నా చిన్నప్పుడు (అప్పుడు గుంటూరు జిల్లా – ఒంగోలు తాలూకా) మా ఊరికి (ఇప్పుడు ప్రకాశం జిల్లా – నాగులుప్పలపాడు మండలం- ఈదుమూడి) నాలుగు ప్రైవేటు బస్సులు తిరిగేవి.
రూపం, పనిని బట్టి వాటికి జనమే పేర్లు పెట్టేశారు. అవెంత సహజంగా ఉండేవో! ఇప్పటిలా వాటి రూపంతోనూ, పనితోనూ, స్థానిక భాషతోనూ సంబంధం లేకుండా పటాటోపపు పేర్లు ప్రజల నోట విన్పించేవే కాదు. ఇప్పుడు చూడండి … శీతలహంస (ఏసీ పనిచేయక హింస), మయూరి (నెమలి మాదిరిగానే గంటకు ఐదు కిలోమీటర్లు నడిచేది), సూపర్ లగ్జరీ (బిగుసుకుపోయిన అద్దాలు, వాలిపోయిన సీట్లు), లగ్జరీ (ఖరీదులో మిన్న సౌకర్యాలు సున్న), ఎక్స్‌ప్రెస్ (ఉదయం ఐదు గంటలకు చేరవలసిన బస్సు గడియారంలో సాయంత్రం అదే సంఖ్య చూపించే సమయానికి చేరే వాహనం) ఇలా ఏడుస్తున్నాయి.
సరే, చీరాల నుంచి మా ఊరి మీదుగా అద్దంకికి నాలుగు బస్సులు నడిచేవి. వాటిలో ఒకదాని పేరు రెఫ్పోడు… ఊరి చివర ఉండగానే ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకుగాను డ్రైవర హారను మోగించేవాడు. ఆ హారను రెఫ్ప్ … రెఫ్ప్ … రెఫ్ప్ … రెఫ్ప్ అంటూ శబ్దం వచ్చేది. దాన్ని బట్టే ఆ బస్సుకు రెఫ్ఫోడు (రెఫ్ప్ + వాడు) అని జనమే పేరు పెట్టారు. ఇంకోదాని పేరు పలకల బస్సు … రూపాన్ని బట్టి దానికా పేరు పెట్టారు. మిగతా బస్సుల మూలలు విశాలంగా ఉండేవి. అద్దాలకు కూడా వంపులుండేవి. ఈ బస్సుకేమో కచ్చితంగా గీతగీసినట్లు వంచి ఉండేది. అద్దాలేమో వంకర లేకుండా బస్సు మొత్తాన్నీ చూస్తే దీర్ఘచతురస్రాకారంగా ఉండేది. మూడోది పచ్చబస్సు … దాని రంగును బట్టే ఆ పేరొచ్చింది. మిగతా బస్సులు నాలుగయిదు రంగులతో ఉంటే ఇది మాత్రం నిండుగా పచ్చదనంతో ఉండేది. ఇక నాలుగో బస్సు పేరు గుర్తుకు తెచ్చుకునేందుకు ఎంత ప్రయత్నించినా వెలికిరావటం లేదు. అయితే నాకు తెలిసి కొన్నాళ్లే ఈ బస్సులు నడిచాయి. రాష్ట్ర ప్రభుత్వం బస్సుల్ని జాతీయం చేయటంతో మా ఊరికి బస్సులు రావటం ఆగిపోయింది. ఆగి పోయిన కాలం నాకు గుర్తులేదుగానీ, చివరకు ఆర్టీసి బస్సు 1985కుగానీ ప్రయాణం ప్రారంభించలేదు. ఆ మధ్య కాలమంతా మా గ్రామస్తులు ఎనిమిది కిలోమీటర్లు నడిచి ఉప్పుగుండూరులో బస్సులు ఎక్కేవాళ్లు. తిరుపతి, మదరాసు తదితర దూర ప్రాంతాలకయితే పొలాలమీదుగా చిన్నగంజాం నడిచెళ్లి అక్కడ రైలు బండి ఎక్కేవాళ్లు. 1950 ప్రాంతాల్లో ఒంగోలు – చీరాల ఒకటి రెండు బస్సులు తిరిగేవట. ఆ బస్సుల్ని బొగ్గుతో నడిపేవారని పెద్దవాళ్లు చెప్పగా విన్నాను. బస్సులోనే రాక్షసి బొగ్గును కుప్పగా పోసుకుని అవసరం మేరకు దానిని ఇంజినులో వేసి మండిస్తుంటే బస్సు నడిచేదట. దానికి ఓ చిన్న పరిశ్రమకు ఏర్పాటు చేసినంత పొగ గొట్టం ఉండేదట. 1980కు ముందు చీరాల – ఒంగోలుకు ఆర్టీసివాళ్లు మూడు రూపాయలు వసూలు చేసేవాళ్లు. అదే ఉప్పుగుండూరు నుంచి ఒంగోలుకు రెండు రూపాయలు, ఉప్పుగుండూరు – చీరాలకయితే రూపాయి ఉండేది. ఇప్పుడు వాటి ధరలు ఏడెనిమిది రెట్లు పైగా పెరిగింది. అన్నట్లు నాకు ఊహ వచ్చిన తర్వాత 1977లో తొలిసారిగా కడవకుదురు అనే ఊళ్లో రైలెక్కి అమ్మనబ్రోలుకు వెళ్లాను.
26 సెప్టెం
Posted by raman on సెప్టెంబర్ 27, 2010 at 2:47 ఉద.
Interesting sir
sweet memories.
i rode those buses.