Archive for సెప్టెంబర్ 11th, 2010

మింగమెతుకు అడగొద్దు! మీసాలకు సంపెంగ నూనె రాస్తాం !!


మింగ మెతుకు లేకపోతేనేం మీసాలకు సంపెంగ నూనె రాసేస్తాం” అంటున్నాయి నేటి ఘనత వహించిన ప్రభుత్వాలు. అనటమేమిటి? పూసేస్తున్నాయి కూడా. ఆహార సంస్థ గోదాముల్లో ఆహార ధాన్యాలు ముక్కిపోనివ్వకుండా పేదలకు ఉచితంగా పంచాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే, కాదు పొమ్మన్న దేశ ప్రధాని… ”పొయ్యి మీద సంగతి నాకు తెలియదుగానీ, పొయ్యి మాత్రం ఇస్తానని కుండ బద్దలు కొట్టి దేశ పాలకుల  ఒట్టొట్టి  విశ్వరూపాన్ని పట్టిచూపాడు. మన్మోహనుడికి తామేమన్నా తక్కువ తిన్నామా అన్నట్లుగా రాజస్థాన్‌లో ఏకంగా వెయ్యి మంది కటిక పేదోళ్లకు ప్రభుత్వం సెల్‌ఫోన్లను శుక్రవారం ఫలహారం చేసింది. కేంద్ర సమాచారశాఖ మంత్రి సచిన్‌ పైలెట్‌ నియోజకవర్గం అజ్మీరులోని ఫగి గ్రామంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఈ తుక్కు వ్యవహారాన్ని నిర్వహించింది. ఆహార సంస్థ గోదాముల్లో మద్యాన్ని దాచి పెట్టి దొరికి పోయిన రాజస్థాన్‌ పౌరసరఫరాలశాఖ మంత్రి బాబూలాల్‌ నాగర్‌ ఈ కార్యక్రమానికి హాజరవటం  విశేషం. అయితే పేదలు మాత్రం సెల్‌ఫోన్ల పట్ల విముఖత వ్యక్తం చేశారు. ”మాకు ఆహార ధాన్యాలు కావాలి. లేదంటే ఉపాధి చూపాలి, ఈ ఫోన్లు ఏమి చేసుకుంటాం?” అంటూ లబ్ధిదారు గ్యారసీదేవి అధికారులను అక్కడికక్కడే కడిగిపారేసింది. ”వీటివలన మా ఖర్చులు పెరగటం తప్ప ప్రయోజనం ఏముంది? గోదాముల్లో ఆహార ధ్యాన్యాలు ముక్కిపోతున్నాయి. ప్రభుత్వం వాటిని ఎందుకు పంపిణీ చేయదు?” అని నిరుపేద గోవింద్‌ ప్రశ్నించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమానికి మంత్రి సచిన్‌ హాజరు కావాలి. చివరి క్షణంలో ఆయన డుమ్మా కొట్టి బాబూలాల్‌కు ఆ పనిని అప్పగించాడు. సామాజిక ప్రయోజనం బాధ్యతగా భావించి నిరుపేదలకు సెల్‌ఫోన్లను పంపిణీ చేసినట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ సిగ్గులేకుండా చెప్పుకుంది. హవ్వ!
ఇక గోదాముల్లో లక్షల టన్నుల మేర ముక్కి పోతోన్న ఆహారధాన్యాలను పేదలకు ఉచితంగా పంచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించగా… సలహా ఇచ్చిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ నోరుజారి ఆనక నాలుక కరుచుకున్నాడు. ”సలహా కాదు, ఆదేశమే జారీ చేశాం” అని సుప్రీం కోర్టు తిరిగి మొట్టికాయ వేసినా పేదల పక్షపాత ఘనమైన ప్రభుత్వానికి సిగ్గులేకుండా పోయింది. ఉచితంగా పంచబోమని ప్రపంచబ్యాంకు పెద్ద జీతగాడు మన్మోహన్‌ సింగ్‌ ఎదురు తిరిగాడు. అయితే రూ. 490 కోట్లు ఖర్చుపెట్టి పేదలకు గ్యాస్‌ కనెక్షన్లను ఉచితంగా ఇస్తామని నిస్సిగ్గుగా ప్రకటించాడాయన. గ్యాస్‌ కనెక్షను కోసం వినియోగదారులు చెల్లించాల్సిన రూ. 1400 ప్రభుత్వం జమచేస్తుంది. అక్టోబరు రెండో తేదీన జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించే ఈ పథకం ద్వారా ఏటా 35 లక్షల మంది నిరుపేదలకు గ్యాస్‌ కనెక్షన్లను ఉచితంగా అందజేస్తారు. గ్యాస్‌ పొయ్యినీ, తర్వాత గ్యాస్‌నూ పేదలే కొనుక్కోవాలి. వంటకు వినియోగించే రకరకాల వంటచెరకు వలన ఏర్పడే కాలుష్యాన్ని తక్షణం తగ్గిస్తారా? లేదా? అని ఇబ్బడి ముబ్బడిగా కర్బనాలను ప్రకృతిలోకి విడుదల చేస్తోన్న అమెరికా నిలదీయటంతో ఉచిత గ్యాస్‌ కనెక్షన్ల పథకానికి యూపీఏ ప్రభుత్వం తెరలేపింది. అదీ దీని వెనుక ఉన్న రహస్యం. దీనికితోడు ఏటా 35 లక్షల గ్యాస్‌ పొయ్యిలు, వాటి విడిభాగాలు కూడా అమ్ముడుపోయి ఈ దేశ పారిశ్రామిక వేత్తలకు సొమ్మవుతుంది గదా. ఒక్కొక్క పొయ్యిద్వారా రూ. 100 లాభమే వస్తుందనుకున్నా ఏటా కనీసం రూ. 35 కోట్ల రూపాయలు వ్యాపారులకు దక్కుతాయి. ఇది కాక నెలనెలా గ్యాస్‌ అమ్మకాలపైన దక్కేది అదనం.
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి తేల్చిన లెక్కల ప్రకారం 10,688 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముక్కిపోయినట్లు తేలింది. ముక్కిపోయిన ధాన్యాలు ఆరు లక్షల మందికి పదేళ్లపాటు సరిపోయేవి. 1997 నుంచి 2007 వరకూ తేల్చిన లెక్కల ప్రకారం దేశంలో 1.83 లక్షల టన్నుల గోధుమలు, 6.33 లక్షల టన్నుల బియ్యం, 2.20 లక్షల టన్నుల వరి ధాన్యం, 111 లక్షల టన్నుల మొక్కజొన్నలు ముక్కిపోయాయి. ముక్కిపోయినవాటికి తోడు  ఎలుకలు, పందికొక్కులు, పందులు, ఇతర జంతువులు, రెండు కాళ్ల అవినీతి జంతువులు తినగలిగినన్ని తినగా మిగతా వాటిని  సముద్రం పాలు చేస్తున్నారు.
పేదవాడికి చేపల కూర వడ్డించటం కాదు, చేపల్ని పట్టటం ఎలాగో? నేర్పాలి…. అంటాడు మావో. ఇక్కడ చేపల్ని పట్టటం ఎటూ నేర్పేది లేదు. వడ్డించేదీ లేదు అంటారు మన సోనియాజీ, మన మన్మోహనసింగ్‌ ఈజ్‌ కింగ్‌.