Archive for సెప్టెంబర్ 10th, 2010

లక్ష కోట్లు మింగిన రాబందు సాక్షికి అవినీతికి సాక్షిగా పోలీసు మామ దొరికాడోచ్‌ !

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా సాక్షి … అవినీతికి నిలువెత్తు సాక్ష్యం. మహా అక్రమార్కుల పెట్టుబడులతో ప్రారంభమయిన సాక్షికి చివరకు ఓ కానిస్టేబులు లోకువయ్యాడు. తన ముడ్డికింద ఏ రంగుందో చూడకుండా నలుపును చూసి ఎద్దేవా చేసిందట వెనకటికి గురివింద గింజ. అన్నట్లు పోలిక తప్ప ఈ చిన్న విమర్శ సాక్షిని పట్టిచూపేందుకు చాలదు కాక చాలదు.
24 గంటలు, వారం రోజులు, మున్నూట అరవై అయిదు రోజులూ జగన్మోహన రాగాన్ని మాత్రమే ఆలపిస్తోన్న సాక్షి టీవీకి శుక్రవారం మధ్యాహ్నం కాసింత ఆటవిడుపు దొరికినట్లుంది పాపం. ప్రకాశంలో ఓదార్పు లైవ్‌ కార్యక్రమాన్ని కాసేపు పక్కన పెట్టింది. బహూశా జగన్మోహనుడు మధ్యాహ్న భోజనం, అనంతరం విశ్రాంతి కోసం కెమెరాలను కాసేపు పక్కన పెట్టించి ఉండొచ్చు. అదే అదునుగా హైదరాబాదు సాక్షి వీరులు విజృంభించారు. హైదరాబాదు పాత బస్తీకి సాక్షి కెమెరా పయనమయింది. ఛార్మినార్‌ నీడన పొంచి కూర్చుంది. అక్కడే ఉన్న ఛార్మినార్‌ మద్యం దుకాణం వైపుకు కెమెరాను గురిపెట్టారు. ఎవరెవరో వచ్చి అక్కడే బహిరంగంగా తాగేస్తున్నారంటూ చూపటంతోపాటు తెగ వాగేశారు. వైఎస్‌ హయాంలో ఇలా జరగనేలేదు కాబోలు!? తర్వాత పన్నెండు, పదమూడేళ్ల పిల్లల్ని చూపారు. హయ్యో! చూడండి!! హమ్మో! చూడండి!! చిన్న చిన్న పిల్లలకు బహిరంగంగా, అక్రమంగా, అన్యాయంగా మద్యం అమ్ముతున్నారంటూ గావు కేకలు పెట్టింది న్యూస్‌ రీడరమ్మ కాసేపు. అదయిపోయింది. ఇప్పుడు చూడండి అసలు సీను అంటూ ఓ కానిస్టేబులు ఆ దుకాణం నుంచి తిరిగి వస్తుండగా ఒకటికి పదిసార్లు ఊపి ఊపి మరీ చూపారు. ఆ పోలీసు ముడుపులు కాజేశాడంటూ వ్యాఖ్యానించారు రీడరమ్మగారు. అనంతరం సాక్షి కెమెరా ఆ కానిస్టేబులును వెంటాడింది. ఆయనగారేమో తెగ సిగ్గుపడిపోయాడు. చేతులు అడ్డం పెట్టుకుని ముఖం కనపడకుండా తెగతెగ తంటాలు పడ్డా ఫలితం దక్కలేదనుకోండి. ”ఏంది సార్‌, నేనేమీ తప్పుచేయలేదు సార్‌” అంటూ పదే పదే బతిమలాడుకున్నాడు. వెయ్యి రూపాయల నోటుకు చిల్లర కోసం మద్యం దుకాణానికి వెళ్లానంటూ చెప్పుకున్నాడు. చిల్లర కోసం మద్యం దుకాణానికే వెళ్లాలా? అంటూ  రీడరమ్మ తెగ ఎగతాళి. పట్టువదలని సాక్షి వీరుడు ఆ కానిస్టేబులు పరుగు తీసేదాకా వెంటాడి ఓ ఘనమైన అక్రమ వ్యవహారాన్ని లోకానికి వెల్లడించిన అనంతరమే విశ్రాంతి తీసుకున్నాడు. అయితే పోలీసు చేతిలో చిల్లర లేదు. వెయ్యి రూపాయల నోటే ఉంది. చిల్లర లేదంటే ఆ నోటును ముడుపుగా మద్యం దుకాణం వాళ్లు ఇచ్చారని అనుకోవచ్చా!? అయితే అంత పెద్ద మొత్తం ఎక్సైజేతర పోలీసులకు ఇస్తారా? అన్న అనుమానం వెన్నంటి ఉండనే ఉంటుంది. అసలు ఆ కానిస్టేబులు మద్యం దుకాణంలోకి పోతున్న సమయంలో అక్కడే ఉన్న సాక్షి కెమెరా చూడలేదా? ఏది సత్యం ! ఏది అసత్యం !! ఓ మహా సాక్షి! ఓ వైఎస్‌ జగన్మోహనా !!