Archive for అక్టోబర్, 2010

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

ప్రకటనలు

‘తిక్క’ కుదిరింది …. తెలుగు వాడి- వేడి గెలిచింది.


డబ్బూ, దాంతో వచ్చే పలుకుబడితో ఏదయినా చేసేయొచ్చన్న తిక్క … తెలుగు వాడి – వేడి ముందు ఓడిపోక తప్పలేదు. తెలుగుతనం మరోసారి గెలిచింది. చేతలు ఒట్టిపోయినవాళ్లు, స్వలాభాపరులు, మూర్ఖులు, అక్రమార్కులు, వాగాడంబరులు నిట్టనిలువునా తెలుగు పోరాటపటిమ ముందు ఓడిపోయారు.
తెలుగన్న ఎన్టీరామారావు హయాంలో పాతికేళ్ల క్రితం నిర్మాణమయిన బహిరంగ వేదిక తెలుగు లలిత కళాతోరణం రూపుమార్చాలనీ, పేరుమార్చాలని తెగులును తవ్వితలకెత్తుకున్న రాష్ట్ర ప్రభుత్వం, దాని తాబేదార్లు ప్రజల నిరసన ముందు తలదించక తప్పలేదు. తెలుగు కళా తోరణాన్ని పది కోట్ల రూకలతో పేరు మార్చాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు నవ ఢిల్లీలో సుబ్బిరామిరెడ్డి విలేకరుల ముందు ప్రకటించారు. తాను ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు లేఖ కూడా రాశానని తెలిపారు. రాజీవ్‌ పేరు పెట్టటం తప్పుకాదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు. బూతద్దం వేసి వెదికినా పశ్చాత్తాపం ఆయన ముఖంలో ఎక్కడా కన్పించలేదు.
లాభముంటే వ్యాపారులు వరదకయినా పోతారన్నట్లుగా ఈ మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి ఏదో స్వలాభం ఆశించే ఈ వ్యవహారానికి తెరలేపాడంటే నమ్మక తప్పదు. ఈ కళా(రా)బంధు ప్రస్తుతం ఊడగొట్టిన నాగలి కదా. రూ.10 కోట్లతో లలిత కళాతోరణాన్ని తిరగ్గట్టేసి సోనియమ్మగారిని పిలిచి ప్రారంభం చేయిస్తే మంత్రి పదవి ఇట్టే వొళ్లో పడుద్దని పగటి కలలు కన్నట్లుంది పాపం. కాకుంటే ఏ లక్షలాది కోట్ల రూపాయల విలువయిన గుత్తపనినో కేంద్రం నుంచి కొట్టేసేందుకయినా కావాలి. ఈ రెండూ కాకపోతేనేం, ఇక మూడోది రాష్ట్ర రాజధాని నగరంలో, అదీ శాసనసభకు కూతవేటు దూరంలో ఉన్న ఈ అపురూప సౌధాన్ని ముప్పైమూడేళ్లపాటు సొంతం చేసుకునే ఏర్పాటు ఎటూ ఉండనే ఉందాయె. కోట్లాది రూపాయల విలువయిన కేంద్రాన్ని సొంతం చేసుకుని ఏళ్ల తరబడీ తమ (అ)రాచకీయాలు వెలగబెట్టే అవకాశాన్ని సొంతం చేసుకునేందుకుగాను రాజీవ్‌ పేరును ఉపయోగించుకునేందుకు విఫలయత్నం చేశాడీ పెద్ద మనిషి. ఏదయితేనేంగానీ చివరకు తెలుగువాడి నిరసన ముందు తలంచక తప్పలేదు. అయినా ఇంత చేసిన తర్వాత తిక్క వరపు సుబ్బిరామిరెడ్డి ఆశించిన దాన్ని సోనియమ్మ ఇవ్వకుండా ఎందుకుంటుందిలే!?

చదువులమ్మ సాక్షిగా కన్యాశుల్కంతో కళ్యాణం

12 ఏళ్ల బాలికతో 78 ఏళ్ల వృద్ధుడి పెళ్లి

ఆదిలాబాద్‌ జిల్లా బాసర సరస్వతీదేవి సాక్షిగా 78 ఏళ్ల వృద్థుడు అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికను 30 అక్టోబరు 2010న వివాహం చేసుకున్నాడు. దీనికిగాను ఆ వృద్ధుడు ఆ బాలిక కుటుం బానికి పొలం రూపాన కన్యాశుల్కం చెల్లించాడు. మహారాష్ట్రలోని బెలోలి తాలూకా నర్సి పట్టణ సమీపంలోని నాహేగాంకు చెందిన సాహెబ్‌రావు భార్య, 40 ఏళ్ల కుమారుడు మృతి చెందారు. కోడలు తనకు సేవలు చేయడం లేదంటూ ఈ వృద్ధుడు పెళ్లికి తయారయ్యాడు.  వాస్తవానికి గతంలోనే మరొకరితో అతనికి వివాహం జరిగింది. వృద్ధుడి వేధింపులు భరించలేక ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయిoది. ఇప్పుడు తన గ్రామానికే చెందిన పేద బాలికపై కన్నేశాడు. తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని బాలిక కుటుంబానికి ఇచ్చేవిధంగా ఒప్పందం  కుదుర్చుకున్నాడు. తొలుత  బాలిక ఎదురు ఎదురుతిరిగింది. అయితే కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి ఒప్పించారు. దీంతో చేసేది లేక వృద్ధుడితో ఆ బాలిక తాళి కట్టించుకుంది. ఇంత తతంగం జరిగినా ఆలయాధికారులుగానీ, పోలీసులుగానీ ఈ పెళ్లిని అడ్డుకోలేదు. ఆలయ పూజారులు పెళ్లి చేసేందుకు నిరాకరించడంతో బయట నుంచి పూజారిని పిలిపించుకుని కార్యక్రమం ముగించుకున్నారు.

15 రోజుల్లో 32 ఆలయాల దర్శనo

  • గుళ్లూ గోపురాల చుట్టూ ఎడ్యూరప్ప ప్రదక్షిణలు
  • రూ.1.6 కోట్ల ప్రజా ధనం వృథా

దేవుడే రక్షిస్తాడు! ఇది కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప నమ్మకం. తనకు సమస్యలు ఎదురైనప్పుడు, ఎదురవుతున్నట్లు కనిపించినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న గుళ్లూగోపురాల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభిస్తారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎడూరప్ప నమ్మకానికి అంతే లేకుండా పోయింది. తన ప్రభుత్వానికి పొంచి వున్న ముప్పును తప్పించాలంటూ గుళ్లూ గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేపట్టారు. అదీ ఒకట్రెండు గుడులనుకుంటే పొరపాటే. కేవలం 15 రోజుల వ్యవధిలో 32 గుళ్లను దర్శించి ‘చరిత్ర’ సృష్టించారు. ఇలా దర్శించిన గుళ్లలో జమ్మూకాశ్మీర్‌లోని వైష్ణోదేవీ మందిరం కూడా ఉంది. తమిళనాడులో ఏడు, కేరళలో మూడు, దక్షిణ కర్నాటకలో ఆరు, బెంగళూరు, తన సొంత పట్టణం షిమోగాలో మూడేసి గుడులను ఆయన దర్శించారు. ఒకవైపు గుళ్ల చుట్టూ తిరుగుతూనే హోమాలు కూడా నిర్వహించారు. ఇలా తన వ్యక్తిగత భక్తి విశ్వాసాలకు వినియోగించిన ధనం మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చయింది.

