అసలే కోతి – అపై కల్లు తాగిందన్నట్లు…


11 అక్టోబరు 2010.
అర్ధరాత్రి 12 గంటల సమయం.
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని విఎస్‌టి ప్రాంతం.
నేను బాగ్‌లింగంపల్లిలోని మా కార్యాలయం నుంచి రాంనగర్లోని మా ఇంటికి రోజూమాదిరిగానే నడిచొస్తున్నాను. ఓ మోటారు సైక్లిస్టు ఆర్టీసి క్రాస్‌రోడ్డులోనుంచి రాంనగర్‌ రోడ్డులోకి 10-15 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రవేశించి నామీద పడబోయాడు. నేను అతడిని గట్టిగా పట్టుకుని పైకి తోస్తే తొలుత నిలదొక్కుకున్నాడుగానీ, ఒకటి రెండడుగులు ముందుకుపోయి వాహనంసహా కింద పడిపోయాడు.
అయ్యో! అని జాలేసింది. వేగంగా కదిలి వాహనాన్ని లేపుతుండగా, మరొకరు వచ్చి సాయం చేశారు. తర్వాత ఆ వాహనదారుడిని కూడా లేపేందుకు చేయిపట్టుకునే సమయంలో గుప్పుమని వాసనకొట్టింది. అప్పుడర్ధమయింది అసలు విషయం. వాడు పూటుగా తాగున్నాడు. నాకు తిక్కరేగింది. వాడ్ని అలాగే వదిలేశాను.
మోచేయి దగ్గర చురుక్కుమనటంతో చూద్దునుగదా, రక్తం కారుతోంది. అంటే వాడు నామీద పడబోతున్న సమయంలో మాటారు సైకిలు వెనక పెట్టున్న తుప్పుపట్టిన కిరోసిన్‌ పొయ్యి మోచేతికి తగిలి గాయమయింది. రక్తాన్ని చూసేసరికి వాడి మీద కోపం మరీ తన్నుకొచ్చింది.
”దున్నపోతుమాదిరిగా ఉన్నావు. తాగి ఊళ్లోళ్లమీద పడకపోతే, ఇంట్లో చావకూడదూ? తిట్లకు లేచాను.
దీంతో వాడు బుస్సుమని లేచాడు. ”ఆయ్‌! ఎ..వ..డి.. న..ను..కు..న్నా..వు..రా న..న్ను? చం..పే..స్తా!. మ ..రి..యా..ద..గా పో.. పో..పో..పో” అంటూనే మళ్లీ కూలబడ్డాడు.
ఇక అక్కడుండటం అంత మంచిది కాదనుకుని చకచకా ఇంటి ముఖం పట్టాను.
సమాజం నేరపూరితం అవుతోంది.
సమాజం ఘోరాలకు నెలవవుతోంది.
నా బుర్ర నిరాశావాదంలో చిక్కుకుంది.
నా హృదయం చివుక్కుమంది.
రెండు మూడు పాత నేర సంఘటనలు గబగబా బుర్రలో చేరి సినిమాలయ్యాయి.
ఈ సంఘటనకు వేదిక హైదరాబాదే.
ఐదేళ్లనాడు నేను రాజధానిలో కాపురం పెట్టిన తొలి మాసంలో జరిగింది. అప్పుడు నాకు అశోక్‌నగర్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, న్యూనల్లకుంట తప్ప మరే పేర్లూ తెలియవు. అందువలన ఈ సంఘటన ఏ ప్రాంతంలో జరిగిందో పేర్లు చెప్పలేను.
తుప్పల్లో శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది.
దాన్ని వెలికితీసి దినపత్రికల్లో ఫొటోలు ప్రచురించారు. పోలీసు స్టేషన్లలోనూ ప్రదర్శించారు. ఇక వాళ్ల పద్ధతిలో వాళ్లు ప్రయత్నించినా ఆ మృతుడి వివరాలేవీ చిక్కలేదు.
తర్వాత పదిరోజులకి ఓ ఇద్దరు తాగుబోతుల్ని పోలీసులు అనుమానం కింద అదుపులోకి తీసుకుని యమలోకం చవిచూపించారు భూలోకంలోనే. పోలీసులు అనుకున్న రహస్యాల్ని చెప్పినట్లు లేదుగానీ వాళ్లు ఓ హత్య చేసినట్లు మాత్రం కక్కారు. పోలీసులు ఆరా తీయగా తుప్పల్లో దొరికిన గుర్తు తెలియని మానవుడిని వాళ్లే చంపేశారని తేలింది మొత్తానికి.
”వాడికీ మీకూ తగాదేమిటి?” పోలీసుల ప్రశ్న.
”తగాదా లేదు సార్‌.” ఒకడి సమాధానం.
”ఏరా, లం.. ..డకల్లారా! తగాదా లేకుండా వాణ్నెందుకు చంపార్రా?
”నిజమే సార్‌, వాడెవడో మాకు తెలియదు.” రెండోవాడూ అదే చెప్పాడు.
ఆశ్చర్యపోవటం పోలీసుల వంతయింది.
”అదేంటిరా? వాడెవడో తెలియదంటారూ? తగాదా లేదంటారూ? మరి వాడిని ఎందుకు చంపినట్లో చెప్పి చావండిరా బాబూ! పోలీసులు తల కొట్టుకుంటూ వాళ్లను కోపంగా బతిమిలాడుకున్నారు కాసేపు. వాళ్లు నోరు విప్పకపోవటంతో ఓ పోలీసు తన లాఠీని విప్పాడు. అయినా వాళ్లలో చలనం లేదు.
దీంతో ఓ కుర్ర పోలీసు గబుక్కున లేచి, టేబుల్‌మీద పెట్టిన తుపాకీని అందుకుని వాళ్లలో ఒకడి కణతకు గురిపెట్టి ” ఒరేయ్‌, మా ఓపికలకు పరీక్ష పెట్టొద్దురా, లం.. కొడకల్లారా! నోరు తెరవకపోయారో? ఒకే ఒక్క తూటాకు ఛస్తారు” అంటూ తుపాకీతో నెట్టాడు.
అప్పుడుగానీ వాళ్లలో ఒకడు నోరు విప్పలేదు.
