Archive for అక్టోబర్ 7th, 2010

ఎందెందు వెదికిన అందెందు … రాహుల్ సాంక్రుత్యాయన్

ఆయన ఆసియా ఖండంలో సాటిలేని విజ్ఞాన వేత్త. 20 భాషలు మాట్లాడగల, రాయ గల పండితుడు. ఒకప్పడు బౌద్ధ సన్యాసి. తర్వాత బీహార్‌ కిసాన్‌ నాయకుడు. ఆయన జీవితం చివరి వరకు కమ్యూనిస్టు కార్యకర్తగా ఉన్నాడు. ఆ మహాజ్ఞాని జీవితం ఒక పెద్ద పోరాటం. అడుగడుగునా లెక్కలేని సాహసాలతో కూడిన అద్భుతమైన కథ. ఒక్క మాటలో వర్ణించాలంటే తెరపిలేని దేశాటనం, అంతులేని పరిశోధనా, విపులమైన రచనా వ్యాసాం గం…ఇవన్నీ గలసి అతని జీవితాన్ని ఒక మహత్తర సాహస కావ్యంగా మలిచాయి. ఆయన   రాహుల్‌ సాంకృత్యాయన్‌. రాహుల్జీ అనీ, పండిట్‌జీ అని కూడా పిలిచేవారాయనను.  ఆయన 20 ఏళ్ల ప్రాయం నుంచే ప్రారంభించి చరమదశ వరకు 150 పుస్తకాలు రాశాడు. ఓల్గాసే గంగ, జయ యౌధేయ వంటివి తెలుగులోకి అనువదించారు. బౌద్ధం మీద లెక్కలేనన్ని పరిశోధనలు చేసిన గొప్ప పరిశోధకుడు.

బాల్యం ….

రాహుల్‌ సాంకృత్యాయన్‌ 1893లో బెనారసు దగ్గర పందహ  గ్రామంలో  పేద రైతు కుటుంబంలో పుట్టాడు. తల్లి తరఫు తాతగారి ఇంట్లో పెరిగాడు. ”నీ మేనమామ సైనికుడు. సింహాలను వేటాడుతాడు. జాల్నా, కొచ్చిన్‌, కలకత్తా నగరాల్లో సైనిక జీవితాన్ని గడుపుతున్నాడు” అని సాంకృత్యాయన్‌ అమ్మమ్మ ఆయనకు కథలుగా చెబుతుండేది. దాంతో ఆయనకు బాల్యంలోనే సాహస కృత్యాలపట్ల మక్కువ ఏర్పడింది. ఇదే అతనిని ముందు ముందు ఎన్నో సాహస కృత్యాలకు పురిగొల్పి, అద్భుత పరిశోధనలను చేయించింది. సాంకృ త్యాయన్‌ 14వ యేటనే ఇంటివద్ద చెప్పకుండా కలకత్తా బయలు దేరాడు. 3 నెలలు పాటు అక్కడ ఉండి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ మూడు నెలల కాలంలోనే సన్యాసులతో సంబంధం పెట్టుకున్నాడు. సహజ సాహస గుణానికిదొకటి తోడయింది. ఇక ఇంటి వద్ద స్థిరంగా ఏలా ఉండగలడు? 16వ ఏట మళ్ళీ కలకత్తాలో 8 నెలలుండి వచ్చాడు. హిమాలయ పర్వతాలకని బయలుదేరి, హరిద్వారం చేరి కొన్నాళ్ళు సంస్కృత భాష అభ్యసించాడు.  అక్కడ కాలు కుదరక బెనారసు వచ్చి అధ్యయనం  పూర్తి చేశాడు. 1913లో తన 20వ ఏట బీహార్‌లోని ఒక ధనిక జమీందారు దగ్గర సంస్థాన పండితుడిగా చేరాడు. కానీ, ఆ బంగారు గొలుసులు స్వేచ్ఛా ప్రియుడైన ఈ మహావ్యక్తికి నచ్చలేదు. ఎంతో కాలం అక్కడ ఉండలేక పోయాడు. దక్షిణదేశ పుణ్యక్షేత్రాలను దర్శించడానికి బయలు దేరాడు. పూరీ జగన్నా థం, మద్రాసు వగైరా చూశాడు. చెంగల్పట్టులో 4 మాసాలు ఒక మహర్షి దగ్గర విశిష్టాద్వైతాన్ని గురించి చదువుతూ ఒక నాడు తిరుపతి తిరు నాళ్ళు చూడబోయి, అక్కడి నుండే అభిల భారత పర్యటన సాగించాడు. ప్రయాణాలకు ఎప్పుడు డబ్బు కావాలన్నా జమీందారు  నుంచే తెప్పిస్తుం డేవాడు. 9 నెలలు తిరిగి, తిరిగి బీహారు చేరుకుని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకొని మళ్లీ బయలు దేరాడు. అయోధ్యలో ఒక  మఠంలో చేరి కొద్ది రోజుల్లోనే వాళ్ళకు నాయకుడయ్యాడు. ఈ దశలోనే ఆర్య సమాజం తో సంబంధం ఏర్పడింది. మొదటి నుండీ ఆయనకు విచక్షణాజ్ఞానం ఎక్కువ. అది వరకుండే మత విశ్వాసాలకంటే ఆర్య సమాజం అభివృద్ది కరమైనదని భావించాడు. అది మొదటి ప్రపంచ యుద్ధ కాలం. పత్రికలు చదవటం ప్రారంభించాడు. రష్యా విప్లవమన్నా, ధనిక- దరిద్ర బేధం లేని సమాజమన్నా గాఢమైన అభిమానమేర్పడింది. ఈ యాత్రలోనే ఆగ్రాలో ఆర్య సమాజ ప్రచారకులను తయారు చేసే పాఠశాలలో ఒక యువ ఉపాధ్యాయుడితో సంబంధం గలిగింది. ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రష్యన్‌, అరబిక్‌ భాషలను నేర్చుకున్నాడు. ఖురాన్‌, బైబిల్‌ క్షుణ్ణంగా చదివాడు. సాంకృ త్యాయన్‌కు పరిచయమైన యువ ఉపాధ్యాయుడు రహస్య టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలు గలిగి ఉండే వాడు. దాంతో ఆయన నిషిద్ద గ్రంథాలు కొన్ని తెచ్చి సాంకృత్యాయన్‌కు ఇచ్చి చదివిం చాడు. ఆ ఉద్యమంపై సాంకృత్యాయన్‌కు అభిమానం ఏర్పడి బాంబులు తయారు చేయడం నేర్చుకొన్నాడు. కాని సోవియట్‌ రష్యాలో సోషలిజం గురించి తెలుసుకోవడంతో ఆయన వ్యక్తిగత దౌర్జన్యవాదాన్ని విడనాడాడు. ధనిక-దరిద్ర భేదాలుండరాదనీ, సైన్సు మానవుని అభివృద్దికి ఉపయోగపడాలనీ చెబుతూ ”సమాజం” అనే పుస్తకాన్ని రాసాడు. తరువాత చిత్ర కూటానికి వెళ్ళి సంస్కృతంలో ఉన్నత విద్యనభ్యసించాడు. 1920 వేసవికాలంలో మళ్ళీ హరిద్వారకు బయలు దేరాడు. ఒక కంబళీ, కమండలంతో సన్యాసి వేషంతో తిరుగుతుండేవాడు. సన్యాసి వేషధారికి సర్వత్రా ప్రవేశం సులభంగదా! ఎప్పడూ అభివృద్ధిని కోరుకునే ఆలోచన ఆయనది. అందువల్ల ఆయన బౌద్దమతం పట్ల ఆకర్షితుడయ్యాడు.  బౌద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించాడు. ప్రతిచోటా బౌద్ద మతాధిపతుల దృష్టిని ఆకర్షిం చాడు. కాని, ఒక్క ప్రదేశంలోనూ నిలకడగా లేడు. ప్రతి వేసవికాలం దేశాటనమూ, ప్రతి శీతాకాలం గ్రంథ రచన…యిదీ అతని అప్పటి జీవిత కార్యక్రమం. 