Archive for అక్టోబర్ 12th, 2010

పోసానికి పిచ్చి ముదిరింది! కెమెరా తలకు చుట్టండి !!


అవును పోసాని కృష్ణమురళికి పిచ్చి ముదిరింది.! ఇక కెమెరా తలకు చుడితే సరిపోతుంది మరి!! పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటికెవడో.
చే అని కోట్లాది మంది ప్రపంచవ్యాపితంగా ఆప్యాయంగా పిలుచుకునే చేగువేరాను దుశ్శాసనుడంటూ సినిమా తీయపూనుకున్న పోసానికి ఈ తిట్లు చాలవు. చే మానవత్వపు గని. వైద్య వృత్తి చేపట్టి డాలర్లు పోగేసుకునేందుకు బోలెడు అవకాశం ఉన్నా ప్రజల కోసం, సామాజిక మార్పుకోసం జీవితాంతం కృషిచేసిన మహనీయుడు చే. అర్జెంటీనాలో పుట్టి క్యూబా విప్లవోద్యమంలో కాస్ట్రోతో కలిసి పనిచేసిన ఆయన లాటిన్‌ అమెరికా దేశాల విముక్తి కోసం రక్తమోడ్చిన విప్లవకారుడు. బొలీవియా విముక్తి పోరాటంలో గాయపడి దొరికిన ఎర్నెస్టో చే గువేరాను అమెరికా పాలకుల ఆదేశాలమేరకు నిలువునా చంపేశారు.
కాగా దుశ్శాసనుడు పుక్కిట పురాణం భారతంలో పాత్రధారి. ద్రౌపది చీరలు వలవబోయిన దుష్టుడిగా ఇతగాడు ప్రజల మదిలో ముద్రేసుకున్నాడు. అలాంటి వాడి పేరుతో చేగువేరాకు పొంతన కుదర్చాలనుకోవటమే అతని పిచ్చి ఏ స్థాయికి చేరిందో ఇట్టే అర్ధమవటం లేదూ! పరాజయాల పరంపర ఎదుర్కొంటున్న శ్రీకాంత్‌ను చేగువేరా రూపంలో దుశ్శాసనుడిగా చూపితే వచ్చేది విజయమూ కాదు. రాలేది డబ్బూ కాదు. నిర్మాత సహా ఈ ముఠా పరాజయాన్ని మూటగట్టుకుని చరిత్రలో మద పిచ్చోళ్లుగా ముద్రేయించుకోవటం ఖాయం.

జగన్‌ ఆదాయప్పన్ను లెక్కలు విని నివ్వెరపోయిన టాటా, బిర్లా, అంబానీ


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు, లోక్‌సభ కడప సభ్యుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి 2010 – 11 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి 84 కోట్ల రూపాయల పన్నును ముందస్తుగా చెల్లించారు. దీంతో కార్పొరెట్‌ దిగ్గజాలైన టాటా, బిర్లా, అంబానీలు సైతం విస్తుపోయారని వార్త.  తన సంవత్సరాదాయం రూ.520 కోట్లు ఉంటుందని అంచనా వేసి ఆయన ఈ పన్ను చెల్లించారు! గత సంవత్సరం చెల్లించిన దానికంటే ఇది 1100 శాతం అధికం. ఆయన 2008-09 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ. 2.92 లక్షల పన్ను మాత్రమే చెల్లించడం గమనార్హం. 2009-10 ఆర్థిక సంవత్సరానికి 6.72 కోట్లు చెల్లించారు. జగన్‌ అసాధరణ ఎదుగుదల కార్పొరేట్‌ దిగ్గజాలనూ, విశ్లేషకులను నివ్వెరపరిచింది. అత్యధిక పన్ను చెల్లించిన వారిలో జగన్‌ తర్వాత గనుల కుబేరుడు, కర్నాటక మంత్రి గాలి జనార్ధనరెడ్డి భార్య గాలి లక్ష్మీ అరుణ కావటం పరిశీలనార్హం. జగన్‌ ఆధ్వర్యంలోని సాక్షి దినపత్రికకు గడచిన సంవత్సరం కాలంలో రూ. 400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఓ వైపున వార్తలు విన్పిస్తుండగా, రెండోవైపున ఇంతింత లాభాలు ఏ విధంగా సమకూరాయో? అన్న అనుమానం రావటం సహజం.

100 టపాల్ని కొ[క]ట్టేశానహోచ్‌ !

మనిషి బతుకు లెక్కకు నూరేళ్లయినా అంతసేపూ బతకటం అక్కడొకరికీ ఇక్కడొకరికీ మాత్రమే సాధ్యమన్నది మనకు తెలియంది కాదు.
కిర్రుకెట్టులోనూ శతకాలు కొట్టటం ఒకరిద్దరికే సాధ్యమని కర్ణాకర్ణిగా విన్నాను.
తెలుగోళ్లకు శతకాలు కొత్తకాదు. అవే సుమతి శతకం, వేమన శతకం ఇత్యాదులు.
ఇక సినిమాలు వందరోజులు ఆడితే పండగే పండక్కదా!
ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాలు వందరోజులు నిలబడితే కూడా అంతే గొప్పగా భావించి వార్తల్ని రాసేయటం, చూపించేయటం రివాజుగా మారింది.
అట్లాంటి నేపథ్యంలో కంప్యూటరమ్మ పోకడలు అతికొద్దిగా మాత్రమే తెలిసిన నేను తెలుగులో బ్లేడు బాబ్జీ మాటల్లో చెప్పాలంటే బలాగు పెట్టటం… నూరు టపాల్ని టపాటపా రాసేయటం నాగ్గొప్పే కదా!


