పీ … హెచ్ … ఢీ – 7
యుక్తిలేనివాడ్ని ఊరి నుంచి తరిమేయమన్నారు పెద్దలు. దాన్ని దృష్టిలోకి తీసుకుందో ఏమోగానీ చందమామ కథలన్నీ పాఠకుడికి ప్రధానంగా యుక్తిని నేర్పుతాయి.
అనగనగనగా పృధ్వీపురం అని ఉండేది. ఆ ఊళ్లో బాహూడు అనే రైతు ఉండేవాడు. ఆయన వ్యవసాయం చేయటానికి ఓ గుర్రం ఉండేది. కొన్నాళ్లకు అది ముసలిదయిపోయింది. దాంతో పనులు చేయలేకపోవటంతో దాన్ని అమ్మేసి మరొక గుర్రాన్ని కొనుక్కోవాలని బాహూడు తలపోశాడు. గుర్రాలను అమ్మకాలు – కొనుగోళ్లు జరిపే దళారులకు ఆ విషయాన్ని చెబుతాడు. దళారులు ఎంతమంది కొనుగోలుదారులకు బాహూడి గుర్రాన్ని చూపినా ఫలితం లేకుండా పోయింది. ముసలి గుర్రాన్ని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కొందరు కొంటామన్నా వాళ్లిస్తామన్న ధర మరీ తక్కువ కావటంతో బాహూడు ఒప్పుకోలేకపోయాడు. అలా ఎంతకూ తన ముసలి గుర్రం అమ్ముడుపోకపోవటంతో ఇక తానే ఏదో ఒకటి చేసి పని పూర్తిచేసుకోవాలని భావిస్తాడు.
తన గుర్రాన్ని తోలుకుని త్రిపుర సుందరీపురం అనే పట్టణం చేరతాడు. బాహూడు అక్కడకు చేరేసరికి పొద్దుగూకుతుంది. సత్రంలో ఉండాలంటే అంత రూకలు బాహూడి దగ్గర లేవు. ఆ రాత్రికి కొట్టంలో గుర్రాన్ని కట్టేసుకుని తాను ఉండేందుకు అంగీకరించమంటూ బాహూడు ఓ ఆసామిని బతిమలాడగా ఆయన అంగీకరించాడు. బాహూడు పడుకోబోతూ ఆసామిని కలిసి తాను ఆలస్యంగా నిద్ర లేస్తే గుర్రం పెంటికలను మాత్రం తొలగించవద్దని వేడుకున్నాడు. అదేమని ఆసామి అడగ్గా గుర్రంతోపాటు దాని పెంటిక కూడా తనకు ఎంతో ఇష్టమని చెబుతాడు. దాంట్లో ఏదో రహస్యం ఉందని ఆ ఇంటి ఆసామి తలపోస్తాడు. బాహూడు కన్నా ముందే లేచి ఆ రహస్యమేదో కనుక్కోవాలని అనుకుంటాడు. అయితే బాహూడు ఆరోజు వేకువ జామునే లేచి గుర్రం పెంటికలో బంగారు కణికలను గుచ్చి ఏమీ జరగనట్లే తిరిగి పడుకున్నాడు. ఆ ఇంటి ఆసామి ఉదయాన్నే లేచి గుర్రం పెంటికలను పరిశీలించగా వాటిల్లో బాహూడు పెట్టిన బంగారు కణికలు బయటపడ్డాయి. తాను తెలివిగా రహస్యాన్ని కనుగొన్నానని ఆయన ఆనందపడిపోయాడు. ఏ విధంగానయినా ఆ గుర్రాన్ని సొంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తెల్లవారిన తర్వాత బాహూడిని పిలిచి ఏమీ తెలియనట్లుగా ఆతను పట్ణణానికి ఎందుకు వచ్చాడో అడిగి తెలుసుకున్నాడు. ఆ గుర్రాన్ని ఎంత ఖరీదయినా తానే కొంటానని చెప్పగా బాహడు తొలుత బెట్టుచేసి చివరకు బలవంతంగా ఒప్పుకున్నట్లుగా నటించి పదివేల బంగారు రూకలకు గుర్రాన్ని అమ్మేసి దర్జాగా తన గ్రామానికి వెళ్లిపోయాడు. వంద బంగారు రూకలు ఇచ్చేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని గుర్రానికి అధిక ఆదాయం రాబట్టుకోవటం వెనుక బాహూడి యుక్తి ఉంది. అయితే ఇక్కడ బాహూడు మోసానికి పాల్పడటం కన్పిస్తోంది. సాధారణ పాఠకులలో అత్యధికులు మోసం జరిగిందన్న గ్రహించలేకపోవటం పరిశీలనార్హం. బాహూడికి ఎదురయిన సమస్యను తెలివి తేటలతో పరిష్కరించుకోవటం ఒక్కటే పాఠకులు గుర్తిస్తారు. అందువలన సమస్యలు ఎదురయినప్పుడు యుక్తిగా పరిష్కరించుకోవాలని పాఠకులు ఈ కథ నుంచి నేర్చుకుంటారు.
Archive for సెప్టెంబర్ 21st, 2010
21 సెప్టెం
యుక్తి …. సమస్యల పరిష్కార మార్గదర్శి
21 సెప్టెం