాయో వెదకండి. వాటిని పనిలోపనిగా పంచేసుకోవచ్చు. ప్రపంచబ్యాంకు నుంచి ఒకటో రెండో చిప్పలు తెచ్చుకుని తినేయొచ్చు.” తమకు పదవులే కాకుండా, ఒక్క పథకమూ దక్కలేదంటూ కోపంతో ఊగిపోతున్న సీనియర్లకు ఆశలు కల్పించాడు ముక్కుమంత్రి కాజేసేటి పోశయ్య.
అదే సమయంలో ”యురేకా … యురేకా” అంటే కేసీ బ్రదర్స్ పెద్దోడు కేకపెట్టాడు.
”చెప్పండి, చెప్పండి” అంటూ సీనియర్లంతా ఆయన చుట్టూ మూగారు.
”పుట్టినవాడు గిట్టక మానడు. గిట్టినవాడిని తీసుకుపోక తప్పదు” చెప్పాడు కేసీ బ్రదర్స్ పెద్దోడు.
”ఏంటో, నువ్వేమి చెబుతున్నావో, నీకు తెలుస్తున్నట్లు లేదు. తలా కాస్త మేసేందుకు పనికొచ్చే పథకం చెప్పరా మగడా అంటే చావు, పాడె, శ్మశానం అంటావేంటి? ఆవేశపడిపోయాడు పానారెడ్డి.
”వస్తన్నా, అక్కడికే వస్తన్నా… మన రాష్ట్రంలో మన పుణ్యమా అని శ్మశానాలకి ఎక్కడలేని గిరాకీ వచ్చిపడిందిప్పుడు. వాటిని ఎవరికి కావాల్సినన్ని వాళ్లు తీసుకుందాం. ప్రపంచబ్యాంకు నుంచి చిప్పల పథకం కింద నిధులు తీసుకుని తిన్నంత తిని, పదో పరకో ఖర్చుపెట్టి వాటికి కాస్త సున్నం కొడదాం. శవానికి ఇంతని రుసుము వసూలు చేసుకుందాం. ఈ పని ఛెండాలమని అనుకునేవాళ్లు ఒకపని చేయొచ్చు. ఎవరో ఒకరికి సబ్ కాంట్రాక్టు ఇచ్చేయొచ్చు. ముందే ఇంతని కొట్టేయొచ్చు. రాజధానిలోనే 1500 శ్మశానాలున్నాయి. పనిలో పనిగా కొన్నింటిని మూసేసి స్థలాల్ని చక్కబెట్టుకోవచ్చు. మొత్తం మొత్తం వీలుగాకపోతే కొంత కొంత అమ్మేసుకోవచ్చు. ఎట్లా ఉంది నా ఆలోచన? కేసీ బ్రదర్ పెద్దోడు అందరి ముఖాల్లోకి చూస్తూ ఆగాడు.
ఒకరిద్దరు మాత్రం నా ముఖంలా ఉందని ఈసడించుకున్నా, మిగతా వాళ్లంతా ”బాగుంది, బాగుంది” అంటూ భుజం తట్టారు.
”సరే, నాకూ ఇది బాగానే ఉందనిపిస్తోంది. పనిలో పనిగా శ్మశాన సేవలన్నింటికీ తిరుమల మాదిరిగా టిక్కెట్లు పెట్టేయండి. శవం లోపలికి రావాలంటే ఇంత, గుంతకయితే ఇంత, కాల్చాలంటే ఇంత, కాలుపుకు మామూలు కట్టెలయితే ఇంత, గంధపు చెక్కలయితే ఇంత, కాళ్లు కడుక్కున్నందుకు ఇంత, స్నానాలు చేస్తే ఇంత, ఎములు వేరి పెట్టినందుకు ఇంత, బ్రాహ్నణ సేవలకు ఇంత… ఇయ్యన్నీ మీకు చెప్పాలా? ప్రతిదానికీ వసూలు చేయించుకోండి. ఏడాది తిరిగే సరికి సూట్‌కేసులు నిండకపోతే నన్నడగండి. అయితే నన్ను మాత్రం మర్చిపోమాకండి. అన్నట్లు శ్మశానం ఖర్చు పెరిగితే శవాల్ని ఆసుపత్రుల్లోనో, వీధుల్లోనో వదిలేసి పారిపోయేవాళ్లు పెరిగిపోతారు. అందుకని ఓ పనిచేద్దాం. అసలే కొత్త పథకాలు మొదలు పెట్టరేమని ప్రజలు ఒకటే అడుగుతున్నారు. తెల్లకార్డు ఉన్నోళ్లందరికీ శ్మశానం ఖర్చుల్ని ప్రభుత్వమే భరించే విధంగా మరణశ్రీ అని పథకం పెడదాం. ఏడాదో, రెండేళ్లో నడుపుదాం. తర్వాత బీమా పథకం పెట్టి అందరూ దాన్లో చేరితే తప్ప చావంటే చావుకే భయంపుట్టేలా చేద్దాం. చచ్చినట్లు తినో తినకో చావు ఖర్చులకి బీమా చేసుకునేలా చేద్దాం. అన్నట్లు పనిలో పనిగా మరణశ్రీ పథకం నిధుల్ని బొక్కేయొచ్చు. ఇక బీమా పథకాన్ని కూడా కొన్ని సంస్థలకే ఇచ్చే విధంగా ప్లాను చేద్దాం. అవసరమయితే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కదానికి ఇద్దాం. ఎవరికి ఏ ప్రాంతం కావాలో నిర్ణయించుకోండి. ఇప్పుడే బీమా సంస్థల్ని ప్రారంభించండి. సమయం రాగానే ఎవరిది వాళ్లకు అప్పగిస్తా. అన్నట్లు నన్ను మాత్రం మరచిపోకండి. దీనికి అందరూ ఇష్టపడినట్లేకదా?. ఇక సమావేశం ముగిద్దాం. అమ్మగారు పానియమ్మతో ఈ విషయాలన్నింటినీ విన్నవించుకోవాలి. అబ్బాయిగారితో ఆమోద ముద్ర వేయించుకోవాలి.” ఊడిపోతోన్న పంచెను తిరిగి దోపుకుంటూ ముక్కుమంత్రి బయలుదేరటంతో సీనియర్లు కూడా లేచారు ఏఏ శ్మశానాలని తమ ఖాతాలో వేసుకోవాలో ఆలోచిస్తూ…
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
”ఇప్పుడు మన ముక్కుమంత్రి కాజేసేటి పోశయ్యగారిని ఉపన్యసించవలసినదిగా కోరుతున్నాను” పోజివ్ మరణశ్రీ పథకం ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన ఆరోగ్యశాఖ మంత్రి మానం బానేందర్ సిఎంను ఆహ్వానించారు.