నూరు టపాలకు సంబంధించి లెక్కల్ని చూస్తే…
తెలుగింటి వయస్సు … నాలుగు మాసాలు.
అయితే మా గ్రామానికి వెళ్తే అక్కడ మా అమ్మ తప్ప కంప్యూటరమ్మా ఉండదు – అంతర్జాలపు గోలా ఉండదు. అంటే ఆ కాలమంతా సెలవే సెలవన్నమాట.
నా మాటలో చెప్పాలంటే అయిదరుబయిదరులో ఉన్నా అంతర్జాలానికి అధికంగానే విరామ సమయం ఉన్నట్లు తేలింది.
గత వారం రోజులుగా అంతర్జాలంతో మాకు సంబంధబాంధవ్యాలు లేవు. దీంతో టపాల్ని పావుగంట, ఇరవై నిమిషాల్లోనే మా కార్యాలయంలోనే చేయక తప్పలేదు. ఆ కారణంగానే మిత్రుల రచనలనే టపాలుగా పెట్టుకునేడ్చాను లెండి. అన్నట్లు వాటితోనే నూరు టపాలు సుమా. అయినా తెలుగిల్లులో నూరు టపాలు పడ్డాయి కదాని పండుగ అంటున్నానులెండి.
ఆశీర్వచనాలు … అక్షింతలు (స్పందనలు) … 399. ఇంక్కొరు కనీసం బండబూతుల్నయినా… భోంగిరి యాద్గిర్‌ మాదిరిగానయినా తిట్టి ఉంటే బాగుండేదేమో! అన్నట్లు ఆయన అమ్మా, అక్క అక్షింతలతోపాటు సమైక్యవాదం విన్పిస్తున్నాడంటూ కొత్తపాళీగారిని దంచుడే దంచుడేకు ఉస్మానియాకు ఆహ్వానిస్తూ ఓ తెలంగాణాభిమాని పంపిన ప్రత్యేక ఆహ్వానాన్ని కూడా చెత్తబుట్టలో పడేసి ఉంచాను. వాటితో కలుపుకుంటే 401. అయితే వీటిలో కనీసం పదో, పదిహేనో నా స్వకుచ మర్ధనలూ ఉంటాయనుకోండి.
ఆశీర్వచనాల లోతుపాతుల విషయానికొస్తే ఏ కృష్ణశ్రీగారో ఆశీర్వదించారని సంతోషపడేలోగానే మరుసటి రోజున అక్షింతలూ పడి తలబొప్పికట్టింది. అయినా అంతలోనే నాకిష్టులయిన లబ్ధప్రతిష్టులు కర్లపాలెం హనుమంతరావుగారి లాంటి అనుభవజ్ఞులు ఆహా అంటూ వెన్నుతట్టి నిలబెట్టారు నన్ను. అలాగే అమెరికా నుంచి శరత్‌కాలం ( నా పాతిక, ముప్పై కథల కథానాయకుడి పేరు శరత్తేనండోయ్‌), చెన్నయ్‌ నుంచి మిత్రుడు జయదేవ్‌, విజయవాడ నుంచి జర్నలిస్టు రామకృష్ణ, సామాన్యుడు, కొత్తపాళి, సుజాత(మ్మ), రాజధాని నుంచి రాఘవేంద్రరావుగారు ఇలా ఇలా పలువురు నన్ను చదివి, తిట్లో, శాపనార్థాలో, ఆశీర్వచనాలో, సూచనలో చేయటం పట్ల ధన్యవాదాలు.
అలాగే వీవెన్‌, చదువరి కూడా తమ తమ స్పందనలను పంచుకోవటం సంతోషదాయకం. పేర్లన్నింటినీ వెతికి రాయాలనున్నా, సమయాభావంతో చేయలేకపోయినందుకు నన్ను క్షమింతురుగాక!
ఇక వీక్షకుల సంఖ్య చూస్తే … 16074 మంది. అబ్బో! నాదేమీ బ్లాగు బాబ్జీ లాంటి బలాగు కాదు. అయినా ఇంతమంది వీక్షకుల్ని ఆకర్షించటం గొప్పేనేమో?. తెలుగింటిలాంటి భిన్నమైన (ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది మరోదారి… అనలేదూ మన పెద్దలు) ఆలోచనున్న, ప్రతిదానికీ ముఖం మాడ్చుకుని పేలాలు వేగించే బ్లాగుకు రావటం, చదవటం, స్పందించటం హబ్బో, హబ్బో … కోట్లాది పూలను పూయించినట్లు – కోట్లకోట్ల భావాలను వికసింపజేసినట్లే గదా!?
ఇంకొక్క విషయం చెప్పి ముగిస్తాను. నా బ్లాగుకు ఇంత ప్రాచుర్యం కల్పించిన సంకలినులకు నేనేమీ చేయలేకపోవటం. అదేనండి కూడలి, జల్లెడ, మాలిక, హారాలను నా బ్లాగులో అనుసంధానం చేయాలి కదా. కానీ ఏమి సేతునురా లింగా ఏమీ సేతు అన్నట్లుగా నాకు అనుసంధాన ప్రక్రియ చేతగాక చేసిన తప్పు తప్ప, కావాలని చేసింది కాదని సంబంధిత మిత్రులు నన్ను క్షమిస్తారని ఆశిస్తాను. మిత్రులెవరయినా స్పందించి ఆ అనుసంధానమేదో చేసిపెడితే భలే సంతోషిస్తాను సుమండీ.
నా పోస్టుల్లో కాస్త ఎన్నదగినవాటిని ఎన్నుకుని ఓ వంద పేజీలకు మించకుండా వచ్చే ఫిబ్రవరి నాటికి ఆచ్చేయాలనుంది. మిత్రులు సలహాలివ్వండి సారూ!
అన్నట్లు మొహమాటం లేకుండా చెబుతున్నాను. నూరు టపాలు పూర్తిచేసుకున్న తెలుగిల్లుకు మీ ఆశీర్వచనాలు పంపడం మాత్రం మరచిపోకండేం!
ఈ సంతోష వేళ…
అందరికీ నెనరులు!
అందరికీ కృతజ్ఞతలు !!
అందరికీ ధన్యవాదాలు !!
వెంకట సుబ్బారావు కావూరి
మా ఊరు ఈదుమూడి.