తాగొచ్చి గొడవ చేసే తండ్రి తీరు ఆ విద్యార్థిని ఆలోచింపజేసింది. ఇంటి దగ్గర చదువుకోలేని వాతావరణం అతనిని చేతలకు పురిగొల్పింది. మద్యం నుంచి తండ్రిని విముక్తి చేస్తేనే తన వ్యథతోపాటు గ్రామంలో పలు సమస్యలు పరిష్కారమవుతాయని పదిహేనేళ్ల ఆ పదో తరగతి విద్యార్థి బుర్రలో మెదిలింది. తనకొచ్చిన ఆలోచనను పెద్దలకు చెబితే ఎగతాళి చేశారు. తోటి విద్యార్థులను అడిగితే ”వామ్మో, అంతపని మనవల్లేమవుతుంది?” అంటూ నిరాశపరిచారు. ఆ పరిస్థితుల్లో మద్యం బాధితుడయిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఒకరు తోడుగా నిలిచాడు. ఇద్దరూ కలిసి ‘మద్య నిషేధం విధించండి. మద్యాన్ని తరిమికొట్టండి’ అంటూ రాసిన ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ వీధులెంట తిరగటం ప్రారంభించారు. కొందరు హేళన చేసినా వాళ్లు వెనుదిరగలేదు. ఇద్దరితో ప్రారంభమైన ప్రదర్శన గంట తిరిగే లోపే వారికి వందల మంది తోడయ్యారు. ఆ వ్యవహారం పెద్దల కళ్లు తెరిపించింది. మద్యం వ్యతిరేక ఉద్యమం ఉధృతమైంది. 11 రోజుల అనంతరం అధికార యంత్రాంగం కదిలింది. మద్య నిషేధ కమిటీ సభ్యులు ఆ గ్రామాన్ని సందర్శించారు. మద్యం వ్యతిరేక ఉద్యమకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో సారా ఉత్పత్తి చేసినా, అమ్మినా, తాగినా తీవ్రచర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. అధికారులు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామం పరిస్థితి ఇదీ. మద్య వ్యతిరేక ఉద్యమం ప్రారంభించిన విద్యార్థికి ఇంతటి మద్దతు రావడం వెనుక ఆ గ్రామంలో గత రెండేళ్లలో సారా తాగి 130 చనిపోవటం ప్రధాన కారణం.
కృష్ణా జిల్లా తిరువూరు సరిహద్దులో ఉన్న ముత్తగూడెంలో 800 కుటుంబాలున్నాయి. వారిలో దళితులు, గిరిజనులే అధికం. వారంతా భూమిలేని నిరుపేదలు. రెక్కాడితే డొక్కాడని కూలీలు. ఆ గ్రామంపై ఐదేళ్ల క్రితం మద్యం వ్యాపారుల కన్ను పడింది. అప్పటి వరకూ ఆ గ్రామంలో కొందరు బయటి ప్రాంతానికి వెళ్లి తాగేవాళ్లు. అలాంటి గ్రామంపై కన్నేసిన వ్యాపారులు కొందరు ధనిక యువకులను ప్రలోభపెట్టారు. వారికి ముడి సరుకుల్ని అందజేసి సారా తయారీని అక్కడే ప్రారంభించారు. దానిని దళారుల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికితోడు గ్రామంలో విచ్చలవిడిగా గొలుసుకట్టు మద్యం దుకాణాలనూ నెలకొల్పారు. ఈ గ్రామంలో 40 మంది దొంగ మద్యం వ్యాపారులున్నట్లు పోలీసులు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో ఆ గ్రామంలో 170 మంది చనిపోగా, వారిలో 130 మంది మద్యం వలనే ప్రాణాలు విడిచారని తేల్చారు. ఇదే ఉద్యమం రూపుదాల్చడానికి కారణమయింది.