1921లో సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. ఉద్యమంలో పాల్గొనాలనుకొన్నాడు. బీహారు చేరాడు. జమీందారీ విధానమంటే ఉండే మంటతో, వెనుకటి జమీందారు తన జమీని చూసుకోమన్నా అంగీకరించక ఉద్యమంలో పాల్గొన్నాడు. గ్రామాల్లో పని ప్రారంభించాడు. మంచి వక్త. తాలూకా కాంగ్రెస్‌ నాయకులు ఈయన గొప్పతనాన్ని గుర్తించి వారి నాయకుడుగా ఎన్నుకొన్నారు. ఇంతలోనే ఆ జిల్లాలోని 4 తాలూకాల్లో వరదలు వచ్చాయి. ఇతర ప్రపంచాన్ని పూర్తిగా మరిచి, వరద బాధితులకు, ప్రమాద స్థలాలకు కూడా వెళ్లి సేవజేశాడు.  కాంగ్రెస్‌ జిల్లా నాయకులు ఆయన కార్యదీక్షనూ, త్యాగబుద్ధినీ గమనించారు. సహాయ నిరాకరణోద్యమంలో ఉపన్యాసం ఇచ్చినందుకుగాను ప్రభుత్వం 6 నెలలు శిక్ష విధించింది. జైల్లో కాంగ్రెస్‌ నాయకులందరూ శాస్త్రాల్లో ఈయనకున్న అద్భుత పాండిత్యానికి ఆశ్చర్యపోయారు. బయటికి రాగానే జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా ఎన్నుకుని గౌరవించారు. జిల్లాలోని ప్రజలంద రిచే ఏకైక నాయకుడుగా పరిగణింపబడ్డాడు. ఉద్యమం ఆగిపోయింది. గాంధీ కార్యక్రమం సాంకృత్యాయన్‌కు నచ్చలేదు. స్వరాజ్య వాదుల తో చేరి కాంగ్రెస్‌ కార్యదర్శి పదవికి రాజీనామా ఇచ్చాడు. 1927 డిసెంబర్‌లో గయ కాంగ్రెస్‌కు హాజరయ్యాడు. నేపాలు వెళ్ళి ఒకటి రెండు మాసాలుండి తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి అరెస్టు వారంటు సిద్ధంగా ఉంది. అరెస్టు చేసి ఆజారీబాదు జైల్లో 2 సంవత్సరాలు నిర్భంధించారు. ఈ రెండు సంవత్సరాలూ పూర్తిగా అధ్యయనంలో నిమగ్నుడయ్యాడు. సంస్కృతంలో గ్రంథాలు వ్రాయడం వల్ల సమాజానికి ఉపయోగం లేదనుకొని, హిందీలోనే తన రచనలు సాగించాడు. సోవియట్‌ యూని యన్‌ను గురించి పూర్తిగా తెలియక పోయినా, తెలిసిన కాస్తతోనే ”20వ శతాబ్దపు భారతదేశం” అనే పుస్తకంలో భారత్‌లో సోషలిజం వస్తే ఎలా ఉండేది ఒక చక్కని నవలా రూపంలో చిత్రించాడు. ఆయన భావనాశక్తి అపూర్వ మైనది. 160 పేజీలుంటుంది ఆ నవల. సులభ శైలి.  ఈ జైలు జీవితంలోనే గణిత శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాడు. విడుదలయిన తరువాత కాన్పూరు కాంగ్రెస్‌కు హాజరయ్యాడు. తిరిగి సంచారం ప్రారంభించి, పంజాబ్‌ ఫ్రాంటి యర్‌, కాశ్మీర్‌, పశ్చిమ టిబెట్‌ వరకూ వెళ్ళి 9 నెలలకు ఇంటికి వచ్చాడు. కాంగ్రెస్‌ ఎన్నికల్లో పాల్గొని గౌహతి కాంగ్రెస్‌కు వెళ్ళాడు. 5 నెలలు బీహారులో ఉండి 1927లో సిలోనుకు (శ్రీలంక) వెళ్ళి, బౌద్ధమతంలోని లోతులను పరిశీలిం చాడు. అక్కడ బౌద్ధ కళాశాలలో పాలీబాష అధ్యాపకుడయ్యాడు. ఎంతో ప్రాచీన సంస్కృత వాజ్మయాన్ని తిరగవేశాడు. 1928 డిసెంబర్‌లో ఎల్లోరా, అజంతా గుహలకు వెళ్ళి బైద్ధ శిల్పాన్ని పరిశోధించాడు. 1929లో ఒక బ్రహ్మాండమైన యాత్రకు పూనుకున్నాడు. నేపాల్‌ వెళ్ళి మారు వేషాలతో హిమాలయ పర్వతాలను దాటి, 4 నెలల పాటు అదే పనిగా వాననక, మంచనక ఎన్నో కష్టాల కోర్చి ప్రమాణం చేస్తూ, టిబెట్‌ ముఖ్యపట్టణమైన లాసా చేరుకొన్నాడు. టిబెట్టులో ఎన్నో ప్రాచీన గ్రంథాలను, శిల్పాలను పరిశో ధించి వెలికి తీశాడు. 1930 జూన్‌లో 22 కంచరగాడిదల బరువుగల పురాతన గ్రంథా లనూ, చిత్రాదులనూ వెంట వేసుకొని యీ అపర భగీరధుడు టిబెట్టు నుండి సంహళానికి చేరాడు. అందరి ప్రశంసలకూ పాత్రమైన బుద్ధ జీవితాన్ని రాశాడు. అప్పటికి దేశంలో శాసనో ల్లంఘనోద్యమం సాగుతున్నది. 1930 ఆఖరు లో వచ్చి ఉద్యమంలో చేరి రహస్యంగా పని చేయటం ప్రారంభించాడు. గాంధీ-ఇర్విన్‌ ఒడంబడికతో ఉద్యమం ఆగిపోయింది. 1931 కరాచీ కాంగ్రెస్‌కు హాజరయ్యాడు. ఇంతకాలం ఎక్కడ తిరిగినా ఏమీ చేసినా, కాషాయ వస్త్రా లనూ, కమండలాన్నీ వీడలేదు. కాని చరఖా- అహింసలన్నా, గాంధీ తత్వమన్నా మొదటి నుండి ఈయనకు గిట్టలేదు.