పర్యటనలకు ప్రభుత్వ హెలికాప్టరే వినియోగించుకున్నారు. ఈ విధంగా రూ.1,58,24,700 ప్రభుత్వ ధనం ఖర్చయినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన కేబినెట్‌లోని ‘విశ్వాసపాత్రులైన’ మంత్రులది కూడా ఇదే దారి. దక్షిణ భారత్‌లోని కొన్ని ప్రముఖ ను వారు దర్శించారు. ఎడ్యూరప్ప సన్నిహితురాలు, విద్యుత్‌ శాఖ మంత్రి శోభా కరందాజ్లే అయితే మరో అడుగు ముందుకేశారు. ఎడ్యూరప్ప పీఠాన్ని కాపాలంటూ వారం రోజులపాటు ఉపవాస ప్రార్థనలు చేపట్టారు. ఆమె కేవలం కొన్ని పళ్లు, నీరు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్‌ సహచరుల తీరు ఈ విధంగా ఉంటే, ఎడ్యూరప్పకు గట్టి మద్దతిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఇలాంటి పూజలకే పది లక్షలు ఖర్చు పెట్టారు. ఎడ్యూరప్ప జాతక చక్రాన్ని బట్టి దోష నివారణ పూజలు చేయించారు.

అత్యున్నత పురస్కారం గెలుచుకున్నానహో


అవును. నిజ్జంగా నిజం. నేను అత్యున్నత పురస్కారాన్ని గెలుచుకున్నాను. ఈ పురస్కారాన్ని సభ జరిపి ప్రదానం చేయలేదు. నాకు తెలియకుండానే నాకు ప్రదానం చేసేశారు. శాలువాలు కప్పరు. మంగళవాయిద్యాలు అంటూ ప్రతేకంగా ఉండవు.  మనసున మల్లెలు మాలలూగుతాయి. ఆనందం అంబరమంటుతుంది. సాధారణంగా ఇచ్చే జ్ఞాపిక అంటూ ప్రత్యేకంగా ఉండదు. అయినా జీవితాంతం వెన్నంటి ఉండే మృధుమధురమైన జ్ఞాపకాన్ని మాత్రం ఈ పురస్కారం నాకు అందించింది.
అదేనండి. ప్రముఖ రచయిత కర్లపాలెం హనుమంతరావుగారు తన ‘నా లోకం’ బ్లాగులో నా బొమ్మేసి మరీ నన్ను పరిచయం చేశారు. దాని కిందే గత నెలలో ప్రజాశక్తి స్నేహలో ప్రచురితమయిన నా కథ ‘ఖూని’ని కూడా టపా పెట్టారు.
శుక్రవారం (29. 10.10) ఉదయం అలాఅలా తెలుగు బ్లాగ్లోకాన్ని వీక్షించుకుంటూ నడుస్తుండగా, నడుస్తుండగా…ఓ చోట … నా లోకం. దానిలోకి జొరబడకుండా పోనెప్పుడూ. ఈ రోజూ అలానే జొరబడి చూద్దునుకదా. ఒక్కసారిగా దిమ్మతిరిగిందనుకోండి. అక్కడ నా బొమ్మ పెట్టుంది. ఇదేందిరా అనుకునేంతలోనే దాని కింద ‘పేరు వెంకటసుబ్బారావు కావూరి’ అంటూ శీర్షిక. ఆ కింద నా గురించి నా వరకూ లక్షలు, కోట్లు విలువచేసే నా పరిచయం. పైగా నన్ను గురించి, నా నిజాయితీ గురించి వకాల్తా. నా బ్లాగును వీక్షిస్తే కచ్చితంగా సంతృప్తి కలుగుతుందని యోగ్యతా పత్రం. ఆమ్మో ఇంకేం కావాలి రాతగాడిగా నాకు. ఇంకా కిందకొస్తే ఖూనీ కథ. అదండీ సంగతి. నాకొచ్చింది ఈనాడు ఎడిట్‌పేజీ రచయిత కర్లపాలెం హనుమంతరావుగారు మెచ్చి ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం. గతంలో బలిపీఠం కథకు ప్రముఖ రచయిత కాలువ మల్లయ్యగారి చేతులమీదుగా జాతీయ స్ధాయి పురస్కారాన్ని అందుకున్నాను. బీసీ నారాయణరావు ఉత్తమ పాత్రికేయ పురస్కారాన్ని ఈనాడు జర్నలిజం పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం నాగేశ్వరరావుగారి చేతులు మీదుగా, నాకు ఇష్టమయిన వ్యక్తిత్వ స్వరూపులు, పూర్వ జర్నలిస్టు వీ. శ్రీనివాసరావుగారి సమక్షంలో అందుకున్నాను. ఆ రెండింటి మాదిరే కర్లపాలెం హనుమంతరావుగారి తన నా లోకం బ్లాగ్లోకం ద్వారా అందజేసిన యోగ్యతాపత్రాన్ని గొప్ప పురస్కారంగా భావిస్తున్నాను. కృతజ్ఞతలు.

‘వంశధార’ అక్రమార్కులకు క్లీన్‌చిట్‌ … మరి రూ. 20 కోట్లు ఎటు పోయినట్లో?


శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రూ.20 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర నిఘా విభాగం నివేదిక బుట్టదాఖలవనుంది. అవినీతి పరులని ప్రాథమికంగా తేలటంతో సస్పెండు చేసిన అధికారులకు ఇప్పుడు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. 2006-07లో వంశధారకు రూ.62.08 కోట్లు వినియోగించి మరమ్మతులు చేశారు. ఈ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు రావటంతో నిఘా విభాగం దర్యాప్తు జరిపింది. దానికి సంబంధించిన నివేదికను గత ఏడాది మార్చిలో ప్రభుత్వానికి అందించారు. అక్రమాలకు అప్పటి వంశధార ప్రాజెక్టు ఎస్‌ఇ, ఇఇ, డిఇ తదితర 33 మంది ఇంజినీర్లు బాధ్యులని నిఘా విభాగం నిర్ధారించింది. స్వాహాచేసిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలనీ, ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని నిఘా విభాగం స్పష్టంగా పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులందరినీ సస్పెండు చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత సంఖ్యలో ఇంజనీర్లను ఒకేదఫా సస్పెండు చేయటం అదే తొలిసారి. దీంతో గుత్తేదార్లు, ఇంజినీర్లు ఎవరి దోవలో వారు పైరవీలు మొదలెట్టారు. ూద్యోగుల సమస్యల్ని పరిశీలించే విభాగానికి ఫిర్యాదు చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. అయినా వారికి వ్యతిరేకంగానే తీర్పులు వెలువెడ్డాయి. చివరికి ఆ నివేదికను మంత్రులు పొన్నాల, ధర్మాన తదితరులు కలిసి ముఖ్యమంత్రి రోశయ్య ముందు పెట్టారు. దీంతో కనీసం తూతూ మంత్రంగానయినా తిరిగి దర్యాప్తు జరిపించి కొందరికైనా క్లీన్‌చిట్‌ ఇస్తే మినహా సస్పెన్షన్లను ఎత్తివేయలేమని ప్రభుత్వం తేల్చుకుంది. ూత్తరాంధ్ర ప్రాజెక్టుల సలహాదారు రౌతు సత్యనారాయణను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం ూత్తర్వులు జారీ చేసింది. సస్పెండైన 33 మంది ఇంజనీర్లలో, 12 మందికి అవినీతి వ్యవహారాల్లో ఎటువంటి సంబంధమూ లేదని నిర్దారిస్తూ సత్యనారాయణ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ మేరకు 12 మందినీ గత ఏప్రిల్‌లో తిరిగి ూద్యోగాల్లో నియమించారు. మిగిలిన 21 మందికీ ప్రభుత్వం దారిమళ్లిన సొమ్మను తిరిగి చెల్లించాలని తాఖీదులు జారీ చేసింది. అక్రమార్కులలో ఒకరు మృతిచెందగా, ముగ్గురు ఉద్యోగ విరమణ చేశారు. నిబంధనల ప్రకారం జీతంలో మూడోవంతుకు మించి జమచేసుకునేందుకు అవకాశం లేదు. సస్పెన్షను కాలంలో ఉద్యోగికి దక్కేది మూడో వంతు జీతమే. అందువలన దారిమళ్లిన సొమ్మును వసూలు చేయాలంటే ఆ ఉద్యోగికి పూర్తి జీతం అందాలి. ఆ మిషతో అక్రమార్కుల సస్సెన్షనును ప్రభుత్వం ఎత్తివేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయల మూటలు చేతులు మారినట్లు విమర్శలు విన్పిస్తున్నాయి.

లాభాల పొగ – రోజుకు రూ. 20 కోట్లు

”ఇప్పుడు ఆడపిల్ల పుట్టగానే చదువుకోవడానికి ఏ బడికి పంపాలి? ఏమి చదివించాలి? అని ఆలోచించే దశకు అందరూ చేరుకున్నారు. మేము మాత్రం బీడీలు చుట్టటం నేర్పిస్తున్నాం. బీడీలు చుడితేనే జీవనం. లేకుంటే పస్తులే. ఇతరులతో పోల్చి మా పిల్లల భవిష్యత్తును ఆలోచిస్తే భయంగా ఉంది – బీడీ కార్మికురాలు అన్నపూర్ణమ్మ ఆందోళన ఇది.
ఈ దుస్థితి రాష్ట్రంలో పది లక్షల మంది బీడీ కార్మికులు అనుభవిస్తున్నారు. బీడీ కార్మికులకు కనీస వేతనాల జోలే లేకున్నా కార్మిశాఖ పట్టించుకున్న దాఖలాలే లేవు.
పెద్ద బీడీలకయితే తునికాకు 800 గ్రాములు, పొగాకు 270 గ్రాములు, చిన్న బీడీలయితే తునికాకు 600 గ్రాములు, పొగాకు 220 గ్రాముల చొప్పున యజమానులు కార్మికులకు అందజేస్తున్నారు. అయితే అది పెద్దవయితే 600 బీడీలకూ, చిన్నవయితే 800 బీడీలకు మాత్రమే సరిపోతోంది. అదీకాక వెయ్యి బీడీలకు రెండు కట్టలు అదనంగా ఇవ్వాలి. అంటే కార్మికుల శ్రమ ఫలితం నుంచి మిగిలిన వాటిని జమచేసుకుంటారు. బాగా లేవంటూ ఏమీ చెల్లించకుండా తీసుకునే బీడీలను కూడా యజమానులు అమ్ముకుంటున్నారని కార్మికులు వాపోతున్నారు.
రాష్ట్రంలో బీడీ సంస్థల యాజమానుల లాభం ఏడాదికి రూ. 7300  కోట్లు
రాష్ట్రంలో రోజుకు వంద కోట్ల బీడీలు తయారవుతున్నాయి. వెయ్యి బీడీల తయారీకి రూ.85 ఖర్చవుతుంది. వాటిని యజమానులు రూ.280 చొప్పున మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఈ లెక్కన వంద కోట్ల బీడీలకు రూ. 8.5

కోట్లు ఖర్చుపెట్టి రూ.28 కోట్లు ఆదాయం గడిస్తున్నారు. అంటే యజమానులకు రోజుకు రూ.20 కోట్లు మిగులుతోంది. అంటే ఏడాదికి రూ. 7300 కోట్లన్నమాట.
మరి కార్మికులో…
రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులున్నారు.
వారికెవరికీ కనీస వేతన చెల్లింపు చట్టం అమలు కావటం లేదు.
గుర్తింపు పత్రాలున్న కార్మికులు కేవలం పది శాతమే.
మహిళలకు ప్రసూతి సమయంలో వేతనంతోపాటు ఇవ్వాల్సిన 12 వారాల సెలవు ఎక్కడా అమలు కావటమే లేదు.
బీడీ కార్మికుల్లో 70 శాతం మంది క్షయ, క్యాన్సరు, గర్భకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.
90 శాతం మందికి ఇఎస్‌ఐ సౌకర్యం లేకపోవడంతో సొంత డబ్బుతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పటం లేదు.