Archive for సెప్టెంబర్ 4th, 2010

మా మల్లార’ప్పంతులు’గారికి వేనవేల దండాలు

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరికీ
శుభాకాంక్షలు. ఆ మాటకొస్తే అందరూ ఉపాధ్యాయులే. ఎందుకంటే ప్రకృతి సహా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతో ఇంతో నేర్పని వారుండరు. అయితే ఇది ప్రత్యేకించి చదువు నేర్పించేవారి దినోత్సవం కాబట్టి ఉపాధ్యాయులకు నమోవాకాలు.

ప్రకాశం జిల్లా దుద్దుకూరు ఆచార్య రంగా జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో పొనుగుబాటి వెంకటసుబ్బారావు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నివాసం మాత్రం మా గ్రామమయిన ఈదుమూడి. రోజూ మాతోనే రెండు + రెండు = నాలుగు కిలోమీటర్లు నడిచేవారు. అయనిది మల్లవరం అయినందున ఆయన్ని అందరూ మల్లారప్పంతులు అని పిలిచేవారు. ఉద్యోగ విరమణాననంతరం ప్రస్తుతం ఇంకొల్లులో ఉంటోన్న ఆయనకు వేనవేల దండాలు. ఆయన భౌతిక శాస్త్రంతోపాటు జీవ శాస్త్రాన్నీ, గణితం, ఆంగ్ల పాఠ్యాంశాలను కూడా బోధించేవారు. ఏ పాఠాన్నయినా అరటికాయ వలిచి నోట్లో పెట్టినట్లు బోధించేవారు. అందుకనే ఆయన శిష్యులు వందలాది మంది ఇంజినీర్లయ్యారు. అన్ని రంగాలవారినీ కలిపి లెక్కిస్తే ఆ సంఖ్య వేలకు చేరుతుందంటే అతిశయోక్తికాదు. మా గ్రామంలోనే 40 మందికిపైగా ఇంజినీర్లవటం ఆయన ప్రత్యేకతను పట్టిచూపుతోంది. కావూరి అప్పారావు, కావూరి సాంబశివరావు, కావూరి కన్నయ్య ఇలా మా దాయాదులు పలువురు ఇంజినీర్లుగా అమెరికాలో ఉంటున్నారు. కావూరి నవీన్‌ ఎంఫార్మసీ చదివి అరబిందోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. కావూరి నాగార్జున, కావూరి అంకినీడు ఉపాధ్యాయులయ్యారు.
రాత్రిపూట అసలు చదవకపోయినా ఆయన ఏమీ అనేవాడు కాదు. అందరినీ రాత్రి ఎనిమిది గంటలకల్లా పడుకోబెట్టటం ఆయన ప్రత్యేకత. అయితే వేకువజామున అదీ మూడు గంటలకే నిద్రలేపేవాడు. పైగా అది జనవరి నెల అయినా సరే దుప్పటి కప్పుకుంటే ఒప్పుకునేవారు కాదు. ఆ సమయంలో ఆకాశం నుంచి విడుదలయ్యే ఆల్ట్రావైలెట్‌ కిరణాలు శరీరానికి సోకితే ఆరోగ్యానికి మంచిదని ఆయన వివరించేవారు. దుప్పటి కప్పుకుంటే చదవకుండా హాయిగా నిద్ర పోతారని ఆయన భయం. వేకువజాము చదువుకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు.
ప్రతిరోజూ ఇంగ్లీషు గ్లామరు బోధించేవారు. ప్రతి అంశాన్నీ ముందుగా వివరించి తర్వాత పదేపదే నమూనాలు రాయించేవారు. గణితాన్ని కూడా నామిని సుబ్రమణ్యం అంతకాదుగానీ, బాగా అర్ధవంతంగా బోధించేవారు. వాళ్ల నాయనమ్మ నెయ్యి మొత్తాన్నీ ఎలా వంపుకునేదీ, తాను గుంటూరు విద్యార్థి వసతి గృహంలో ఉండగా సాంబారులో ఉల్లిపాయలన్నింటినీ కొట్టేసేందుకు తన మిత్రబృందంతో వేసిన ఎత్తుగడలు, ఒక పరాజితుడు పొరబాటు, గ్రహపాటు, అలవాటు పదాలను ఎలా వినియోగించుకున్నదీ, ఆయన బంధువొకరు చుట్టానికి దక్కకుండా గారెలన్నింటినీ తిన్న సంగతులు ఇలా పలు అనుభవాలను పాఠాలు చెబుతూనే జోడించి చెప్పి నవ్విస్తుండేవారు. డబ్బులు వసూలు చేసుకునే లక్ష్యంతో కాకుండా విద్యార్థులకు మరింత నేర్పాలనే ఉద్దేశంతో ప్రైవేటు (ట్యూషన్లు) నిర్వహించేవారు. అందులోనూ బంధువులు, పేదలు, ఉపాధ్యాయుల కుటుంబాలకు చెందిన వారి నుంచయితే ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు. కనీసం ఒక్కరినైనా ఇంట్లో పెట్టుకుని చదివించటాన్ని ఆయన చివరిదాకా వీడలేదు. అయితే వేలాది మందికి తన బోధనతో చక్కటి జీవితాలను అందించిన ఆయన తన బిడ్డల విషయంలో మాత్రం ఎందుకనో అంత శ్రద్ధ పెట్టలేకపోయారు. ఇష్టం లేక మాత్రం కానేకాదు. బహూశా తన బిడ్డలపై అధిక శ్రద్ధప పెడితే లోకం తప్పుపడుతుందని భావించారేమో తెలియదు. ఈసారి కలిసినప్పుడు ప్రశ్నించి తెలుసుకోవాలి. బిఎస్సీ చదివిన కుమారుడు కాంపౌండరుగానూ, ఎంఎ చదివిన కుమార్తె సామాన్య గృహిణిగానూ జీవితం గడుపుతున్నారు.

మా నాన్న కోటేశ్వరరావు ఆయన సహ ఉపాధ్యాయుడయినందున ప్రాథమిక పాఠశాల నుంచే నేనూ మల్లారప్పంతులుగారి ప్రైవేటుకు వెళ్తుండేవాడిని. పదో తరగతిలో ఆనాడు రంగారావు (హైదరాబాదులో కార్పొరేట్‌ ఉద్యోగి), కంచర్ల ఇంటిపేరున్న మరొక (గుంటూరు జిల్లా బాపట్లలో బట్టల వ్యాపారి) విద్యార్థి ఉండేవారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక ఇంగ్లీషు స్టోరీని చూడకుండా రాయాలి. పంతులుగారు ఉదయం కాగానే ”రంగారావ్‌ స్టోరీ వచ్చిందా? కంచర్లా స్టోరీ వచ్చినట్లేనా? అడిగేవారు. వాళ్లేమో ”అంతా వచ్చింది సార్‌, చివర్లో కొద్దిగా  ఉంది. అది చదివి రాస్తా సార్‌” అని ప్రతిరోజూ, ప్రతిసారీ విధిగా గడువు కోరేవారు. ”ఎంత సేపు కావాలి?” అడిగేవారాయన. పది నిమిషాలో, పావుగంటో సమయం అడిగేవాళ్లు. అయితే కోరిన సమయం ముగిసినా వాళ్లకు ఆ స్టోరీ వచ్చేది కాదు. ఒకటికి నాలుగుసార్లు సమయాన్ని పొడిగించినా అదే పరిస్ధితి. మల్లారప్పంతులుగారు అప్పుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించేవారు. నిద్రలో కూరుకుపోతే చదువెలా వస్తుందని ప్రశ్నించేవారు. ఆనాడు మా ఊళ్లో పొగాకు కొట్టటం అయిన తర్వాత ఆ మొక్కల్ని ఎండబెట్టి వంటచెరకుగా వినియోగించేవారు. వాటిని పొక్కట్టెలు అంటారు. వాళ్లిద్దర్నీ పొక్కెట్టెలతో ఆయన సన్మానించేవారు. కనీసం పదిపదిహేను పొక్కట్టెలయినా పగిలిపోయేవి. పొక్కెట్టలు బోలుగా ఉంటాయి. నిజానికి వాటిని ఎత్తి పట్టుకుంటేనే విరిగి పడిపోయేవి. చదవకుండా నిద్రపోయే విద్యార్థుల్ని ఆయన సన్మానించే పద్ధతి అది. పదో తరగతి విద్యార్థుల్ని కాక ఇతరులెవరికీ ఆ మాత్రం శిక్ష కూడా వేసేవారు కాదు. కాకపోతే మాటలతోనే గట్టిగా భయపెట్టేవారు.
నారాయణ – గారెల బుట్ట కథ
మల్లారప్పంతులుగారికి మా ఊళ్లో నారాయణ అని బంధువు ఉండేవారు. నారాయణకు గారెలంటే మహా ఇష్టమట. నారాయణ ఇంటికి ఓ రోజు బంధువొకడు వచ్చాడు. రాకరాక వచ్చిన బంధువు కోసం నారాయణ భార్య గారెలు వండి వారిద్దరికీ వడ్డించింది. నారాయణకేమో బుట్టలోని గారెలన్నింటినీ తానే తినేయాలని కోరిక కలిగింది. ఆలోచించి ఎత్తువేశాడు.
నారాయణ : థూ, ఇంత ఛెండాలంగానా గారెలు వండేది? మనిషన్నవాడెవడయినా వీటిని తింటాడా?
భర్త ఎత్తుగడ తెలియని ఆమె ”అదేందండీ! బాగానే ఉన్నాయే?” అంది అమాయకంగా.
నారాయణ : బాగా ఉన్నాయా? నీకు తలకాయ పనిచేస్తోందా? అంటూ చేతిలో ఉన్న గారెను మూలకు విసిరకొట్టి, ప్లేటును నెట్టేశాడు. అప్పటికే గారె తింటోన్న బంధువుకు దాన్లో ఏమి బాగాలేదో అర్ధం కాలేదు. అయితే ఇంటాయన బాగా లేవని అంతగా చెబుతుంటే తినటం ఎట్లా? తింటే కక్కుర్తిగాడని అనుకోరూ? చేసేదేమీ లేక బంధువు కూడా గారెల్ని పక్కన బెట్టేశాడు. సాయంకాలానికి బంధువు వెళ్లిపోయాడు. అప్పుడు నారాయణ గారెల బుట్టను ముందు పెట్టుకుని ఒక్క ముక్క మిగలకుండా లాగించేశాడు. ఇదీ గారెల కథ. పప్పులో ఉప్పు కథను కూడా మల్లారప్పంతులుగారి నోట తరచూ వినేవాళ్లం.

