అట్టు రూపాయి ! ఇడ్డెను అర్ధ రూపాయి !!


అట్లతద్ది ఆరట్లోయ్‌, ముద్దపప్పు మూడట్లోయ్‌ … ఈ తెలుగు సినీ గీతాన్ని విన్నారా? బహూశా, ఈ పాట విచి(పవి)త్రబంధం సినిమా కోసం ఆరుద్ర రాశాడని గుర్తు.
ఇవాళ ప్రాచుర్యం పొందిన దోశ మనది కాదు. మన అరవ సోదరులది. తెలుగువాళ్లది అట్టు. ఇవాళ మనం తినే ఇడ్లీ కూడా మనది కాదు సుమా. అదీ అరవసోదరులదే. అలాంటిదే మనకొకటుంది. అదే ఆవిరి కుడుము. వాస్తవంగా మన అట్టు, మన ఆవిరి కుడుము ఆరోగ్యకరమయినవి. మన అట్ల పిండిలో మైదా ఉండదు. మన ఆవిరి కుడుములో బియ్యాన్ని చిట్లించి తయారుచేసిన రవ్వ కలపరు. మినప్పిండికి, కొంత బియ్యప్పిండి కలిపితే అట్లు పోసుకోవచ్చు. ఆవిరి కుడుముకయితే అచ్చంగా మినప్పిండే. ఇంకేమీ ఉండదు. అయితే స్వాతంత్య్రాననంతరం మన రాష్ట్రంలో హోటళ్ల తీరు మారటం, సంఖ్య విస్తరించటంతో అరవోళ్లు, మళయాళీలు వాటిల్లో పనిచేసేందుకు ఇబ్బడిముబ్బడిగా చేరుకున్నారు. వాళ్లు తమకు తెలిసిన వాటినే ఇక్కడా తయారు చేసేందుకు మొగ్గుచూపటంతో అరవ దోశ, ఇడ్లీ ఇక్కడ చేరిపోయాయి. దోశ, ఇడ్లీల తయారీలో ఖర్చు ఆదా అవటంతోపాటు పనిలో సౌలభ్యం కూడా కలిసొచ్చి అవి రాష్ట్రంలో పాతుకుపోయాయి.


సాధారణంగా చెన్నయి ప్రభావం అధికంగా ఉండే ప్రకాశం జిల్లాలో అందునా ఒంగోలులో పెద్ద హోటళ్లలో దోశెలు చేరిపోయినా, వందలాది మంది పూటకూళ్ల పెద్దమ్మలు మాత్రం ఇంకా అట్లను వదల్లేదు. పల్లెల్లోనూ ఇంకా అట్లదే రాజ్యం.
మిత్రుడు ఆలపాటి ఉప్మాకథ స్పందనలో చెప్పినట్లుగా ఒంగోలులో ఏ వీధికి పోయినా ఇంటి ముంగిట ఓ పొయ్యి కనపడుతుంది. దానిపైన అట్టుపోసే పెద్దమ్మలో (ఆంటీయో) పెదనాన్న (అంకులో)లో కనపడతారు. అట్టు రూపాయి. అదే ఇడ్లీ అయితే అర్ధ రూపాయి మాత్రమే. కాస్త నలుగురూ తిరిగే ప్రాంతంలో ఇళ్ల పంచల్లోనే ఇలాంటి హోటళ్లు వందలాది కనపడతాయి. సహజంగా పేదలు తమకు తెలిసినవారి ఖాళీ పంచల్లో వీటిని పెట్టుకుని ఉపాధి పొందటం కద్దు. అదే సాయంకాలం వేళ బోండాలు, మిర్చి బజ్జీలు కూడా వాటికి జతచేరతాయి.


ఒంగోలు దక్షిణం బజారు ఇలాంటి హోటళ్లకు మరీ ప్రసిద్ధి. ఇళ్ల పంచలతోపాటు కొందరు ఆ వీధి మొగదల్లో రోడ్డు వెంట తోపుడు బండి పెట్టుకుని వేలాది రూపాయల వ్యాపారం చేస్తారు. ఈ బళ్లల్లో మాత్రం తినుబండారాల ఖరీదు కాస్త అధికమే. ఇడ్లీ రూపాయి. అదే అట్టు అయితే మూడు రూపాయలు ఉంటుంది. అన్నట్లు కొన్నిచోట్ల యగ్‌దోశ పేరిట అట్టుమీద కోడిగుడ్డు సొనను పరిచి కాలుస్తారు. దానికి ఐదు రూపాయలదాకా వసూలు చేస్తారు. చట్నీ కారంకారంగా భలే రుచిగా ఉంటుంది. దానికి తోడు ఉల్లిపాయ చట్నీ, మాడ్చిన కారం, అల్లపు చట్నీలు కూడా ఉంటాయి. కొన్నిచోట్ల నెయ్యి అదనం. దానికి రూపాయో, రెండు రూపాయలో అదనంగా వసూలు చేస్తారు.
ఒకసారి తిన్నవాళ్లెవ్వరూ ఈ ఇడ్లీ, అట్టు రుచిని ఎన్నటికీ మరచిపోలేరు. అందుబాటులో ఉంటే తినకుండా ఉండలేరు. ఇలాంటి హోటళ్లు ఉన్న ప్రాంతంలో ఇంట్లో చేసుకునేకన్నా వీళ్ల దగ్గర కొనుక్కోవటానికే ఇల్లాళ్లు మొగ్గుచూపుతారు. ఖరీదు అందుబాటులో ఉండటంతోపాటు శుచీ శుభ్రం కూడా ఉండటమే దీనికి కారణం.
ఈ సందర్భంగానే ఒంగోలులో జనంతో కిటకిటలాడే రెండు మధ్య తరహా హోటళ్లను గురించి చెప్పనీయండి. అయితే వాటిలో కర్నూలు రోడ్డులోని పవర్‌ ఆఫీసు దగ్గరుండే మణి హోటలు మూతపడింది. ఈ హోటళ్లో టేబుళ్లు – కుర్చీలు ఉండవు. అంతా మంచాలమీద కూర్చుని లాగించేవాళ్లం. ఇక్కడ ఇడ్లీ రూపాయి, సాదా దోశె మూడు రూపాయలు, యగ్‌ దోశ ఐదు రూపాయలు ఉండేది. ఈ హోటలు యజమాని మణి శుభ్రతకు బాగా ప్రాధాన్యత ఇచ్చేవాడు. మణి తల్లి, తండ్రి, భార్య రోజూ పనిచేస్తారు. సెలవుల్లో కుమార్తె, కుమారుడు వాళ్లతో జత కలిసేవారు. ఆ హోటలుకు వచ్చేవారినందరినీ అన్నయ్య, తమ్ముడు అంటూ మణి, ఆయన భార్య పలకరించేవాళ్లు. ఉదయం 10 గంటలకు వరకు మాత్రమే నడిపేవాళ్లు. ఆదాయం బాగా ఉండేది. మూతబడిన హోటలు సమాచారం ఎందుకనుకున్నానుగానీ, ఎవరయినా అలా నడపదలచుకుంటే ఉపయోగపడుతుందని ఆశతో రాశాను. ఇంకొకటి ఇప్పుడు బస్టాండు సమీపంలోని ఆరవై అడుగుల రోడ్డులో మస్తాన్‌ హోటల్‌ పేరిట చిన్న దుకాణంలో నడుస్తోంది. అర డజనుమంది పనిచేసే ఈ హోటలులో తినాలంటే కనీసం అర గంట ఎదురు చూడాల్సిందే. అయితే ఇక్కడ నెయ్యి వడ్డిస్తున్నందున ఖరీదులు మాత్రం ఎక్కువే. ముప్పై, నలభై రూపాయలు లేందే ఈ హోటలుకు పోకూడదు. ఇక్కడ మంచినీళ్లు కూడా కొనుక్కోవలసిందే. కారం తినలేనివాళ్లు కూడా ఇక్కడకు పోకూడదు. తినగలిగినవాళ్లు కూడా రోజూ పోతే అంతే సంగతులు. ఏదో ఒక జీర్ణకోశ వ్యాధి తప్పదేమో? అయితే ఎప్పుడన్నా రుచి చూడటానికి వెళ్తే నాలుక కోరిక తీరుతుంది. ఏ మాటకామాట చెప్పుకోవాలి. ఇక్కడ వడ్డించే ఇడ్లీ, జీడిపప్పు వేసి చేసే మందమయిన దోశెల్ని ఒక్కసారయినా తినాల్సిందే.

8 వ్యాఖ్యలు

  1. నాది ఒంగోలుతో మూడేళ్ళ అనుబంధం…..ప్రత్యేకంగా “మణి” హోటల్ తో……మీరు ఇప్పుడు ఆ హోటల్ మూసేశారని చెప్తుంటే నమ్మబుధ్ధి కావట్లేదు…..మణి అంకుల్, పద్మ ఆంటీ నన్ను ఎంతో ఆదరంగా చూసేవాళ్ళు….కౌటిల్య,కౌటిల్య అని ఆప్యాయంగా పిలిచేవాళ్ళు..వాళ్ళబ్బాయి వాసు నా క్లాసుమేటు కూడా….మా హాస్టల్ పక్కనే అవ్వటం వల్ల ఎప్పుడూ అక్కడే నా టిఫిన్…..ప్రత్యేకించి గురువారం,ఆదివారం( ఆ రోజుల్లో మా హాస్టల్ లో పలావు,పూరీ ఉండేవి.రెండూ నాకు సహించేవి కాదు)….వెళ్ళగానే ఆంటీ మూడు ఇడ్లీ ఇచ్చేవారు..అవి తినేలోపు అంకుల్ మంచిగా దోశ వేసి ఇచ్చేవాళ్ళు…ఇంకోటి తింటానంటే వేసేవాళ్ళు…..ఎంత బిజీగా ఉన్నా నేను నోరు తెరిచి అడగాల్సిన అవసరం ఉండేది కాదు….చూసుకుని ఇచ్చేవాళ్ళు….నాకు ఖాతా కూడా ఉండేది…ఒక నెల ఇవ్వటం ఆలస్యం అయినా అడిగేవాళ్ళు కాదు…..నాకు అన్నిటికంటే బాగా ఇష్టమైంది అక్కడి చట్నీ…..”ఎలా చేస్తారు ఆంటీ” అని అడిగితే ఆంటీ ఓ నవ్వు నవ్వి”ఏముంది అందర్లానే” అనేవారే కాని,ఆ రహస్యం మాత్రం చెప్పేవారు కాదు… అక్కణ్ణుంచి వచ్చేసి పదేళ్ళైనా ఇంకా ఆ చట్నీ రుచి నా నాలుక మీదే ఉంది….తర్వాత ఏ హోటల్లో తిన్నా ఆ రుచి ఎక్కడా దొరకలేదు..గుంటూరు,విజయవాడ(బాబాయ్ హోటల్లో కూడా), ఎక్కడా….ఆ చట్నీ,దోశ కోసమన్నా ఒంగోలు వద్దాం అనిపిస్తుంటుంది…మధ్యలో ఒకటి, రెండు సార్లు వెళ్ళినా, సాయంత్రాలు వెళ్ళటంతో అవ్వలేదు…..నేను అక్కడ ఉన్నపుడే తాతగారు(మణి అంకుల్ నాన్నగారు) పోయారు….తర్వాత ఒకసారి వెళ్ళి వచ్చా……ఎప్పటికైనా వెళ్ళకపోతానా,తినకపోతానా అనుకుంటూంటా….కాని ఇక ఆ దోశ, చట్నీ రుచి దొరకదని అనిపిస్తే చాలా బాధగా ఉంది……….

    స్పందించండి

  2. baagunnayi mee blaagulu. meeru cheppE dharalu ee rOjullOvEnaa? maa kalikaalam oorlo reMDu iDleelu 12-14/-, dOsa 20/–30/-. pch..aa hOTalnEdO maa ooriki paMpinchEyaroo..

    స్పందించండి

  3. ఒంగోలు రాగి సంకటి- కోడి మాంసానికి కూడా ప్రసిద్ధి అని విన్నానే…ఇలాంటి దుకానాలు ఒంగోలులో నేను అనేకం చూసాను.

    స్పందించండి

  4. Posted by ...@..Santosh Kumar Balla..@... on సెప్టెంబర్ 22, 2010 at 10:58 ఉద.

    చాలా బాగుందండి మీ వివరణ…
    మా తూ.గో జిల్లాలో కూడా ఈ అట్లు ఫేమస్…ముఖ్యంగా పుల్లట్లు…
    ఇక్కడ చెన్నై దోశలు చప్పగా, ఆ చట్నీ అయితే మరి…
    ఈ సారి ఇంటికెల్లినప్పుడు పెసరట్టు ఉప్మాతో పాటు…అట్లు కూడా లాగించేయాలనుంది. 🙂 🙂

    స్పందించండి

  5. మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. ఆ వూరి అసలు పేరు అట్లూరు. ఇప్పటికీ అక్కడ పాతూరు (పాత వూరికి వ్యవహారిక నామం) ప్రాంతంలోను, గుంటూరు రోడ్డులోను మీరు వర్ణించినట్లాంటి ఇడ్డెన్లు, అట్లు విరివిగా దొరికేవి. వీటిలో అధిక భాగం వైశ్య కులస్తులు నడిపే వారు. మరి ఇప్పుడు ఆ విధమైన హోటళ్ళు ఉన్నాయో లేదో కానీ, మా బాల్యంలో ఇంట్లో తినడానికి వీలు కానప్పుడల్లా వెళ్ళి తినే వాళ్లం. ఆఅ రుచి వర్ణించలేము. మీ పోస్టు చదివాక ఒక సారి మా వూరెళ్ళి దొరికితే ఆ అట్లు తినాలి అనిపించెంతగా నోరు ఊరించిది మీ రచన. మంచి రుచికరమైన పొస్టుకు ధన్యవాదాలు.

    స్పందించండి

  6. మాస్టరు, చాలా చాలా బావుంది మీ టపా. మా అమ్మమ్మ వేసిన మినపట్టంతా రుచిగా ఉంది,

    స్పందించండి

వ్యాఖ్యానించండి