కథ కొలతకు చిట్టిది! … ప్రభావమే మహా గట్టిది!!


పీ … హెచ్‌ … డీ – 4
చందమామ కథలు అవి చిట్టివయినా, పొట్టివయినా, పొడుగువయినా, సీరియళ్లయినా ఏదో ఒక ప్రభావం కచ్చితంగా చూపేవంటే అతిశయోక్తి కాదు.
మా నాన్న ఉపాధ్యాయుడు. ఆయన నేరుగా అలా ఉండు, ఇలా ఉండు అని ఏనాడూ చెప్పలేదు. ఆ ఖాళీని భర్తీ చేయటం కోసమేనేమో? ప్రతినెలా తన చేత్తో చందమామ పత్రికను విథిగా అందజేసేవారు. ఒంగోలు ప్రభుత్వ ఖజానా నుంచి బడి సిబ్బంది జీతపు రాళ్లు మోసుకొచ్చేందుకుగాను ప్రతినెలా మొదటి రోజున ఒంగోలు వెళ్లేవారు. వస్తూవస్తూ ఏమి తెచ్చినా, తేకపోయినా విధిగా చందమామ తెచ్చి నాకు ఇచ్చేవారు. అలా మొదలయింది చందమామతో నా స్నేహం. చందమామను ఆసాంతం ఆసక్తిగా చదివేవాడిని. మళ్లీమళ్లీ చదివేవాడిని. నెలంతా చదివిందే చదివేవాడిని. నేను మొట్టమొదటిగా చదివిన కథ పేరు గుర్తులేదుగానీ, ఓ రైతు తన ముసలి గుర్రాన్ని అమ్మేందుకు యుక్తిగా నడిపిన వ్యవహారమది. బహూశా ఈ కథ ఆరో పీహెచ్‌డీలో రావచ్చనుకుంటా.
ఇప్పుడు గుర్తుచేయబోయే కథ శీర్షిక కూడా గుర్తులేదు. రచయిత పేరూ తెలియదు. కథల్ని ఎవరో ఒకరు రాస్తారని, వారి పేర్లు మొదట్లోనో, చివర్లోనో ప్రచురిస్తారని బొత్తిగా తెలియదానాడు. మనుషుల పేర్లమాదిరిగానే కేవలం గుర్తుకోసమే కథలకు పేర్లుంటాయని భావించేవాడిని తప్ప శీర్షిక లోతుపాతులు తెలిసినవాడిని కాదు. ఆ అంశం తీరును ఒక్క ముక్కలో శీర్షిక పట్టి చూపుద్దని కుంచెం పెద్దయిన తర్వాతగానీ తెలియలేదు. సరే కథలోకి ప్రవేశిద్దాం.
రామయ్య… బ్రామ్మడు… తిరిగొచ్చిన ఆవు కథ… గుర్తులేని ఆ శీర్షికను ఇలా రాసేందుకు నన్ను అనుమతించండి మరి. నన్ను ప్రభావితం చేసిన ఆ చిట్టి కథ తాత్పర్యాన్ని చెప్పటం తప్ప, దానిలో పేర్లు ఉండకపోవచ్చు. పదాలు ఉండవు. ఆ వాక్యాలు అసలే ఉండవు. కేవలం పుక్కిటి కథను మాత్రమే చెప్పగలను.
అనగనగనగా… అది రామాయపట్నం గ్రామం. ఆ గ్రామంలో భీమయ్య అనే రైతు ఉండేవాడు. అయన కుమారుడు రామయ్య. వయస్సు మీరటంతో భీమయ్య ఓ రోజు చనిపోయాడు. భీమయ్యకు కర్మకాండల్ని ముగించాడు రామయ్య. తాను ఇచ్చిన చిన్నచిన్న దానధర్మాలను మూటగట్టుకుంటున్న బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి ”అయ్యా, మా తండ్రిగారు స్వర్గానికి పోయినట్లేగదా?” ప్రశ్నించాడు రామయ్య.
”అదేమిటోయ్‌, ఏమీ తెలియనట్లు అలా అడుగుతావు? స్వర్గం, నరకమేనా ఉండేది? త్రిశంకు సర్గం లేదూ? చచ్చినవాడు దాన్ని దాటితేనేగదా? సరాసరి స్వర్గానికి చేరేది.” వివరించాడు బ్రాహ్మణుడు.
”త్రిశంకు స్వర్గమా? అదేమిటి సామీ?” మరో అనుమానం లేవదీశాడు రామయ్య తనదైన శైలిలో.
”అదేమిటోయ్‌, త్రిశంకు స్వర్గం గురించి వినలేదటోయ్‌! అదేనోయ్‌, చీము, నెత్తురుల సంగమమే త్రిశంకు స్వర్గం. చచ్చిన మానవులంతా ముందు దాంట్లోపడి కొట్టుకులాడుతుంటారు.” బదులిచ్చాడు బ్రాహ్మణుడు.
”మరి, ఆ త్రిశంకు స్వర్గం నుంచి మా తండ్రిగారు స్వర్గానికి ఎప్పుడు బయలుదేరుతారో తమరు సెలవివ్వండి సామీ. వినమ్రంగా అడిగాడు రామయ్య.
”అద్గదీ అలా అడుగు చెబుతాను. మీ నాన్న త్రిశంకు స్వర్గం దాటి స్వర్గంలో కాలు పెట్టాలంటే ఆయన ఆ నదిని ఈదుకుంటూ దాటాలోయ్‌. ఆయన ఈదాలంటే ఏదయినా ఆధారం కావాలి. సాధారణంగా ఆవయితేనే శ్రేష్టం. ఓ ఆవును నాకిచ్చుకుంటే ఆయన దాని తోకను పట్టుకుని త్రిశంకు స్వర్గం దాటేస్తాడోయ్‌, ఎంచక్కా.” భరోసా ఇచ్చాడు బ్రాహ్మణడు.
