Archive for అక్టోబర్ 13th, 2010

ఓదార్పుకు 42 గంటలు స్వోత్కర్షకు 918 గంటలు


లోక్‌సభ కడప సభ్యుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రకాశం ఓదార్పు యాత్ర మంగళవారం ముగిసింది. అయితే ఓదార్పుకేమో 42 గంటలు వెచ్చించగా, స్వోత్కర్షకు 918 గంటల సమయాన్ని కేటాయించటం పరిశీలనార్హం. అంటే బహిరంగ రహస్య కార్యక్రమానికి నామమాత్రంగానూ, రహస్య లక్ష్యానికేమో అత్యధిక సమయాన్నీ వైఎస్‌ తనయుడు కేటాయించారు. ఈ యాత్రకు జగన్మోహనరెడ్డి రూ. 50 కోట్లదాకా వెచ్చించగా, స్ధానిక నాయకులతోపాటు జనం సొమ్ము కూడా అంతే మొత్తం ఖర్చయినట్లు అంచనా. అంటే మొత్తం ఖర్చు వంద కోట్ల రూపాయలు. మృతుల కుటుంబాలకు అందింది కేవలం 42 లక్షలు మాత్రమే.
వాస్తవానికి ప్రకాశం జిల్లాలో కేవలం తొమ్మిది రోజులపాటు తిరిగి వైఎస్‌ మరణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలినవారి కుటుంబ సభ్యులను ఓదార్చనున్నట్లు యాత్ర నిర్వాహకుడు, గనులశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సెప్టెంబరు మూడో తేదీన గిద్దలూరులో ప్రారంభమయిన తొమ్మిది రోజుల యాత్ర కాస్తా నలభై రోజులపాటు సాసాసాసాసాగింది. కాకపోతే కంటి సమస్య కారణంగా ఆయన ఒంగోలులో మకాం వేసి యాత్రకు విరామమిచ్చారు. అంటే విశ్రాంతి మాత్రం కాదన్న మాట. ఆ కాలంలోనూ రాజకీయాల చర్చోపచర్చలు సాగాయి. జిల్లాలోని సగం అంటే 634 గ్రామాల్లో, 2730 కిలోమీటర్లమేర ఆయన పర్యటన సాగింది. మొత్తం 594 వైఎస్‌ విగ్రహాలను ఆయన ఈ కాలంలో ఆవిష్కరించారు. ఓదార్పు యాత్రను చీరాల, పర్చూరు శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యతిరేకించగా ఆ ప్రాంతాల్లోనే చెరి ఐదు రోజులపాటు జగన్మోహన యాత్ర సాగింది. పైగా దగ్గుబాటి స్వగ్రామం, తెలుగుదేశానికి కోటలాంటి కారంచేడులో మూడు వైఎస్‌ విగ్రహాలను ఆవిష్కరించటం విశేషం. ప్రతిపక్షనేత చంద్రబాబుపైనా, పత్రికలపైనా విమర్శలతో యాత్ర సాగింది. దీనికితోడు జగన్‌ భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటూ బాలినేని ఊరూరా ఠాంఠాం వేయటంతో యాత్ర అసలు లక్ష్యం నగ్నంగా వెల్లడయింది.
అంటే యాత్ర అసలు లక్ష్యం జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోవటం ఒకటి కాగా, అందుకు అడ్డంకయ్యే ప్రతిపక్షాన్నీ, పత్రికలనూ తూర్పారబట్టి ప్రజల్లో పలుచన చేయాలన్న వ్యూహం రెండోది. ఈ లక్ష్యాలు, ఈ వ్యూహాలు ఎంతవరకూ ఫలిస్తాయన్నది భవిష్యత్తులో తేలాల్సిందే. అయితే అసలే కుళ్లిపోయిన రాజకీయాన్ని జగన్మోహనుడు మరింత కంపు చేశాడనటంలో అతిశయోక్తి లేదు. ఆ పనిలోనే తన తండ్రికి అత్యంత ఆప్తమిత్రుడయిన కేవీపీ రామచంద్రరావును సైతం దూరంగా పెట్టాడు. తన బాబాయి సుబ్బారెడ్డికి ఆ స్ధానం ఇచ్చాడు. జిల్లాలో ఓ కులాన్నీ, ఓ మతాన్నీ అండగ చేసుకుని యాత్రను జయప్రదం చేసుకున్న యువ వైఎస్‌ తన ఉజ్వల భవితవ్యానికి కనీసం ఏడాదిన్నర కాలంపాటు యాత్ర జరపాలని ప్రకాశంలో నిర్ణయించుకున్నాడు. పైగా తన ముందు యాత్రల్లో కాంగ్రెసుపార్టీ నేతలపైనా, ప్రభుత్వంపైనా విన్పించీ విన్పించకుండా విప్పిన స్వరాన్ని పూర్తిగా మూతేశాడు. తన భవితవ్యానికి అడ్డంకుల్ని గుర్తించి వాళ్లమీదే తన బాణాల్ని సంధించాడు. సానుభూతిని సొంతం చేసుకునేందుకు జగన్మోహనరెడ్డి అడుగుడుగునా ప్రయత్నించటం ఈ యాత్రలో మరో విశేషం. అయితే ఇందిరమ్మ చనిపోయిన తర్వాత భారతీయుల సానుభూతిని అపారంగా పొందిన రాజీవ్‌గాంధీ అనంతరం ఐదేళ్లకే చతికిల పడిన వైనాన్ని ఆయన గుర్తుచేసుకుంటే మేలు. ఎన్టీఆర్‌  రాజకీయ జీవితం నుంచి కూడా ఈ గుణపాఠం నేర్చుకోవచ్చు.