”మేమిద్దరమూ తాగి ఇంటికెళతన్నాము సార్‌. వాడు మాకు ఎదురుగా వెళ్తన్నాడు సార్‌. మా పక్కకు రాగానే వాడి చేయి నా భుజానికి తగిలింది సార్‌. అయినా వాడు అదేమీ తెలియనట్లు వెళ్లిపోతన్నాడు సార్‌. నాకు కోపం వచ్చింది సార్‌. వాడిని చితగ్గొట్టాలని ఇద్దరమూ అప్పటికప్పుడు అనుకున్నాము సార్‌. మేవుగూడా వెనక్కుతిరిగి వాడు వెనకే వెళ్లాము సార్‌. ఒకచోటకు పోగానే వాడి మెడపట్టుకుని కింద పడేశాను సార్‌. వాడు మమ్మల్ని తిడుతూ మీదకు వచ్చాడు సార్‌. వాడిని వదిలేస్తే మమ్మల్నిద్దరినీ చంపస్తాడనిపించింది సార్‌. అందుకని భయంపుట్టింది సార్‌. అక్కడే చేతికందిన పెద్ద రాయి తీసుకుని వాడి తలమీద వేశాను సార్‌. వాడు కిందపడగానే ఆ రాయిని మళ్లీమళ్లీ వాడి తలమీద వేస్తూ చితగ్గొట్టాము సార్‌. కాసేపటికి వాడు చచ్చిపోయాడనిపించింది. అప్పుడు వాడిని తుప్పల్లోకి లాగి పడేసి మేము వచ్చేశాము సార్‌. నిజ్జంగా ఇదే జరిగింది సార్‌. నన్ను నమ్మండి సార్‌.” చెప్పటం ముగించాడు వాడు.
పోలీసులకు నమ్మకం కుదిరింది వాడు నిజమే చెబుతున్నాడని. ఆ వార్తను పత్రికలకు విడుదల చేశారు ఆ సాయంత్రం.
వాహనాల ఒత్తిడి. మనుషుల ఒత్తిడి. ఒకడు అటూ, ఇద్దరు ఇటూ పోతుండగా ఆ ఒక్కడి చేయి పొరబాటున ఇద్దరిలో ఒకడికి తగిలింది. ఆ చెయ్యివాడు కనీసం గుర్తించలేనంత సున్నితంగా తగిలింది. అయినా మద్యం మహమ్మారి, ఆ ఇద్దరి హృదయాలనూ విషపు శిలలుగా మార్చేసింది. అమాయకుడి ప్రాణాలను క్షణాల్లో తీసేసింది. వాడు చేసిన తప్పేమిటో కనీసం తెలియకుండానే ఓ నిండు ప్రాణం విషపు శిల తాకిడికి పదేపదే గురయి ఎగిరిపోయింది.
ఇంకో నేరం
దీనికి వేదిక ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు.
ఈ నేరం జరిగి కనీసం పాతికేళ్లయినా అయుండొచ్చు.
అప్పట్లో ఒంగోలు నేరాలకు రాజధాని. హత్యలు జరక్కుండా రోజు గడిచిన ప్రతిరోజూ పుణ్యకాలమే. ఆ రోజు ఏదో పుణ్యం చేసుకుందనుకునేవాళ్లు జనం. అలాంటి సమయంలో రోండో ఆట పూర్తయిన తర్వాత ఓ అరగంటకు ఒంగోలు మార్కెట్టు సెంటర్లో హత్య జరిగింది. సమాచారాన్ని ఎవరు చేరవేశారోగానీ పోలీసులు సినిమా అవతారాల్ని వదిలేసి ఆగమేఘాల మీద అక్కడకు చేరుకున్నారు.
అక్కడ పరిశీలించారు.
ఓ వృద్ధుడి శవం. దాని పక్కనే తట్ట. చెల్లాచెదురుగా పడిపోయిన రుచికి ప్రసిద్ధిచెందిన ఇనమనమెల్లూరు జామకాయలు. కొందరు పోలీసులు అక్కడే తమ బుర్రలకు పదును పెడుతుండగా, కొందరు వీధుల్లో వేటాడటం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే నలుగురు కుర్రాళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. అందులో ఒక్కడికీ మీసాలు కూడా రాలేదు. నూనూగు మీసాల కుర్రోళ్లు. అంతా ఇరవై లోపే. నాలుగు దెబ్బలు పడినయ్యో, లేదో… ఆ ముసలోడిని తామే చంపేశామని చెప్పేశారు.
”డబ్బుకోసమా?”
”కాదు.”
”కాయల బేరంలో తగాదా పడ్డారా?”
”లేదు”
”మరి?”
”పూటుగా మందుకొట్టి రెండో ఆట సినిమాకెళ్లాము సార్‌. దాంట్లో హీరో కనపడినవాళ్లందరినీ చంపేశాడు సార్‌. పోలీసులకు దొరికినా, విచిత్రంగా సమాధానాలు చెప్పి కోర్టు నుంచి విడుదలయ్యాడు సార్‌. సినిమాహాలు నుంచి బయటకు రాగానే ఎవణ్నయినా చంపాలని పించింది. అంతే లారీ దిగి జామకాయల బుట్టతో వస్తున్న తాతనయితే సులభంగా చంపొచ్చని అనిపించి అందరం కలిసి ఒకేసారి తాత మీదబడి గొంతు నులిమాము. ప్రాణాలు పోయిన తర్వాత భయం పుట్టి ఇటొచ్చేశాము సార్‌.” అందరూ కలిసికట్టుగానూ, విడివిడిగానూ అదే చెప్పారు. పోలీసులకు నమ్మకం కుదిరింది. వాళ్లను కటకటాల్లో తోసిన రెండు గంటలకుగానీ లోకానికి వెలుగురాలేదు. మద్యం, సినిమా కథానాయకుడి సాహసాలు ఆ నూనూగు మీసాల యువకులను ప్రేరేపించి వారిని హంతకులుగా చేసింది.
ఈ రెండు నేర సంఘటనలకూ కొన్ని ఉమ్మడి నేపథ్యాలున్నాయి.
1. అసమాన సమాజం కారణంగా అట్టడుగుల్లో చోటు చేసుకున్న అసహనం.
2. తగినంత పనిలేకపోవటం.
3. యువకులు సహజంగా ప్రదర్శించుకోవాలనుకునే వ్యక్తిగత సాహసాలకు అవకాశం లేకపోవటం.
4. కళ్లెదుటే కన్పిస్తూ అందని వినియోగదారీ సమాజం.
5. మద్యం.
6. అతిగానూ, అడుగడుగునా ప్రేరేపించే మీడియా.
మరి మీరేమంటారు?

