రాష్ట్ర ముఖ్యముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖ అధికారులతో 4 అక్టోబరు 2010న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ”తొందర తొందరగా తెమలండి, మనకు అప్పెవడిస్తోడో దుర్భిణి వేయండి. దరఖాస్తులు పెట్టండి. వీలయినంత అధికంగా అప్పులు సంపాదించండి” అంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారట. అప్పు తేవటం అంటే మన వనరులను తాకట్టు పెట్టటమేనన్నది గతానుభవం. అప్పంటే మన సౌకర్యాలకు కోత పెట్టటమే. అప్పంటే మన బిడ్డల భవితవ్వంపై వేటు వేయటమే. అప్పంటే ఇక్కడి ధనవంతులకు ఉపకరించే ఒప్పందాలు చేసుకోవటమే. అప్పంటే ఇక్కడి అత్యధికులకు చేటు చేస్తామని అంగీకరించటమే. తెచ్చిన అప్పును అభివృద్ధి పనుల పేరిట గుత్తేదార్ల ఖాతాలకు తరలించటమే. అధినేతల కడుపు నింపటమే. అధికారుల ఆకలి తీర్చటమే. దీనికితోడు అనవసర ఖర్చుల్ని గుర్తించి కత్తెరేయాలని ఆయన ఆదేశించారు. అనవసర ఖర్చులంటే … మనింట్లో ఓ డజను కాఫీ కప్పులుంటాయి. కొత్త రూపంతో వాడెవడో తలకమాసినోడు కప్పుల్ని తయారు చేసి ఊళ్ల మీదకు పంపుతాడు. వాటిని చూడగానే వినియోగదారీతత్వం పెచ్చిరిల్లి వాటిని కొని అద్దాల అల్మైరాలో బోర్లాపడుకోబెడతాం. ఇది అనవసర ఖర్చు.
అయితే రోశయ్య చెప్పింది ఇలాంటిది అనుకుంటున్నారా?!
అయితే తప్పులో పప్పేసినట్లే.
ప్రభుత్వ పాఠశాల – ప్రభుత్వ వైద్యశాల – ప్రభుత్వ పరిశ్రమ – మీటర్లు బిగించకుండా కుళాయిల ద్వారా మంచినీటి పంపిణీ – వీధి దీపాల నిర్వహణ, గ్రంథాలయాలు… అదన్నమాట అసలు సంగతి. ఇలా ఇలా బోలెడు బోలెడున్నాయి లెండి ప్రభుత్వం దృష్టిలో అనవసర ఖర్చులనదగినవి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటే జనసామాన్యానికి ఇచ్చే ఆర్థిక రాయితీలకు కోతలు పెట్టమని అర్ధం.
ప్రపంచబ్యాంకు, జపాను అంతర్జాతీయ సహకార బ్యాంకు (జైకా), జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యూ తదితర ఆర్థిక సంస్థల నుంచి అప్పుల కుప్పలు విరివిగా రాబట్టేందుకు కృషిచేయాలని రోశయ్య ఆవేశపడిపోయారు.
అప్పులు తెచ్చి ముఖ్యమంత్రి ఏమి చేయమన్నారో చూడండి.
1. హైదరాబాదు నగరానికి మంచినీరు.
(అంటే మంచి నీటి ఖరీదు మళ్లీ పెంచబోతున్నారన్నమాట)
2. మురుగు నీటి వసతి కల్పన.
(మురుగునీటిని కాలువల్లోకి వదలాలంటే ఇక నుంచీ పన్ను కడితేనే సాధ్యమన్నమాట)
3. గ్రామీణ పేదరిక నిర్మూలన -3
(గ్రామీణ పేదల్ని (పేదరికాన్ని కాదు సుమా) ఏ విధంగా నిర్మూలించవచ్చో అలాంటి పథకాలకు రూపకల్పన చేస్తారు. ఉదాహరణకు పావలా వడ్డీ అంటూ పురిగొలుపుతారు. తీరా అరకొరలతో సరిపెడతారు. సూక్ష్మరుణ సంస్థలకు అనుమతిలిచ్చి వారితో పేదలకు అప్పులిప్పిస్తారు. ఆ సంస్థలు పేదల మూలుగుల్ని పీల్చిపీల్చి, ఆనక ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులారా! చావండి!! అంటూ మరణ మృదంగాలు మోగించేలా కథ నడిపిస్తారు.
4. భారీ వర్షాలు, వరదలకు నష్టాలపాలయిన బాధితులకు సాయం అదించే పధకం
(వరద బాధితులు, అతివృష్టి బాధితులు ఇలా పేరు పెడతారు. పైర్లను కోల్పోయిన రైతన్నలకూ, మగ్గం మునిగిన చేనేతన్నకూ, ఇల్లు కూలిన పేదోడికీ ఆర్థిక సాయం ప్రకటిస్తారు. అయితే వాటిని కర్నూలు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ లాంటి నిరుపేదలకు మాత్రమే అందజేసి ”ఆహా, నేటితో నా జీవితం ధన్యమయింది కదా!” అని పొంగిపోతారు. ఆ తర్వాత కూడా నదులు మళ్లీ పొంగుతాయి. నిధులు ప్రవహిస్తాయి. వాటిని యథావిధిగానే వలలున్నవాళ్లు, ఊతాలున్నవాళ్లు పట్టేసుకుంటారు.
ఇదీ నేటి ప్రభుత్వాలు నిర్వహిస్తోన్న మోసపు వలయ పాలన. పేదల పేరుజెప్పుకుని పెద్దలు తినేయటం మళ్లీమళ్లీ కొనసాగుతూనే ఉంటుంది. అందుకోసం ఇక్కడి శ్రమజీవుల చెమటను కొల్లగొడతారు. అది చాలక అప్పులు తెచ్చి మరీ బ్యాంకు లాకర్లలో కుప్పలు పోసుకుంటారు.
గమనిక
ప్రబ్యా అంటే ఏమీ లేదండీ ప్రపంచబ్యాంకు