వెనకటికెవరో ముసలమ్మ ఉట్టికెక్కలేనుగానీ, స్వర్గానికి మాత్రం ఎగబాకుతానందట.
అట్లా ఏడ్చింది మన ఘనత వహించిన ప్రభుత్వం సాధిస్తోన్న అభివృద్ధి ఫలాల చిట్టా.
”2015కల్లా మా దేశంలో దరిద్రానంతా తుడిచేస్తాం” అంటూ సింగు ఈజ్ కింగ్ ప్రభుత్వం ఇటీవల ఐక్యరాజ్యసమితికి హామీ ఇచ్చింది. ఈ ఐక్యరాజ్యసమితి కూడా మనదేశ ఓటర్ల మాదిరే ఒట్టి పిచ్చిదయినా అయిఉండాలి కాకుంటే మోసగత్తె అయినా అయి ఉండాలి.
ఎందుకంటే?
మనదేశంలో 2008-09లో కొత్తగా 3.36 కోట్ల మంది దరిద్రుల జాబితాలో చేరారు. అంతేనా ఈ ఏడాది మరొక ఐదు కోట్ల మంది నిష్ట దరిద్రులయ్యారని ప్రపంచబ్యాంకు తేల్చిచెప్పింది.
మరి కుబేరుల సంగతో…
మన దేశంలో కుబేరుల సంఖ్యకూడా పెరిగింది. పైగా 2008-09తో పోలిస్తే కుబేరులు రెట్టింపు పెరిగారు.
ఇంతకీ రెట్టింపు అంటే దరిద్రుల సంఖ్యలా కోట్లలో ఉంటుందని ఎవరన్నా అనుకుంటే దరిద్రంలో కాలేసినట్లే. 2010లో మనదేశంలో 1.27 లక్షల మంది కుబేరులున్నట్లు తేలింది. అదే 2008-09లో కుబేరుల సంఖ్య వారిలో సగం మంది.
అన్నట్లు దేశ జనాభాలో కుబేరుల శాతం ఎంతో తెలుసా? కేవలం 0.01 అదండీ అసలు సంగతి. అయితే స్థూల జాతీయాదాయంలో వారిది మూడింట ఒకొంతు. అంటే ప్రతి మూడు రూపాయల్లోనూ ఒక రూపాయి మొత్తం జనాభాలో కనీసం ఒక్కశాతమన్నా లేని వారిదే.
మరి ఈ లెక్కల్ని బట్టి 2015నాటికి దేశంలో దరద్ర నిర్మూలన సాధ్యమో? కాదో? ఎవరివారే అంచనా వేసుకోవచ్చు. అయితే ఒక్కటి… ఆహారం, నీరు, ఆరోగ్యం, చదువు తదితర రంగాలు ఇదే తీరున
కొనసాగితే మాత్రం దేశంలో తప్పకుండా దరిద్రుల నిర్మూలన జరుగుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.
గత ఏడాది అంటే 2009 -10లో ప్రభుత్వం కేవలం ఐదు లక్షల రెండు వేల కోట్ల రూపాయల పన్ను రాయితీలు కల్పించింది. దీంట్లో ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. కాకపోతే ఈ రాయితీల్లో 99 శాతం కేవలం కుబేరులే లాభం పొందారని మాత్రం గొణుక్కోక, సణుక్కోక తప్పదు.
మరికొన్ని లెక్కలూ డొక్కలూ… (1990 ప్రకారం)
1. దేశ జనాభాలో 37.2 శాతం మంది నిష్ట దరిద్రులున్నారు.
2. 53.5 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. అయితే ఏంటంట? ఏమీ లేదు మహాశయా! కాకపోతే ఈ లెక్కలు తల్లులకు అందుతోన్న పౌష్టికాహారం యొక్క బలాన్నీ, వారికి అందుతోన్న ఆరోగ్యం యొక్క గొప్పతనాన్నీ తేటతెల్లం చేస్తుంది అంతే.
3. ప్రతి 1000 మంది పిల్లల్లోనూ 125 మంది ఆహారలేమితో, అనారోగ్యంతో ఐదేళ్ల లోపే మృత్యుఘంటికలు మోగించుకుంటూ వెళ్లిపోతున్నారు.
4. ప్రతి లక్షమందిలోనూ 437 మంది మహిళలు ప్రసవ సమయంలో ఈ నాటికీ చనిపోవటం నిజ్జంగా నిజం.
5. ప్రతి 1000 మంది నవజాత శిశువుల్లోనూ 80 మంది పుట్టీ పుట్టక ముందే చనిపోతున్నారు.
అదండీ మన సంగతులు.
మనిషన్నవాడు ఆలోచించాలి మరి!
మనసున్నవారు స్పందించాలి పరి పరి!!
28 సెప్టెం
Posted by SNKR on సెప్టెంబర్ 29, 2010 at 2:33 ఉద.
Conditions apply:
* If Con’gras’ stays in power till 31Dec2015. ( That means only if they are elected to power again, no congras MP will be there below karodpati level. )
Posted by తెలుగిల్లు on సెప్టెంబర్ 29, 2010 at 4:30 ఉద.
చిన్న మెలికతో భలే విశ్లేషించారు. అదీ ఒక్క వాక్యంలో.