ఓ బ్లాగులో ఉప్మా రచన చదువుతుంటే, మా ఒంగోలు ఉప్మా హోటలు గుర్తుకొచ్చింది. నోట్లో ఒకటే లాలాజలం. మళ్లీ ఎన్నాళ్లకు తింటానో కదా? మనస్సు కాసేపు విలవిలలాడింది. మీరు ఒంగోలు వెళ్తే మాత్రం కచ్చితంగా ఉప్మా హోటలుకు తప్పకుండా వెళ్లండి. ముందు వేడివేడిగా ఇచ్చే నాలుగిడ్లీ తినండి. తర్వాత ఎన్ని ఉప్మాలు తింటారన్నది మీ ఇష్టం. గంటె ఉప్మా రెండు రూపాయలు మాత్రమే. కావాలంటే చక్కెర వడ్డిస్తారు. కానీ చెట్నీతో తింటే ఆ మజా వేరు. గంగాళాల నుంచి పొగలు కక్కే ఉప్మా వడ్డిస్తారు. ఒకవేపు చేతులు కాలుతుంటే, మరోవైపు నోరూ కాలుతుంది. కానీ నోట్లో వేసుకోగానే అలా…అలా … అలా… అలా… వెన్నముద్దలా గొంతులోకి ఉప్మా జారిపోతుంది. మామూలుకన్నా ఎక్కువగా నూనె వాడి నందునే, ఉప్మా అలా జారిపోతుంది. దానికితోడు కమ్మని జీడిపప్పు ముక్కలు మధ్యమధ్యలో. చట్నీ దానికదే ప్రత్యేకత. సాధారణంగా సెనగపప్పుతో చట్నీ తయారు చేస్తారు. అయితే ఈ హోటల్లో విభిన్నంగా ఉంటుంది. బహూశా సెనగపిండితో తయారు చేస్తారేమోననిపిస్తుంది దాన్ని చూస్తే. అరవై, డెబ్బై మంది తింటుంటే కొంతమంది ఇడ్లీలను సిద్ధం చేస్తుండేవాళ్లు. ఉప్మా మాత్రం ముందుగానే తయారయిపోతుంది. ఉదయం పది గంటల తర్వాత ఉప్మా కాదుగదా, ఇడ్లీ కూడా దొరకదు అక్కడ. ఆరు గంటలకు మొదలయ్యే ఆ హోటలు తొమ్మిదింటిదాకా తీరికలేకుండా సాగుద్ది. ఆ తర్వాత ఇక మరుసటి రోజుదాకా సెలవే. ఒంగోలు ట్రంకురోడ్డులో – కొత్తపట్నం బస్డాండు రోడ్డు చీలిక మూలమీద ఈ హోటలు ఉంది. మస్తాన్‌దర్గా సెంటర్ అంటే అందరికీ తెలుసు. అదే చిరునామా. ఈ హోటలు త్వరలో మూతబడే ప్రమాదం లేకపోలేదు. మొన్నటిమొన్నటిదాకా ఇరుకిరుకు ఇంట్లో ఓ అరడజను మంది సేవకులు, యజమానులు కలిసి ఉప్మా, ఇడ్లీల్ని అందిస్తుండేవాళ్లు. అసలే ఇరుకుగా ఉండే ఆ ఇంటిని అన్నదమ్ములు పంచుకుని మళ్లీ రెండు మ్కులు చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు మరీ ఇరుకయిపోయింది. ఇల్లు ఇరకటం మంచిదంటారా? ఆ ఇంటి దంపతులకు మంచిదంటారు పెద్దలు. మనకు కాదుగదా! పనోళ్లకు రోజుకు రూ. 300 ఇవ్వలేక వాళ్లందరినీ మాన్పించి, ఎవరి పని వాళ్లు చేసుకునే పద్ధతిని ప్రవేశ పెట్టక తప్పింది కాదని ఇటీవల ఉప్మా తినటానికి వెళ్లినప్పుడు యజమాని చెప్పాడు. ఇప్పుడు కొద్దిగా చరిత్ర చెప్పనీయండి. నాకు చిన్ననాటి నుంచీ ఉప్మా అంటే గిట్టేది కాదు. ఇంట్లో ఉప్మా ఉపాహారమయితే ఆ రోజు హోటల్‌కి జై. ఉప్మా గొంతు దిగేది కాదు. ఉప్మా చేసి చచ్చారంటూ పెళ్లింటివారిని కూడా తెగతిట్టేవాడిని. ఆ హోటల్లో రుచి చూసేదాకా దాకా ఉప్మా అంటే ఏవగింపే. ఇప్పుడు ఒంగోలు వెళ్తే కచ్చితంగా ఆ హోటలుకు వెళ్లాల్సిందే. నాలుగు ఉప్మా లాగించాల్సిందే. ఇదీ ఒంగోలు ఉప్మా సంగతి. నేను చిన్నప్పుడు ఉమా చండీ గౌరీ శంరుల కథ సినిమా ఉప్పుగుండూరు మారుతీ టూరింగు టాకీసుకి వచ్చింది. పదిపదిహేనేళ్ల తర్వాత వచ్చిందనుకుంటాను. ఆ సినిమాను నేను చూడలేదుగానీ మా పెద్దోడు ( జెట్టి ఆంజనేయులు) భలే పేరు పెట్టాడు. నిజంగానే నాకన్నా ఓ పదిపన్నెండేళ్లు పెద్దవాడయి ఉంటాడు. అయితే నాకు మంచి స్నేహితుడు లెండి. ఇప్పుడు ఓఎన్‌జీసీలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. ఉప్మా గారె చక్కెరల కథ అని ఆ సినిమాకి పేరు పెట్టాడు. ఇది ఉప్మా కథ కదా అందుకని ఈ ఉప కథను కూడా జతకలిపానంతే. అన్నట్లు మీరు ఒంగోలు వెళ్తే ….