శేఖర్‌ కమ్ముల! ఎందుకీ వంచన?!

”టైటిల్‌ కోసం చాలా ఆలోచించాను. తెలుగులో మరో పేరు తట్టలేదు. అందుకే లైప్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ అని పెట్టాను. సినిమాలో మాత్రం తెలుగుదనం ఉంటుంది.” – తన నూతన తెలుగు చలనచిత్ర విశేషాలను శుక్రవారంనాడు హైదరాబాదులో పాత్రికేయులకు వివరిస్తూ శేఖర్‌ కమ్ముల.

మూస కల్మషంలో తలమునకలుగా ఈదుతోన్న తెలుగు చలనచిత్రలోకాన్ని మలుపు తిప్పేందుకు తనవంతు ప్రయత్నాన్ని నిజాయితీగా నిర్వహిస్తోన్న అతి కొద్దిమందిలో శేఖర్‌ మ్ముల ఒకరు. అందులో ఎలాంటి వివాదాలకూ చొటు లేకపోవచ్చు, అయితే తెలుగు భాషకు సంబంధించి ఆయన చేసిందేమీ లేదు. చేయకపోవటం తప్పుకాదు. అందరూ అన్నీ చేయలేరు కూడా. తామున్న రంగంలోనే మంచికోసం ప్రయత్నించటం, మంచి సంప్రదాయాలను గౌరవిస్తూ, చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేయటమే ధర్మం. తనజాతికి ఊపిరయిన భాష చావుకు సమిథలు పేర్చకుండా ఉంటే చాలు. తెలుగువారంతా తెలుగులోనే ఆలోచించటం, తెలుగువారందిరితో తెలుగులోనే మాట్లాడటం, తెలుగువారందరికీ తెలుగులోనే రాసి చూపటం ఇదీ వ్యక్తులుగా చేయవలసి విధి. తెలుగుభాషాభివృద్ధికి నిర్వర్తించే కార్యక్రమాలకు హాజరుకావటం, మద్దతు తెలపటం, ఆర్థిక, హార్థిక సహాయ సహకారాలు అందిచటం  ఇవాల్టి అవసరం. తమ బిడ్డల్ని కనీసం పదో తరగతి వరకయినా మాతృభాషలో చదివించటం శాస్రీయం. కనీసం తెలుగే మాట్లాడించటం, తెలుగును ఒక పాఠ్యాంశంగా చదివించటమయినా కొంతలో కొంతలో మేలే. నేను మా పిల్లలను పదోతరగతి వరకూ తెలుగు మాథ్యమంలో చదివించాను. డాడీ, డాడ్‌, మమ్మీ, మామ్‌ పిలుపుల్ని ప్రోత్సహించలేదు. మనలాంటి సామాన్యులకంటే అధికంగా భాషా శాస్త్రవేత్తలు, పండితులు, అభిమానులు తెలుగు అభివృద్ధికి కృషిసల్పుతారు.
తొలి రెండు చిత్రాలకూ ‘అనంద్‌’, ‘గోదావరి’ అంటూ తెలుగు పేర్లనే పెట్టిన శేఖర్‌ కమ్ముల తదుపరి చిత్రాలకు ‘హ్యాపీడేస్‌’, లీడర్‌ అంటూ ఆంగ్లాన్ని అద్దటం వెనుక వ్యాపారం ఉందంటే కాదనగలరా? కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి … ఏదో ఒకటి చేసి నష్టపొమ్మంటారా? అని మీరు ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం లేదు. అందువలన మీ చిత్రాలకు మీ ఇష్టమొచ్చిన భాషలో పేర్లు పెట్టుకోండి. మాకు, ప్రత్యేకించి నాకు ఇష్టముంటే చూస్తాను, లేకపోతే లేదు. ఇంతవరకూ మీతో నాకు విభేదం ఏమీ లేదు. అయితే ”తెలుగులో మరో పేరు తట్టలేదు” అని మీరన్నారు చూడండి, దాంతోనే నేను పూర్తిగా విభేదిస్తున్నాను. మిమ్మల్ని తప్పుపడుతున్నాను కూడా. గుళ్లో గుగ్గిలం వేయకపోతేమానె, ఇంకోటేదో చేయొద్దని మన పెద్దలన్నమాట మీరూ వినే ఉంటారు. మీరు నిజాయితీ పరులే ఒప్పుకుంటాను. అంతమాత్రాన అమాయకులు కాదు. అందుకనే వ్యాపార సూత్రాలననుసరించి మీ కొత్త సినిమాకు లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ అని ఆంగ్లంలో నామకరణం చేశారు. ఇవాళ సినిమాలను ఆదరిస్తున్నది చదువుకున్న పాతికేళ్లలోపు యువతరం అని మీకు తెలుసు. ఆంగ్లం మోజులో పీకల్లోతున మనం దించేసిన నేటి యువతరానికి నచ్చేలా, మెచ్చేలా, వారిని ఆకట్టుకునేలా ఆంగ్లం పట్ల మీరు వ్యాపార పరంగా మొగ్గారు. మళ్లీ మరోమారు మీకు గుర్తుచేసేదేమిటంటే అది తప్పుకాదు. నేరం అసలే కాదు. కాకపోతే అమ్మను మరచిపోయారు. దానికి తప్పంతా అమ్మదే అంటున్నారు.
లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ అన్నదానికి తెలుగు దొరకలేదా? ఎందుకండీ ఈ వంచన. మీకు తెలిసో తెలియకో, మీరు మీ వ్యాపార సూత్రాలను అనుసరిస్తున్నారు. దానికి మసిబూసి మారేడు కాయ చేద్దామనకుంటే ఎట్లా? ఎందుకండీ నయవంచన. ఈ రోజున కొందరయినా అనుసరించే పెద్ద మనిషి స్ధానంలో మీరు ఉన్నారు కదా. మీ చిత్రానికి సరయిన తెలుగు పదమే దొరకలేదని మీరు ప్రత్యేకంగా చెప్పకుండా
ఉండాల్సింది. అప్పుడెవరూ ప్రత్యేకంగా పట్టించుకునేవారు కాదు. కానీ మీరు ప్రకటించిన తర్వాత కొద్దిమందయినా కాబోలనుకుంటారు. అదే నిజమని నమ్ముతారు. తెలుగు భాష అసమగ్రమని తేల్చేస్తారు. అది ప్రమాదం. తెలుగుభాష అసలే ప్రమాదంలో ఉంది. ఆత్మహత్యకు సిద్ధపడి చివరి ఆలోచనలు చేస్తోంది. అలాంటిదానిని మీరు లోయలోకి తోసే ప్రయత్నం చేసేశారు మహాశయా. అదే నా బాధంతా. అన్నట్లు మీ నూతన చిత్రానికి అద్భుతమైన పేరు సూచించగల అద్భుతమైన ఆలోచనాపరులు (పండితులు కాదు సుమా … బ్లాగర్లు) ప్రపంచవ్యాపితంగా బోలెడు మంది ఉన్నారని నా ప్రగాఢ నమ్మకం. నమ్మకం కాదు, అనుభవం. కావాలంటే ఒక్క పిలుపివ్వండి. మంచి పేరును ఆహ్వానించండి. ఏమి జరుగుతుందో చూడండి… అన్నట్లు టూకీగా మీ కథ చెప్పండి. అనువాదం, అనుసరణ కోరకండి. స్వేచ్ఛగా సూచించమని సూచించండి. సూచనలు నచ్చితేనే మీరు ఆమోదించవచ్చు. పోనీండి మీరు నా సూచనలు పాటించాల్సిన విధేమీ లేదు. అయితే తెలుగు భాషాభిమానిగా నా కోరికల్లా ఒక్కటే. గుళ్లో గుగ్గిలం వేయకపోతేమానె… కనీసం కంపు రేపే ఆ పని అక్కడ చేయెద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది సూచన మాత్రమే అయినందున ఆలోచించేవరకూ ఎవరికీ ఇబ్బంది ఉండదని భావిస్తున్నాను.
నూరు పూలు వికసించాలి … వేయి ఆలోచనలు ఫరిడవిల్లాలి.