పోశయ్య ముఖం కళతప్పిందా రోజు. ఎప్పుడు చూసినా చేతులు కట్టుకునే ఉంటున్నాడాయన. చలికి వణుకుతున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఆయనకు స్వల్పంగా జ్వరం ఉందట. ముఖ్యమంత్రి ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు అందించేందుకుగాను 24 గంటలు ఛానలు 48 గంటల నుంచీ క్షణం క్షణం పేరుతో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇప్పుడు కూడా పోజివ్ మరణశ్రీ కార్యక్రమ వార్తల కన్నా ముఖ్యమంత్రి ఆరోగ్య విషయాలపైనే ఆ ఛానలు విలేకరి దృష్టిసారించాడు. ముఖ్యమంత్రి పోశయ్య జ్వరం నిజమయినదేనా? కాదా? అన్న ఎస్‌ఎంఎస్ కార్యక్రమాన్ని కూడా ఆ ఛానలు నడుపుతోంది. ఊడిపోయేటట్లున్న పంచెను వెనక దోపుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి మౌత్ డయాస్ వెనుక నుంచోగానే వీడియో కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు డజన్ల సంఖ్యలో ఆయనను చుట్టుముట్టారు. ముందున్నవాళ్లకు మాట తప్ప ఆయన కనపడటం లేదు. అదంతా నాలుగయిదేళ్లుగా అలవాటయిపోవటంతో ఎవ్వరూ పట్టించుకోలేదు.
మొత్తం 177 మందిని పలవరించిన తర్వాత (ఇది పోసుకోలు టీవీ విలేకరి చెంచారావు పిటుసి ఇవ్వగా ఇప్పుడే ప్రసారమయింది.) పోశయ్య రొప్పుతూ ”మన దివంగత ముఖ్యమంత్రి నో.ఎస్‌గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం స్ఫూర్తితో మా ప్రభుత్వం మన ప్రధాన మంత్రి చాకులు వాంతీగారి తండ్రిగారయిన పోజివ్‌వాంతీ పేరుమీద మరణశ్రీ పథకాన్ని, వారి తాతమ్మగారు బందలమ్మపేరుమీద శ్మశానశ్రీ పథకాన్ని, కర్మకాండల ఖర్చుల్ని తట్టుకునేందుకు అవసరమయిన డబ్బూదస్కాన్ని దాచిపెట్టుకునేందుకు లాక్కోశ్రీ, పీక్కోశ్రీని ఇలా మరణించిన తర్వాత అవసరమయినవాటన్నింటికీ వివిధ పథకాలను మా పాలన రెండో ఏడాదికి చేరిన సందర్భంగా ప్రవేశపెడుతున్నామని ప్రకటించేందుకు సంతోషిస్తున్నాను. రాష్ట్రంలో ఇకముందు ఎవ్వరూ అనాధలుగా చావకూడదు. బతికున్నప్పటికన్నా మనకు చావుకు సంబంధించే ఎక్కువ మక్కువ మనకు. పెళ్లికన్నా చచ్చినవాడికి చేయాల్సిన పనులకే ఎక్కువ ఖర్చు కూడా. అందుకనే చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అన్నాడు కదా మన మహాకవి శ్రీశ్రీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీ కోసం ప్రవేశ పెట్టిన శ్మశానశ్రీ, మరణశ్రీ, లాక్కోశ్రీ- పీక్కోశ్రీ పథకాలన్నింటినీ అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. జైహింద్” ఉపన్యాసం ముగించారు ముక్కుమంత్రి.
”ఈ కార్యక్రమంలో చివరిగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పథకం లబ్ధిదారులకు మన ముక్కుమంత్రిగారు గుర్తింపు పత్రాలను పంపిణీ చేస్తారు.” అనారోగ్యశాఖ మంత్రి ప్రకటించటంతో ప్రజలు బారులు- బారులు…బారులుదీరారు.
Archive for సెప్టెంబర్ 3rd, 2010
3 సెప్టెం