వాహనాల పద్మవ్యూహంలో చిక్కుకున్న ఇంకొల్లు బస్సు ఎట్టకేలకు బయటపడిందో లేదో రోజూ మాదిరే వర్షం జోరందుకుంది.
”చిరపుంజిలో పిలిస్తే వర్షాలు కురుస్తాయని చిన్నప్పుడు చదువుకోవటమే తప్ప చూసింది లేదు. కక్కాయ్, అసలీయేడు వానలు తెరిపిస్తాయంటావా?” సాంబయ్య ప్రశ్నించాడు వీరయ్యని.
”తెరపిచ్చుద్దులేరా, దిగులుపడమాక. ఒక్క పంటపోంగానే అంతగా ఇదియితే వెవసాయం యుగాల కితమే అంతమయి ఉండేదిరా పిచ్చోడా?” వీరయ్య అనునయించాడు.
”దిగులుపడ్డం కాదు. అప్పెట్టా తీర్చాలో అర్ధం కాక బుర్ర పగిలిపోతందనుకో. ఈ వర్షాల మూలంగా ఏడెకరాల్లో మినుము పోయె.ఇదొక పాతికేలు, పోయినేడాది అప్పు యాభై వేలు, వడ్డీ కలిపితే మొత్తం లక్ష రూపాయలు కట్టాలంటే నా వల్లవుద్దంటావా?, కక్కాయ్”
”ముందు శ్రద్ధగా వ్యవసాయం చెయ్యరా, అప్పెట్టా తీరదో చూద్దాం. అయినా, నువ్వు దిగులు పడితే అప్పులో ఒక్క పైసా తగ్గి పోద్దంటరా? నీ పిచ్చిగానీ. దాళ్వాకు నేను సర్దుతాలేరా, నువ్వు బాధపడతన్నావని ఇప్పుడే చెబుతున్నా, నాకు వడ్డీ కూడా ఇవ్వొద్దు. ముందు నువ్వు మావూలు మనిషివిగా. నిన్ను సూసి సామ్రాజ్యం ఎంత బాధ పడతందో నీకు తెలవదు. ఆరోగ్య్రాలు పోయాక తిరిగొస్తాయంటరా? సాంబయ్యకు సుదీర్ఘంగా హితబోధ చేస్తుండగా బస్సు మళ్లీ ఆగిపోయింది.
తేరిపారచూస్తే ముందు వాహనాల బారు కన్పించింది. గుళ్లకమ్మ సప్టాకు అరకిలోమీటరు ఈవలున్నట్లు అర్ధమయింది.
”ఏమయింది? గుళ్లకమ్మేయినా వచ్చిందేంటి?” బస్సు పక్కగా వచ్చిన ఎవరినో ప్రశ్నించాడు సాంబయ్య.
”లేదన్నా, సపటా కూలిపోయింది. ఎమ్మారువో వచ్చి ఇస్క బస్తాలు ఏపిస్తన్నాడులే. అయిపోవచ్చింది”
”అదేంటి మొన్నేగదా, నలబై లచ్చలు పెట్టి బాగుచేయించారు!? వీరయ్య ఆశ్చర్యపోతూ అడిగాడు.
”నలబై లచ్చలు…యాబై లచ్చలు. యాడపెట్టారండి. ఆ కాంటాట్రు మంతిరిగోరి సుట్టవంట. ఆయనగోరు తినటవే సరిపోయిందది. సివెంటు లేకుండా ఇసకేసి కడితే గోడ ఎక్కడన్నా నిలసద్దా సావీ?” బస్సులో వాళ్లంతా ఒక్కసారిగా నవ్వారు.
”సదువుకోకపోయినా అనుబగంతో బాగా సెప్పావబ్బాయ్” ఆ ప్రయాణికుడిని మెచ్చుకున్నాడు వీరయ్య.
”నా బోటోడు మాటాడితే, నోటి దురద తీరుసుకుంటన్నాడంటారండి. అదే మీబోటి పెద్దోల్లేమో పట్టనట్టు ఉంటారాయే. తప్పు ఎవడు సేసినా అందరం అడగాలండి”. బస్సులు కదులుతున్నట్లు చూసి ముందుకు వెళ్లిపోయాడు యువకుడు. చిన్నగా బయలుదేరినియ్యి వాహనాలు. సప్టా మీద ఒక వరసే నడుపుతున్నందున ఎదురొచ్చేవన్నీ ఎక్కడివక్కడే నిలబడున్నాయి. ఒంగోలు వేపు వెళ్లే వాహనాలనే పోలీసులు పంపుతున్నారు. తాము చెప్పినట్లు వినటం లేదంటూ డ్రైవర్లను బూతులు తిడుతున్నారు. లాఠీలు ఊపుతూ ఒకటే కేకలు. అరగంట తర్వాత ఎట్టకేలకు చప్టాదాటి రోడ్డెక్కింది ఇంకొల్లు బస్సు.
Archive for అక్టోబర్ 1st, 2010
1 అక్టో