కమ్యూనిస్టు రాహుల్ …..

ఈయన ప్రఖ్యాతినీ, కుశాగ్రబుద్ధినీ గ్రహిం చిన సింహళ ప్రధానమంత్రి సాంకృత్యాయన్‌ను ఇంగ్లండుకు పంపించాడు. అక్కడ ఆయన కమ్యూనిస్టు సాహిత్యాన్ని చదివాడు. రష్యన్‌ ప్రచురణలన్నీ చదివాడు. మార్క్సు అన్నా, రష్యా అన్నా విపరీతమైన భక్తి ఏర్పడింది. సోవియట్‌కు వ్యతిరేకంగా ఎవరేమన్నా సహించేవాడుకాడు. మార్క్సు సమాధివద్దకు వెళ్ళి పుష్పాలతో అలం కరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. బుద్ధు డూ, మార్క్సు ఇద్దరే మానవ సమాజానికి ముఖ్య మైన నాయకులని ఆయన భావిస్తుండే వాడు. ఆయితే కమ్యూనిజమా మతమా అన్న చర్చ వస్తే కమ్యూనిజానికే ప్రాముఖ్యత నిస్తుండేవాడు. ఇంగ్లండు నుంచి ఫ్రాన్స్‌, అక్కడ నుంచి జర్మనీ వెళ్ళాడు. జర్మనీలో హిట్లరు అధికారానికి రాక పూర్వమే సింహళం చేరాడు. 1933 వేసవిలో కాశ్మీర్‌కు వెళ్ళి, మళ్ళీ చలికాలంలో గ్రంథ రచనకు బీహార్‌వెళ్ళాడు. తన దగ్గర ఉన్న పెయింటింగులను పాట్నా మ్యూజియంకూ, గ్రంథాలను రీసెర్చి సొసైటికీ ఇచ్చి వేశాడు. 1933 చివర బరోడాలో జరిగిన ప్రాచ్య విద్యా మహాసభకు చెందిన పురాతన వస్తు పరిశోధన శాఖకు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఇదే సమయంలో బీహార్‌లో భూకంపం వచ్చింది. బాగా నష్టపడిన ప్రదేశాలకు వెళ్ళి ఎంతో దీక్షతో ప్రజలకు సేవజేశాడు. తరువాత టిబెట్టుకు రెండవసారి వెళ్ళి మరికొన్ని ముఖ్యమైన పరిశో ధనలు గావించి 1935లో బీహారు వచ్చాడు. ఆ వేసవిలో 9 నెలల పాటు బర్మా, మలయా, సయాం, జపాన్‌, కొరియా, మంచూ రియా, అక్కడ నుండి ట్రాన్సు బీరీయన్‌ రైల్వే ద్వారా మాస్కో, లెనిన్‌గ్రాడ్‌, బాకూ మొదలైన పట్టణాలను దర్శించి ఇరాన్‌, ఇరాక్‌ల ద్వారా చివరకు 1936లో భారతదేశం చేరాడు. ఆ సంవత్సరం చివరిలోనే ”దర్శన – దిగ్దర్శన” అనే గొప్ప తాత్విక గ్రంథాన్ని పూర్తి చేశాడు.

ప్రేమ – వివాహ0

లెనిన్‌గ్రాడ్‌లో ఉండగా ఒక గొప్ప పురాతన వస్తు పరిశోధన శాస్త్ర పండితుడైన ‘చెర్వాస్కీ’ అనే ఆయనతో స్నేహమేర్పడింది. 1937లో చెర్వాస్కీ టెహరాన్‌లో వేచి ఉండి, రాహుల్జీని ఆహ్వానించగా తిరిగి ఆయనతో సోవియట్‌కు వెళ్ళాడు. లెనిన్‌గ్రాడ్‌లో ఉండగా టిబెట్‌, మంగోలియన్‌ బాషల్లో పండితురాలయిన లైలా అనే ఒక రష్యన్‌ యువతితో పరిచయ మేర్పడింది. ఆమె ఆ రెండు భాషలకు చెందిన శాఖకు కార్యదర్శినిగా లెనిన్‌గ్రాడ్‌ యూనివర్శి టీలో పనిజేస్తూ ఉండేది. పరిచయం ప్రేమగా మారి ఆ సంవత్సరమే వివాహమా డారు. వారికి ఒక కొడుకు పుట్టాడు. ఇంతలో బీహార్‌ కాంగ్రెస్‌ మంత్రివర్గం సాంకృత్యాయన్‌ను మళ్ళీ టిబెట్టుకు వెళ్ళి పరిశోదన సాగించాలనీ, అందుకోసం కొంత డబ్బు కేటాయించామనీ వర్తమానం పంపింది. పరిశోధనే  ప్రాణంగా  భావించే సాంకృత్యాయన్‌ భార్యా పిల్లలను విడిచిపెట్టి టిబెట్టు వెళ్ళి, విలులైన అనేక వ్రాత ప్రతులను తీసుకువచ్చాడు. కలకత్తాకు వచ్చి సోవియట్‌ రష్యాను గురించి ‘సోవియట్‌ భూమి’ అనే పేరుతో 100 ఫోటో లతో గూడిన 900 పేజీల ఉద్గ్రంథాన్ని వ్రాశాడు. కలకత్తాలలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకు లైన పోమనాథ్‌ లహరీ, ముజఫర్‌ అహ్మద్‌ మొదలైన వారిని మొదటిసారిగా కలుసుకొని మాట్లాడాడు. బీహారులో అప్పుడు కమ్యూనిస్టు పార్టీలేక పోవుటం వల్ల, ఆయన అక్కడ కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలో చేరి జమీందారి వ్యతిరేక పోరాటాలు సాగించాడు. పోలీసులచే లాఠీ దెబ్బలు తిన్నాడు. తలకు తీవ్రంగా గాయాల య్యాయి. 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కాని 14 రోజులు నిరశనవ్రత దీక్షతో విడుదల పొందాడు. 1939లో మరొక జమీందారీ వ్యతిరేక పోరాటం జరిపి 2 ఏళ్లు శిక్షకు గురై మళ్లీ ఇదేవిధంగా 14 రోజులకు విడుదల పొందాడు. ఆ సంవత్సరమే కొత్తగా ఏర్పడిన బీహార్‌ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడయ్యాడు. 1940లో మన రాష్ట్రంలోని పలాసాలో జరిగిన అభిల భారత కిసాన్‌ సభకు అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు.  రైతు సమస్యల మీద  అధ్యక్షో పన్యాసం తయారు చేశాడు. అయితే  పలాసాకు ముందుగా జరగనున్న రాంఘర్‌ కాంగ్రెస్‌కు వెళుతుండగా ఆయనను అరెస్టు చేశారు. 29 మాసాలు డిటైనీగా, 1 సంవత్సరం డియోలీ జైల్లోను, మిగతా కాలం హజారీబాగ్‌ జైల్లోనూ నిర్బందించారు. ఇక్కడే 8 నాటకాలు ఇంకా ఎన్నో అభివృద్దికరమైన రచనాలూ మొత్తం 3000 పేజీల గ్రంథాలను రాశాడు. కమ్యూనిస్టు సిద్థాంతాలనూ, ఫాసిస్టు వ్యతిరేకతనూ ఇందులో పొందుపరిచాడు. 1942లో విడుదలై, పాట్నా చేరుకొన్నాడు. అప్పటి నుండీ అభిల భారత కమ్యూనిస్టు పార్టీ పత్రిక ”’లోకయుద్ధ” సంపాదక వర్గంలో పని చేస్తూ వచ్చాడు. తరువాత ఆయన 1945లో విజయవాడ లో జరిగిన  అఖిల భారత కిసాన్‌ మహాసభకు హాజరయ్యాడు. ఆ కాలంలోనే ”నూతన భారతదేశం – నూతన నాయకత్వం” అనే అమూల్యమైన 700 పేజీల గ్రంథాన్ని రాశాడు .

జీవిత చరమాంకం

జీవిత చరమాంకంలో ఆయన ఇండో నేపాలీ వనిత డాక్టర్‌ కమలను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. తరువాత ఆయన శ్రీలంక విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడుగా చేరాడు. అక్కడ ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. 1963లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో రాహుల్‌ సాంకృ త్యాయన్‌ తుదిశ్వాస విడిచాడు. అక్కడ నేటికీ ఆయన సమాధి ఉంది.