Archive for అక్టోబర్ 9th, 2010

టీషర్టు – కీచెయిను – కారు స్టిక్కరు – మద్యం లేబులు అన్నింటా ఆయనే.

మహాకవి శ్రీశ్రీ అంటారూ ”కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు. మరి కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు. ముందు యుగం దూతలు.” అని.
రెండో తరహా భావాలకు అచ్చుగుద్దినట్లు సరిపోయే వాడే చేగువేరా. చేగువేరా 43వ వర్ఠంతి నేడు.

అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ‘చే’ .  


యువకుల టీషర్టులపైనా, యువతుల చేతుల్లోని కీచెయిన్లలో, కార్లు, మోటారు బైకులకు అతికించిన స్టిక్కర్లలో, కప్పులు, సాసర్లు, ఇంటి అలంకరణ సామగ్రి, ఆఖరుకు మద్యం సీసాలపై కూడా కొన్నిచోట్ల నలుపు – తెలుపులో, మరికొన్నిచోట్ల రంగురంగుల్లో, ఇంకొకచోట హవానా చుట్టతో, కాకుంటే నక్షత్రం ముద్రించిన టోపీతో దర్శనమిచ్చే యువ స్ఫురద్రూపమే చేగువేరా.
ఇంతవరకు అందరికీ తెలుసు. తెలియందే అధికం. బహూశా ఆ పావన మూర్తిమత్వం గురించి మరొక్క  శాతం తెలిసినా భారతదేశంలో ప్రస్తుతమున్న పరిస్ధితుల్లో ఆయన చిత్రాలు 99 శాతం మాయమవుతాయంటే అతిశయోక్తిలేదు.
అదే ప్రపంచస్థాయిలో ఒకటి రెండు దేశాల్లో మినహా మిగతా ప్రాంతాలన్నింటా ‘చే’ ఇప్పటి వ్యాపార ప్రచారకుడి పాత్రను వీడి హృదయాంతరాల్లో చేరిపోతాడంటే నిజ్జంగా నిజం.
ఉత్కృష్ట మానవుడి అసలైన ఆలోచనలనూ, చేతల్నీ, సాహసాల్నీ తెలుసుకుని ప్రేమించేవాడు గంగిగోవు పాలలా ఒక్కడున్నా చాలన్న దృష్టితో బ్లాగ్లోకంలో ప్రదర్శనకు పెడుతున్నదే ఈ రచన.
ఆయన ప్రపంచ మానవుడు
మన యువ కథానాయకుడి అసలు పేరు ఎర్నెస్టో చేగువేరా. ఆయన ఎవరెస్టు శిఖరంలా ప్రపంచ మానవుడు. పుట్టింది 1928. అర్జెంటీనా వాసి. మరణించింది మాత్రం బొలీవియా విముక్తి పోరాటంలో. 1967 అక్టోబరు ఎనిమిదో తేదీన గాయపడ్డ ఆయన శత్రుసైన్యాలకు చిక్కాడు. ఇంకేముంది చేను వెంటనే మట్టుబెట్టమంటూ బొలీవియా తొత్తు ప్రభుత్వానికి అమెరికా నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అంతే ఆ మరునాడే చేగువేరాను చంపేశారు.
చే గురించి మరికొంత…
చేగువేరా 1953లో వైద్య విద్యను పూర్తిచేశాడు. మంచి వైద్యుడిగా, పరిశోధకుడిగా ప్రజలకు సేవచేయాలని తొలినాళ్లలో కలలుగన్న చే తర్వాత తన మార్గాన్ని మరల్చుకున్నాడు. లాటిన్‌ అమెరికా దేశాల్లో పర్యటిస్తూ క్యూబా విప్లవోద్యమం పట్ల ఉత్తేజితుడయ్యాడు. ప్రవాసంలో ఉన్న విప్లవకారులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆ క్రమంలోనే మార్స్కిజాన్ని అధ్యయనం చేశాడు. 1955లో క్యూబా విప్లవోద్యమ నేత కాస్ట్రోను కలుసుకుని ఆయన గెరిల్లా దళంలో వైద్యునిగా చేరాడు. మరుసటి రెండేళ్లలో ఆ దళానికి నాయకుడిగా ఎదిగాడు. 1959 జనవరి ఒకటో తేదీకి క్యూబా విప్లవం జయప్రదం అయింది. ఆ తర్వాత కాస్ట్రో ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వహించాడు చే.
తిరిగే కాళ్లు
తిరిగే కాళ్లు, వాగే నోరు ఊరకుండదన్నట్లుగా అటుపిమ్మట చేగువేరా కాళ్లు ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల్లో జరుగుతోన్న విముక్తి పోరాట కేంద్రాల్లోకి నడిచాయి. బొలీవియా విప్లవోద్యంలో పోరాడుతూ అక్కడే అమెరికా అమానుషత్వానికి బలయ్యాడు. ప్రపంచ మానవుడిగా కోట్ల మంది గుండెల్లో చేరి అమరుడయ్యాడు.
తల్లికి లేఖ
సామ్రాజ్యవాదంపై ఏ దేశం విజయం సాధించినా ఆయన అపారంగా సంతోషపడ్డాడు. ఏ దేశం ఓడినా ఆయన బాధపడ్డాడు. 1956లో తన తల్లికి రాసిన లేఖలో ఆయనంటారూ, ”నేను బతికున్నంతవరకూ నేను రుషి కారల్‌మార్క్స్‌ను అనుసరిస్తూనే ఉంటాను. ఆయన ఏ మహోన్నత లక్ష్యాల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడో నేనూ అదే స్ఫూర్తితో పనిచేస్తాను.” అని.
మహోన్నత మిత్రులు మార్స్క్‌, ఎంగెల్స్‌ జీవిత చరిత్రను రాసిన చే, వారి నడవడిక తనను ఎంతగా ప్రభావితం చేసిందో అందులో హృద్యంగా వివరించాడు. మార్స్క్‌ తన జీవితాంతం అత్యద్భుతమైన మానవీయ స్వభావంతో జీవించిన విషయాన్ని మరవకూడదన్నారు. ఆయన తన భార్య, పిల్లలపట్ల అంతులేని అనురాగాన్ని ప్రదర్శిస్తూనే తన జీవిత లక్ష్యాన్ని ఉన్నత కర్తవ్యంగా భావించిన వైనాన్ని ప్రస్తుతించాడు. తన కుటుంబాన్నీ, శ్రామికవర్గాన్నీ గాఢంగా ప్రేమించిన మార్స్క్‌ ఆ రెండింటినీ సమన్వయం చేసుకుని మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి విప్లవకారుడిగా నిలిచేక్రమంలో ఘర్షణకు లోనయ్యాడని విశ్లేషించాడు. ప్రపంచ మానవులయిన మార్స్క్‌, ఎంగెల్స్‌ను కేవలం విగ్రహమాత్రులుగా మిగిలిపోన్విద్దని హెచ్చరిస్తాడు.


ఇది చే ఉత్తమోత్తమ జీవితంలో ఒక్కశాతం కూడా కాదు. అతికొద్ది రేఖలు మాత్రమే. ఆయన స్థానం ఆరేడు కోట్ల రూపాయల విలువయిన కారు డోరుకు అతికించే స్టిక్టరు కాదని చెప్పే ప్రయత్నమే ఇది . ఆయన స్ధానం మద్యం సీసాల లేబులు కాదని గొంతెత్తి అరిచేందుకే ఇది. ఆయన స్థానం, ఆయన నడత, ఆయన ఆలోచనలు, ఆయన పిలుపు మరో ప్రపంచానికి మార్గాలని తెలియజెప్పేందుకే ఇది.