Archive for సెప్టెంబర్ 25th, 2010

కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్‌! వెయ్యిమంది గూండాలకు బాస్‌!!


రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీజీ వెంకటేష్‌ ప్రజల హక్కుల భక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. టిజికి కర్నూలు హిట్లరన్న పేరొచ్చింది. ఆయన ప్రజాప్రతినిధిగా కన్నా గూండాల నాయకుడిగానే రాణిస్తున్నాడు. వెయ్యి మందికి పైగా గూండాలు ఆయన కొలువులో ఉపాధి పొందుతున్నారంటనే వాస్తవ పరిస్థితిని పట్టిచూపుతోంది. రాజు వెడలె రవి తేజము లలరగ అన్నట్లుగా టీజీ వెంట నిత్యం ఐదారు వందలమంది గూండాలు వెన్నంటి ఉంటున్నారట.
అంతేలేకుండా సాగుతోన్న ఆయన అక్రమాలను ఎవరు ప్రశ్నించినా వారిపై గూండాలను ఉసిగొల్పటం టీజీ తన హక్కుగా భావిస్తున్నాడనిపిస్తోంది. అభివృద్ధి పథకాలను సొంతం చేసుకునేందుకు ఆయన పడరానిపాట్లు పడుతూ అదేమన్నవారిని గూండాలతో దాడులు చేయించటం సాధారణమయింది. తన బ్లీచింగ్‌ పరిశ్రమ నుంచి సరుకును సరఫరా చేయకుండానే  రాష్ట్రంలోని నగరపాలక, వందలాది పురపాలక, వేలాది పంచాయతీల నుంచి సొమ్ముచేసుకోవటం ఎప్పటి నుంచో గుట్టుగా సాగుతోంది. గతేడాది తుంగభద్ర పొంగి కర్నూలు నగర ప్రజలను ముంచెత్తిన వరదలు టీజీకి కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయి. తన బ్లీచింగ్‌, తదితర పరిశ్రమలు, వాటి గోదాములు నీట మునిగాయని బీమా సంస్థల నుంచి కోట్ల రూపాయలను వెంకటేష్‌ కొల్లగొట్టుకున్నాడు. అంతవరకూ అయితే పోనీలే అనుకోవచ్చు. అదే సందర్భంలో ఒక్క కిలో బ్లీచింగు పొడిని కూడా సరఫరా చేయకుండానే కర్నూలు నగరపాలక సంస్థ నుంచి రూ. 60 లక్షల రూపాయల్ని మూటగట్టుకోవటమే ఆయన అక్రమాలకు పరాకాష్ట. ఇదీ మన శాసనసభ్యుల తీరు. టీజీ అక్రమాలను ప్రశ్నిస్తున్నాడన్న కోపంతో నాలుగయిదు దఫాలుగా నగరపాలక సభ్యుడిగా గెలుస్తోన్న కార్పోరేటరు పుల్లారెడ్డిని ఆగస్టులో గూండాలతో కొట్టించాడు. తనను ప్రశ్నించారన్న ఆక్రోశంతోనే ఈ నెలలోకూడా మరో ఇద్దరిని హత్య చేయించేందుకు ఆయన గూండాలు విఫలయత్నం చేశారు.
కర్నూలు నగరంలో కీలక కేంద్రంలో ఉన్న క్రిస్టియన్‌ సంఘానికి చెందిన ఎస్‌టిబిసి కళాశాల మైదానంలో ఐదు కోట్ల రూపాయలకు పైగా విలువచేసే ఎకరం స్థలాన్ని ఆక్రమించి దుకాణ సుముదాయాన్ని నిర్మిస్తున్నాడు. అదే విషయాన్ని విద్యార్థులు పురపాలకశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి సెప్టెంబరు 25న  ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీజీ ఆ విద్యార్థులపై తన గూండాలను ఉసిగొలిపి దాడి చేయించాడు. పోలీసులను ఆదేశించి వారిపై కేసులు పెట్టించాడు.
ఇది టీజీ సొంత వ్యవహారశైలే అయినా ఇదే తీరున పలువురు శాసనసభ్యులు ప్రజల హక్కులను హరిస్తున్నారు. మాన, ప్రాణాలను నిలువునా దోచుకుంటున్న హిట్లర్లనూ, ముస్సోలినీలను నిలువునా పాతరేసే రోజు ఎప్పుడొస్తుందోగదా?!