వరద బాధితుల కోసం పోయినేడాది దాతలు అందించిన విలువయిన సామాన్లనూ, నిత్యావసర సరుకుల్నీ కర్నూలు శాసనసభ్యుడు, రాయలసీమ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు టిజి వెంకటేష్ దోచుకుని, దాచుకున్న వైనం వెల్లడయింది. సినీ, టివి, రంగస్థల కళాకారులు హైదరాబాదు నుంచి ఆనాడు పంపిన దుస్తులు, స్టౌలను టీజీకి చెందిన మౌర్య ఇన్ హోటలు నుంచి అతని గోదాముకు ఎపి 02 వి 5632 నంబరు లారీలో 30 జనవరి 2010న తరలిస్తుండగా సిపిఎం కార్యకర్తలు పట్టుకున్నారు. ఏడాదిపాటు తన హోటలులో భద్రంగా పెట్టుకున్న సామగ్రిని కర్నూలు నగర శివార్లలోని సఫా ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఉన్న గోదాముల్లోకి మారుస్తూ వెంకటేష్ సిబ్బంది పట్టుబడ్డారు. సిపిఎం నాయకులు కె రాజగోపాల్, ఎం రాజశేఖర్, సత్యం, ఎల్లప్ప తదితరులు మౌర్య ఇన్ దగ్గర నుంచే లారీని వెంబడిస్తూ మీడియాకూ, అధికారులకు సమాచారం అందించారు. లారీలో తరలించిన సామాన్లకు తోడు గోదాములో బియ్యం, కందిపప్పు, టివిలు, స్టౌలు, దుస్తులు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అయితే సిపిఎం కార్యకర్తలు అందజేసిన సమాచారంతో ఆక్కడకు చేరుకున్న స్థానిక సిఐ నాయుడు చర్య ఏమీ తీసుకోకుండా వాటిని చూసి వెళ్లిపోవటం నేతల అవినీతిపట్ల అధికారుల తీరును పట్టిచూపుతోంది. పైగా ఆ సమాన్లను బాధితులకు పంచేందుకు ప్రయత్నిస్తుండగా సిపిఎం కార్యకర్తలు వాటిని ఎత్తుకు పోయేందుకు ప్రయత్నించినట్లుగా కథ అల్లటం విశేషం. దాతలు అందజేసిన సామాన్లను ప్రభుత్వ అధీనంలో కాకుండా టీజీ గోదాముల్లోనూ, హోటలులోనూ ఎందుకు నిల్వచేశారో చెప్పాల్సిన బాధ్యత వెంకటేష్‌ది కాగా దొంగసరుకును పట్టుకున్న వారిపైకి నేరాన్ని నెట్టేందుకు టీజీ ప్రయత్నించటం దొంగే దొంగ అన్నట్లుగా ఉండలేదూ! పైగా పోయినేడాది అక్టోబరు రెండో తేదీన వచ్చిన వరదలకు బాధితులయిన వారికి ఆందించేందుకు అదే నెలలో దాతలు ఇచ్చిన సాయాన్ని ఇప్పటిదాకా పంచకపోవటానికి కారణం ఏమిటో కూడా ఆయనే విప్పి చెప్పాలి. దాతలు ఇచ్చిన బియ్యం, కందిపప్పును టిజి వెంకటేష్ తన పేరుతో ముద్రించిన సంచులలో పోసి బాధితులకు పంపిణీ చేస్తూ వరదల సమయంలోనే ఒకసారి పట్టుబడ్డాడు. అపర దానకర్ణుడనని నిత్యం తనకు తానే ప్రచారం చేసుకునే టీజీ అసలు లీలలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. తన పరిశ్రమలోకి నీళ్లు వచ్చే అవకాశాన్ని పసిగట్టి ముందస్తు చర్యలు తీసుకున్న వెంకటేష్, వరదల వల్ల తనకు అపార నష్టం వాటిల్లిందనీ, రెండు నెలలకు పైగా మూసి వేయాల్సి వచ్చిందనీ ఫిర్యాదు చేసి 100 కోట్ల రూపాయలను బీమా సంస్థల నుంచి వసూలు చేసుకున్నట్లు విమర్శలున్నాయి. ఇదే వరదల్లో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వారికి ఇప్పటి దాకా ఒక్క పైసా బీమా కూడా దక్కలేదు. ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది వేల రూపాయలు తప్ప టీజీ చేతివాటం కారణంగా దాతలు అందించిన సహాయం కూడా కర్నూలు వరద బాధితులకు అందలేదు. కర్నూలు నగరంలో చిన్నివ్యాపారి నుంచి కోట్లాది రూపాయల వరకూ వ్యాపారం చేసుకునే వారు వేలాది మంది నష్టపోతే ఎమ్మెల్యేగా వారికి అండగా ఉండి సహాయం అందించక పోగా టిజి వెంకటేష్ దాతలు ఇచ్చిన సహాయాన్ని స్వాహా చేయటం నేటి నేతల తీరును పట్టిచూపుతోంది.
30 సెప్టెం
Posted by SK Reddy on సెప్టెంబర్ 30, 2010 at 6:27 సా.
Bloody thief.
Posted by చిలమకూరు విజయమోహన్ on అక్టోబర్ 1, 2010 at 1:27 ఉద.
ఈ దరిద్రునికి తినడానికి ఇంక ఏమీ దొరకలేదా?
Posted by ramakrishna on అక్టోబర్ 1, 2010 at 3:35 సా.
హు…వీళ్లు ప్రజాప్రతినిధులు….కాదు కాదు డబ్బులతో ఓత్లను కొనుక్కున్న ప్రజాసేవకులు…ప్రజలను జట్కా గుర్రాలను చేసి వరి గడ్డి ముందేసి ముఖాలకు పచ్చ కళ్లజోళ్లను తగిలిస్తున్న ఇలాంటి స్వార్ధ దొంగ ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే రోజెప్పుడొస్తుందో…