దళిత కుటుంబానికి చెందిన బి వెంకటకృష్ణ ముత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడి సోదరి ఇంటర్మీడియట్ చదువుతోంది. తండ్రి కోటేశ్వరరావు వంటల మేస్త్రి. కోటేశ్వవరరావుకు పనున్నా లేకున్నా తాగి ఇంటికి రావడం, భార్యను తిట్టడం, ప్రశ్నిస్తే పిల్లలను కొట్టడం రివాజయింది. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరైనా అదీ పూర్తి చేసుకోలేకపోయాడు. కోటేశ్వరరావు నిత్యం చేసే గొడవతో ఆ పిల్లలకు ఇంటి దగ్గర చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇంటి దగ్గర చదవటం లేదని ూపాధ్యాయులతో తరచూ దెబ్బలు తినాల్సి వచ్చేది. దీంతో అక్కా తమ్ముడు మాట్లాడుకున్నారు. తండ్రిలో మార్పు రావాలంటే సారాను మానిపించాలి. ఇదే సమస్యతో బాధపడుతోన్న మరో విద్యార్థి కృష్ణారెడ్డి వారికి తోడయ్యాడు. ఆ విధంగా సెప్టెంబరు తొమ్మిదో తేదీ రాత్రి ఆ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. గంట సేపటి తర్వాత పలువురు వారితో చేతులు కలిపారు.
ముత్తగూడెంలో 160 మందికి వితంతు పింఛన్లు అందుతున్నాయి. లబ్ధిదారుల్లో 130 మంది మద్యం బాధిత కుటుంబాలకు చెందిన మహిళలే. అందరిదీ 40 ఏళ్లలోపు వయస్సే. వీరిలో ఏ ఒక్కరికీ సెంటు భూమి లేదు. కూలికి వెళ్తేనే పూట గడిచే పరిస్థితి వారిది.
10వ తేదీన గ్రామంలో విద్యార్థులు ప్రదర్శన చేశారు. మద్యం మహమ్మారితో భర్తలను కోల్పోయిన బాధిత మహిళలు కూడా విద్యార్థులతో చేతులు కలిపారు. దీంతో గుడుంబా తయారీదారులను గుర్తించి సరుకును ధ్వంసం చేయటం ప్రారంభమయింది. ఈ క్రమంలో కొందరికి బెదిరింపులు వచ్చాయి. కనీసం మద్యం గొలుసు దుకాణాలనయినా నిర్వహించుకునేందుకు ఒప్పుకోకపోతే ఇబ్బందులు తప్పవని గ్రామానికి చెందిన పెత్తందారి ఒకడు బెదిరించినా మహిళలు లొంగలేదు.
విద్యార్థులు, మహిళలకూ సహకరించేందుకు యువత నడుం కట్టింది. ఇది ఉద్యమం విజయవంతానికి తోడ్పడింది. 12 రోజుల నుంచీ ఆ గ్రామంలో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. తాగినవారు వీధుల వెంట కనపడడం లేదు. ఉద్యమాన్ని ప్రారంభించిన వెంకటకృష్ణ తండ్రి కోటేశ్వరరావు బుద్ధిగా ఉండడంతోపాటు పనికి వెళ్తున్నాడు. చిన్నవాడయినా తన కుమారుడు కళ్లు తెరిపించాడంటూ తనను పలుకరించిన వారి వద్ద కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు.
తడిక నిర్మల భర్త శివయ్య తాగితాగి ఐదు నెలల క్రితం చనిపోయాడు. మద్య నిషేధ ఉద్యమంలో ఆమె ముందున్నారు. సెంటు భూమి లేని ఆమె తన ఇద్దరు పిల్లలనూ చిన్నాచితకా పనులు చేసి చదివిస్తోంది.
సారాకి బానిసై భర్త చనిపోయిన జి నర్సమ్మ తన ముగ్గురు పిల్లల్ని బతికించుకునేందుకు సారా అమ్ముతూ ఉద్యమతో కళ్లు తెరిచింది. కూలికి వెళ్లటం ప్రారంభించింది.
23 సెప్టెం
Posted by ramakrishna on సెప్టెంబర్ 24, 2010 at 5:11 ఉద.
వెంకట క్రిష్న స్పూర్తి అందరికీ ఆదర్సం కావాలి…అది నాటు సారా కాబట్టి సరిపొయింది…మద్యం అమ్మకాలకు ప్రభుత్వమే లక్స్యాలు నిర్నయించి అమ్మిస్తున్నది…దీనిపై పోరాటం చెస్తే బొక్కలు విరగ్గొడుతుంది…అయినా పోరాటం చెయాల్సిందే…మంచి వ్యాసం అందించినందుకు క్రుతగ్నతలు…