నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.
ఐరాస ఆహార , వ్యవసాయ క సంస్థ (ఎఫ్‌ఎఓ) వ్యవస్థాపక దినమైన 1945 అక్టోబరు 16 వతేదీని ఏటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దీనిని మొదటి సారి 1981 లో జరుపుకున్నారు. అప్పటి నుంచీ క్రమం తప్ప కుండా ఏటా ఒక్కో సందేశాన్ని ఇది ముందుకు తెస్తుంది. తొలి ఆహార దినోత్సవం నాడు ఆహారానికి తొలి ప్రాధాన్యత అన్నది ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది అంటే 28వ అహార దినోత్సవం సందర్భంగా సంక్షోభ సమయంలో ఆహార భద్రత అన్న దానిని ప్రధాన అంశంగా తీసుకున్నారు. 2010 సంవత్సరానికి గాను ఆకలిపై సమిష్టి పోరు జరపాలని ఎఫ్‌ఎఓ పిలుపు నిచ్చింది. గత సంవత్సరం జరిగిన ప్రపంచ ఆహార భద్రతా సదస్సు ఆమోదించిన ఏక గ్రీవ తీర్మానంలో ఆకలిని భూమ్మీద నుంచి సాధ్యమైనంత త్వరగా తుడిచిపెట్టాలని పిలుపునిచ్చింది. ప్రపంచంలో డెబ్బయి శాతం మందికి జీవనాధార మైన వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతున్న విషయాన్ని ఈ సదస్సులో అన్ని దేశాలూ అంగీకరించాయి. వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగంపై చూపుతున్న ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఆకలి, పేదరికం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించేందుకు ఈ రంగంలో పెట్టుబడులు పెంచాలని కోరింది.
ఆశయాలు, ఉద్ఘాటనలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆచరణే అధ్వానం. భారత్ లాంటి దేశాల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక వైపు వృథా అవుతున్న ఆహార ధాన్యాలు … మరో వైపు ఆకలి కేకలు, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు . ఒకే దేశంలో పూర్తి భిన్నమైన రెండు దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎఫ్‌ఏఓ చేసిన ప్రకటనలు కానీ, అంతర్జాతీయ సదస్సుల్లో అంగీకరించిన తీర్మానాలు కానీ ఏవీ సరిగ్గా అమలు కావడం లేదు. ఆకలిని పారదోలుతామని అంతర్జాతీయ వేదికలపై గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చే పాలకులు వాటిని ఆచరణలో పెట్టే విషయానికొచ్చేసరికి మౌనం వహిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచుతామని అక్కడ చెబుతారు. ఇక్కడకు వచ్చేసరికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. మన దేశంలో సంస్కరణలు అమలులోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులపై ఏటా కోత పడుతూనే వుంది. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఆకలి, పేదరికం పెరుగుతున్నది. ‘కామన్వెల్త్ కామన్ హంగర్’ పేరుతో తాజాగా విడుదలైన నివేదికలో ప్రపంచ వ్యాపితంగా పౌష్టికాహార లోపం, సరైన తిండి లభించని కారణంగా బరువు తక్కువగా పుడుతున్న పిల్లల్లో అత్యధిక శాతం భారత్‌లోనే వున్నారని తేలింది. ప్రపంచంలో బరువు తక్కువతో పుట్టిన పిల్లల్లో 64 శాతం మంది 54 కామన్వెల్త్ (ఒకప్పటి బ్రిటిష్ వలసకింద వున్న దేశాలు)లో ఉండగా, అందులో భారత్‌ది అగ్ర తాంబూలం. దేశంలోని మొత్తం పిల్లల్లో 43 శాతం మంది బరువు తక్కువగా వున్నారని ఆ నివేదిక పేర్కొంది. వీరిలో అయిదేళ్లలోపు పిల్లలు 7 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాదపడుతున్నారని సేవ్ చిల్డ్రన్ సంస్థ తన నివేదికలో తెలిపింది. భారత దేశాన్ని నేడు పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పౌష్టికాహార లోపం ఒకటని ఈ నివేదికకు ముందు మాట రాసిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్మామినాథన్ చెప్పారు.
పౌష్టికాహార లోపం వల్ల పిల్లల్లో ఎదుగుదల మందగిస్తుంది. తల్లులు కూడా దీని వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పౌష్టికాహార లోపం అనేది జాతికే అవమానం అని ప్రధాని చెబుతారు. దీనిని రూపుమాపాల్సిందేనని ఎర్ర కోట బురుజుల నుంచి గంభీరమైన ప్రకటనలు చేస్తారు. కానీ, ఆచరణలో ప్రజల జీవితాల్లో వాస్తవంగా ఎలాంటి మార్పు వుండడం లేదు. అధికారిక లెక్కల ప్రకారమే కోటి 78 లక్షల టన్నుల తిండిగింజలు ముక్క బెట్టి పారబోయడానికైనా సిద్ధపడుతున్న ప్రభుత్వం, పేదల ఆకలి తీర్చేందుకు, వారిలో పౌష్ఠికాహార లోపాన్ని తొలగించేందుకు వీటిని ఉచితంగా పంచడానికి ససేమిరా అంటోంది. పేదలకు ఉచితంగా పంపిణీ చేయమని సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశిస్తే దీనివల్ల రైతులకు నష్టం వస్తుందని పసలేని వాదన చేస్తోంది. ప్రభుత్వం చెప్పింది నిజమేననుకునే వారు కూడా ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వం చెప్పేది పచ్చి అబద్ధం. ఇప్పుడు గోదాముల్లో నిల్వలు పేరుకుపోయిన ఆహార ధాన్యాలు రెండేళ్ల క్రితమే రైతుల నుంచి సేకరించినవి. అంటే వాటికి ఎప్పుడో ధర చెల్లించారు. కాబట్టి ఇప్పుడు వాటిని పేదలకు ఉచితంగా ఇస్తే రైతులు నష్టపోతారనడం ఏ విధంగానూ సరికాదు.
ఇందుకు ప్రభుత్వం బాధ్య త వహించాలి. ఆకలి తో అలమటించేవారు అత్యధికంగా ఉన్న 88 దేశాలలో మనం 66వ స్థానంలో వున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నదంటే ఏమనుకోవాలి. ఆమ్ ఆద్మీ అంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమో ఇది చెప్పకనే చెబుతోంది. ప్రజలను మభ్య పుచ్చడానికి ఇప్పుడు ఆహార భద్రత చట్టం తెస్తానంటున్నది. ఆ చట్టం ముసాయిదా రూపు రేఖలు చూస్తే దీనిని ఆహార అభద్రతా చట్టం అనడమే సరైనదని అనిపిస్తుంది. తలసరి ఆహార వినియోగంలో ప్రపంచంలో భారత్ బాగా వెనుకబడి వున్నది. పంటలు బాగా పండినప్పుడు కూడా ఆహార అభద్రత కొనసాగుతూనే వున్నది. 2009 ఒక్క సంవత్సరంలోనే దేశంలో కోటీ 36 లక్షల మంది పేదలుగా మారారు. అంతకంతకూ పెరుగుతున్న ఆకలి, పేదరికంపై సమిష్టి పోరాటం సాగించడమంటే దీనికంతటికీ మూలమైన ప్రభుత్వ విధానాలపై పోరాడటమే.