”అయితే, సరే స్వామీ, అప్పోసొప్పో చేసి ఓ ఆవుదూడనయినా కొనిస్తా.” రామయ్య లొంగిపోయాడు.
రామయ్య ఇంటికెళ్లాడు. దాచిపెట్టిన రూకలన్నీ తండ్రి కర్మకాండలకే ఖర్చయ్యాయి. ఇక ఆవును ఎలా కొనాలో అర్థంకాక తలపట్టుకుని ఆలోచించి ఆలోచించి చివరకు తనకున్న కొద్దిపాటి భూమిని ఆవలయ్యకు ఇచ్చి ఓ పెయ్యదూడను తోలకొచ్చాడు. దానిని బ్రాహ్మణుడి ఇంటికి తీసుకుపోయి ఒప్పగిస్తాడు.
బ్రాహ్మణుడు తెగసంతోషపడిపోయి ”ఇక దిగుల్లేదు పోవోయ్‌! మీ నాన్న దీని తోకపట్టుకుని ఈది త్రిశంకు స్వర్గం దాటేస్తాడోయ్‌. ఇక రేపో, మాపో ఆయనకు స్వర్గ ప్రాప్తిరస్తూ….” దీర్షాలు తీశాడు బ్రాహ్మణుడు. రామయ్య సంతోషంగా వెనుదిరిగాడు.
కొన్నాళ్ల తర్వాత రామయ్య బ్రాహ్మణుడి ఇంటి వెళ్లాడు.
రామయ్య : పంతులుగారూ, పంతులుగారూ, మానాన్న త్రిశంకు స్వర్గాన్ని దాటేశాడా?
బ్రాహ్మ : అనుమానం ఎందుకోయ్‌? త్రిశంకు స్వర్గాన్ని నిక్షేపంలా దాటేశాడు. స్వర్గానికి చేరిపోయాడు. అక్కడ సమస్త సుఖాల్నీ అనుభవిస్తున్నాడు. నువ్వు నిశ్చింతగా ఉండు.
రామయ్య : అదిసరే పంతులుగారూ, మా నాన్న ఇంక తిరగిరాడుగదా?
బ్రాహ్మ : నీ పిచ్చిగూల, స్వర్గం నుంచి మళ్లీ రావటమే. మీ నాన్న స్వర్గం నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదు.
”అయితే నా ఆవును నేను తోలకపోతన్నా” అంటూ దాన్ని ఇంటికి తెచ్చుకుంటుంటే, బ్రాహ్మణుడు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు.
ఇదీ ఆ చిట్టి కథ. అయితే అనవసరమయిన వర్ణనతో చిట్టి కథ చిన్ని కథంతయింది. చిన్నప్పుడు చదివినప్పుడు… రామయ్య భలే చేశాడు. అట్లా చేయాలి, అన్పించిందంతే. కానీ పదే పదే చదివిన తర్వాత, కుంచెం, కుంచెం పెద్దయ్యేకొద్దిగానీ ఈ కథలో ఉన్న పట్టు అర్ధం కాలేదు. యుక్తి ఉండనే ఉంది. రామయ్య మాదిరిగా మనమూ మన సమస్యల్ని పరిష్కరించుకోవచ్చుగా అనుకున్నవాడికి ఊహాశక్తి పెరుగుతుంది. త్రిశంకు స్వర్గం ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తే … పురాణాల్లో దానిని గురించి ఏముందో పరిశోధిస్తాము. ఫలితంగా పలు అంశాలు తెలుసుకోవటం. ఆ క్రమంలో పలు ప్రశ్నలు. సమాధానాలకు వెదుక్కోవటం. ఇది సాధారణ కోణం. కానీ ఈ కథకు సంబంధించి శోధిస్తే స్వర్గ, నరకాలు లేవనీ, కొందరు తమకు లబ్ధి కోసం వాటిని సృష్టించారని అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయం పట్టుబడితే మనల్ని చుట్టుముట్టిన పలు అబద్ధాలు, అనర్థాలు పఠేల్మమని పేలిపోతాయి. వాస్తవాలు వెలికొస్తాయి. అదే శాస్త్రం. అదే శాస్త్రీయత. చందమామ కథల ప్రత్యేకత అదే. పాఠకులకి శాస్త్రీయాన్ని బోధించాయి.
పీ… హెచ్‌… డీ – 5 త్వరలో

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

  1. very good logic nd analysis also rao jee

    స్పందించండి

  2. దొంగలూ…దెయ్యాలూ…శ్మసానాలూ…లేకుండా చందమామలో కథ ఉందేదే కాదు. కానీ కథ చదివాక చక్కని ఆలోచన.. మంచి నీతి..మంచికి న్యాయం జరిగిందనే ఆనందం కలిగేవి..

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: