చెరువు మొగదల నుంచే గుయ్యిమని హారను కొట్టుకుంటూ ఇంకొల్లు నుంచి బస్సొచ్చింది. ఈదుమూడి రైతులంతా సంచుల్నీ, గోతాముల్నీ చేతబట్టుకుని లోపలికి జొరబడ్డారు. వాళ్లతోబాటే సాంబయ్య కూడా ఎక్కాడు. సామ్రాజ్యం చెప్పటంతో సాంబయ్య కక్కాయి వీరయ్య అతన్ని క్షణం క్షణం గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ ఒకే సీట్లో కూర్చున్నారు. బస్సు వేగం పుంజుకుంది. వీరయ్య మనసు గతంలోకి పరుగు తీసింది.
సాంబయ్య చిన్నప్పుడే తండ్రి వెంకటరత్నం చనిపోయాడు. జానెడు జానెడు చుట్టలేకుండా వెంకటరత్నాన్ని ఎవ్వరూ చూసినోళ్లు ఆ వూళ్లోనే కాదు, ఆయన ఇంట్లో కూడా లేరు. నోటికి రాచపుండు పుట్టి సాంబయ్యకు రెండేళ్ల వయస్సప్పుడు ఆయన పోయాడు. రాచపుండుకు చుట్టతాగుడే కారణమని మదరాసు క్యాన్సరు ఆసుపత్రి పెద్ద డాక్టరు చెప్పాడు. రోగం ముదిరిపోయినాక వచ్చినందున చేసేదేమీ లేదని వెంకటరత్నాన్ని ఆసుపత్రికి తీసుకుపోయిన వీరాంజనేయులుకి రహస్యంగా చెప్పాడాయన. మూడు నెలలకన్నా ఎక్కువ బతక్కపోవచ్చని జాగ్రత్తలు చెప్పాడు. ఆయన చెప్పినట్లే రెండు రోజులు ముందే వెంకటరత్నం చనిపోయాడు. వదిన తప్ప దిక్కులేని ఆ కుటుంబాన్నీ ఓ కంట కనిపెట్టుకుని నెట్టుకొచ్చాడు వీరయ్య. వీరయ్యతోనే సాంబయ్యకు తండ్రి తాలూకు ప్రేమ అంతో ఇంతో దక్కింది. సాంబయ్యను తన బిడ్డలతోపాటే వీరయ్య చదివించాలనుకున్నా, ఊళ్లో పదో తరగతి అయిన తర్వాత ఇక పోనని మొండికేశాడు. ఆ విషయం తెలిసి ఇంటికల్లా వచ్చి మరీ,
”చదువు మానేస్తే చంకనాకిపోతావురో” హెచ్చరించాడు ఆ ఊరివాళ్లంతా ఆప్యాయంగా మల్లారప్పంతులని పిలుచుకునే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పొనుగుబాటి వెంకటసుబ్బారావు. చదువుకుంటే ఏమి లాభమో కథలుకథలుగా చెప్పిచూశాడు పంతులుగారు. ఆయనకు ఎదురు చెప్పలేక మౌనం పాటించాడు సాంబయ్య.
”మానేయాలనే అనుకుంటే నాకు చెప్పకుండా నిర్ణయం తీసుకోకురా సాంబయ్యా.” అంటూ రెండు గంటల తర్వాత వెళ్లిపోయాడాయన.
అయినా సాంబయ్య ఆలోచనలో మార్పు రాలేదు.
సాంబయ్యకు తల్లిని ఒంటరిగా వదిలి చదువుకునేందుకు అటు ఒంగోలో, ఇటు చీరాలో పోవాలనిపించలేదు. ఆసలా ఆలోచననే తట్టుకోలేకపోయాడు. వీరయ్య ఓ రోజు ఇంటికొచ్చి, కాలేజిలో చేరేందుకు చీరాల బయలుదేరమంటే ఏడుపుకు లంకించుకున్నాడు. అన్నం కూడా తినకుండా పోనంటే పోనని మొండికేశాడు. బలవంతంగా కాలేజీలో చేరిస్తే ఏమవుద్దోనని తల్లి భయపడింది.
”పెడద్రపోడు. ఎంతజెప్పినా ఇంటంలేదుగా, పోనియ్యి. వాడి కరమ. ఎవులు కరమకి ఎవులు బాద్దులబ్బాయి” చేసేది లేక బాధతోనే సాంబయ్య తల్లి కొడుకుని సమర్ధించింది.
”అట్టా అంటే ఎట్టొదినా? పిల్లలకి తెలియకపోతే పెద్దోళ్లమి చెప్పాలిగానీ.” ఇంకా నచ్చచెప్పబోయాడు వీరయ్య.
”కాదులేబ్బాయి. ఆడది ఎదురు సెబుతుందని అనుకోబాక. సిన్నప్పటినుంచీ సూడ్డంలా. వాడు అడ్డం తిరిగితే ఏ పనన్నా సేయించగలిగామా ఏనాడయినా”
”ఏదో సిన్నా, సితకా పన్లు ఏరు వదినా, ఇది జీవితానికి సంబందించింది. అట్టా సూడగూడదు.”
తల్లితోపాటు వ్యవసాయంలో పడ్డాడు ఆనాటి నుంచీ.
ఉండూరయితే తానున్నా లేకున్నా, కొడుక్కి అండగా ఉంటారని సాంబయ్యకు 22 ఏళ్లు రాగానే తూర్పుబజారు ఉప్పల రాఘవయ్య కూతురు సామ్రాజ్యంతో పెళ్లి చేసింది. వీరయ్య దంపతులే పెళ్లి పీటలమీద కూర్చుని ఆ శుభకార్యాన్ని పూర్తిచేశారు. ఉప్పుగుండూరు మలుపుల్లో వాహనాలు ఎదురు రాకుండా డ్రైవరు హారను కొట్టటంతో వీరయ్య ఆలోచనలకి బ్రేకు పడింది. స్టాండులో ఆగింది బస్సు.
”జీడిపప్పు మిఠాయి … జీడిపప్పు మిఠాయి”
”వాటర్ ప్యాకెట్ … వాటర్… వాటర్ ప్యాకెట్”
”కాలక్షేపానికి బఠానీలు, కాలక్షేపానికి బఠానీలు”
ఒకేసారి కుర్రాళ్లంతా బస్సును చుట్టుముట్టి కేకలు వేస్తుండటంతో అక్కడంతా గలభాగలభాగా ఉంది.
వీరయ్య బయటకు పారజూశాడు. ఎదురుగా అరుగుమీద బాచింపట్ల వేసుకుని కూర్చున్న నాషా భక్తరాజు కన్పించాడు. మహానుభావుడు ఆ ఊరికి నలభై ఏళ్లపాటు సర్పంచిగా చేశాడు. ఆయనకు పోటీ ఉండేదే కాదు. వయస్సు మళ్లినందున ఎవరినన్నా మంచి కుర్రవాడ్ని పెట్టాలని ఆయన బతిమలాడితేగానీ ఆ ఊళ్లో మొదటిసారిగా పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు. పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, లావు బాలగంగాధరరావుకు కొరియర్‌గా పనిచేసిన మహానుభావుడిగా ఆ ప్రాంత గ్రామాలన్నింటా గౌరవ మర్యాదలు అందుకుంటూ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడాయన. భక్తరాజు బస్సుకేసి చూస్తుండటంతో వీరయ్య కిటికీ నుంచి చెయ్యి బయటపెట్టి ఆయనకు నమస్కారం పెట్టాడు. ప్రతిగా భక్తరాజు నవ్వుతూ చేయెత్తి ఊపాడు. బస్సు బయలుదేరింది.
28 సెప్టెంబరు 2010న ఎగసాయం … 3