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

  1. బాగా వ్రాసారు…మీ బాధ అర్ధముతోంది ఈ టపా చదువుతోంటే…..కానీ ఇది ఎవరు బాగు చేయలేరు……బాగా డబ్బులున్న వాళ్ళకి తాగుడు ఒక గొప్ప….ఏమి లేని వారికి తాగుడు ఒక మత్తు..బాధల్ని దూరం చేసే మందు….ఇలా ప్రతి ఒక్కరు దాన్ని సమర్ధించుకునే వారె!! ఇలాంటివారికి దూరంగా ఉండడం తప్ప చేసేదేమీ లేదు.

    స్పందించండి

  2. ఇది చదువుతుంటే గొడవలంటే ఠక్కున ఒక విషయం గుర్తుకువచ్చింది. కెనడాకి కొత్తగా వచ్చిన రోజులవి. ఒక 25 సెంట్ల విషయంలో తేడా వచ్చి మా రూంమేటు ఒకడు నాతో గొడవ పెట్టుకున్నాడు. ఓ 25 సెంట్ల విషయంలో గొడవెందుకుగానీ నువ్వే వుంచేసుకో అని నేనంటే ఏం దానం ఇస్తున్నావా నాకు అని మళ్ళీ గొడవ. ఇండియాలో వాళ్ళు ధనికులే కానీ ఏం లాభం.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: